బహుళ అవకాశాలకు... బిజినెస్‌ ఎనలిటిక్స్‌!

వెతికితే చాలు.. వెంటాడుతూనే ఉంటాయి. టర్మ్‌ పాలసీ గురించి అన్వేషిస్తే ఆ తర్వాత వాటి ప్రకటనలే దర్శనమిస్తాయి. విహారానికి టికెట్‌ బుక్‌చేసుకుంటే మా హోటల్‌లో బస చేయండంటూ ఆఫర్లు హోరెత్తుతాయి. ఎందుకిలా అంటారా...

Updated : 31 Jan 2022 05:37 IST

వెతికితే చాలు.. వెంటాడుతూనే ఉంటాయి. టర్మ్‌ పాలసీ గురించి అన్వేషిస్తే ఆ తర్వాత వాటి ప్రకటనలే దర్శనమిస్తాయి. విహారానికి టికెట్‌ బుక్‌చేసుకుంటే మా హోటల్‌లో బస చేయండంటూ ఆఫర్లు హోరెత్తుతాయి. ఎందుకిలా అంటారా... సాంకేతిక విజ్ఞానమే ఇందుకు కారణం. అందులో బిజినెస్‌ ఎనలిటిక్స్‌ పాత్ర కీలకం. ఇప్పుడిది శక్తిమంతమైన ఉద్యోగాల్లో ఒకటిగా పరివర్తనం చెందుతూ.. వ్యాపార సంస్థలకు దిక్సూచిలా, ఉద్యోగార్థులకు అవకాశాల వారధిలా విస్తరిస్తోంది!


రెండేళ్లలోగా 85 శాతం సంస్థలు తమ వ్యాపార సమర్థ నిర్వహణకోసం ఎనలిటిక్స్‌నే అస్త్రంగా మలచుకుంటాయని అంచనా.  

‘‘2023 పూర్తయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా 13 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని బిజినెస్‌ ఎనలిటిక్స్‌ నమోదు చేస్తుంది’’

- గార్డ్‌నర్‌ అధ్యయనం


‘‘బిజినెస్‌ ఎనలిటిక్స్‌ సంబంధిత ఉద్యోగాలకు 2026 నాటికి ఊహించని డిమాండ్‌ ఉంటుంది’’

- యునైటెడ్‌ స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌


నుషులకు ఆక్సిజన్‌ మాదిరిగా సంస్థలను ఎనలిటిక్స్‌ ముందుకు నడిపిస్తున్నాయి. ఆధునిక వ్యాపార ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలు, అభిరుచులను విశ్లేషించి, కాచివడపోసి సంస్థల ముందు ఉంచుతున్నాయి. పుంఖానుపుంఖాలుగా పోగవుతోన్న సమాచారం నుంచి సారాన్ని ఒడిసిపట్టి వ్యాపార వ్యూహాలకు దశ, దిశలను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో సమర్థ మానవ వనరుల గిరాకీ ఉంది. భవిష్యత్తులోనూ అవకాశాలకు డోకా లేదని నివేదికలు తెలుపుతున్నాయి. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ప్రావీణ్యాన్ని పొందితే ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు!

పెద్ద మొత్తంలో పోగవుతోన్న సమాచారం నుంచి అవసరమైనదాన్ని గ్రహించి, విలువైనదిగా మార్చడానికి ఎనలిటిక్స్‌ దోహదపడడంతో సంస్థలు ఈ విభాగంపై దృష్టి సారిస్తున్నాయి. కొన్ని టూల్స్‌ సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించుకుంటున్న సంస్థలు అభివృద్ధివైపు దూసుకెళ్తున్నాయి. అందువల్ల మిగిలిన సంస్థలూ ఎనలిటిక్స్‌ అస్త్రాన్నే తమ వ్యాపారంలో ప్రయోగిస్తున్నాయి. ఇందుకోసం నిపుణులను నియమించుకుంటున్నాయి.

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రిటైల్‌, హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా...తదితర విభాగాల్లో ఎనలిటిక్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఉన్న సమాచారాన్ని స్టాటిస్టిక్స్‌, క్వాంటిటేటివ్‌ ఎనాలిసిస్‌, ఎక్స్‌ప్లనేటరీ అండ్‌ ప్రిడిక్టివ్‌ మోడల్స్‌, ఫ్యాక్ట్‌ బేస్డ్‌ మేనేజ్‌మెంట్‌...ఉపయోగించి ఫలితాలు పొందడమే ఎనలిటిక్స్‌. భారతదేశం ఈ విభాగంలో ప్రపంచ హబ్‌గా మారుతోంది. వివిధ భారతీయ కంపెనీలూ ప్రపంచవ్యాప్త సేవలు అందిస్తున్నాయి.


హోదాలెన్నో..

బిజినెస్‌ ఎనలిస్ట్‌: డేటా ఎనలిస్ట్‌ నుంచి సమాచారాన్ని స్వీకరించి, దానికి అనుగుణంగా వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. మార్పులు చేపడతారు.

కస్టమర్‌ బిహేవియర్‌ ఎనలిస్ట్‌/ మార్కెట్‌ రిసెర్చ్‌ ఎనలిస్ట్‌: ఆ కంపెనీ వద్ద ఉన్న వినియోగదారుల సమాచారం ఆధారంగా వీరు కొనుగోళ్లను పరిశీలిస్తారు. ఏ ఉత్పత్తికి డిమాండ్‌ ఎక్కువగా ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడం, దుకాణాలకు చేరవేయడం, నిల్వ చేయడం మొదలైన పనులు వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి.

ఆపరేషన్స్‌ ఎనలిస్ట్‌: ఆ కంపెనీలో వివిధ విభాగాల్లో జరుగుతోన్న పనులు గమనిస్తారు. రోజువారీ సమస్యలను పరిశీలిస్తారు. శాఖలవారీ మెరుగైన పనితీరు కోసం సూచనలు చేస్తారు. సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారు.

సప్లై చెయిన్‌ ఎనలిస్ట్‌: ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉండేలా చూస్తారు. వినియోగదారుడు కోరుకున్న వెంటనే వారికి లభించేలా చూడడంలో వీరి పాత్ర ఉంటుంది.

రిసెర్చ్‌ ఎనలిస్ట్‌: సమస్యలను విశ్లేషిస్తారు. వినియోగదారులు, స్టేక్‌ హోల్డర్ల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు చూపుతారు. డొమైన్‌ నిపుణులుగా సంస్థలో గుర్తింపు పొందుతారు.

రిస్క్‌ ఎనలిస్ట్లు: సమాచారాన్ని విశ్లేషించి, కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏమైనా ఉంటే గమనిస్తారు. నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటారు. సంస్థ ఆర్థిక పుష్టికి తోడ్పడతారు.

ఇవే కాకుండా... పోర్ట్‌ఫోలియో ఎనలిస్ట్‌, క్యాంపైన్‌ ఎనలిస్ట్‌, హెచ్‌ఆర్‌ / పీపుల్‌ ఎనలిస్ట్‌, ప్రైసింగ్‌ ఎనలిస్ట్‌, ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌, సెక్యూరిటీ ఎనలిస్ట్‌, వెబ్‌ ఎనలిస్ట్‌, స్టాటిస్టికల్‌ ఎనలిస్ట్‌, సీఆర్‌ఎం ఎనలిస్ట్‌, ఎస్క్యూఎల్‌ ఎనలిస్ట్‌ తదితర హోదాలతో ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించవచ్చు.


కెరియర్‌ గ్రాఫ్‌

ప్రారంభంలో ఎనలిస్ట్‌ హోదాతో విధులు నిర్వర్తిస్తారు. నాలుగేళ్ల అనుభవంతో సీనియర్‌ ఎనలిస్ట్‌ కావచ్చు. ఎనిమిదేళ్ల అనుభవం ఉన్నవారు లీడ్‌ ఎనలిస్ట్‌, పన్నెండేళ్ల అనుభవంతో మేనేజర్‌ హోదాతో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ నైపుణ్యాలు ఉన్నవారికి తక్కువ వ్యవధిలోనే పదోన్నతులు సాధ్యమవుతాయి. ఫైనాన్స్‌, ఇన్వెస్టిమెంట్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో బిజినెస్‌ ఎనలిస్ట్‌ హోదాతో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రంగాల్లో వేతనాలు సైతం పెద్ద మొత్తంలో దక్కుతాయి.


మూడు సంస్థలు సంయుక్తంగా...

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), కోల్‌కతా; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్‌; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), కోల్‌కతా ఈ మూడు సంస్థలూ కలిసి పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ప్రపంచంలోనే మేటి బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సుల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది.

ఒక్కో సంస్థలో 6 నెలలపాటు కోర్సు చదువుకుంటారు. చివరి 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఎనలిటిక్స్‌ సంబంధిత సాంకేతికాంశాలు ఐఐటీలోనూ, ఎనలిటిక్స్‌ సంబంధిత స్టాటిస్టిక్స్‌, మెషీన్‌ లర్నింగ్‌ థియరీని ఐఎస్‌ఐలో, ఎనలిటిక్స్‌ అనువర్తనాలను ఐఐఎంలో నేర్పుతారు. 60 శాతం మార్కులతో బీటెక్‌/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంకాం/ ఎంబీఏ పూర్తిచేసుకున్నవారు అర్హులు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ఇంటర్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం తదితరాంశాలకు కొన్నేసి పాయింట్లు కేటాయించి కోర్సులోకి ఎంపిక చేస్తారు.

ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 27న కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలున్నాయి.

పరీక్ష: దీన్ని 150 మార్కులకు నిర్వహిస్తారు. 50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 15, లాజికల్‌ రీజనింగ్‌ 5, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌ 5, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.
సిలబస్‌, పూర్తి వివరాలకు
www.pgdba.iitkgp.ac.in చూడవచ్చు.

* అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీస్‌ ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు రెండేళ్ల వ్యవధితో అందిస్తోంది. ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

* హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందిస్తోంది. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో ప్రవేశం కల్పిస్తారు.

* వివిధ ఐఐఎంలు ప్రత్యేకంగా ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. క్యాట్‌ స్కోర్‌ లేదా పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తున్నాయి.

* సింబయాసిస్‌, మణిపాల్‌, గ్రేట్‌ లేక్స్‌, ఐటీఎం, ఎక్స్‌ఐఎంఈ, గీతం.. ఇలా ఎన్నో సంస్థలు బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో వీటిలో చేరవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ, జీడీ, ఇంటర్వ్యూలతో అవకాశం కల్పిస్తారు.


ఏ నైపుణ్యాలు కావాలి?

క్వాంటిటేటివ్‌, ఎనలిటికల్‌, కమ్యూనికేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, ప్రోగ్రామింగ్‌, స్టాటిస్టికల్‌, మ్యాథ్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డేటా విజువలైజింగ్‌ నైపుణ్యాలు అవసరమవుతాయి. పూర్తి ఆసక్తి, సమస్యను అర్థం చేసుకునే పరిజ్ఞానం రెండూ ఉండాలి. సాంఖ్యకశాస్త్రంపై పట్టుండాలి. విశ్లేషణ సామర్థ్యం తప్పనిసరి. లాజిక్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ పనికొస్తాయి.

సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ఎనలిస్ట్‌ ప్రధాన విధి. వాటి ఆధారంగా నివేదికలు తయారుచేయాలి. ఇందులో గ్రాఫ్‌లు, చార్టులు, డ్యాష్‌బోర్డులు, ఇన్ఫోగ్రాఫిక్స్‌ ఉపయోగించాలి. చూసేవాళ్లు సులువుగా అర్థంచేసుకునేలా, ఒక అభిప్రాయానికి వచ్చేలా చేయగలగాలి. ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌పై అవగాహన ఉండాలి. సమాచారం (డేటా) నిల్వచేయడం, తిరిగి పొందే విధానాలను తెలుసుకోవాలి. హడూప్‌, పైతాన్‌, ఆర్‌, ఎస్‌ఎఎస్‌, స్వాట్‌, రేషనల్‌ రిక్వజైట్‌ ప్రొ..మొదలైన టూల్స్‌పై పట్టుంటే మంచిది.


బీబీఏలో భాగంగా...

ప్పుడు చాలా సంస్థలు యూజీ స్థాయిలోనే బిజినెస్‌ ఎనలిటిక్స్‌ చదువుకునే అవకాశం కల్పించాయి. బీబీఏలో భాగంగా వీటిని నడుపుతున్నాయి. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. గీతం, కేఎల్‌యూ, విశ్వవిశ్వాని, నార్సీమెంజీ, సింబయాసిస్‌, విట్‌, సెయింట్‌ జోసెఫ్‌.. సంస్థల్లో చదువుకోవచ్చు.


ఆన్‌లైన్‌లోనూ...

కోర్స్‌ఎరా, సింప్లీ లర్న్‌, అప్‌గ్రేడ్‌, గ్రేట్‌ లర్నింగ్‌...ఇలా పలు బోధన సంస్థలు... వివిధ విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి ఆన్‌లైన్‌ కోర్సులు నడుపుతున్నాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని