చరిత్రపై ఎన్ని అపోహలో!

ఏ పోటీ పరీక్షలోనైనా ‘జనరల్‌ స్టడీస్‌’ తప్పనిసరి. దానిలో భారతదేశ చరిత్ర ఓ ముఖ్య విభాగం. పోటీ పరీక్షలకు సంబంధించి ‘చరిత్ర’పై చాలా అపోహలు విద్యార్థుల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని తొలగించుకుని వాస్తవాలు తెలుసుకోవాలి. సరైన దృక్పథం ఏర్పరచుకోవాలి. ఇలా

Published : 11 Apr 2022 01:44 IST

ఏ పోటీ పరీక్షలోనైనా ‘జనరల్‌ స్టడీస్‌’ తప్పనిసరి. దానిలో భారతదేశ చరిత్ర ఓ ముఖ్య విభాగం. పోటీ పరీక్షలకు సంబంధించి ‘చరిత్ర’పై చాలా అపోహలు విద్యార్థుల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని తొలగించుకుని వాస్తవాలు తెలుసుకోవాలి. సరైన దృక్పథం ఏర్పరచుకోవాలి. ఇలా చేస్తే... ఈ విభాగాన్ని మెరుగ్గా అధ్యయనం చేయవచ్చు. ఎక్కువ మార్కులూ తెచ్చుకోవచ్చు! 

‘ చరిత్ర చదువుతుంటే సరిగా మెదడుకు ఎక్కదు. ఇది పరీక్షల్లో ప్రతికూలమవుతుంది. దీన్ని వదిలేస్తే నష్టమేం లేదు’   

ఇదో అర్థం లేని అభిప్రాయం. ముఖ్యంగా కొందరు బీటెక్, సైన్స్‌ అభ్యర్థులు చరిత్ర అంటే ఆసక్తి లేక.. తెచ్చిపెట్టుకున్న వ్యతిరేకతతో ఇలా ఈ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరికాదు. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ప్రతి మార్కూ విలువైనదే. జనరల్‌ స్టడీస్‌లోని 11 విభాగాలనూ శ్రద్ధగా చదవాల్సిందే. అప్పుడే వీలైనన్ని మార్కులు తెచ్చుకోవడం సాధ్యం.

‘చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు చాలా ఉంటాయి. అందువల్ల సరైన స్కోరు రాదు’

ఇది అపోహ మాత్రమే. ఎప్పుడో ఒకటి రెండుసార్లు తప్ప సంవత్సరాలు గుర్తించాల్సిన ప్రశ్నల సంఖ్య రెండు నుంచి నాలుగు లోపే ఉంటాయి. అవి కూడా బాగా గుర్తింపు పొందినవీ, తేలికగా గుర్తించగలిగినవీ. ఇది గుర్తించకుండా చరిత్ర అంటేనే సంవత్సరాలు అన్నరీతిలో చదివే అభ్యర్థులకు భారంగా ఉండటమే కాకుండా పరీక్షలో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన సంఘటనలు ముడిపడిన సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే జనరల్‌ స్టడీస్‌లో చరిత్ర కష్టమేమీ కాదు. మార్కులను బాగానే స్కోరు చేయవచ్చు.

‘రాజవంశాలు, రాజ్య స్థాపన,  ఒక రాజు తర్వాత మరొక రాజు పాలన.. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమే’ 

ఇది మరో అపోహ. చిన్న చిన్న మారు మూల రాజవంశాలపై వచ్చే ప్రశ్నల సంఖ్య తక్కువే. అందువల్ల ప్రధాన రాజవంశాలపై అధిక దృష్టి నిలపాలి. రాజుల పరంపరను గుర్తుపెట్టుకోవడం అవసరమే కానీ ప్రధానమైన రాజుల గురించే ఎక్కువ సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. గుర్తింపు లేని రాజుల గురించి వచ్చిన ప్రశ్నలు నామమాత్రమే. ఏదో ఒక ప్రశ్నపత్రంలో ఒక గుర్తింపు లేని రాజు గురించి వచ్చిన ప్రశ్న చూసి అలాంటి ప్రశ్నలే వస్తాయని అసలైన విషయాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. 

‘చరిత్ర పుస్తకాల్లో ఉండే సమాచారంలో చాలా భిన్నత్వం కనిపిస్తుంది’ 

ఇది వాస్తవం కాదు. అక్కడక్కడా కొన్ని సంవత్సరాల విషయంలో తేడా ఉండొచ్చు కానీ ప్రామాణిక రచనలన్నింటిలోనూ ఒకే రకమైన సమాచారం ఉంటుంది. అచ్చు తప్పుల వల్లా, రచయిత పూర్తి దృష్టి పెట్టలేనప్పుడూ ఒకటి రెండు తప్పులు దొర్లవచ్చు.  

‘కొన్ని చరిత్ర పుస్తకాల్లో భారీగా విస్తృత సమాచారం ఉంటోంది. అదంతా చదవాలా?’

ఇదో సమస్య. తమ పుస్తకాలు గొప్పవని గుర్తింపజేసేందుకు పరీక్షల పరంగా అనవసర సమాచారాన్నిచ్చే రచయితలు కూడా ఉన్నందున ఇలాంటి ఇబ్బంది ఉత్పన్నమవుతోంది. అందుకే వీలైనంతవరకు ప్రభుత్వ ప్రచురణల వైపు మొగ్గు చూపితే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. లేదా ఒకటి రెండు పుస్తకాలు చదివి ఉమ్మడి సమాచారంపై సొంత నోట్సు రాసుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు.


అధ్యయనానికి  కొన్ని ముఖ్య పుస్తకాలు 

* సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల స్థాయి పుస్తకాల్లో ఎంపిక చేసిన చాప్టర్లు

* భారతదేశ చరిత్ర, సంస్కృతి (తెలుగు అకాడమీ, బీఏ రెండో సంవత్సరానికి ఉద్దేశించినది)

* ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌ఈఆర్‌టీ ప్రచురణలు.

* భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర (1857 -1947) (ఎంఏ కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకం)

* ‘ప్రశ్నల నిధి- చరిత్ర’ (తెలుగు అకాడమీ)

* తెలంగాణ చరిత్ర సంస్కృతి (బీఏ మూడో సంవత్సరం కోసం తెలుగు అకాడమీ ప్రచురణ) 

* ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర- పి.రఘునాథరావు

* ఆంధ్రుల చరిత్ర (బీఏ కోసం తెలుగు  అకాడమీ ప్రచురణ) 

స్టడీ టిప్‌: మనకు పదాలుగా చదివిన వాటికంటే బొమ్మలుగా కళ్లతో చూసే విషయాలే ఎక్కువగా గుర్తుంటాయట. అందుకే పరీక్షల్లో రాయాల్సిన జవాబుల్లో ముఖ్య పదాలను ఒక వరుసక్రమంలో రాసుకోవడం, ఒకదానికి ఒకటి లింక్‌ చేసుకుంటూ చదవడం, ఒక ఇమేజ్‌లా గుర్తుపెట్టుకోవడం వల్ల ఆ ఆన్సర్‌ ఎక్కువకాలం మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని