బ్యాంకులో పాగా వేద్దాం!

బ్యాంకు ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ నియామక ప్రకటన వెలువడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 7,855  క్లర్క్స్‌ పోస్టులను భర్తీ చేస్తారు.డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  

Updated : 11 Oct 2021 06:11 IST

బ్యాంకు ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ నియామక ప్రకటన వెలువడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 7,855  క్లర్క్స్‌ పోస్టులను భర్తీ చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  

క్లరికల్‌ పరీక్షలను ఇంగ్లిష్‌, హిందీ భాషలతోపాటు దేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దాంతో జులై నెలలో నిలిపివేసిన క్లరికల్‌ నియామక ప్రక్రియను ఐబీపీఎస్‌ తిరిగి చేపట్టింది. జులైలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కొన్ని మార్పులతో తిరిగి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలయింది.

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మూడు ముఖ్యమైన మార్పులను గమనించవచ్చు.

పెరిగిన ఖాళీలు: గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఖాళీల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. గతంలో దేశవ్యాప్తంగా 5 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 8 వేల ఖాళీలు భర్తీ అవనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రకటనలో ఒక్కో రాష్ట్రంలో 263 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 387, తెలంగాణ రాష్ట్రంలో 333 ఖాళీలు భర్తీ అవనున్నాయి.

ప్రాంతీయ భాషలో రాసే అవకాశం: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లిష్‌, హిందీ భాషలతోపాటుగా దేశంలోని 14 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం ప్రస్తుతం ఈ నోటిఫికేషన్‌ ద్వారా కలుగుతోంది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు ఇది చాలా చక్కని అవకాశం. వారు తెలుగులో ఈ పరీక్ష రాసే వీలు ఏర్పడింది.

తాజాగా డిగ్రీ పూర్తిచేసినవారికి అవకాశం: జులైలో నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పుడు చివరి సంవత్సరం/ సెమిస్టర్‌లో ఉన్న చాలామంది విద్యార్థులు పరీక్షలు పూర్తికాని కారణంగా దరఖాస్తు చేయలేకపోయారు. తాజా నోటిఫికేషన్‌లో అక్టోబరు 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ తేదీ లోపు డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పద్ధతిలో రెండంచెల ద్వారా నిర్వహించే ఆబ్జెక్టివ్‌ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష. రెండో అంచెలో నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


నోటిఫికేషన్‌ వివరాలు

విద్యార్హత : ఏదైనా డిగ్రీ (27.10.21 నాటికి)

వయసు : 20-28 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు : రూ. 175 (ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యూడీ/ ఎక్స్‌ సర్వీసెమెన్‌) రూ.850 (ఇతరులు)

దరఖాస్తుకు చివరి తేదీ : 27 అక్టోబరు 2021

ప్రిలిమ్స్‌ పరీక్ష : డిసెంబరు 2021

మెయిన్స్‌ పరీక్ష : జనవరి/ ఫిబ్రవరి 2022

వెబ్‌సైట్‌ :www.ibps.in


సన్నద్ధత ఎలా ఉండాలి?

ప్రిలిమినరీ పరీక్ష డిసెంబరులో, మెయిన్స్‌ పరీక్ష జనవరి/ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను ప్రకటించకపోయినా ప్రిలిమ్స్‌ పరీక్ష డిసెంబరు రెండు/ మూడు వారాల్లో నిర్వహించినా దాదాపు రెండు నెలల సమయం దానికి ఉంటుంది. మెయిన్స్‌ పరీక్షకు మూడు నెలలకు పైగా వ్యవధి ఉంటుంది. ప్రిపరేషన్‌ను ఇప్పుడు మొదలుపెట్టినా పరీక్షలో విజయం సాధించడానికి ఈ సమయం సరిపోతుంది!

మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా పరీక్ష విధానం గురించీ, ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ల్లో ఉన్న సబ్జెక్టుల గురించీ తెలుసుకోవాలి. ఆ సబ్జెక్టుల సిలబస్‌పై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఐబీపీఎస్‌ సబ్జెక్టుల సిలబస్‌ను పేర్కొనకపోయినా గతంలో నిర్వహించిన పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో ఏయే టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో గమనిస్తే తెలుసుకోవచ్చు.

* ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు కలిపి ప్రిపరేషన్‌ ఉండేలా చూసుకోవాలి.

* ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉన్న 2 నెలల సమయంలో మెయిన్స్‌ స్థాయిలో ప్రిపరేషన్‌ పూర్తవ్వాలి.

* ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటిలో ఉన్న క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌లకు రోజులో ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.

* కొంత సమయాన్ని మెయిన్స్‌లో ఉన్న జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ ఎఫైర్స్‌) కోసం వినియోగించాలి.

* సన్నద్ధతకు రోజుకు 10- 12 గంటలు కేటాయించుకోవాలి.

* ఈ మొత్తం సమయాన్ని 4: 3: 2: 1 నిష్పత్తిలో వరుసగా ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌లకు విభజించుకోవాలి. అంటే రోజుకు పది గంటలను కేటాయిస్తే, దానిలో ఆప్టిట్యూడ్‌ 4 గంటలు, రీజనింగ్‌ 3 గంటలు, ఇంగ్లిష్‌ 2 గంటలు, జనరల్‌ అవేర్‌నెస్‌ 1 గంట చదవాలి. ఇలా చేస్తే విభాగాల ప్రాధాన్యం, కఠినత్వం ఆధారంగా సమయాన్ని మెరుగ్గా విభజించుకున్నట్టు అవుతుంది.

* ఆయా విభాగాల్లో పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌ను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసుకోవాలి.

* రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ముందుగా టాపిక్‌ కాన్సెప్ట్‌ నేర్చుకుని దానిలో బేసిక్‌ ప్రశ్నల నుంచి ఎక్కువ స్థాయి దాకా వివిధ స్థాయుల్లో ఉండే ప్రశ్నలు బాగా నేర్చుకోవాలి.

* దాదాపు 20-25 రోజుల్లో ఈ టాపిక్స్‌ అన్నీ నేర్చుకోవచ్చు.

* ఆ తర్వాత ప్రశ్నలను వేగంగా సాధించేలా వీలైనంత సాధన చేయాలి. వివిధ షార్ట్‌కట్‌ పద్ధతులను నేర్చుకుని ఉపయోగించాలి.

* మొదటి రోజు నుంచే ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రాన్ని సాల్వ్‌ చేయాలి. ఆ తర్వాత దాన్ని విశ్లేషించుకుని ఏ ప్రశ్నలను సాధించలేకపోతున్నారో, దేనికి ఎక్కువ సమయం పడుతుందో గమనించి అవి మెరుగుడేలా సాధన చేయాలి.

* వేగంతోపాటు కచ్చితత్వం కూడా తప్పనిసరి.

వీటిని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికతో సిద్ధమైతే ప్రభుత్వరంగ బ్యాంకులో కొలువు మీ సొంతమవుతుంది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని