ఆన్‌లైన్‌లో ఐఐటీ డిగ్రీ!

మన దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు ఐఐటీలు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇప్పుడివి ఇతర చదువులపైనా దృష్టి సారించాయి. ప్రత్యేక కోర్సులతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్ల నుంచి ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్‌సీ కోర్సును అందిస్తోంది. ఎక్కువమంది విద్యార్థులు ఇందులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. మే సెషన్‌లో ప్రవేశానికి తాజాగా ప్రకటన వెలువడింది!

Updated : 16 Mar 2022 06:31 IST

ప్రోగ్రామింగ్‌ అండ్‌  డేటా సైన్స్‌లో బీఎస్‌సీ

మన దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్‌ విద్యాబోధనకు ఐఐటీలు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇప్పుడివి ఇతర చదువులపైనా దృష్టి సారించాయి. ప్రత్యేక కోర్సులతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్ల నుంచి ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్‌సీ కోర్సును అందిస్తోంది. ఎక్కువమంది విద్యార్థులు ఇందులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. మే సెషన్‌లో ప్రవేశానికి తాజాగా ప్రకటన వెలువడింది!

టీవలి కాలంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో నియామకాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వేతనాలూ అంతే మొత్తంలో దక్కుతున్నాయి. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారి కోసం సంస్థలన్నీ జల్లెడ పడుతున్నాయి. అన్ని రంగాలూ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ ఆటోమేషన్‌ దిశగా వేగంగా అడుగులేస్తున్నాయి. వివిధ రంగాల భవిష్యత్తు అంతా సాంకేతిక అనుసంధానంపైనే ఆధారపడి ఉంది. ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ల పాత్ర ఇందులో కీలకం. వీటిపై పట్టుపెంచుకున్నవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌లో అందించే బీఎస్‌సీ ఇన్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ ఉపయోగపడుతుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయమైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

ఆర్ట్స్‌ విద్యార్థులకీ...

సాధారణంగా బీఎస్సీ కోర్సుల్లోకి ఆర్ట్స్‌ విద్యార్థులకు అవకాశం లభించదు. అయితే ఐఐటీ మద్రాస్‌ అందించే ఆన్‌లైన్‌ బీఎస్సీ కోర్సులో ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం కల్పించారు. అందువల్ల ప్రోగ్రామింగ్‌/ సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులెవరైనా ఇందులో చేరవచ్చు. ప్రాథమికాంశాల నుంచి కోర్సు మొదలవుతుంది. కాబట్టి పూర్వ విద్యా నేపథ్యం (ఇంటర్మీడియట్‌ గ్రూపు)తో సంబంధం లేకుండా ఈ కోర్సులో కృషితో రాణించవచ్చు.

అయితే ప్రవేశం నేరుగా లభించదు. అలాగని కష్టమూ కాదు. ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి కొన్ని అంశాల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. వాటిని ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి అర్హత (క్వాలిఫయర్‌) పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు కోర్సులో కొనసాగవచ్చు.

ఆన్‌లైన్‌ బీఎస్‌సీలో మూడు దశలు- .ఫౌండేషన్‌, డిప్లొమా, డిగ్రీ ఉంటాయి. ఒక దశలో విజయవంతమైనవాళ్లే రెండో దశకు అర్హులు. మొదటి దశలో ఉత్తీర్ణత సాధిస్తే ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌ అందుకుంటారు. రెండో దశను దాటితే డిప్లొమాను ప్రదానం చేస్తారు. మూడు దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుంటే బీఎస్‌సీ పట్టా చేతికందుతుంది.

క్వాలిఫయర్‌

క్వాలిఫయర్‌ పరీక్షలో అర్హత నిమిత్తం నాలుగు వారాల వ్యవధితో 4 ప్రాథమిక స్థాయి కోర్సులైన ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌, స్టాటిస్టిక్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌, కంప్యుటేషనల్‌ థింకింగ్‌ విభాగాల్లో కనీస స్కోరు సాధించాలి. వీటికి సంబంధించి ఒక్కో సబ్జెక్టులో వారానికి రెండు లేదా మూడు గంటల వీడియో పాఠాలు అందిస్తారు. ప్రతి కోర్సులోనూ అసైన్‌మెంట్లు ఉంటాయి. వీటిని గడువులోగా ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటిలో అర్హత సాధించినవారినే క్వాలిఫయర్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

జనరల్‌ అభ్యర్థులైతే మొత్తం మీద 40 శాతం, ఓబీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు పొందినవారికి క్వాలిఫయర్‌ పరీక్షను 4 గంటల వ్యవధితో నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకు గంట వ్యవధి ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులు ప్రతి కోర్సులోనూ 40, మొత్తం మీద 50 శాతం స్కోరు సాధిస్తే అర్హులైనట్లుగా పరిగణిస్తారు. ఓబీసీలు కోర్సువారీ 35, మొత్తం మీద 45 శాతం పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే కోర్సువారీ 30, మొత్తం మీద 40 శాతం మార్కులు రావాలి.

ఇలా అర్హత సాధించినవారికి ఫౌండేషన్‌ లెవెల్‌ కోర్సులోకి అనుమతిస్తారు. క్వాలిఫయర్‌ ఎగ్జామ్‌లో సాధించిన స్కోరుని అనుసరించి మొదటి రెండు టర్మ్‌ల్లో ఎన్ని కోర్సులు నేర్చుకోవచ్చో నిర్ణయిస్తారు. యాభై శాతం సాధించినవారికి 2, 70 వరకు సాధించినవారికి 3, డెబ్భైపైన సాధిస్తే 4 కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. మొదటి రెండు టర్మ్‌ల్లో సాధించిన స్కోరును అనుసరించి తర్వాతి టర్మ్‌ల్లో ఎన్ని కోర్సులు పూర్తిచేసుకోవచ్చో నిర్ణయిస్తారు.

వీడియోల్లో వీక్లీ అసైన్‌మెంట్లు

ప్రతివారం రికార్డు చేసిన వీడియో పాఠాలు విడుదల చేస్తారు. ఒక్కో కోర్సులోనూ వారానికి పది గంటల నిడివితో వీటిని అందిస్తారు. ఈ వీడియోల్లోనే వీక్లీ అసైన్‌మెంట్లు ఉంటాయి. వీటిని గడువులోగా పూర్తిచేసుకోవాలి. ఒక్కో కోర్సుకీ 3 క్విజ్‌లు ఉంటాయి. వీటిని సాధారణంగా ఆయా కోర్సుల్లో 4,7,10 వారాల్లో నిర్వహిస్తారు. కోర్సు చివరలో టర్మ్‌ పరీక్షలు ఉంటాయి. ప్రతి కోర్సులోనూ వారానికి ఒక అసైన్‌మెంట్‌ ఉంటుంది. వీటిలో కనీస స్కోరు సాధించిన వారికే టర్మ్‌ చివర్లో పరీక్ష రాయడానికి అవకాశమిస్తారు. అలాగే టర్మ్‌ పరీక్షలు రాయడానికి 3 క్విజ్‌ల్లో కనీసం ఒక దానిలో అర్హత సాధించడమూ తప్పనిసరే.

కోర్సులో చేరినవారు తమకు కేటాయించిన పట్టణ అభ్యసన కేంద్రంలో క్విజ్‌, టర్మ్‌ పరీక్షలకు హాజరుకావాలి. ఈ కోర్సు మొత్తం ఆంగ్లంలో అందిస్తున్నారు. అందువల్ల ఆ భాషపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన ఉంటే మేలు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రతి కోర్సులోనూ డిస్కషన్‌ ఫోరం ఉంటుంది. ఐఐటీ మద్రాస్‌ అందించే ఆన్‌లైన్‌ బీఎస్‌సీ కోర్సులో చేరినవారు ఏదైనా డిగ్రీ కళాశాలలో బీఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ లేదా బీసీఏ కోర్సును- కుదిరితే రెగ్యులర్‌ విధానంలో లేదంటే దూరవిద్యలో కొనసాగించడం మంచిది.

ఎవరు అర్హులు?

పదో తరగతిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ చదివివుండాలి. ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సు పూర్తిచేసినవారై ఉండాలి. మూడేళ్ల డిప్లొమా చదివినవారూ అర్హులే. రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నా పర్వాలేదు. ప్రస్తుతం బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు చదువుతున్నవారు, పూర్తిచేసుకున్నవారు, మధ్యలో వైదొలిగినవారు ఆన్‌లైన్‌ బీఎస్‌సీలో ప్రవేశం పొందవచ్చు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ఫీజు: రూ.3000 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1500.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15

క్వాలిఫయర్‌ కోర్సు: మే 2 నుంచి మొదలవుతుంది.

క్వాలిఫయర్‌ పరీక్ష తేదీ: జూన్‌ 5

పరీక్ష కేంద్రాలు: ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, గుంటూరు, కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌:www.onlinedegree.iitm.ac.in


ఏం నేర్చుకుంటారంటే...

* ఫౌండేషన్‌: మ్యాథ్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌ 1, 2. స్టాటిస్టిక్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌ 1, 2. కంప్యుటేషనల్‌ థింకింగ్‌, ప్రొగ్రామింగ్‌ పైతాన్‌, ఇంగ్లిష్‌ 1, 2.

* డిప్లొమా: ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌. ఒక్కో దాంట్లోనూ 6 కోర్సులు ఉన్నాయి. వీటిలో 5 కోర్‌ కోర్సులు ఒకటి స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌కు సంబంధించింది.  
ప్రోగ్రామింగ్‌లో: డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ప్రోగ్రామింగ్‌, డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గ్గారిద]మ్స్‌ యూజింగ్‌ పైతాన్‌,  ప్రోగ్రామింగ్‌ కాన్సెప్ట్స్‌ యూజింగ్‌ జావా, మోడర్న్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ 1,2, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ 1 ఉంటాయి.
డేటా సైన్స్‌లో: మెషిన్‌ లర్నింగ్‌ ఫౌండేషన్స్‌, మెషీన్‌ లర్నింగ్‌ థియరీ, మెషిన్‌ లర్నింగ్‌ ప్రాక్టీస్‌, బిజినెస్‌ డేటా మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, స్కిల్స్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ 2 ఉంటాయి.

* డిగ్రీలో: ఈ స్థాయిలో అభ్యర్థులు నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. కంప్యూటర్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ల్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. తీసుకున్న విభాగానికి చెందిన కోర్‌ కోర్సులతోపాటు ఎలక్టివ్‌లు పూర్తిచేసుకోవాలి. ప్రతి విభాగంలోనూ 2 కోర్‌ కోర్సులు, 5 ఎలెక్టివ్‌లు, 2 ప్రాజెక్టులు ఉంటాయి. వీటితోపాటు స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ 3,4 అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. కంప్యూటర్‌ సిస్టమ్స్‌ తీసుకున్నవారికి ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌ కోర్‌లుగా ఉంటాయి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తీసుకుంటే సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కోర్‌లు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ ఎంచుకున్నవారికి ఏఐ సెర్చ్‌ మెథడ్స్‌ ఫర్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డీప్‌ లర్నింగ్‌ కోర్‌లు.


31 కోర్సులు... 116 క్రెడిట్లు

ఫౌండేషన్‌ నుంచి డిగ్రీ వరకు మొత్తం 31 కోర్సులుంటాయి. వీటిద్వారా 116 క్రెడిట్లు దక్కుతాయి. అభ్యర్థి సామర్థ్యాన్ని అనుసరించి మూడు నుంచి ఆరేళ్లలోపు మొత్తం కోర్సు పూర్తిచేసుకోవచ్చు. మొత్తం ఫీజు (ఫౌండేషన్‌ + డిప్లొమా + డిగ్రీ) రూ.2.42 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో యాభై శాతం రాయితీ ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న అన్ని వర్గాలవారికీ ఫీజులో 75 శాతం రాయితీ వర్తిస్తుంది. ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించనవసరం లేదు. టర్మ్‌, కోర్సులవారీ కట్టుకోవచ్చు. సంవత్సరంలో 3 టర్మ్‌లు ఉంటాయి. అవి జనవరి, మే, సెప్టెంబరుల్లో మొదలవుతాయి. ఒక్కో టర్మ్‌లోనూ కనీసం 2 నుంచి గరిష్ఠంగా 4 కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. ఫౌండేషన్‌ పూర్తయితేనే డిప్లొమాలోకి, డిప్లొమా పాసైతే డిగ్రీ కోర్సుల్లోకి అవకాశం ఉంటుంది. ప్రతి కోర్సులోనూ 3 క్విజ్‌లు ఒక టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. 

* ఫౌండేషన్‌: ఇందులో 8 కోర్సులు ఉంటాయి. వీటిద్వారా 32 క్రెడిట్లు లభిస్తాయి. వీటిని 8 నెలల నుంచి మూడేళ్లలోగా పూర్తిచేసుకోవచ్చు. విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు ఫౌండేషన్‌ సర్టిఫికెట్‌తో వైదొలగొచ్చు లేదా డిప్లొమాలో కొనసాగొచ్చు. ఫీజు రూ.32,000.

* డిప్లొమా: ఇందులో 12 కోర్సులు ఉంటాయి. వీటితో 44 క్రెడిట్లు అందుతాయి. ఏడాది నుంచి మూడేళ్లలోపు పూర్తి చేసుకోవచ్చు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌. ఒక్కో దాంట్లో 6 కోర్సులు ఉంటాయి. వీటితో 22 చొప్పున క్రెడిట్లు లభిస్తాయి. ఈ రెండింటినీ పూర్తిచేసుకున్నవారు డిప్లొమా ఇన్‌ ప్రోగ్రామింగ్‌, డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌ సర్టిఫికెట్లను అందుకుని కోర్సు నుంచి వైదొలగొచ్చు లేదా డిగ్రీలో కొనసాగొచ్చు. ఈ కోర్సు ఫీజు రూ.1,10,000.

* డిగ్రీ: ఇందులో 11 కోర్సులుంటాయి. వీటిని పూర్తిచేసుకుంటే 40 క్రెడిట్లు సొంతమవుతాయి. ఏడాది నుంచి మూడేళ్లు పడుతుంది. వీరికి బీఎస్‌సీ ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఫీజు రూ.లక్ష.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని