బెల్‌లో 511 ఉద్యోగాలు

త్రివిధ దళాలకు రక్షణ పరికరాలను రూపొందించే భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఉద్యోగ ప్రకటనను వెలువరించింది.

Published : 10 Aug 2021 10:31 IST

త్రివిధ దళాలకు రక్షణ పరికరాలను రూపొందించే భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ఉద్యోగ ప్రకటనను వెలువరించింది. సంస్థ బెంగళూరు యూనిట్‌ కోసం ఒప్పంద ప్రాతిపదికన 511 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌ అర్హత ఉన్నవారు ఈ కొలువులకు అర్హులు!

తాజా ప్రకటన ద్వారా నియామకం చేయబోయే పోస్టుల్లో.. ట్రెయినీ ఇంజినీర్లు-308, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-203 ఉన్నాయి. ఈ పోస్టుల్లో దివ్యాంగులకు  4% రిజర్వేషన్‌ ఉంటుంది. ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ఠ వయః పరిమితి 25 ఏళ్లు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయః పరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసై ఉండాలి. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రెండేళ్ల అనుభవం అవసరం. ఆన్‌లైన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను బీఈ/ బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ కోసం ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను బెల్‌ వెబ్‌సైట్‌లో పెడతారు. వీరికి వీడియో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను బెల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ట్రెయినీ ఇంజినీర్‌కు దరఖాస్తు ఫీజు రూ.200. ఫీజును ఎస్‌బీఐ చలాను లేదా ఎస్‌బీఐ కలెక్ట్‌ లింక్‌ ద్వారా చెల్లించవచ్చు. పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుతో పాటుగా:  పదో తరగతి మార్కుల కార్డు, ఇంజినీరింగ్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ (ఏ క్లాసులో పాసయ్యారో స్పష్టంగా ఉండాలి), అన్ని సెమిస్టర్ల మార్కుల కార్డులు లేదా కన్సాలిడేటెడ్‌ మార్కుల కార్డు, కుల/తెగ/ కమ్యూనిటీ/ డిసెబిలిటీ/ ఎకనామిక్‌ స్టేటస్‌ సర్టిఫికెట్‌ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులైతే) అప్‌లోడ్‌ చేయాలి. గతంలో పనిచేసిన/ ప్రస్తుతం పనిచేస్తోన్న సంస్థ యాజమాన్యం నుంచి అనుభవం సూచించే సర్టిఫికెట్, చివరిసారిగా జీతం తీసుకున్న పే స్లిప్‌ సమర్పించాలి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ సమర్పించాలి. లేదా దరఖాస్తును ప్రోపర్‌ ఛానల్‌ ద్వారా పంపించాలి.

ఎంపికైన ట్రెయినీ ఇంజినీర్లను ఏడాది కాలానికి విధుల్లోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్‌ అవసరం, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఈ కాలాన్ని మూడేళ్ల వరకు పెంచవచ్చు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్లను కనిష్ఠంగా రెండేళ్ల కాలానికి తీసుకుంటారు. ప్రాజెక్ట్‌ అవసరాలు, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నాలుగేళ్ల వరకు పెంచవచ్చు.

ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుకు తాజా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేయొచ్చు. అయితే నియామక సమయంలో ప్రొవిజనల్‌ డిగ్రీ సర్టిఫికెట్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌ ఇంజినీర్లకు రెండేళ్ల అనుభవం ఉండాలి. అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. టీచింగ్‌/ రీసెర్చ్‌ అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

దరఖాస్తుకు చివరి తేది: 2021 ఆగస్టు 15. 

వెబ్‌సైట్‌: https://bel-india.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని