ప్లాబ్‌ టెస్టు.. ఇలా నెగ్గొచ్చు!

ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో ప్లాబ్‌ పరీక్ష రాయడానికి కావాల్సిన అర్హతల గురించీ, దానికెలా సన్నద్ధమవ్వాలనే అంశం గురించీ చాలా సందేహాలు వస్తుంటాయి. ఆ విశేషాలు... 

Published : 20 Jan 2022 11:57 IST

ఎంబీబీఎస్‌ విద్యార్థుల్లో ప్లాబ్‌ పరీక్ష రాయడానికి కావాల్సిన అర్హతల గురించీ, దానికెలా సన్నద్ధమవ్వాలనే అంశం గురించీ చాలా సందేహాలు వస్తుంటాయి. ఆ విశేషాలు... 
ప్లాబ్‌ అంటే ప్రొఫెషనల్‌ అండ్‌ లింగ్విస్టిక్‌ అసెస్‌మెంట్స్‌ బోర్డ్‌ టెస్ట్‌. దీన్ని జనరల్‌ మెడికల్‌ కౌన్సిల్, యూకే వారు నిర్వహిస్తారు. ఇతర దేశాల్లో మెడిసిన్‌ చదివినవారు యూకేలో మెడికల్‌ ప్రాక్టీస్‌ చేయడానికి అవసరమైన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను నిర్థ్ధారించే పరీక్ష.. ప్లాబ్‌. యూకేలో మెడిసిన్‌ చదివినవారు మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించడానికి ముందు రెండు సంవత్సరాల ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ చేయడం తప్పనిసరి. ప్లాబ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత పొందినవారిని ఈ రెండు సంవత్సరాల ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ చేసినవారు పొందే విషయపరిజ్ఞానానికి సమానమైన పరిజ్ఞానం ఉన్నవారిగా భావిస్తారు. 

ప్లాబ్‌ టెస్ట్‌ రాయడానికి ముందుగా విద్యార్థి ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యం పరీక్షించే ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలో ప్రతి సెక్షన్‌లో 7.0 స్కోర్‌ తోపాటు మొత్తంగా 7.5 స్కోర్‌ పొంది ఉండాలి. 

ప్లాబ్‌ టెస్ట్‌ పార్ట్‌-1, పార్ట్‌-2 అని రెండు భాగాలు. 

- పార్ట్‌-1 రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే- ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ కార్డ్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ప్లాబ్‌ టెస్ట్‌ పార్ట్‌-1లో 180 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకూ ఇచ్చే ఐదు సమాధానాల నుంచి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ప్లాబ్‌ టెస్ట్‌ పార్ట్‌-1 లో రోగుల సంరక్షణ కోసం విద్యార్థికున్న విషయపరిజ్ఞానాన్ని అన్వయించగల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అంతేగానీ జ్ఞాపకశక్తిని పరీక్షించదు. ప్రస్తుతం యూకేలో అమల్లో ఉన్న అత్యుత్తమ వైద్య విధానాలపై, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పరికరాలకు  సంబంధించీ ప్రశ్నలు ఉంటాయి. ఇవే కాకుండా కమ్యూనికేషన్, కన్సల్టేషన్‌ స్కిల్స్, రోగి భద్రత, టీమ్‌ వర్క్‌ లాంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. 

- ప్లాబ్‌ టెస్ట్‌ పార్ట్‌-2 ఆబ్జెక్టివ్‌ స్ట్రక్చర్డ్‌ క్లినికల్‌ పరీక్ష. ఇందులో 18 వాస్తవిక సందర్భాలు ఉంటాయి. ఒక్కొకటి ఎనిమిది నిమిషాల పాటు, మాక్‌ కన్సల్టేషన్‌ లేదా వార్డులో నిజ జీవిత సెట్టింగ్‌లను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ప్లాబ్‌ టెస్ట్‌ పార్ట్‌-2 లో ఎక్కువగా మెరుగైన వైద్యచికిత్స గురించి ప్రశ్నలుంటాయి. ప్లాబ్‌ పార్ట్‌-1, పార్ట్‌-2ల్లో ఉత్తీర్ణత సాధించాక యూకేలో ప్రాక్టీస్‌ చేయడానికి లైసెన్స్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సివుంటుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని