100 రోజుల్లో గెలుద్దాం!

ప్రతిభావంతులైన విద్యార్థులు నెగ్గాలని కలలు గనే పరీక్ష.. సివిల్స్‌. పోటీ పరీక్షల్లో శిఖర సమానంగా పేరు పొందిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రకటన ఇటీవలే వెలువడింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 27న జరగబోతోంది. ఇంకా 100 రోజుల వ్యవధి మాత్రమే ఉంది.

Published : 15 Mar 2021 00:12 IST

సివిల్స్‌ ప్రిలిమినరీ-2021కి పక్కా ప్రణాళిక

ప్రతిభావంతులైన విద్యార్థులు నెగ్గాలని కలలు గనే పరీక్ష.. సివిల్స్‌. పోటీ పరీక్షల్లో శిఖర సమానంగా పేరు పొందిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రకటన ఇటీవలే వెలువడింది. ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 27న జరగబోతోంది. ఇంకా 100 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ సమయాన్ని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకుంటూ విజయం దిశగా దూసుకువెళ్లేందుకు ఏ మెలకువలు పాటించాలి?
సివిల్స్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థి స్థూలంగా అనుసరించాల్సినవి.. ఎ) సిలబస్‌పై అవగాహన పెంచుకుని కష్టపడి చదవటం (సాధ్యమైనంతవరకు ప్రతిరోజూ 10- 14 గంటల అధ్యయనం. బి) ప్రాక్టీస్‌ పరీక్షలను రాయటం, వాటిలో బాగా స్కోర్‌ చేయడం.
సన్నాహక వ్యూహం
* మీరు ఇప్పటికే అన్ని సబ్జెక్టుల్లో అన్ని టాపిక్‌లనూ పూర్తి చేసివుండాలి. ఒకవేళ ఏమైనా అంశాలు మిగిలివుంటే వచ్చే పది రోజుల్లో వాటిని చదవటం పూర్తి చేయండి.
* గుర్తుంచుకోండి, పై సబ్జెక్టులన్నీ అంతం లేనివి. ఇవి సామాజిక శాస్త్రాలు. నిర్దిష్ట సరిహద్దు లేకపోవటం వీటి ప్రత్యేకత. ‘ప్రతి అంశాన్నీ సంపూర్ణంగా చదివేశాను’ అని చెప్పగలిగేలా ఏమీ ఉండదు. ఎందుకంటే అది అసాధ్యం. చేయాల్సిందల్లా- ప్రతి సబ్జెక్టుకూ తగిన వ్యవధి కేటాయించుకునేలా ఒక టైమ్‌ టేబుల్‌ తయారుచేసుకోవటం; దానికి కట్టుబడివుండటం. * ఏదైనా ఒక టాపిక్‌ను సరిగా పూర్తి చేయలేదనుకోండీ- చింతించనక్కర్లేదు. అందుబాటులో ఉన్న రోజులకు మీ షెడ్యూల్‌ను తిరిగి రూపొందించుకోవచ్చు. * నమూనా పరీక్షల్లో మీరు కటాఫ్‌ మార్కును చేరుకోలేకపోతే, కారణాలను గుర్తించి లోపాలు సవరించుకోండి. * ప్రశ్నను చాలా వేగంగా చదువుతూ ప్రశ్నలోని ఏమైనా అంశాలను పట్టించుకోవటం లేదా? దాన్ని సవరించుకోండి.. * మీరు కచ్చితమైన ఆధారంతో ఊహించి రాసినవి సరైన జవాబులు అవుతుంటే మంచిదే. * ఆధారం లేకుండా ఊహించి జవాబులు గుర్తిస్తున్నారా? అయితే, దాన్ని ఆపండి
* మొత్తంమీద మీరు ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాల్సివుందో గ్రహించి సాధన చేయండి.


ఈ ఏడాది  సివిల్స్‌లో..
1) ఖాళీల సంఖ్యను 712 కు తగ్గించారు. 2) అంటే ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య సుమారు 9300 ఉంటుంది.3) హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య యథావిధిగా 5 లక్షలు ఉన్నప్పటికీ, ఈ ఏడాది శ్రద్ధగా రాసే సీరియస్‌ అభ్యర్థుల సంఖ్య పెరగబోతోంది. ఎందుకంటే... గత సంవత్సరం కరోనా కారణంగా గణనీయమైన సంఖ్యలో ఈ పరీక్షను రాయలేదని గుర్తించాలి.
వీటన్నిటి ఫలితంగా...
ఎ) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ -1 కఠినంగా ఉండబోతోంది.  
బి) క్వాలిఫైయింగ్‌ స్వభావమున్న పేపర్‌- 2 కూడా మరింత క్లిష్టంగా ఉండవచ్చు.


కొన్ని వాస్తవాలు

1. ప్రిలిమినరీ ఏటా కష్టంగా మారుతోంది. ఈ ఏడాది మరింత కష్టతరమవుతోంది. మెయిన్‌ పరీక్షకు 9300 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు.  
2. అర్హత పేపర్‌ - 2ను మరింత కఠినంగా తయారుచేస్తారు. ఎగ్జామినర్‌ ఇక్కడ పెద్ద సంఖ్యలో అభ్యర్థులను తగ్గించాలని అనుకుంటారు. నాన్‌ మ్యాథ్స్‌ విద్యార్థులు గణిత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది.  
3. పేపర్‌-1లో ప్రశ్నలు కఠినంగా ఉంటాయి. బహుళ ఆప్షన్‌ల నుంచి సరైన సమాధానం ఎంచుకునే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి.  
4. శిక్షణ సంస్థలు తయారుచేసిన ప్రశ్నల నిధినుంచి ఏ ప్రశ్నా నేరుగా రాదు.  
5. మీకు సమాధానం స్పష్టంగా తెలియనప్పుడో, మీ సమాధానం తప్పుగా ఉన్నప్పుడో జవాబు కోసం కేవలం నెట్‌లో వెతకవద్దు. ప్రామాణిక పాఠ్యపుస్తకంలో చూడండి. ఎందుకంటే.. ప్రామాణిక పాఠ్యపుస్తకాన్ని రిఫర్‌ చేసినప్పుడు, వెతుకుతున్న సమాచారాన్ని మాత్రమే కాకుండా అదనపు సమాచారాన్ని కూడా పొందుతారు.
6. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం రాసిన పుస్తకాల నుంచో,  గైడ్‌ల నుంచో ప్రశ్నలను తీసుకోరు. అందుకే ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదవడం మంచిది.
7, కటాఫ్‌ మార్కును కొద్దిలో మిస్‌ అయిన చాలామంది అభ్యర్థుల విషయంలో వారు ప్రశ్నలను తప్పుగా ఊహించటమో.. అవసరం లేకపోయినా ఎక్కువ ప్రశ్నలకు తప్పు జవాబులు గుర్తించటమో కన్పిస్తుంది.

- వి. గోపాలకృష్ణ



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని