‘పది’లమైన కొలువులు!

పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటన విడుదలచేసింది.

Published : 23 Nov 2020 00:18 IST

పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారిని డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్‌, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. రాత పరీక్ష, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు. పురుష అభ్యర్థులకే ఈ అవకాశం!

నావిక్‌ ఉద్యోగానికి నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మ్యాథ్స్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌), రీజనింగ్‌ (వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఫొటోను జతచేసిన మూడు అడ్మిట్‌ కార్డులు, పదో తరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్‌, మార్కుల పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌; డొమిసైల్‌ సర్టిఫికెట్‌, ఏదో ఒక గుర్తింపు పత్రం (ఓటర్‌ ఐడీ లేదా పాన్‌కార్డు లేదా ఆధార్‌ కార్డు లేదా కాలేజీ ఐడీ) తీసుకెళ్లాలి. వీటన్నింటికీ 3 సెట్ల ఫొటో కాపీలు తీసుకెళ్లాలి.

దేహదార్ఢ్య పరీక్షలు
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్క్వేట్‌ అప్స్‌- 20, పుష్‌అప్స్‌ -10 తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి. దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. జోన్లవారీ ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు గడువు: డిసెంబరు 7
రాత పరీక్ష: జనవరిలో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరీక్ష కేంద్రం: విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: http:/joinindiancoastguard.gov.in

ఎంపికైతే...

అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ మొదలవుతుంది. శిక్షణ ప్రారంభానికి ముందే మరోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మాత్రమే శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక విధుల్లోకి తీసుకుంటారు. కుక్‌గా ఎంపికైనవారు కోస్ట్‌ గార్డు ఉద్యోగులకు మెనూ ప్రకారం శాకాహార, మాంసాహార వంటకాలు తయారుచేయాల్సి ఉంటుంది. స్టివార్డ్‌గా విధుల్లో చేరినవాళ్లు భోజన వడ్డన, హౌస్‌ కీపింగ్‌, స్టోర్స్‌ నిర్వహణ తదితర సహకార పనులు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వీరు ప్రధాన అధికారి (లెవెల్‌ 8) హోదా వరకు చేరుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని