పరీక్ష ఎప్పుడైనా.. పక్కా సంసిద్ధత!

జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి, తెలుగు రాష్ట్రాల స్థాయిలో సీనియర్‌ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరగని నేపథ్యంలో... వివిధ ప్రవేశ పరీక్షలకు మెరుగ్గా ఏ విధంగా తయారుకావాలనేది విద్యార్థులకు ప్రశ్నగా మారింది. అసలు పరీక్షలు ఉంటాయా లేదా,  ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లాంటి సందేహాలు ఆందోళన పెంచుతున్నాయి.

Updated : 07 Jun 2021 05:41 IST

పోటీలో మెరుగ్గా ఉంచే మెలకువలు

అనిశ్చితీ, అస్పష్టతా ఉన్నపుడు కార్య సాధన ప్రయత్నాలు సజావుగా సాగవు. కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో కీలకమైన ప్రవేశ పరీక్షలెన్నో సకాలంలో జరగక వరసగా వాయిదా పడుతున్నాయి. చదవటం పక్కనపెడితే మర్చిపోయే ప్రమాదం.. పునశ్చరణ ఎక్కువ చేస్తే సబ్జెక్టుపై ఆసక్తి తగ్గిపోయే చిక్కు... దీంతో మానసిక పరమైన ఆందోళనతో విద్యార్థులు సతమతమవుతున్నారు. చదివిన అంశాలపై పట్టు నిలుపుకోవటం వీరికి సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!  
జాతీయ స్థాయిలో సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి, తెలుగు రాష్ట్రాల స్థాయిలో సీనియర్‌ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరగని నేపథ్యంలో... వివిధ ప్రవేశ పరీక్షలకు మెరుగ్గా ఏ విధంగా తయారుకావాలనేది విద్యార్థులకు ప్రశ్నగా మారింది. అసలు పరీక్షలు ఉంటాయా లేదా,  ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లాంటి సందేహాలు ఆందోళన పెంచుతున్నాయి.
జేఈఈ-మెయిన్స్‌ ఫిబ్రవరి- మార్చి సెషన్లు జరిగాయి. తర్వాత కరోనా తీవ్రత దృష్ట్యా ఏప్రిల్‌- మే నెలల్లో జరగాల్సిన రెండు సెషన్ల పరీక్షలను వాయిదా వేశారు. మే సెషన్లో ఇంజినీరింగ్‌తోపాటు ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ విభాగాల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించవలసి ఉంది. ఈ పరీక్షలను జులై, ఆగస్టుల్లో నిర్వహించేలా ఎన్‌టీఏ ప్రతిపాదనలు చేసింది. కానీ పరీక్షకు 15 రోజుల ముందు మాత్రమే దానిపై వివరణ ఇస్తామని చెప్పారు. ఈ పరీక్ష ఇప్పటికే రెండు సార్లు జరిగింది కాబట్టి దాని ఆధారంగా ఫలితాలను ప్రకటించవచ్చు. లేదా ఏప్రిల్‌- మేలో జరగవలసిన రెండు సెషన్ల పరీక్షల స్థానంలో ఒకే పరీక్షను నిర్వహించి వాటి ఆధారంగా ప్రవేశాలు నిర్వహించవచ్చు.

* ఆగస్టు 1వ తేదీ జరగాల్సిన నీట్‌ పరీక్షను అదే తేదీలో జరపాలని ఆలోచిస్తున్నారు.
* జూన్‌ 24-30 తేదీల మధ్య జరగాల్సిన బిట్‌శాట్‌ పరీక్షను వాయిదా వేశారు.
* న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌ను జూన్‌ 13 నుంచి వాయిదా వేశారు.
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 14న జరిగింది. దీంతో ప్రవేశాలను ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా పూర్తి చేస్తున్నారు.

ఏం చేయాలంటే...

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోటీ పరీక్షలు జులై ఆఖరు వారంలోనో, ఆగస్టులోనో జరిగే అవకాశాలున్నాయి. ముందుగా విద్యార్థులు జులై 15కు పునశ్చరణ పూర్తి చేసుకునేవిధంగా ప్రయత్నించాలి. ఇప్పటికే మూడు, నాలుగుసార్లు పునశ్చరణ పూర్తిచేసుకునివుంటారు. మళ్లీ చదివినా దానిలో తీసుకునే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అవగాహన పెంచుకోవడం కోసం చదవడం, అభ్యాసం చేయడం కంటే.. చదివిన అంశాలను క్రోడీకరించి మైండ్‌ మ్యాప్స్‌ వేసుకోవాలి. ప్రధానంగా ఇవి భౌతిక, రసాయనశాస్త్రాల్లో బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు విద్యార్థి చేయాల్సినవి..
1 రోజుకో చాప్టర్‌: ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతి పుస్తకాలను వరుస క్రమంలో ఒక సబ్జెక్టుకు రోజుకు ఒక చాప్టర్‌ చదవడానికి గంట సమయం కేటాయించుకోవాలి. దీనిలో చివర ఉండే వర్క్‌డ్‌ అవుట్‌ ఎగ్జాంపుల్స్‌ చదవాలి. పుస్తకం చివర ఉన్న ప్రాబ్లమ్స్‌ ఏది ఎలా చేయాలో విశ్లేషించుకోవాలి.
2 చదివాక మననం: పూర్తిగా చాప్టర్‌ చదివాక పుస్తకం మూసివేసి పది నిమిషాలు వరుస క్రమంలో ఏమున్నదో మననం చేసుకోవాలి.  
3 నోట్సు రాయటం: తనలో తాను తర్కించుకోవడం లేదా స్నేహితులతో ఫోన్‌లో చర్చించుకుని ఒక క్రమం ఏర్పరుచుకోవాలి. వాటిని పుస్తకంలో వరుస క్రమంలో నోట్సు రాసుకుంటూ వెళ్లాలి. రాసిన తర్వాత మళ్లీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు తెరిచి తను రాసిన దాంట్లో అన్ని అంశాలూ వచ్చాయో లేదో చూసుకోవాలి. ఏవైనా వదిలేసినట్లయితే వాటిని రాసుకోవాలి.  
4 చాప్టర్లపై పట్టు: ఈ విధంగా శ్రద్ధగా చేస్తే విద్యార్థి సంబంధిత చాప్టర్‌లపై దాదాపు 80 శాతం పట్టు సాధించవచ్చు.
5 వరస తప్పించి: నోట్స్‌ రాసుకున్న తర్వాత తోచిన ఆబ్జెక్టివ్‌ మెటీరియల్‌ను తీసుకుని దానిలో వరుస క్రమంలో కాకుండా అక్కడక్కడా (ఆర్బిట్రరీ) కొన్ని ప్రాబ్లెమ్స్‌ మీద వర్క్‌ చేస్తూ వెళ్లాలి.
6 ప్రశ్నలు మారిస్తే: తర్వాత ఐదు నిమిషాలు ఏ విధంగా చేశారో, ప్రశ్నలు మారిస్తే సమాధానాలు ఎలా ఉండాలో తర్కించుకోవాలి.
7 ప్రశ్నపత్రం తయారీ: ఇక అతి ముఖ్యమైన పని ఏమిటంటే.. ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేయడం పూర్తిచేశాక ఆ అభ్యాసంలో ప్రశ్నపత్రాన్ని విద్యార్థే తయారుచేయగలగటం. అధ్యాపకునికీ, విద్యార్థికీ మధ్య ఉండే తేడా.. సబ్జెక్టు పరిజ్ఞానం అనేకంటే.. ఆ సబ్జెక్టులో ప్రశ్నపత్రం తయారుచేయగలగడం అనేది వాస్తవం. విద్యార్థికి ఏ చాప్టర్‌పైన అయినా అవగాహన ఏర్పడితే దానిలో అద్భుతమైన ప్రశ్నలు తయారుచేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక చాప్టర్‌లో విద్యార్థి ప్రశ్నపత్రం తయారుచేయగలిగితే.. ఆ చాప్టర్‌లో ఆరు నెలల్లోపు ఎప్పుడు పరీక్షలు జరిగినా అద్భుతంగా పరీక్ష రాసే అవకాశం ఉంటుంది!
మూస పద్ధతిలోనే చదువుతూ వెళితే విద్యార్థిలో విశ్లేషణాత్మక దృక్పథం ఏర్పడదు. ఎక్కువసార్లు చదివితే ఆసక్తి తగ్గి.. ఆత్మన్యూనత ఏర్పడవచ్చు. ప్రస్తుత సమయంలో అధ్యాపకుల సూచనలూ, సలహాలకు అవకాశం తక్కువగా ఉంది. అందుకని పైన చెప్పినట్టు ప్రణాళిక ఏర్పరుచుకుంటే..నాణ్యమైన సమయం పుస్తకాలపై గడిపే అవకాశం ఉంటుంది.
ఉదయం రెండు గంటలలోపు రెండు సబ్జెక్టులు, మధ్యాహ్నం నుంచి రాత్రిలోపు మిగిలిన రెండు సబ్జెక్టులు..ఇలా ఒక నిర్దిష్టమైన టైమ్‌ టేబుల్‌ వేసుకుని చదివితే పరీక్ష ఎప్పుడు జరిగినా ఆత్మవిశ్వాసంతో రాసే అవకాశం ఉంటుంది. ఈ కొవిడ్‌ పరిస్థితుల అవరోధాలు ప్రతి విద్యార్థికీ ఉన్నాయి. అయితే మిగిలిన వారి కంటే పది శాతం అదనంగా.. ప్రత్యేక పద్ధతుల్లో సాధన చేస్తే కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుంది!

ఒత్తిడి పెరగకుండా...

పరీక్ష ఒకసారి వాయిదా పడటం వేరు. కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియకుండా పరీక్షకు మెరుగైన పద్ధతిలో సంసిద్ధంగా ఉండాలంటే ఆచరణపరంగా సమస్యే. అందుకే విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈమధ్య జాతీయస్థాయిలో జరిగిన అధ్యయనంలో మానసిక శాస్త్రవేత్తలు చాలామంది విద్యార్థుల మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ఒత్తిడి వల్ల విద్యార్థులు గతంతో పోలిస్తే తీవ్రమైన కుంగుబాటుతో ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. అందుకని ఇప్పుడు విద్యార్థుల్లో ఒత్తిడి పెరగకుండా చూడటం; వారిలో పరిస్థితులను తట్టుకునే ఆచరణాత్మక దృక్పథం పెరిగేలా ప్రయత్నాలు చేయటం- విద్యారంగ నిపుణుల కర్తవ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని