టెన్త్‌తో టెక్నీషియన్‌ ఉద్యోగం

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) 641 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

Published : 18 Jan 2022 12:14 IST

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) 641 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు లెవెల్‌-3 వేతనం అందుకోవచ్చు. వీరు ఐఏఆర్‌ఐ ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఐసీఏఆర్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా 64 ఐసీఏఆర్‌ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీలను ఆయా కేంద్రాల వారీగా భర్తీ చేస్తారు. అయితే వీటికి ఎవరైనా పోటీ పడవచ్చు. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో వీరిని టెక్నికల్‌ ట్రైనీగా పరిగణిస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్‌-1 హోదా కేటాయిస్తారు. వీరికి లెవెల్‌-3 కేంద్ర వేతనం అందుతుంది. అంటే రూ.21700 మూలవేతనానికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

పరీక్ష ఇలా

వంద మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిని 4 విభాగాల నుంచి అడుగుతారు. జనరల్‌ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, సైన్స్, సోషల్‌ సైన్సెస్‌లో ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించాలంటే యూఆర్‌లు 40, ఎస్సీ, ఓబీసీ ఎన్‌సీఎల్, ఈడబ్ల్యుఎల్‌లు 30, ఎస్టీలు 25 మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హ్హత పొందినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.

ఏ విభాగాల నుంచి ప్రశ్నలు?

 జనరల్‌ నాలెడ్జ్‌: వర్తమానాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్, పొరుగు దేశాలకు సంబంధించి అడుగుతారు. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్‌ సైన్స్, జనరల్‌ పాలసీ అండ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ విభాగాల్లో వీటిని అడుగుతారు. గత 9 నెలల ముఖ్యాంశాలను బాగా చదువుకుంటే సరిపోతుంది. 

మ్యాథ్స్‌: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. నంబర్‌ సిస్టమ్, అరిథ్‌Çమెటికల్‌ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్‌ చార్టుల నుంచి వీటిని అడుగుతారు. 

 సైన్స్‌: ఈ ప్రశ్నలూ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. ఫిజికల్‌ కెమికల్‌ సబ్‌ స్టాన్సెస్‌- నేచర్‌ అండ్‌ బిహేవియర్, వరల్డ్‌ ఆఫ్‌ లివింగ్, నేచురల్‌ ఫినామినన్, నేచురల్‌ రిసోర్సెస్‌ అంశాల్లో ఇవి ఉంటాయి. 

సోషల్‌ సైన్స్‌: ఇవీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. భారత దేశం, ప్రపంచానికి సంబంధించి ఆర్థిక రాజకీయ అంశాలు, అభివృద్ధి, విపత్తు నిర్వహణ మొదలైన వాటిలో ప్రశ్నలుంటాయి. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 20 వరకు స్వీకరిస్తారు.

ఆన్‌లైన్‌ పరీక్షలు: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చిత్తూరు, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌.

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.300. మిగిలిన అందరికీ రూ.వెయ్యి.

ఖాళీలు: మొత్తం 641 ఉన్నాయి. వీటిలో 286 అన్‌ రిజర్వ్‌డ్, 61 ఈడబ్ల్యుఎస్, 93 ఎస్సీ, 68 ఎస్టీ, 133 ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు కేటాయించారు. 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: జనవరి 10, 2022 నాటికి కనిష్ఠంగా 18 నుంచి గరిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. 

వెబ్‌సైట్‌: https://www.iari.rs.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు