అన్నిటికీ పునాది ఆ నేర్పు!

 చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం

Published : 28 Dec 2020 01:06 IST

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు- 2 

 చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం చేసుకోవడం. ఈ రెండింటిపైనే మానవ సంబంధాలనేవి ఆధారపడి ఉన్నాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే మళ్లీ ఈ రెండింటిలో మొదటిదే ప్రధానం. అంటే ఒకరు తనను తాను అర్థం చేసుకుంటే ఎదుటివారిని అర్థం  చేసుకోవడం సులభం.
గ్రీకు తత్వవేత్తలు ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ఏనాడో చెప్పారు. మనిషి తనను తాను తెలుసుకోవడంపైనే భవిష్యత్తులో అతని అస్తిత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌) జీవన నైపుణ్యాలకు ప్రధాన పునాది.
స్వీయ అవగాహనలో తొలిమెట్టు.. తనను తాను అవగాహన చేసుకుని తనను తాను అంగీకరించడం. అంటే అంతర్గత సామర్థ్యాలను గుర్తించడం. అదే సమయంలో తన పరిమితులను అర్థం చేసుకోవడం. వీటిని తన లక్ష్యాలతో అనుసంధానం చేసుకోవడం.
చాలామంది తమను తాము అంగీకరించకుండా ఊహాలోకంలో ఉండిపోవడం వల్ల జీవన సమరంలో పరాజితులుగా మిగిలిపోతారు.
అయితే- చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా స్వయంకృషితో కోటీశ్వరులైనవారు, పెద్దగా అక్షర జ్ఞానం లేకపోయినా ఆసక్తితో విజ్ఞానఖనులైనవారు, శారీరకంగా అశక్తులైనా మేధాశక్తితో అపురూప విజయాలు సాధించినవారి సంగతేంటన్న ప్రశ్న వస్తుంది.
స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌)లో రెండు ముఖ్య విషయాలున్నాయి. తన గురించి తెలుసుకోగలిగే వారెవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికీ తాను మాత్రమే. ఇక రెండో విషయం- మనల్ని మనం మెరుగుపరచుకోవాలంటే ఆ పని చేయగలిగేదీ మనం మాత్రమే. పరిమితుల్ని గుర్తించి నిజాయతీగా ప్రయత్నించడం ద్వారా మన మనఃఫలకాలపై నిలిచిన వారెందరో!

* అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఒరాకిల్‌ వ్యవస్థాపకుడైన మల్టీ బిలియనీర్‌ లారీ ఎలిసన్‌
* కాళ్ళూ చేతులూ లేకుండా జన్మించి గజ ఈతగాడిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా పేరొందిన ఆస్ట్రేలియా జాతీయుడు- అమెరికన్‌ నికొలస్‌ జేమ్స్‌ వుజిసిక్‌
* జన్మతః అంధుడైనా ప్రపంచ ప్రసిద్ధ గాయకుడిగా పేరు తెచ్చుకున్న స్టీవ్‌ వండర్‌
ఇలా తమ పరిమితుల్ని అంగీకరించి, వాటిపై పోరాటం చేసి వీరంతా విజయబావుటా ఎగురవేశారు. స్వీయ లోపాలను అధిగమించాలన్న కాంక్ష ఉన్నవారికి ఈ స్ఫూర్తిబాటలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. (స్వీయ విశ్లేషణలో 4 దశలు.. ఈ-పేపర్లో)

- యస్‌.వి. సురేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని