Updated : 10 Jan 2022 06:33 IST

వైరస్‌ని చదివేద్దాం... కొలువులు పట్టేద్దాం!

ప్రపంచంలో దాదాపు అందరికీ తెలిసిన పేర్ల జాబితాలో కొవిడ్‌, కరోనా, డెల్టా, ఒమిక్రాన్‌... ముందు వరుసలో ఉంటాయి. మొన్నటి దాకా అణ్వాయుధాలు ప్రపంచ దేశాలను శాసించాయి. కానీ నేడు కంటికి కనిపించని అతి సూక్ష్మ వైరస్‌ మానవాళిని గడగడలాడిస్తోంది. ఇంకా చెప్పాలంటే పేద, ధనిక, ఉద్యోగి, వ్యాపారి, విద్యార్థి, విహారి.. ఇలా అందరినీ ఒకచూపు చూస్తూ దూసుకుపోతోంది. రేపో, ఎల్లుండో కొవిడ్‌కి ముకుతాడు పడినప్పటికీ..మరో వైరస్‌ విరుచుకుపడదని హామీ లేదు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే శత్రుసేనలను మట్టి కరిపించే సైనికుల్లా ఈ వైరస్‌ ప్రభావం మానవాళిపై తగ్గించడానికి కొందరు నిత్యం ప్రయత్నిస్తున్నారు. వారే వైరాలజిస్టులు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి సేవలు, వైరాలజీ కోర్సు, సంస్థలు, కెరియర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం...

జికా, సార్స్‌, ఎబోలా... కొన్నేళ్ల క్రితం అందరినీ కలవరపెట్టాయి. ఇప్పుడు కరోనా మనతో ఆడుకుంటోంది. దీని తర్వాత మరొకటి వస్తుంది. ఎందుకంటే మనుషులపై వైరస్‌లు దాడిచేయడం కొత్తేమీ కాదు. ఒకదాన్ని సమర్థంగా ఎదుర్కునేలోపు మరొకటి ఆవిర్భవిస్తుంది. ఈ పోరాటం నిత్యం జరుగుతూనే ఉంటుంది. మనందరి తరఫున వైరాలజిస్టులు, కొన్ని సంస్థలు, ప్రయోగశాలలు ఈ యుద్ధాన్ని చేస్తున్నాయి.

శత్రువు రాకను ముందే పసిగట్టి సమర్థంగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. వైరస్‌ అలా కాదు. ఇది కంటికి కనిపించదు. దాని ప్రభావం గుర్తించేలోపే పరిధి విస్తరించకుంటుంది. ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుంది. ఒక్క మనుషులే కాదు జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు, పాడిపంటలూ వైరస్‌ పీడిత, బాధిత వర్గాలే. సృష్టిలోని సమస్త జీవరాశికీ వైరస్‌తో ముప్పే. దాని తీవ్రతను తగ్గించడం, సమర్థంగా తిప్పికొట్టడంలో వైరాలజిస్టుల సేవలే కీలకం. ఇందుకు వ్యాక్సిన్టు, ఔషధాలే అస్త్రాలు. వాటి రూపకల్పనలో వైరాలజిస్టులు పాలు పంచుకుంటారు. 

ఏం చేస్తారంటే...

దాడిచేసిన వైరస్‌ ఏ రకమైనదో గుర్తించడం ఒక సవాల్‌. దాని వ్యాప్తిని అడ్డుకోవడం కఠిన పరీక్షే. వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది. నిర్ధారించడం, ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూడడం, వైరస్‌ సోకినవారికి మెరుగైన వైద్యం అందడానికి కొత్త ఔషధాలు, వ్యాక్సీన్ల విషయంలో సూచనలు అందించడం..వైరాలజిస్టుల విధులు. వీరు ఎక్కువ సమయం మైక్రోబయాలజీ లేదా వైరాలజీ ప్రయోగశాలల్లో గడుపుతారు. కొన్నిసార్లు భిన్న రకాల ల్యాబుల్లో పరిశోధనలు చేయాల్సి వస్తుంది. కొత్త రకం వైరస్‌ వ్యాప్తిచెందినప్పుడు దాని జెనిటిక్‌ లక్షణాలు తెలుసుకోవడానికి మరింత శ్రమించాలి.

వైరాలజిస్టుల సలహాలు వైద్యరంగంలోనివారికి బాగా అవసరం. అందువల్ల వారితోనూ కలిసి పనిచేస్తారు. వైద్యులకు సూచనలు అందిస్తారు. అలాగే వారి నుంచీ కొన్ని విషయాలు తెలుసుకుంటారు. కొన్ని సార్లు ఆసుపత్రులకు వెళ్లి రోగులనూ కలవాల్సి ఉంటుంది. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ కలిసి పనిచేయాల్సి వస్తుంది.

ఎవరు అర్హులు?

* బీఎస్సీలో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం ఒకటి లేదా బీవీఎస్సీ లేదా ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్నవారు ఎమ్మెస్సీ వైరాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రో బయాలజీ కోర్సులో అంతర్భాగంగా వైరాలజీ ఉంటుంది.
* యూజీ స్థాయిలో వైరాలజీ కోర్సు మన దగ్గర అందుబాటులో లేదనే చెప్పుకోవచ్చు. అందువల్ల భవిష్యత్తులో వైరాలజిస్టులు కావాలనే ఆశయం ఉన్నవారు డిగ్రీలో మైక్రోబయాలజీ ఒక సబ్జెక్టుగా తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుంది.
* మైక్రోబయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ సబ్జెక్టుల్లో నచ్చిన కాంబినేషన్‌ ఎంచుకుంటే పీజీలో వైరాలజీ చదవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
* మెడికల్‌ మైక్రో బయాలజీ, ఇమ్యునాలజీ, మైక్రో బయాలజీ కోర్సులు పీజీ స్థాయిలో చదువుకున్నవారు సైతం వైరాలజిస్టుగా రాణించవచ్చు.

ప్రవేశ పరీక్షలో...

గత ఏడాది నేషనల్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్ష వంద మార్కులకు నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొత్తం 50 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడిగారు. సెక్షన్‌ ఎ జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో పది ప్రశ్నలు, సెక్షన్‌ బిలో బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, లైఫ్‌సైన్సెస్‌, మెడికల్‌ సైన్సెస్‌, మైక్రో బయాలజీ, వెటర్నరీ సైన్స్‌, జువాలజీల నుంచి 40 ప్రశ్నలు ఉన్నాయి.

ఏం చదువుతారంటే...

ఎమ్మెస్సీ వైరాలజీ రెండేళ్ల కోర్సులో చేరినవారు వైరస్‌లు, వాటి ఏజెంట్ల గురించి తెలుసుకుంటారు. వైరస్‌ నిర్మాణాన్ని కనుక్కుంటారు. దాని వర్గాన్ని గుర్తిస్తారు. అది వ్యాప్తి చెందడానికి ఉన్న మార్గాలు, దాని ఉత్పత్తి విధానాన్ని తెలుసుకుంటారు. వాటి కారణంగా వచ్చే రోగాలను గుర్తిస్తారు. ఆ వైరస్‌ కదలికలు నియంత్రించి, దాని పరిధి విస్తరించకుండా ఉండడానికి అవసరమైన ప్రత్యామ్నాయాలు ఆన్వేషిస్తారు. టిష్యూ కల్చర్‌, సెల్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, డీఎన్‌ఏ టెక్నాలజీ, యాంటీ వైరస్‌, బయో సేఫ్టీ, మాలిక్యులార్‌ బయాలజీ, ఎపిడిమాలజీ, మాలిక్యులార్‌ టెక్నిక్స్‌...తదితర అంశాలు అధ్యయనం చేస్తారు. మొత్తం నాలుగు సెమిస్టర్లలో కోర్సు ఉంటుంది. ఇందులో చివరి సెమిస్టర్‌ ల్యాబ్‌కు అనుసంధానంగా రిసెర్చ్‌ ప్రాజెక్టు రూపొందించాలి.

కావాల్సిన నైపుణ్యాలు

విభిన్న రకాల పరీక్షలు చేసి వాటి ఫలితాలను విశ్లేషించి, ఒక నిర్ణయానికి రాగలగాలి. పరీక్షల ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వైద్యులు, ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని మెరుగైన సమాచారం అందించాలి. ఇందుకోసం మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి. ప్రయోగశాల పరికరాలను పూర్తిస్థాయిలో ఉపయోగించే నైపుణ్యం (మాలిక్యులర్‌ బయాలజీ స్కిల్స్‌) ఉండాలి.

వీటిలో అవకాశాలు

* ఫార్మా సంస్థలు, పరిశోధన సంస్థలు, వ్యాక్సీన్‌ తయారీ సంస్థలు, మెడ్‌టెక్‌ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల్లో అవకాశాలు లభిస్తాయి. వీరికి..వైరాలజిస్టు, రిసెర్చ్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ ఎనలిస్ట్‌, లేబొరేటరీ అసిస్టెంట్‌, తదితర హోదాలు లభిస్తాయి. ‌

* ఎన్‌ఐవీలో చదువుకున్నవారిని భారత్‌ బయోటెక్‌, యాక్టిస్‌ బయోలాజిక్స్‌, నేషనల్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌, నేషనల్‌ రిప్రొడక్టివ్‌ హెల్త్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సెరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, టాటా ఫండమెంటల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హిందూస్థాన్‌ యునీలీవర్‌, వెంకటేశ్వర హ్యాచరీస్‌...తదితర సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.
* వైరాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేసుకున్నవారు సైంటిస్ట్‌గా రాణించవచ్చు. వ్యాక్సీన్ల తయారీ, కీలక పరిశోధనల్లో భాగం కావచ్చు.
* మస్కట్‌ ఇంటర్నేషనల్‌, బయోకాన్‌ బయోలాజిక్స్‌, లక్ష్మీ లైఫ్‌ సైన్సెస్‌తో పాటు పలు సంస్థలు వైరాలజీ కోర్సులు చదివినవారికి అవకాశం కల్పిస్తున్నాయి.


కోర్సులు... సంస్థలు

* మన దేశంలో వైరాలజీపై అధ్యయనం కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నేషనల్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌వీఐ), పుణెలో ఏర్పాటైంది. ఇందులో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ స్థాయుల్లో వైరాలజీ కోర్సులు ఉన్నాయి. సావిత్రిభాయి ఫూలే పుణే యూనివర్సిటీకి అనుబంధంగా వీటిని అందిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్‌ఐవీ 2020-21 విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌లోనూ మార్పులు చేసింది. త్వరలో ప్రకటన వెలువడుతుంది.
* తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సు అందిస్తోంది. ఇక్కడ 24 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీ పీజీసెట్‌తో ప్రవేశం లభిస్తుంది. కొద్ది నెలల్లోనే ప్రకటన వెలువడుతుంది..
* మణిపాల్‌ సంస్థ ఎమ్మెస్సీ వైరాలజీ కోర్సు అందిస్తోంది.
* అమిటీ విశ్వవిద్యాలయం వైరాలజీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తుంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రకటన వెలువడుతుంది. .
* సీఎంసీ వెల్లూరులో సూపర్‌ స్పెషాలటీ (డీఎం)లో వైరాలజీ కోర్సు అందిస్తున్నారు. అయితే ఎంబీబీఎస్‌ అనంతరం ఎండీ కోర్సులు పూర్తిచేసుకున్నవారికే ఇందులో అవకాశం ఉంటుంది.

విదేశాల్లో: యూఎస్‌లో..హార్వర్డ్‌, పెనిసిల్వేనియా, షికాగో, విస్కాన్సిన్‌ మాడిసన్‌, ఓహియో స్టేట్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలు వైరాలజీ చదువులకు ప్రసిద్ధి. కెనడాలో టొరంటో, బ్రిటిష్‌ కొలంబియా, మెక్‌గిల్‌, కాల్గరీ, ఆల్బర్టా, క్యుబెక్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. యూకేలో గ్లాస్‌గో, ఇంపీరియల్‌, కేంబ్రిడ్జ్‌ సంస్థలు పేరు గడించాయి.


వైరాలజిస్టులు కావాలనే ఆశయం ఉన్నవారు డిగ్రీలో మైక్రోబయాలజీ ఒక సబ్జెక్టుగా తీసుకుంటే అధిక ప్రయోజనం. మైక్రోబయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ సబ్జెక్టుల్లో నచ్చిన కాంబినేషన్‌ ఎంచుకుంటే పీజీలో వైరాలజీ చదవడానికి వీలవుతుంది!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని