గెలుపును నిర్ణయించే మలుపు!

సివిల్స్‌ ప్రక్రియలో చిట్టచివరి అంచె... ఇంటర్వ్యూ. సర్వీస్‌కు ఎంపికవ్వటంలో దీనికెంతో ప్రాధాన్యం ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్‌గా వ్యవహరించే ఇంటర్వ్యూ విశేషాలూ, మెలకువలూ కేవలం దీనికి హాజరయ్యే అభ్యర్థులకే కాకుండా ఇతర పోటీ పరీక్షలు రాసేవారికీ,

Published : 17 Mar 2022 01:47 IST

సివిల్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌లో మెలకువలు

సివిల్స్‌ ప్రక్రియలో చిట్టచివరి అంచె... ఇంటర్వ్యూ. సర్వీస్‌కు ఎంపికవ్వటంలో దీనికెంతో ప్రాధాన్యం ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్‌గా వ్యవహరించే ఇంటర్వ్యూ విశేషాలూ, మెలకువలూ కేవలం దీనికి హాజరయ్యే అభ్యర్థులకే కాకుండా ఇతర పోటీ పరీక్షలు రాసేవారికీ, సివిల్స్‌ సమరంలోకి అడుగుపెట్టబోయేవారికీ ఆసక్తికరం!  

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష-2021 ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. దీనిలో నెగ్గిన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఐదు నుంచి ఏడు ఇంటర్వ్యూ బోర్డులు ఏకకాలంలో ఈ టెస్ట్‌ను నిర్వహిస్తాయి. ప్రతి బోర్డుకూ యూపీఎస్‌సీ సభ్యుడు నేతృత్వం వహిస్తారు. నలుగురి నుంచి ఆరుగురు రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్స్‌, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు సహాయకులుగా ఉంటారు. కమిషన్‌ నిశిత పరిశీలన తర్వాతే ఈ నిపుణులను సభ్యులుగా నియమిస్తుంది. ప్రతి బోర్డు రోజూ 11మందికి పైగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రతి అభ్యర్థినీ అరగంటకు పైగా ఇంటర్వ్యూ చేస్తారు. ఏటా అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యకు రెండున్నర రెట్ల మందిని ఇంటర్వ్యూ చేస్తారు.  

ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు బోర్డులోని నిపుణులకు యూపీఎస్‌సీ ఛైర్మన్‌, సభ్యులు టెస్ట్‌ నిర్వహణకు అవసరమయ్యే మార్గనిర్దేశాన్ని చేస్తారు. అంచనాలో ఏకరూపతను సాధించేందుకు బోర్డులన్నీ ఒకే ప్రమాణాలను పాటించమంటారు. బోర్డులోని నిపుణులను ప్రతివారం ఒక బోర్డు నుంచి మరో బోర్డుకు మారుస్తుంటారు.

పకడ్బందీగా.. గోప్యంగా

రాత పరీక్షలో అభ్యర్థి ఎన్ని మార్కులు సాధించాడో బోర్డుకు తెలియదు. అభ్యర్థి పూర్తిచేసిన డీటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ (డీఏఎఫ్‌-1, డీఏఎఫ్‌-2) ఆధారంగా అభ్యర్థి బయోడేటా, అభిరుచులు, ఆసక్తులకు సంబంధించిన సారాంశాన్ని బోర్డుకు అందజేస్తారు. అభ్యర్థులకు సంబంధించిన ఈ సమాచారాన్ని తయారుచేయడంలో ఎంతో గోప్యతను పాటిస్తారు. ఇంటర్వ్యూకు 5-10 నిమిషాల ముందు మాత్రమే బోర్డు సభ్యులకు అందజేస్తారు. ఏ రోజున ఏ అభ్యర్థి ఏ బోర్డుకు హాజరవుతున్నాడనే విషయం.. అభ్యర్థికిగానీ, చెయిర్‌పర్సన్స్‌కుగానీ, సభ్యులకుగానీ తెలియదు. ఇంత పకడ్బందీగా రూపొందించడం వల్ల ఈ విధానంలో ఎలాంటి పైరవీలకూ, సిఫార్సులకూ అవకాశం ఉండదు.

అభ్యర్థి మెయిన్‌ పరీక్షను ఏ ప్రాంతీయ భాషలో రాస్తే.. అదే భాషలో ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఒకప్పుడు ఉండేది. బి.బి. భట్టాచార్య కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ పద్ధతిలో మార్పు చేశారు. 2011 సంవత్సరం నుంచి మెయిన్స్‌లో రాసిన మీడియంతో సంబంధం లేకుండా ఇంటర్వ్యూలో తనకు అనువైన భాషను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.

పర్సనాలిటీ టెస్ట్‌లో కనీస అర్హత మార్కులు అంటూ ఉండవు. 1950ల్లో మాత్రం ఎంపికకు కనీస అర్హత మార్కులు ఉండేవి. పర్సనాలిటీ టెస్ట్‌లో 35 శాతం మార్కులను కనీస అర్హత మార్కులుగా పరిగణించేవారు. 1957లో ఈ పద్ధతిని రద్దుచేశారు. ఏకపక్షంగా ఉండటానికి అవకాశం ఉందని, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు దీనివల్ల ప్రయోజనం ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నారు.  

అందరూ అనుభవజ్ఞులే

అసలు పర్సనాలిటీ టెస్ట్‌ స్వభావం ఎలా ఉంటుంది? నిజానికి దీన్ని పర్సనాలిటీ టెస్ట్‌ అని అన్నప్పటికీ ఇది అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌ను తెలుసుకునే పరీక్ష.

ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు విభిన్నమైన నేపథ్యాలు, అనుభవాలు, రంగాలకు చెందినవారై ఉంటారు. ఎక్కువగా 55 ఏళ్లకు పైబడివాళ్లు ఉంటారు. అంటే దాదాపు అన్ని అంశాల్లోనూ పరిపూర్ణ పరిజ్ఞానంతో ఉంటారు. కాబట్టి ఏ రంగానికి సంబంధించిన ప్రశ్నలనైనా అడిగే అవకాశం ఉంటుంది.  

ప్రాథమికంగా అభ్యర్థి నేపథ్యం, వర్తమానాంశాల పట్ల అతడి దృక్కోణాన్ని ఇంటర్వ్యూ సభ్యులు పరిశీలిస్తారు. వాటిపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు.


ఎందుకు ప్రాముఖ్యం?

మొత్తం 2025 మార్కుల్లో పర్సనాలిటీ టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్ష విధానంలో దీని వెయిటేజి 13.5 శాతం మాత్రమే. అయితే మొత్తంమీద అభ్యర్థి ప్రతిభను నిర్ణయించటంలో ఈ మౌఖిక పరీక్ష ప్రభావం 30 శాతం కంటే ఎక్కువే. అలఘ్‌ కమిషన్‌ (2000) నిర్వహించిన అధ్యయనంలో ఇది రుజువైంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో అవసరమైన సంస్కరణలను సూచించే నిమిత్తం ఈ కమిషన్‌ ఏర్పాటయింది.

గత కొన్ని సంవత్సరాల్లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల మార్కులను విశ్లేషిస్తే కింది విషయాలు వెల్లడయ్యాయి.

* టాప్‌ 50 లేదా 100 ర్యాంకులు సాధించినవారిలో కనిపించిన ఉమ్మడి విషయం- వీరు మెయిన్స్‌లో, ఇంట ర్వ్యూలో అధిక మార్కులు సాధించారు.

* ఇంటర్వ్యూలో అదనంగా కొన్ని మార్కులు సాధిస్తే.. 10 ర్యాంకులకు పైనే తేడా వస్తుంది.

* కొన్నిసార్లు ఇంటర్వ్యూలో 2 లేదా 3 మార్కులు తక్కువ వస్తే.. 3 నుంచి 4 ర్యాంకుల కిందికి పడిపోతుంది. దీని ఫలితం ఏమిటంటే... ఐఏఎస్‌ కాకుండా ఐపీఎస్‌ లేదా ఐఆర్‌ఎస్‌ను ఎంచుకోవాల్సి రావచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే.. ఇంటర్వ్యూ అనేది అభ్యర్థి సర్వీసునూ, క్యాడర్‌నూ, అభ్యర్థి జీవితాంతం అనుభవించే హోదాను కూడా నిర్ణయిస్తుంది.


ప్రశ్నలు వీటి నుంచి

ఐదు స్థూల అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

1 వ్యక్తిగతం: మీ పేరు, మీరు ఏ జిల్లా/ గ్రామానికి చెందినవారు, ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల మీద ప్రశ్నలు అడగొచ్చు. మీ మాతృభాష, దాని ప్రాముఖ్యం, ప్రభుత్వం రంగంలోనే ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటనే విషయం మీద ప్రశ్నలు అడగొచ్చు.

2 విద్యాపరంగా: కనీస విద్యార్హతలపై ప్రశ్నలు రావొచ్చు. విద్యాభ్యాసం పూర్తికావడానికీ, ఇంటర్వ్యూకు హాజరుకావడానికీ మధ్య ఎక్కువ విరామం ఉండవచ్చు. అలాంటపుడు కోర్‌ సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పునశ్చరణ చేయాలి. ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టులు, సివిల్స్‌ పరీక్షలో ఎంచుకున్న ఆప్షనల్స్‌ వేర్వేరుగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇంజినీరింగ్‌ విద్యార్థి గ్రాడ్యుయేషన్‌లో చదవని ఆంత్రొపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకుంటే.. ఈ సబ్జెక్టు నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.

3 ఆప్షనల్‌: ఆప్షనల్‌ సబ్జెక్టు నుంచి లోతైన ప్రశ్నలను ఎక్కువగా అడగరు. ఎందుకంటే అభ్యర్థి అప్పటికే మెయిన్‌ పరీక్షలో దీనికి సంబంధించి పరిజ్ఞానం రుజువుచేసుకుని ఉంటాడు. గ్రాడ్యుయేషన్‌లో చదవని సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నప్పుడు మాత్రం ఆ సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.

4 వర్తమాన అంశాలు: ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విషయాలకు సంబంధించి ఏ అంశంలోనైనా వర్తమానాంశాలను అడిగే వీలుంది. అందుకని ప్రతిరోజూ వార్తాంశాలను విశ్లేషించుకోవాలి.

5 అభిరుచులు: ఖాళీ సమయంలో ఏంచేస్తారని ఇంటర్వ్యూ బోర్డులో అడిగే అవకాశం ఉంది. మీకు హాబీలు ఏమీ లేకపోయినట్లయితే అదే విషయాన్ని నిజాయితీగా చెప్పేయాలి. ఏదైనా అభిరుచి ఉన్నట్లయితే దానికి సంబంధించిన మౌలిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ఉండాలి. ఏదేమైనా పాఠశాల రోజుల్లో మీకున్న ఒక్క అభిరుచి గురించయినా చెప్పడం మంచిది.

గత కొన్నేళ్లుగా ప్రశ్నల స్వభావంలో మార్పు వచ్చింది. ఇది అభ్యర్థి నిజమైన వ్యక్తిత్వాన్ని బయటకు తీసేదిగా ఈ మార్పు ఉంటోంది. నిగ్వేకర్‌ కమిటీ సిఫారసుల ప్రకారం.. సాంప్రదాయిక అంశాలతో పాటు అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే దిశగా ప్రవర్తన, వైఖరి, విలువ ఆధారిత లక్షణాలను తెలిపే ప్రశ్నలను అడుగుతున్నారు.

ప్రశ్నలు వస్తాయని ఊహించగలిగే అంశాల విషయంలో ముందస్తు సన్నద్ధత ఎల్లప్పుడూ మంచిదే. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్వ్యూ సమయం దగ్గరపడుతున్నా, ఇంటర్వ్యూ రోజు కూడా చెదరని ధీమాతో ఉండగలుగుతారు.


మెయిన్స్‌ ఫలితాల వెల్లడి తర్వాత ఇంటర్వ్యూల ఆరంభానికి సాధారణంగా 15-20 రోజుల విరామం ఉంటుంది. అయితే ఈసారి ఫలితాల ప్రకటించిన వెంటనే ఇంటర్వ్యూలను నిర్వహించటానికి యూపీఎస్‌సీ సిద్ధమవుతోంది.

అందుకే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే మౌఖిక పరీక్షకు తమ సన్నద్ధతను మొదలుపెట్టటం శ్రేయస్కరం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని