Updated : 07 Feb 2022 02:39 IST

డిజిటల్‌ ప్రపంచానికి రక్షణ కవచం!

సైబర్‌ భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యం
అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో

వర్తమాన ప్రపంచం సమర్థులైన సైబర్‌ భద్రత నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీన్ని అవకాశంగా మార్చుకుంటే వృత్తి జీవితంలో చక్కగా స్థిరపడవచ్చు. ఆసక్తి ఉన్నవారికోసం వివిధ రకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. అలా వీలు కానివాళ్లు ఆన్‌లైన్‌ వేదికగానూ నైపుణ్యాలు పెంచుకోవచ్చు!

తేనీటి నుంచి టేకోవర్‌ దాకా ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. భారత్‌తో సహా, ప్రపంచ దేశాలన్నీ డిజిటల్‌ విధానానికి జై కొడుతున్నాయి. మొన్నటి దేశ బడ్జె్జెట్‌లో దీనికే అధిక ప్రాధాన్యం దక్కింది. క్షణాల్లో నగదు బదిలీ అవుతోంది... చిటికేసేలోగా సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. ఈ విధానాలన్నీ మనకెంతో సౌకర్యాన్ని తెచ్చిపెట్టాయి.

అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. అంతర్జాలాన్నే అడ్డాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులతో పాటు, రహస్యాలనూ దొంగిలిస్తున్నారు. డిజిటల్‌ భద్రతకు సవాల్‌ విసురుతున్నారు.

ఈ దాడుల నుంచి రక్షించే నైపుణ్యం ఉన్నవారి కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది. సుమారు 30 లక్షల మంది నిపుణుల కొరత ఉందని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరి మీరు ఇందులో భాగం కావాలనుకుంటున్నారా?

నిరంతర యుద్ధం
దేశానికి సైనికుల మాదిరి డిజిటల్‌ ప్రపంచానికి సైబర్‌ భద్రత నిపుణుల సేవలు ఎంతో కీలకం. సమాచారాన్ని పంచుకోవడం నుంచి దేశ వ్యాపార ప్రయోజనాలను చూసుకోవడం వరకు ప్రతిదీ సైబర్‌ సెక్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ సైబర్‌ దాడులూ ఎక్కువవుతున్నాయి. మోసాలకు ఆన్‌లైన్‌ అత్యుత్తమ వేదికైంది. దీంతో సైబర్‌ నేరగాళ్లతో నిరంతర యుద్ధం జరుగుతునే ఉంటోంది. తెలిసిన ముప్పుని యాంటీ-వైరస్‌ సాఫ్ట్‌వేర్‌, ఫైర్‌వాల్స్‌తో అడ్డుకట్ట వేయవచ్చు. కానీ సైబర్‌ దాడి ఎక్కడ, ఎలా, ఏ రూపంలో జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే మనకు తెలీకుండానే మనతోనే వివరాలు చెప్పించుకుని దోచుకుంటున్నారు.

ఈ సైబర్‌ దాడులు ఆర్థిక లావాదేవీలకే పరిమితం కావడం లేదు. ‘నా దగ్గర డబ్బుంటే కదా, ఎవరైనా నన్ను మోసం చేయడానికి!’ అనుకోవడానికి అవకాశం లేదు. మీ బలహీనతలనే ఆయుధాలుగా చేసుకుని, మీతోనే రహస్యాలు చెప్పించుకుని మరీ, ‘డబ్బులిస్తావా, బయట పెట్టమంటావా?’ అంటూ వేధిస్తుంటారు.

ఈ మోసాలకు ఒక పరిధి, పరిమితి అంటూ ఏమీ ఉండవు. ఇందుకోసం ఎన్నో పద్ధతులు ఉన్నాయి. హ్యాకింగ్‌ అనేది సైబర్‌ దాడికి ఒక రూపం. రహస్య సమాచారాన్ని యాక్సెస్‌ చేయడానికి చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకుని నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తారు. వ్యక్తులను ఇబ్బంది పెట్టడానికి స్పామింగ్‌ పరిజ్ఞానం ఉపయోగిస్తారు. ఇందుకోసం పెద్దమొత్తంలో వ్యర్థ సందేశాలు, అవాంఛిత ప్రకటనలను పంపుతారు. ఫిషింగ్‌ అంటే క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌, సెక్యూరిటీ కోడ్‌ లాంటి సున్నితమైన సమాచారాన్ని పొందడం, మోసపూరిత సందేశాలు లేదా నిజమైన వెబ్‌సైట్‌ల వలె కనిపించే నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా లాగిన్‌ ఆధారాలను పొందడం. ఇలా సైబర్‌ మోసాలు ఎన్నో రకాలుగా సవాలు విసురుతుంటాయి.

భవిష్యత్తు అంచనాలు
* సైబర్‌ సెక్యూరిటీలో 30 లక్షల మంది నిపుణుల కొరత ఉందని ప్రపంచ ఆర్థిక సంఘం లెక్కగట్టింది.

* ప్రపంచవ్యాప్తంగా 2014 నాటికి సైబర్‌ సెక్యూరిటీలో భర్తీకాని ఉద్యోగాలు పది లక్షలు ఉంటే 2021కి వచ్చేసరికి ఆ సంఖ్య 30 లక్షలకు చేరిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

* మన దేశానికి 2025 నాటికి 15 లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగుల కొరత ఉంటుందని మైకెల్‌ పేజ్‌ అనే నియామక సంస్థ అంచనా వేసింది.

* సైబర్‌ సెక్యూరిటీ వెంచర్స్‌ ప్రకారం.. కేవలం సైబర్‌క్రైమ్‌ నిర్వహణకే 2021 నాటికి ప్రపంచానికి ఏటా 6 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు అయింది.

* వచ్చే దశాబ్దంలో వేగంగా వృద్ధి చెందుతోన్న హోదాల్లో పదో స్థానంలో ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎనలిస్ట్‌ ఉద్యోగం ఉంటుందని యూఎస్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో అంచనా. మిగతా ఉద్యోగాల్లో వృద్ధి 4 శాతం ఉంటే ఇందులో 31 శాతం ఉందని తెలిపింది.

* భారత్‌లో 2019లో 221 మిలియన్‌ డాలర్లు ఉన్న సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్‌ సేవలు 2022 పూర్తయ్యేసరికి 320 మిలియన్‌ డాలర్లకు చేరతాయని లెక్కలేస్తున్నారు.

* సెక్యూరిటీ ఆపరేషన్స్‌, థ్రెెట్‌ మేనేజ్‌మెంట్‌, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, ఐడెంటిటీ అండ్‌ యాక్సెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలకు గణనీయమైన డిమాండ్‌ ఉందనీ, అయినప్పటికీ సంస్థలకు నిపుణులైన అభ్యర్థులు దొరకడం లేదనీ డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

అవకాశాలు... హోదాలు.
సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు అన్నిచోట్లా అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఆర్థిక, డేటా సంస్థల్లో వీరి సేవలు ఎంతో కీలకం. సాఫ్ట్‌వేర్‌, ఈ కామర్స్‌, ఫిన్‌టెక్‌, బ్యాంకులు, నెట్‌వర్క్‌తో అనుసంధానమైన అన్ని సంస్థల్లోనూ అవకాశాలుంటాయి.

వ్యాపార సంస్థలన్నీ తమ, వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నాయి. అందుకే సైబర్‌ సెక్యూరిటీ ఎన్నో అవకాశాలు అందిస్తుంది.

సెక్యూరిటీ ఇంజనీర్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సెక్యూరిటీ ఎనలిస్ట్‌, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ లీడ్‌, సెక్యూరిటీ ఆడిటర్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, సెక్యూరిటీ కన్సల్టెంట్‌, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌, సెక్యూరిటీ మేనేజర్‌, క్రిప్టోగ్రాఫర్‌, సెక్యూరిటీ స్పెషలిస్ట్‌...ఇలా విభిన్న హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి.


2025 నాటికి ఒక్క భారతదేశంలోనే 15 లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగుల కొరత ఉంటుంది

- మైకెల్‌ పేజ్‌ గ్లోబల్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీ


తక్కువ స్థాయిలోనే గణితం

వ్యక్తుల, సంస్థల సమాచారాన్ని ఇంటర్నెట్‌ ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచడంలో సైబర్‌ సెక్యూరిటీ కీలకం. అయితే ఈ సైబర్‌ భద్రతను ఎవరు చూసుకుంటారు, వారు ఎలాంటి కోర్సులు చదువుతారు, ఏ తరహా నైపుణ్యాలు అవసరమో... తెలుసుకోవాలనే కుతూహలం రావడం సహజం.

సైబర్‌ భద్రతను కెరియర్‌గా మల్చుకోవాలనుకునేవారికి ప్రాథమిక స్థాయి కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఉన్నా సరిపోతుంది. మీరు ఈ విభాగంలో సమర్థులని ప్రపంచానికి చెప్పడానికి సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారికి ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలూ లభిస్తున్నాయి.

* ఇంటర్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులైతే బీటెక్‌లో సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో చేరవచ్చు.

* కొన్ని సంస్థలు బీఎస్సీ, బీసీఏలోనూ సైబర్‌ సెక్యూరిటీ చదువులు అందిస్తున్నాయి.

* యూజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఎమ్మెస్సీ, ఎంటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ బాట పట్టవచ్చు.

* ఇతర గ్రూపుల నేపథ్యం ఉన్నవారు, తాజా గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్‌లో వివిధ సంస్థలు అందించే సైబర్‌ కోర్సులతో అవకాశాలు పొందవచ్చు.

ఈ కోర్సుల్లో తక్కువ స్థాయిలోనే గణితం ఉంటుంది. ఎడ్‌ఎక్స్‌, కోర్స్‌ఎరా, సింప్లీ లర్న్‌, గ్రేట్‌ లర్నింగ్‌, అప్‌గ్రేడ్‌...మొదలైనవి వివిధ విశ్వవిద్యాలయాలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో కలిసి కరిక్యులమ్‌ రూపొందించి, ఆరు నెలలు, ఏడాది వ్యవధితో ఆన్‌లైన్‌లో కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ఎవరైనా చేరవచ్చు.


ఏం నేర్చుకుంటారు?

* కంప్యూటర్‌ సిస్టమ్‌ లోపాలు ఎలా గుర్తించాలి, డిజిటల్‌ దోపిడీని గుర్తించడం, డేటా నష్టం, వైరస్‌ల ద్వారా డబ్బు నష్టం వంటివి నివారించడాన్ని సైబర్‌ సెక్యూరిటీ కోర్సుతో నేర్చుకోవచ్చు.

* సైబర్‌ దాడులను నివారించడమే కాకుండా, దాన్ని ముందస్తుగా నిరోధించడానికి, సైబర్‌ ముప్పునకు వ్యతిరేకంగా ఎదురుదాడి చేయడానికి పటిష్ఠ భద్రత ఎలా రూపొందించాలో కోర్సులో బోధిస్తారు. డేటా సేకరణ, ప్రాసెసింగ్‌, భద్రతా వ్యూహాలు, ఆపరేషనల్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సెక్యూరిటీ ఎకనామిక్స్‌, సెక్యూరిటీ పాలసీలను అభ్యసిస్తారు.

* ప్రోగ్రామింగ్‌, క్లౌడ్‌ సెక్యూరిటీ, రిస్క్‌ ఎనాలిసిస్‌ నైపుణ్యాలు పెంపొందేలా తర్ఫీదు ఉంటుంది. ఎథికల్‌ హ్యాకింగ్‌, పెనెట్రేషన్‌ టెస్టింగ్‌, మాల్వేర్‌ అనాలిసిస్‌ మొదలైనవీ తెలుసుకుంటారు.

* ప్రోగ్రామింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లపై అవగాహనను పెంపొందించుకుంటారు.

* ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌, ఫండమెంటల్‌ కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, బ్లాక్‌ చెయిన్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, ఐవోటీ సెక్యూరిటీ మొదలైనవాటినీ అభ్యసిస్తారు.

బీటెక్‌లో...
చాలా సంస్థలు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును సైబర్‌ సెక్యూరిటీ స్పెషలైజేషన్‌తో అందిస్తున్నాయి.

అమృత విశ్వ విద్యాలయం, జైన్‌ యూనివర్సిటీ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, పారుల్‌ యూనివర్సిటీ, ఐఐఐటీ బెంగళూరు, బిట్స్‌ హైదరాబాద్‌, యూపీఈఎస్‌ దెహ్రాదూన్‌, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి, ఎస్‌ఆర్‌ఎం, గాల్గోటియా, శస్త్ర, లవ్‌లీ ప్రొఫెషనల్‌, విజ్ఞాన్‌, విట్‌...ఇలా ఎన్నో సంస్థల్లో సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో చేరవచ్చు.

బీటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో భాగంగా.. కంప్యూటర్‌ వ్యవస్థలు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌, ఇంటర్నెట్‌, క్లౌడ్‌ వ్యవస్థ, ఇతర టెక్నాలజీల పనితీరు, నిర్మాణ వివరాలపై శిక్షణ ఇస్తారు. అలాగే భద్రతా లోపాలు గుర్తించడానికి ఉన్న పద్ధతులు, అందుబాటులో ఉన్న వివిధ ఆటోమేషనల్‌ టూల్స్‌, అవసరమైన ప్రోగ్రామింగ్‌ మెలకువలు నేర్పుతారు. డేటా స్ట్రక్చర్స్‌, పైతాన్‌, జావా లాంటి కంప్యూటర్‌ లాంగ్వేజీలతోపాటు రుబి, జావా స్క్రిప్టింగ్‌, పెర్ల్‌ వంటి స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌లూ ఉంటాయి. వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల అంతర్గత నిర్మాణం గురించి తెలుపుతారు. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, క్రిప్టోగ్రఫీ, వివిధ హార్డ్‌వేర్‌ పరికరాల నిర్మాణం, పనిచేసే విధానం, లోపాలు గుర్తించడం, పటిష్ఠమైన భద్రత వ్యవస్థ నిర్మించడంపై శిక్షణ అందిస్తారు. డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, ఏఐ, ఎథికల్‌ హ్యాకింగ్‌, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌ మొదలైనవి నేర్చుకుంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts