Updated : 03 Jan 2022 06:43 IST

పరిధి పెంచుకో.. ఫలితం అందుకో!

కొత్త సంవత్సరం అనగానే.. యువతలో నూతనోత్సాహం తొణికిసలాడుతుంటుంది. లక్ష్యాలను సాధించాలనీ, కొత్త కోర్సుల్లో చేరి జ్ఞానాన్ని పెంచుకోవాలనీ, పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగాలు సాధించాలనీ, ఉత్సాహభరితంగా జీవితంలో స్థిరపడాలనీ.. ఇలా అనేక కోణాల్లో ఆలోచనలు నవోత్తేజాన్ని పొందుతాయి. ఎదిగేందుకు నిచ్చెనలే కాదు, అడ్డుపడే అనేక అవరోధాలూ ఈ ప్రయాణంలో ఉంటాయి. సరైన ప్రణాళిక లేకపోతే పోటీపరీక్షల వైకుంఠపాళిలో పాముల బారిన పడాల్సివస్తుంది. అనుకూల ఫలితాలు సాధించేందుకు ఆశావహమైన ఆలోచనా ధోరణి దోహదపడుతుంది!

కొవిడ్‌ కష్టాలను సాకుగా చూపించే యువత పెద్ద సంఖ్యలోనే ఉంది.. దీనివల్లే పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేకపోయామనీ, మంచి ఉద్యోగాలు పొందలేక పోయామనీ, గత రెండేళ్లుగా నిరాశానిస్పృహలున్నాయని.... తమ అపజయాలకు కొవిడ్‌ ముసుగు వేసుకుంటూ తమని తాము సంతృప్తి పరుచుకుంటున్నారు. ఈ ఆలోచన ధోరణి నుంచి బయటకు రావాలి. వాస్తవాలు గమనిస్తే.. ఎన్నో సంవత్సరాల కంటే గడిచిన సంవత్సరంలోనే కష్టపడిన యువతీ యువకులు విదేశాల్లో సైతం మాస్టర్‌ డిగ్రీ చదివారు. ఉద్యోగాలు భారీ సంఖ్యలో సాధించారు. గత ఏడాది అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన 61 వేల ఉద్యోగ వీసాల్లో అత్యధిక శాతం మన భారతీయులే పొందారు. ప్రైవేటు రంగం కుదేలయిందన్నది నిజమే కానీ ప్రతిభావంతులకు ఈ ఉద్యోగాలు పుష్కలంగానే అందాయి. దీన్నిబట్టి ఉండాల్సినవి- సరైన నైపుణ్యాలూ, వనరుల వేట, ఆశావహ దృక్పథం అని చెప్పవచ్చు.


నియామక ప్రకటనలు

ఆంధ్రప్రదేశ్‌లో రెవిన్యూ, ఎండోమెంట్‌ విభాగాల్లో ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడ్డాయి. రెవిన్యూలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్స్‌, ఎండోమెంట్లో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-3 పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణలో కొత్త సంవత్సరంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కొంత మెరుగుపడింది. ఇక్కడ పోలీస్‌, ఉపాధ్యాయ గ్రూప్‌- 1, 2 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించే అవకాశాలు బలంగా ఉన్నాయి.

జాతీయస్థాయిలో సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీ పరీక్షలు యథాతథంగా జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగం పెద్దఎత్తున గత రెండు సంవత్సరాల్లో నియామకాలు జరిపింది. రాబోయే సంవత్సరాల్లో కూడా జరిపే అవకాశాలున్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు కొవిడ్‌ సమయంలో కూడా క్రమం తప్పకుండా నియామకాలు జరిపాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న వారు నేడు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.


అపోహ వీడి.. సమాయత్తం

అందువల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయిందనీ, ఇక మీదట ఉద్యోగావకాశాలు ప్రభుత్వ రంగంలో ఉండవేమో అనేది అపోహ మాత్రమే. ఆర్థిక సంస్కరణల అనంతరం సహజంగానే ఉద్యోగ నియామకాలపై నియంత్రణ ఉంది. అదే రీతిలో నియామక ప్రక్రియలు కొనసాగుతాయి. ఇది గ్రహించి నిరాశానిస్పృహల ధోరణి నుంచి అభ్యర్థులు బయటపడాలి. ప్రభుత్వ రంగంలో తాము ఎక్కడ స్థిరపడాలనుకున్నారో ఆయా రంగాల్లో నూతన సంవత్సరంలో ఎటువంటి నోటిఫికేషన్లు వచ్చే వీలుందో సరైన రీతిలో అంచనా వేసుకోవాలి. తగిన రీతిలో సమాయత్తం అవ్వాలి. ఇదే తెలివైనవారు చేసే పని. ఆ విధంగానే ఆలోచనలు కొత్త సంవత్సరంలో కూడా ఉండాలి.


ఆలోచన పరిధి విస్తరింపచేయండి

ప్రభుత్వ ఉద్యోగాల్లో టీచర్‌, ఎస్‌ఐ, గ్రూప్‌-1, 2 ఉద్యోగాల్లో ఏదో ఒకదాన్ని నిర్దిష్టంగా పొందాలని నిర్ణయించుకుని తగిన రీతిలో కృషి చేస్తూ చాలామంది అభ్యర్థులుంటారు. సంబంధిత నోటిఫికేషన్‌ రాకపోతే నిరాశా నిస్పృహలకు గురవుతారు. ప్రకటన వచ్చినా తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో మరింతగా ఒత్తిడికి గురవుతారు. సంబంధిత నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు లేకపోయినా దాన్నే అంటిపెట్టుకుని చదువుతూ ఉంటారు. ఈ ఆలోచనా ధోరణి మంచిది కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న విభిన్న పాలనా పరిస్థితులవల్ల అన్ని రకాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. అందుకే ఉద్యోగార్థుల ఆలోచనా పరిధిలో మార్పు అవసరం.


ఒకటి కాకపోతే మరోటి

కటికి మించిన ఉద్యోగ రకాలను లక్ష్యంగా నిర్దేశించుకుని సమాయత్తం అవ్వాలి. ఒక రకపు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రాకపోయినా మరోరకం ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఎదుర్కొనే నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంచుకోవాలి. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోయినా, ఆలస్యం అవుతున్నా వెనువెంటనే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, బ్యాంకింగ్‌ సర్వీస్‌ ఎగ్జామ్స్‌ మొదలైనవి ఎదుర్కొని ఉద్యోగం పొందవచ్చనే దృక్పథం ఏర్పరచుకోవాలి.

నియామక ప్రకటనలు వచ్చినా రాకపోయినా, సరైన ఫలితాలు లేకపోయినా సివిల్స్‌, గ్రూప్‌-1 పరీక్షలు మాత్రమే తమ జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్న చాలామంది ఆ ఉద్యోగాలు పొందలేకపోవచ్చు. ‘నేను టీచర్‌గా మాత్రమే పనికి వస్తాను’, ‘నేను పోలీస్‌ ఉద్యోగంలోనే రాణిస్తాను’, ‘నాకు ఇతర ఉద్యోగాలు పొందే శక్తి లేదు’ అనే తరహా ధోరణి సరి కాదు. దీన్నుంచి బయటపడి కొత్త అవకాశాల వైపు దృష్టి సారించాలి. పూర్తి శక్తిని వినియోగించి ఆ ఉద్యోగాలను పొందగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇలాంటి ఆలోచనాధోరణి పెంచుకుంటేనే నూతన సంవత్సర సంకల్పాలు విజయవంతం అవుతాయి!


ప్రైవేటు రంగం ముందంజ

ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. రోజురోజుకీ విస్తరిస్తున్న ప్రైవేటు రంగం మాత్రం ఉపాధి అవకాశాల్లో ముందంజలోనే ఉంది. గడిచిన రెండు సంవత్సరాల్లో లాక్‌ డౌన్‌ ఉన్నప్పటికీ ప్రైవేటు రంగం పెద్దఎత్తున నియామకాలు జరిపింది. ‘వర్క్‌ ఫ్రం హోం’ లాంటి పద్ధతుల్లో ఉపాధి కల్పించింది. రాబోయే రోజుల్లోనూ సేవా రంగంలో దిగువస్థాయి ఉద్యోగాల కల్పన పెద్దఎత్తున ఉండబోతోంది. పారిశ్రామిక రంగంలో కూడా మధ్య స్థాయి ఉద్యోగాల వరకు ప్రైవేటు రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం యధాతథంగా తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. కొత్త కొత్త అప్లికేషను, వాటి రూపకల్పన, విక్రయానంతర సేవలు, ఆన్‌లైన్‌ వ్యాపారాలు..ఇలా  అనేక రూపాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.


విదేశాల్లో ఆకర్షణీయ అవకాశాలు

వివిధ దేశాల్లో భారత యువత అవకాశాలు వెతుక్కోవటమే కాదు, కొత్త ఉపాధిని కల్పిస్తూ వస్తున్న ఘనతనూ సొంతం చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే కాదు, ఎగుమతులు- దిగుమతులు, ఆతిథ్య సేవలు, మానవ వనరుల నిర్వహణ మొదలైన ఎన్నో రంగాల్లో భారతీయుల నైపుణ్యాలను విదేశాలు స్వాగతిస్తున్నాయి. ఆయా దేశాల్లోని భాషా పరిజ్ఞానంతో పాటు నిజాయితీ, నైపుణ్యాలు ఉంటే చాలు. భారతదేశంలో సంపాదించేదాని కంటే కొన్ని రెట్ల విలువైన సంపాదనతో నాణ్యమైన జీవితం గడిపే అవకాశాలున్నాయి.

చీకటిని తిట్టుకుంటూ కూర్చునేవారు వెలుగును చూడలేరు. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయని నిరుత్సాహపడేవారు కొలువులు కొట్టలేరు. ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఆ విశాల తత్వాన్ని అందుకోగలిగిన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ఉన్నవారికి ఎప్పుడూ ఉద్యోగాల కోత లేదు. కొరత రాలేదు. భవిష్యత్‌ అవకాశాల్ని ఊహించుకుంటూ, సాధించుకుంటూ మెరుగైన ప్రయాణం చేసేదే యువత. అదే సంకల్పంతో ఈ నూతన సంవత్సరంలో రాణించాలి. సంకల్పం బలంగా ఉంటే సగం విజయం సాధించినట్లే!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని