సత్వర ఉపాధికి ఒకేషనల్‌ దారి!

అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బీవోక్‌) కోర్సులకు ప్రాధాన్యం ఉంది.చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి ఆశించేవారికి ఇవి చక్కని దారి చూపుతున్నాయి. ఈ వృత్తివిద్యా కోర్సుల వ్యవధి మూడేళ్లే. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ వీటిని చదువుకునే అవకాశం ఉంది.

Updated : 06 Sep 2021 06:50 IST

అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బీవోక్‌) కోర్సులకు ప్రాధాన్యం ఉంది.చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి ఆశించేవారికి ఇవి చక్కని దారి చూపుతున్నాయి. ఈ వృత్తివిద్యా కోర్సుల వ్యవధి మూడేళ్లే. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ వీటిని చదువుకునే అవకాశం ఉంది.


హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌, ఫుడ్‌ టెక్నాలజీ, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, అగ్రికల్చర్‌, బ్యాంకింగ్‌, మీడియా...ఇలా వివిధ రంగాలు, విభాగాల్లో ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ చదువుల్లో ప్రాక్టికల్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఎక్కువ. కోర్సు పూర్తవగానే అదనపు శిక్షణ అవసరం లేకుండా సంబంధిత విభాగంలో సేవలందిస్తోన్న సంస్థల్లో చేరిపోవచ్చు.  

విదేశాల్లో ఒకేషనల్‌ విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దక్షిణ కొరియాలో సుమారుగా 96, జర్మనీలో 75, యూఎస్‌లో 52 శాతం మంది విద్యార్థులు ఒకేషనల్‌ కోర్సుల నేపథ్యం ఉన్నవాళ్లే. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా వీటిని తీర్చిదిద్దడమే అందుకు కారణం. మనదేశంలో ఇటీవలి కాలంలో ఈ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వివిధ రంగాలు, అందులోని విభాగాల అవసరాలను తీర్చి, నిపుణులైన మానవవనరుల కొరతను అధిగమించడానికి ఈ చదువులు పనికొస్తాయి. స్థానిక అవసరాలు తీరేలా వీటిని రూపొందిస్తున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలకు అనుగుణంగా కళాశాలలు సంబంధిత అంశాల్లో కోర్సులను అందిస్తున్నాయి. ఈ చదువుల్లో 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉంటుంది. అందువల్ల తెలుసుకోవడం కంటే సంబంధిత పనిని పరిశీలించడం, స్వయంగా పూర్తిచేయడం ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అనువర్తనానికి (అప్లికేషన్‌) ప్రాధాన్యం ఉంటుందన్నమాట. ఇందుకోసం సమీపంలోని పరిశ్రమలతో చదువులను అనుసంధానం చేస్తారు.  

ఒకేషనల్‌ చదువులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏ తరహా పరిశ్రమలో సేవలు అందించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకునే అవకాశం వీరికి లభిస్తుంది. చాలా సంస్థలు టైలర్‌ మేడ్‌ విధానంలో కోర్సు, శిక్షణ అందిస్తున్నాయి. దీంతో చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా విధుల్లో చేరిపోవచ్చు.

సాధారణ గ్రాడ్యుయేట్లు పోటీ పడే అన్ని ఉద్యోగాలకూ ఒకేషనల్‌ డిగ్రీలు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (ఎంవోక్‌) కోర్సులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు మార్గదర్శనం చేస్తోంది. ఎన్‌ఎస్‌డీసీ యూజీసీతో కలిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవది ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్న వారికి లెవెల్‌ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా వారికి లెవెల్‌ 6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌ 7 స్థాయికి చేరుకున్నట్లు.

డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌లో బ్యాచిలర్‌ కోర్సులు ఎక్కువగా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వీటిని అందిస్తున్నాయి. వీటితోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విద్యా సంస్థల్లోనూ బ్యాచిలర్‌ స్థాయిలో ఒకేషనల్‌ కోర్సులు చదువుకోవచ్చు.


ఇవీ కోర్సులు

మూడేళ్ల ఒకేషనల్‌ డిగ్రీ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు  వైవిధ్యకరమైన వివిధ అంశాల్లో శిక్షణ పొందవచ్చు. అగ్రికల్చర్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బయో మెడికల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. ఇవే కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా ఎనాలిసిస్‌, ప్రొడక్షన్‌ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏర్‌ కండిషనింగ్‌, ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఆపరేషన్స్‌, జర్నలిజం, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌.. తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తీ, అభిరుచులను బట్టి  ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.


జాతీయ స్థాయిలో...

కేషనల్‌ చదువులకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌వీయూ) దేశంలో పేరున్న సంస్థ. అగ్రికల్చర్‌, ఆటోమోటివ్‌, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, చైల్డ్‌ కేర్‌, డయాలసిస్‌ టెక్నాలజీ, ఎల‌్రక్టానిక్స్‌, హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబిల్డ్‌ సర్వీసెస్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్మాస్యూటికల్‌, ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌, రినవబుల్‌ ఎనర్జీ, ట్రావెల్‌ అండ్‌ టూరిజం విభాగాల్లో ఎన్నో కోర్సులను ఈ సంస్థ తరఫున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలవారీ అందిస్తున్నారు. ఇక్కడి హెల్త్‌కేర్‌లో భాగంగా మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, డయాలసిస్‌ టెక్నాలజీ, పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలోనూ చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మొత్తం 16 రంగాల్లో 34 కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ఏడాది చదువు పూర్తిచేసుకుంటే డిప్లొమా, రెండేళ్లు చదివితే అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, మొత్తం కోర్సు పూర్తిచేసుకంటే బ్యాచిలర్‌ డిగ్రీ ప్రదానం చేస్తారు.

* సావిత్రీ బాయి ఫూలే పుణె యూనివర్సిటీ: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌లో జ్యూయలరీ డిజైన్‌ అండ్‌ జెమాలజీ కోర్సు అందిస్తోంది. ఈ కోర్సులో చేరినవారు క్యాడ్‌, క్యామ్‌ టెక్నాలజీతో బంగారు ఆభరణాలు డిజైన్‌ చేయడం, సహజ, సింథటిక్‌ జెమ్స్‌ గుర్తించడం...మొదలైనవాటిని తెలుసుకుంటారు. జెమాలజిస్ట్‌, జ్యూయలరీ డిజైనర్‌, ఆస్ట్రిజన్‌, జెమ్‌ కట్టర్‌, డైమండ్‌ కట్టర్‌, డైమండ్‌ గ్రేడర్‌..తదితర ఉద్యోగాలు దక్కుతాయి.

* బెనారస్‌ హిందూ యూనివర్సిటీ: ఒకేషనల్‌ విధానంలో చాలా రకాల కోర్సులు అందిస్తోంది. ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశం లభిస్తుంది.

* ఇటీవలి కాలంలో ఏర్పడిన 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చేరే అవకాశం సీయూసెట్‌తో లభిస్తుంది. ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌లో భాగంగా టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ కోర్సులు అందిస్తున్నారు.  

* తేజ్‌పూర్‌ యూనివర్సిటీ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌

* లఖ్‌నవూ యూనివర్సిటీ: రినవబుల్‌ ఎనర్జీ టెక్నాలజీ

* అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ: ప్రొడక్షన్‌ టెక్నాలజీ, పాలిమర్‌ అండ్‌ కోటింగ్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ అండ్‌ గార్మెంట్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో...

* సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, హైదరాబాద్‌: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అందిస్తోంది. సైన్స్‌ విద్యార్థుల కోసం ఇండస్ట్రియల్‌ మైక్రో బయాలజీ కోర్సు ఒకేషనల్‌ విధానంలో నడుపుతోంది.

* హిందీ మహా విద్యాలయ, హైదరాబాద్‌ (ఓయూ రోడ్‌): హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం అడ్మినిస్ట్రేషన్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ల్లో యూజీ, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది.

* సెయింట్‌ థెరిసా అటానమస్‌ ఉమెన్‌ కాలేజీ, ఏలూరు: క్లినికల్‌ అండ్‌ ఆక్వా ల్యాబ్‌ టెక్నాలజీ, వెబ్‌ టెక్నాలజీ అండ్‌ మల్టీ మీడియా.  

*  పిఠాపురం రాజా గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌, కాకినాడ: ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, కమర్షియల్‌ ఆక్వా కల్చర్‌

* ఎస్వీ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌, శ్రీకాళహస్తి: డ్రెస్‌ డిజైనింగ్‌ అండ్‌ టైలరింగ్‌లో డిప్లొమా

*  వైఎన్‌ అటానమస్‌ కాలేజ్‌, నర్సాపూర్‌: హెల్త్‌కేర్‌ అండ్‌ నర్సింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అపారెల్‌ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ మల్టీ మీడియా (డిప్లొమా)

* వీఎస్‌ఎం కాలేజ్‌, రామచంద్రాపురం: ఆక్వా కల్చర్‌

* పీవీఆర్‌ ట్రస్ట్‌ డిగ్రీ కాలేజ్‌, కాకినాడ: హార్టికల్చర్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌, క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ ఇమేజ్‌ టెక్నాలజీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటీరియర్‌ డిజైన్‌

* గవర్నమెంట్‌ అటానమస్‌ కాలేజ్‌, రాజమండ్రి: రినవబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌.

* ఐడియల్‌ కాలేజ్‌, కాకినాడ: సస్ట్టెయినబుల్‌ అగ్రికల్చర్‌, ఇండస్ట్రియల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.

* కాకరపర్తి భావనారాయణ కాలేజ్‌, విజయవాడ: వెబ్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌.

* వీఆర్‌ మెమోరియల్‌ కాలేజ్‌, గుంటూరు: మల్టీమీడియా అండ్‌ వెబ్‌ డిజైన్‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ల్లో డిప్లొమాలు. కమర్షియల్‌ ఆక్వా కల్చర్‌లో బీవోక్‌.

* శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి: ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అప్పారెల్‌ డిజైనింగ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సైన్స్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు