మెరుగైన మార్కులకు..మెలకువలు

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగబోతున్నాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి దూరంగా ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే అత్యధిక మార్కులు సాధించడం సాధ్యమే. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో పాటించాల్సిన సూచనలు నిన్నటి సంచికలో ప్రచురించాం

Updated : 03 Mar 2022 04:35 IST

ఇంటర్‌ పరీక్షల్లో విజయ భవ!

2

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగబోతున్నాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి దూరంగా ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే అత్యధిక మార్కులు సాధించడం సాధ్యమే. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో పాటించాల్సిన సూచనలు నిన్నటి సంచికలో ప్రచురించాం. ఈ సంచికలో బైపీసీ విద్యార్థుల కోసం బోటనీ, జువాలజీలో స్కోరింగ్‌ మెలకువలను నిపుణులు అందిస్తున్నారు!  

ఈ సంవత్సరం కరోనా పరిస్థితుల వల్ల 70 శాతం సిలబస్‌లో మొత్తం మూడు సెక్షన్లలో చాయిస్‌ ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి ఈ సిలబస్‌తో వెయిటేజ్‌ ఆధారంగా సిద్ధమైతే మంచి మార్కులను సాధించవచ్చు. మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంటర్‌ బోర్డ్‌ పరీక్షలు మొదటిసారిగా రాస్తున్నారు. వారు ఆందోళన పడకుండా కింది పాఠ్యాంశాల్లో ప్రశ్నలకు సిద్ధం కావాలి.

వృక్షశాస్త్రం (బోటనీ)

మొక్క బాహ్య స్వరూపశాస్త్రంలోని పుష్పవిన్యాసం, పుష్పం (22 మార్కులు), మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి (16), ఆవృతబీజాల వర్గీకరణ (14), మొక్కల జీవావరణ శాస్త్రం (12). వీటిని చదవడం వల్ల మొత్తం అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు 8, స్వల్ప సమాధానాలు 8, వ్యాసరూప ప్రశ్నలు రెండు వస్తాయి. అదేవిధంగా మొదటి సంవత్సర విద్యార్థులు వీటితోపాటు జీవ ప్రపంచం (8 మార్కులు), జీవ వర్గీకరణ (8 మార్కులు)... ఈ పాఠ్యాంశాలు చదవడం వల్ల 60 మార్కులు పొందొచ్చు.
ద్వితీయ సంవత్సర విద్యార్థులు కింది పాఠ్యాంశాలను ప్రణాళిక ప్రకారం చదవాలి. జన్యుశాస్త్రంలోని అనువంశిక సూత్రాలు, వైవిధ్యం, అణుస్థాయి ఆధారిత అనువంశికత్వం, జీవసాంకేతికశాస్త్రం, సూత్రాలు, ప్రక్రియలు, దీని అనువర్తనాలు. వీటి నుంచి మొత్తం 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, 11 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 1 వ్యాసరూప సమాధాన ప్రశ్న వస్తాయి. సాధారణ విద్యార్థులు వీటిని ప్రణాళికతో సన్నద్ధమైతే మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధ్యం. మెరిట్‌ విద్యార్థులు వీటితోపాటు మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మ జీవులు పాఠ్యాంశం చదవడం వల్ల 3 అతిస్వల్ప, 1 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీరు తక్కువ సమయంలో సంసిద్ధమై 60 శాతం మార్కులను పొందొచ్చు. ఈ సూచనలు పాటిస్తూ సమయాన్ని సద్వినియోగపరుచుకుని చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు.

- సుందర్ రావు


విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలైెనా పనిదినాలు సరిపోయినట్లుగా వచ్చాయి కాబట్టి అందరికీ అన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌ పూర్తయివుండొచ్చు. ఐపీఈ ప్రశ్నపత్రంలో అన్ని విభాగాల్లోనూ చాయిస్‌ ఇచ్చారు. 60/60 మార్కులు సాధించడానికీ, ప్రతి ఒక్కరూ పాస్‌ మార్కులు సంపాదించడానికీ ఇది మంచి అవకాశం. జువాలజీలో కొన్ని చాప్టర్లలో పూర్తిగా సన్నద్ధమైతే 40 మార్కులు, ఆపైన సంపాదించవచ్చు.
‘జువాలజీ అంతా రివిజన్‌ చేశాను. పాఠాలన్నీ పూర్తిగా వచ్చు’ అని అతి విశ్వాసంతో ఉంటే మార్కులు తగ్గే అవకాశం ఎక్కువ. జువాలజీలో ప్రతి సమాధానంలోనూ కీ వర్డ్స్‌/ సెంటెన్సెస్‌ ఉంటాయి. క్షుణ్ణంగా చదివి వాటిని పూర్తిగా రాస్తేనే 60/60 లభిస్తాయి. కాబట్టి అన్ని చాప్టర్స్‌లో ఉండే 2, 4, 8 మార్కుల ప్రశ్నల సమాధానాలనూ, వాటిలో ఉన్న ప్రతి డయాగ్రమ్‌నూ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. డయాగ్రమ్‌ నీట్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. చాయిస్‌ ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయడం మరిచిపోవద్దు.
వెయిటేజి ప్రకారం 1, 2, 3, 4, 6, 8 యూనిట్లలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు, 1,2,4 యూనిట్లలో అన్ని 2, 4 మార్కుల సమాధానాలు, 3వ యూనిట్‌లో 2, 8 మార్కుల సమాధానాలు, 6, 8ల్లో 2 మార్కులు, 8 మార్కుల సమాధానాలు నేర్చుకుంటే 60 శాతం సాధించవచ్చు.

జంతుశాస్త్రం (జువాలజీ)

కనీసం 1, 2 4 చాప్టర్‌ల్లో ఉండే అతిస్వల్ప, స్వల్ప సమాధాన ప్రశ్నలు క్షుణ్ణంగా నేర్చుకుంటే 30 లేదా ఆపైన మార్కులు సంపాదించవచ్చు. ఈ చాప్టర్స్‌లో ఉన్న సమాధానాలను చదివాక.. చూడకుండా ఒకటి లేదా రెండుసార్లు నేర్చుకుంటే సమాధానాలను పూర్తిగా రాయవచ్చు. మంచి మార్కులు సంపాదించవచ్చు.
ఉన్న సమయం తక్కువ కాబట్టి అన్ని పాఠ్యాంశాలూ చదవాలనే సాకుతో ఏ పాఠ్యాంశాన్నీ పూర్తిగా చదవకుండా అక్కడక్కడా ఒకటి లేదా రెండు సమాధానాలు నేర్చుకుంటే అవి పరీక్షలో రావచ్చు, రాకపోవచ్చు. మనకు అనుకూలంగా, సులువుగా ఉండే సమాధానాలు నేర్చుకుంటే అవి కూడా రాకపోవచ్చు. కాబట్టి అధ్యాపకులను సంప్రదించి ఏయే చాప్టర్‌లో ప్రశ్నలు ముఖ్యమైనవో తెలుసుకోవాలి. వాటిని చదివితే ఏ సమాధానాన్నయినా రాయగలిగే సామర్థ్యాన్ని సాధించవచ్చు.
జువాలజీ రెండో సంవత్సరంలో 60/60 సంపాదించడానికి అన్ని పాఠ్యాంశాల్లోని అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, 1, 2, 4, 8 యూనిట్లలో స్వల్ప సమాధాన ప్రశ్నలు, శరీర ద్రవాలు, ప్రసరణ, మానవ ప్రత్యుత్పత్తి లేదా జన్యుశాస్త్రం చాప్టర్‌లలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు నేర్చుకోవాలి.
30, ఆపైన మార్కులు సంపాదించడానికి 1బి, 2బి, 4బి, 8 చాప్టర్స్‌లో అతిస్వల్ప, స్వల్ప సమాధాన ప్రశ్నలు, మానవ ప్రత్యుత్పత్తి లేదా శరీర ద్రవాలు, ప్రసరణ చాప్టర్స్‌లో దీర్ఘ సమాధాన ప్రశ్నలను నేర్చుకోవాలి.
ప్రజంటేషన్‌ బాగా ఉంటే మార్కులు సంపాదించవచ్చు.
1. ముందుగా పూర్తిగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అవి అతిస్వల్ప, స్వల్ప లేదా దీర్ఘ సమాధాన ప్రశ్నలు- ఏవైనా సరే.
2. కొట్టివేతలూ లేకుండా, నీట్‌గా సమాధానం రాయాలి.
3. ప్రశ్న సంఖ్యను సరిగా వేయాలి.
4. ప్రతి సమాధానమూ రాసిన తర్వాత ఒక లైన్‌ను గీయాలి. దీనివల్ల సమాధానాలు కలిసిపోకుండా, విడివిడిగా చూపించవచ్చు
5. సమయానుకూలతను బట్టి అదనపు సమాధానాలను కూడా రాయటం మేలు.

- విజయ్‌కుమార్‌ (రచయితలు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధ్యాపకులు)  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని