విలువ పెంచే విలువలు

ఐటీ, కార్పొరేట్‌ కంపెనీల్లో లక్షల మంది యువత పనిచేస్తుండగా పాలలో నీళ్లను వేరుచేసి చూపే లాక్టోమీటర్‌ మాదిరిగా కంపెనీకి విలువగా నిలిపే లక్షణమే వర్క్‌ ఎథిక్స్‌. కెరియర్‌లో రాణించేలా చేసే

Published : 15 Mar 2021 00:12 IST

ఐటీ, కార్పొరేట్‌ కంపెనీల్లో లక్షల మంది యువత పనిచేస్తుండగా పాలలో నీళ్లను వేరుచేసి చూపే లాక్టోమీటర్‌ మాదిరిగా కంపెనీకి విలువగా నిలిపే లక్షణమే వర్క్‌ ఎథిక్స్‌. కెరియర్‌లో రాణించేలా చేసే ఇది ఓ జీవన నైపుణ్యం.
ఒక టాస్క్‌ని ఒక ఉద్యోగికి అప్పగించినప్పుడు దీనిని సానుకూలంగా స్వీకరించడం, నిర్దేశించిన వ్యవధిలో పూర్తిచేసేందుకు తగిన క్రమశిక్షణ చూపడం, మధ్యలో ఎదురయ్యే సవాళ్లను సీనియర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసుకోవడం, టాస్క్‌ అవసరం రీత్యా వ్యక్తిగత అవసరాలు, ప్రాథÅ]మ్యాలను మార్చుకోవడం... అంతిమంగా విజయవంతంగా నిర్దేశిత సమయంలో నాణ్యతతో పూర్తి చేయగలగడం. ఈ దశలన్నింటిలో ఉద్యోగి చూపించే నిబద్ధతే- వర్క్‌ ఎథిక్స్‌. సాధారణ ఉద్యోగినీ, ఉత్తమ ఉద్యోగినీ వేరు చేసి చూపగలిగే గీటురాయి ఇదే!  
ఎలా అలవర్చుకోవాలి?  
విలువలు... నైతిక వర్తనల నుంచి వచ్చిందే పని వాతావరణంలో నైతిక వర్తన (వర్క్‌ ఎథిక్స్‌). ఇది కొంతవరకు తల్లిదండ్రుల పెంపకం... టీనేజ్‌ వరకు ఎదురైన అనుభవాలు, పాఠశాల వాతావరణంపై ఆధారపడి వున్నప్పటికీ కెరియర్‌లో ఉన్నతికి కారణమని గుర్తించినప్పుడు ఈ లక్షణాలను సాధనతో పెంపొందించుకోవచ్చు. ఇందుకు ఉపకరించే మార్గాలు-  

పెయిన్‌-ప్లెజర్‌: స్వల్పకాల- దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ‘పెయిన్‌-ప్లెజర్‌’ సిద్ధాంతాన్ని చెబుతుంటారు. స్వల్పకాలపు బాధ ఓర్చుకోగలిగితే దీర్ఘకాలపు ఆనందం సొంతమవుతుంది. కానీ స్వల్పకాలపు ఆనందం కోసం ప్రలోభపడితే దీర్హకాలం బాధ  అనుభవించాల్సివుంటుంది.టాస్క్‌ను నిర్వహిస్తున్నప్పుడు కీలక సమయంలో ఏదో ఒక సాకు చెప్పి సెలవు పెట్టేస్తే ఆపని తప్పిపోయి తాత్కాలిక ఆనందం కలుగవచ్చు. అదే ఆ కష్టాన్ని తట్టుకోగలిగితే దీర్హకాల ప్రయోజనం కలిగించే పదోన్నతులూ లభించవచ్చు.  
పుస్తక పఠనం:  పుస్తక పఠనం మెదడు పొరల్లోకి వెళ్లి చైతన్యం కలిగిస్తుంది. వ్యక్తిగత ఆలోచనా సరళి, దృక్పథాల్లో మార్పు తీసుకువస్తుంది. అత్యున్నత జీవన విలువలను పాటించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగినవారి జీవితగాథలు స్ఫూర్తిని కలిగిస్తాయి. పఠనం ఇప్పుడు పుస్తకరూపంలోనే కాదు, వివిధ రూపాల్లో అంతర్జాల వేదికపై లభిస్తోంది. రూపం మారినా, అక్షరం, పదం, వాక్యం కలిగించే ఉత్తేజాన్ని అందుబాటులో ఉండే మార్గాల ద్వారా సొంతం చేసుకోవచ్చు.  
రోల్‌మోడల్‌:  ఊహాజగత్తులో కదలాడే కథానాయకులకంటే నిజ జీవితంలో పరిశీలనకూ, స్ఫూర్తి పొందేందుకూ ఒక నాయకుడు ఉండటంలో తప్పు లేదు. ఎదుగుతున్న రంగంలో కృషిచేస్తున్నప్పుడు అదే రంగంలో మైలురాళ్లు సృష్టించిన నాయకులను ఆదర్శంగా మనోఫలకంపై ప్రతిష్ఠించుకొని వారు అనుసరించిన విలువలు, నైతిక వర్తనను తెలుసుకోవడం ద్వారా ఉత్తేజం పొందవచ్చు. ఇది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు