ఇంగ్లిష్‌... ఈజీగా!

ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రాత పరీక్షకు దరఖాస్తు చేసినవారిలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ నేపథ్యమున్న తెలుగు మీడియం...

Updated : 05 Apr 2022 06:42 IST

ఏపీపీఎస్‌సీ జూనియర్‌ అసిస్టెంట్లు  
 

ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రాత పరీక్షకు దరఖాస్తు చేసినవారిలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ నేపథ్యమున్న తెలుగు మీడియం విద్యార్థులే కావడంతో ఇంగ్లిష్‌ పార్ట్‌కు తయారవ్వటం వారికి కొంత కష్టమవుతోంది. జనరల్‌ ఇంగ్లిష్‌లో ఎక్కువ మార్కులు సాధించటానికి ఏ మెలకువలు పాటించాలి?

జూనియర్‌ అసిస్టెంట్‌ సిలబస్‌లో పేపర్‌-2లో వచ్చే 150 మార్కుల్లో 75 మార్కులను జనరల్‌ ఇంగ్లిష్‌కూ, 75 మార్కులను తెలుగుకూ కేటాయించారు. జనరల్‌ ఇంగ్లిష్‌లో 1. కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ 2. ఇడియమ్స్‌ అండ్‌ యూసేజెస్‌ 3. ఒకాబ్యులరీ అండ్‌ పంక్చువేషన్‌ 4. లాజికల్‌ రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ 5. గ్రామర్‌ ఉన్నాయి. ఇచ్చిన సిలబస్‌లో మొట్టమొదటిది కాంప్రహెన్షన్‌ పాసేజ్‌. ఒక పాసేజ్‌ ఇచ్చి దాదాపు ఐదు ప్రశ్నలు ఇస్తారు. వీటికి జవాబులు కచ్చితంగా గుర్తించాలంటే మొదటగా ప్రశ్నలు ఏం ఇచ్చారో ఒకసారి చదవాలి. తద్వారా ఎలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు ఇచ్చారో తెలుస్తుంది. ఆ తర్వాత పాసేజ్‌ను కనీసం రెండుసార్లు చదవాలి. మొదటిసారి వేగంగా చదివి అది ఏ అంశానికి సంబంధించినదో తెలుసుకోవాలి. రెండోసారి చదివే సందర్భంలో అన్ని ప్రాధాన్య అంశాలనూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో ప్రశ్న చదువుతూ సరైన సమాధానాలను గుర్తించాలి. దాదాపు ప్రశ్నలన్నీ కీ వర్డ్స్‌ సహాయంతో గుర్తించేలా ఉంటాయి. అయితే 1 లేదా 2 ప్రశ్నలు పాసేజ్‌ను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలితేనే జవాబును గుర్తించేలా ఉండొచ్చు. అన్నింటికీ సమాధానం గుర్తించాలంటే పదజాలం (ఒకాబ్యులరీ)పై పట్టు పెంచుకోవాలి.

రెండో అంశం ఇడియమ్స్‌ అండ్‌ యూసేజెస్‌. ఈ అంశాన్ని తెలుగు మీడియం అభ్యర్థులు సులువుగా నేర్చుకోవాలంటే సంభాషణలను ఆసక్తిగా గమనించాలి. నిజానికి నిత్యజీవితంలో కొన్ని ఇడియమ్స్‌ను సంభాషణల్లో వాడుతూనే ఉంటాం. కానీ ఆ సమయంలో అది ఇడియమ్‌ అనిపించకపోవచ్చు.

దొంగలు Red handed  గా పట్టుబడ్డారు అని వాడుతుంటాం. అంటే.. ఒక తప్పు చేస్తూ ఉండగా దొరికిపోవడం.

సాఫ్ట్‌వేర్‌ నిపుణులు  Blue chip company  లో ఉద్యోగం తెచ్చుకోవడం నా లక్ష్యం అంటుంటారు.  blue chip company అంటే లాభాల బాటలో నడుస్తూ, సిబ్బందికి మంచి జీతాలిచ్చే కంపెనీ. ఈ విధంగా రంగులు, సైజులు, మానవ శరీర భాగాలు, జంతువులు, సంఖ్యలతో వచ్చే ఇడియమ్స్‌పై పట్టు సాధించాలి. ఆ తర్వాత 3 నుంచి 10వ తరగతిలో వచ్చే ఇడియమ్స్‌ను వాక్యాల్లో ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోవాలి.

ప్రిఫిక్సెస్‌ అండ్‌ సఫిక్సెస్‌తో ఆరంభించండి

మూడో అంశం.. ఒకాబ్యులరీ అండ్‌ పంక్చువేషన్‌. ఒకాబ్యులరీ అంశంలో దాదాపు 10 సబ్‌ టాపిక్స్‌ 1. సిననిమ్స్‌ 2. యాంటనిమ్స్‌ 3. వన్‌వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌ 4. ఫ్రేజల్‌ వర్బ్స్‌ 5.స్పెలింగ్స్‌ 6. ప్రిఫిక్సెస్‌ 7. సఫిక్సెస్‌ 8. ఆల్ఫబెటికల్‌ ఆర్డర్‌ 9. రైమింగ్‌ వర్డ్స్‌ 10. హోమఫోన్స్‌. ఈ అంశాలన్నీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుకున్నవే. సన్నద్ధతను ప్రిఫిక్సెస్‌ అండ్‌ సఫిక్సెస్‌తో మొదలుపెడితే తక్కువ సమయంలో ఎక్కువ పదజాలం అవగాహనకు వస్తుంది.

ఉదా: Mono = one   (ఒక).Mono అనే Prefix కు ‘ఒక’ అనే అర్థం తెలిస్తే కింది పదాలు అవగాహనకు వస్తాయి.

Monopoly ఏకస్వామ్యం, Monogamy = ఒకే భార్య/భర్త ఉండటం, Mono action = ఒక వ్యక్తి చేసే నటన (ఏకాపాత్రాభినయం), Monotheist = ఒకే దేవుణ్ణి నమ్మే వ్యక్తి, Monolith= ఏకశిలా విగ్రహం.
conjunctions పై పట్టు తప్పనిసరి. ప్రత్యేకించి.. not only - but also, either - or, neither - nor, rather - than, hardly - when, scarcely - when, no sooner - than, lest - should, both - and, too - to, so - that - not, very - and  therefore లాంటివి చదివి ఉపయోగించడం నేర్చుకోగలిగితే రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌పై పట్టు సులువవుతుంది.

నాలుగోది లాజికల్‌ రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌. ఈ అంశంపై పట్టు సాధించాలంటే ఇంగ్లిష్‌ వార్తాపత్రికను చదవడం తప్పనిసరి. ఆ చదివే క్రమంలో వాక్యాల తీరు గమనించాలి. మొదట్లో ఎలాంటి అంశాలు వస్తున్నాయి, చివర్లో ఎలాంటివి వస్తున్నాయి చూడాలి. కనెక్టివ్‌ వర్డ్స్‌ (పదబంధాలు) కూడా నేర్చుకోవాలి.

ఉదా: Once upon a time, Once there was, In olden days, In these days. ఇలాంటివి సాధారణంగా పేరాగ్రాఫ్‌ మొదట్లో రావడానికి అవకాశం ఉంది.
Therefore, Hence, Finally, At the end... ఇలాంటి పదాలు పేరాగ్రాఫ్‌ చివర్లో వస్తుంటాయి.

ఉదాహరణలతో సాధన

జనరల్‌ ఇంగ్లిష్‌లో చిట్టచివర అంశం గ్రామర్‌. దీనిలో 15 సబ్‌ టాపిక్స్‌ చదవాలి. వీటిని మరింత లోతుగా, పోటీ పరీక్షలకు తయారయ్యే పద్ధతిలో నేర్చుకోవాలి. బేసిక్స్‌ నుంచి హైస్టాండర్డ్‌ వరకు ఎక్కువ ఉదాహరణలతో సాధన చేయాలి.

సరైన ఆప్షన్లతో పాటు...

మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌కు జవాబు రాసే సందర్భంలో ఒక ప్రశ్నకు జవాబు ఏదో తెలిసినప్పటికీ మిగతా ఆప్షన్లు ఎందుకు సరైనవి కావో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
ఉదాహరణకు: A group of two persons is called - 1) Duo  2) Dilemma  3) Twins  4) Pair.  ఈ ప్రశ్నకు జవాబును గుర్తించే సమయంలో- Duo - A group of two persons  (ఇద్దరు మనుషుల సముదాయం), Dilemma - A confuse state in choosing one out of two (రెండిటిలో ఏది ఎంచుకోవాలో తెలియని స్థితి), Twins - Giving birth to two kids at the same time (ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం), Pair - two (జత)
ప్రిపరేషన్‌లో భాగంగా పైవిధంగా చదివితే అభ్యర్థికి తక్కువ సమయంలో ఎక్కువగా సబ్జెక్టుపై అవగాహన వస్తుంది.

ప్రశ్నలకు ఆన్సర్‌ చేసే సందర్భంలో sentences  పూర్తి స్థాయిలో అర్థంకానప్పుడు మరోసారి చదివి కఠిన పదాలకు ఏ అర్థం వచ్చే అవకాశం ఉందో ఆలోచిస్తే దాదాపు సమాన అర్థం మెదడుకు తట్టే అవకాశం ఉంటుంది.

కఠినమైన పదాలు, Repeated critical words వచ్చినప్పుడు అక్కడే తెలుగు వివరణ (అర్థం) రాసుకోవడం మంచిది.

ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌...

 Articles  చదివే సందర్భంలో...వాటి రకాలు, నిర్వచనాలు నేర్చుకుని తర్వాత A, An, The  ఎక్కడెక్కడ ఉపయోగించాలో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీలైనన్ని ప్రాక్టీస్‌ బిట్స్‌ చేయండి.
ప్రధానంగా Prepositions పై దృష్టి పెట్టండి. వాటి అర్థాలు, యూసేజెస్‌ నేర్చుకోవాలి.
Tenses అత్యంత ముఖ్యమైంది. ఇందులో అభ్యర్థులు మొత్తం 12 రకాల forms of tenses,  వాటి clue words నేర్చుకుని MCQ’s ప్రాక్టీస్‌ చేయాలి. .
Parts of Speech  చదివే సందర్భంలో Definitions  సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రత్యేకించి Adjective, Adverb పై దృష్టి పెట్టి చదవాలి. పోటీ పరీక్షల్లో ఈ రెండు అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నలు ఉంటున్నాయి.
Cloze test  అనే అంశం ఈమధ్య కాలంలో పోటీ పరీక్షలో అడుగుతున్నారు. దీనిలో పూర్తి స్థాయిలో మార్కులు సాధించాలంటే హిందూ లాంటి ఇంగ్లిష్‌ పేపర్‌ను ప్రతిరోజూ కనీసం ఒక గంట చదివి వాక్య నిర్మాణాలను గమనించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని