పరీక్ష కోణంలో.. పకడ్బందీగా!

జనరల్‌ స్టడీస్‌ భారతదేశ చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌-1, 2, ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల్లో ‘జనరల్‌ స్టడీస్‌’ తప్పనిసరి. దీనిలో భారతదేశ చరిత్ర ఓ ముఖ్య విభాగం. దీనికెలా సన్నద్ధం కావాలి? గరిష్ఠ మార్కులు తెచ్చుకోవాలంటే ఏ మెలకువలు పాటించాలి? చరిత్ర అనగానే పూర్తిగా సిలబస్‌ను చూడకుండా మార్కెట్లో దొరికే పుస్తకాల్ని చదివే పద్ధ్దతిని మార్చుకోవాలి. పరీక్ష స్థాయిని బట్టి సిలబస్‌ పరిమితి ఉంటుంది. అదేవిధంగా లోతును నిర్ణయించుకోవాలి.

Updated : 12 Apr 2022 06:01 IST

జనరల్‌ స్టడీస్‌ భారతదేశ చరిత్ర

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌-1, 2, ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల్లో ‘జనరల్‌ స్టడీస్‌’ తప్పనిసరి. దీనిలో భారతదేశ చరిత్ర ఓ ముఖ్య విభాగం. దీనికెలా సన్నద్ధం కావాలి? గరిష్ఠ మార్కులు తెచ్చుకోవాలంటే ఏ మెలకువలు పాటించాలి?

చరిత్ర అనగానే పూర్తిగా సిలబస్‌ను చూడకుండా మార్కెట్లో దొరికే పుస్తకాల్ని చదివే పద్ధ్దతిని మార్చుకోవాలి. పరీక్ష స్థాయిని బట్టి సిలబస్‌ పరిమితి ఉంటుంది. అదేవిధంగా లోతును నిర్ణయించుకోవాలి.

జనరల్‌ స్టడీస్‌లో విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు, గవర్నెన్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాలను చేర్చాక భారతదేశ చరిత్రకు కేటాయించే మార్కుల సంఖ్య తగ్గింది. ఈ కొత్త విభాగాలు చేర్చకముందు 150 ప్రశ్నలకు దాదాపు 25 ప్రశ్నలు చరిత్ర నుంచే వచ్చేవి. పాత ప్రశ్నపత్రాల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. వాటిని చూసి ప్రస్తుత పరీక్షా విధానంలో కూడా అంతే సంఖ్యలో వస్తాయని ఆశించి ఎక్కువ సమయం కేటాయించనక్కర్లేదు. తాజా ధోరణిని బట్టి 10- 15 ప్రశ్నల్ని భారతదేశ చరిత్ర నుంచి ఆశించవచ్చు. అందుకు తగిన సమయాన్ని కేటాయించి చదివితే మిగతా విభాగాలకు న్యాయం చేస్తూ ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు!

* ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర అని మూడు భాగాలుగా చదవాల్సి ఉంటుంది. ఆధునిక చరిత్రలో అంతర్భాగంగానే స్వాతంత్య్ర ఉద్యమాన్ని చూడాలి. గత అనుభవాలను బట్టి... ప్రాచీన, ఆధునిక భారతదేశ చరిత్రలకు అధిక ప్రశ్నలు కేటాయించారు. 15 ప్రశ్నలు ఇస్తారనుకుంటే 5 ప్రశ్నల వరకు ప్రాచీన చరిత్ర, 7- 8 ప్రశ్నలు ఆధునిక చరిత్రలకూ, మిగతావి మధ్యయుగ భారతదేశ చరిత్రకూ కేటాయించారు. సమయాన్ని బట్టి కొంతమంది అభ్యర్థులు పూర్తిగా చదివేవారు. కొరత ఉన్నప్పుడు ప్రాచీనం, ఆధునికంపై ఎక్కువ దృష్టి పెట్టి మార్కులు తెచ్చుకునేవారు. ఆధునిక భారతదేశ చరిత్రలోనూ అత్యధిక భాగం స్వాతంత్య్రోద్యమం పొందేది.
* సిలబస్‌లో పూర్తిగా ఆధునిక భారతదేశ చరిత్ర అని పేర్కొంటే మలి మొఘలులతో అనుసంధానించుకుని భారత్‌ పరిపాలన క్రమం, స్వాతంత్య్రోద్యమం లోతుగా చదవాలి. ఎందుకంటే ఆ విభాగంపైనే 15 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక.

రాజకీయ, సాంస్కృతిక చరిత్రలు

పరీక్ష కోణంలో పరిశీలించాల్సిన మరొక అంశం- చరిత్ర చదివే క్రమంలో రాజకీయ చరిత్ర, సాంస్కృతిక చరిత్ర అనే కోణాలుండాలి. ప్రాచీన, మధ్యయుగ ఆధునిక అనే విభజనతో చదువుతున్నప్పుడు కాలం ప్రధానంగా పరిగణనలోకి వస్తుంది. అందుకనుగుణంగా అంశాలన్నీ విభజించారు. దీన్నే రాజకీయ సాంస్కృతిక చరిత్ర అన్నప్పుడు అంశాల వారీగా అధ్యయనం చేయాలి. సంస్కృతి అంటే నాటి ఆచార వ్యవహారాలు, జీవనశైలి, కళలు, సాహిత్యం, ఆర్థిక అంశాలు, సాంఘిక నిర్మితులు మొదలైన వాటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు- భారతదేశంలో వాస్తు.

వాస్తు ... సింధు నాగరికత కాలం నుంచి బ్రిటిష్‌ సామ్రాజ్యం ఏర్పడేవరకు ఉన్న వివిధ రకాలైన కట్టడాల రూపంలో కనిపిస్తుంది. సాంస్కృతిక అనే పదం వాడినపుడు తప్పనిసరిగా ఆ కోణంలోనే ప్రశ్నలు వస్తాయి.

మరొక ఉదాహరణ... సింధు నాగరికత కాలం నాటి సంగీతానికి సంబంధించిన సాక్ష్యాలు లేనప్పటికీ అనంతర కాలంలో దక్షిణ, పశ్చిమ, ఉత్తర భారతదేశంలో సంగీతం వివిధ రూపాల్లో అభివృద్ధి చెందింది. సాంస్కృతిక అని సిలబస్‌లో పేర్కొన్నప్పుడు ఈ విధంగా సంగీతం అనే అంశాన్ని మొత్తం భారతదేశ చరిత్రలో పరిశీలించాల్సి ఉంటుంది. కులం, మతం, పండగలు, సామాజిక సంప్రదాయాలు... ఇలా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని చదివితే సిలబస్‌ అనుకూల ప్రిపరేషన్‌ అంటారు. అదే విధంగా ఆయా సాంస్కృతిక అంశాలకు ప్రోత్సాహాన్నిచ్చిన రాజ వంశాలు లేదా అందులో ప్రముఖులైన రాజుల గురించి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో వివిధ కాలాల్లో వచ్చిన వివిధ రచనలు, అందులోని సారాంశంపై కూడా ప్రశ్నలు అధికంగానే ఉంటాయి.
* రాజకీయ చరిత్ర అని ప్రత్యేకంగా పేర్కొంటే... వివిధ రాజ్య వంశాల స్థాపన, ఒక్కొక్క రాజవంశంలో పరంపర, చారిత్రకంగా గుర్తు పెట్టుకోదగిన సంఘటనలు, ప్రముఖులైన రాజులు, అనుసరించిన ఆర్థిక విధానాలు మొదలైన అంశాల రూపంలో రాజకీయ చరిత్రను చదవాలి. రాజకీయం అంటేనే అధికారం పొందేందుకు చేసే ప్రక్రియ. ఆ పరంపరలో వివిధ రాజులు తమ అధికారాన్ని పొందేందుకూ, నిలబెట్టుకునేందుకూ ఎటువంటి వ్యూహం అనుసరించారు అనే కోణంలో కారణాలు, ఫలితాలు విశ్లేషించుకుంటూ చదవాలి. రాజకీయ చరిత్రలోనే ప్రధానంగా వివిధ సంవత్సరాలు కూడా ప్రశ్నల రూపంలో అడిగే అవకాశముంది.


ప్రాంతీయ చరిత్రలు కూడా...

ఇటీవల జనరల్‌ స్టడీస్‌లో  ప్రాంతీయ చరిత్రలు కూడా జోడిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో జరిగిన చారిత్రక విషయాలు, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ భూభాగంలో జరిగిన చారిత్రక విషయాలు!

ప్రాంతీయ చరిత్ర సిలబస్‌లో ఉందా లేదా అని ఒకసారి పరిశీలించండి. భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు సిలబస్‌లో లేకుండా కేవలం ప్రాంతీయ చరిత్ర ఇస్తే మాత్రం 10-15 ప్రశ్నలకు సిద్ధపడి ఉండాలి. భారతదేశ చరిత్రను అనుసంధానం చేస్తూ ప్రాంతీయ చరిత్రలు సిలబస్‌లో ఉంటే రెండు లేదా మూడు ప్రశ్నలు మాత్రమే జనరల్‌ స్టడీస్‌లో అడిగే అవకాశం ఉంది. ఇలా భారతదేశ చరిత్రతో ప్రాంతీయ చరిత్రను అనుసంధానించిన సందర్భంలో తక్కువ ప్రశ్నలకు అవకాశం ఉన్నందున ప్రధాన సంఘటనలు, రాజవంశాలు, ప్రముఖ రాజుల గురించి క్లుప్తంగా చదివితే సరిపోతుంది.

గ్రూప్స్‌లో ఇలాంటి పరీక్ష రాసేటప్పుడు ప్రాంతీయ చరిత్రలు మిగతా పేపర్లలో ఉంటాయి కాబట్టి ఆయా పేపర్లలో అంతర్భాగంగా సిలబస్‌ను చదివితే జనరల్‌ స్టడీస్‌లో వచ్చే రెండు మూడు ప్రశ్నల్ని తేలిగ్గా ఎదుర్కోవచ్చు. గ్రూప్‌-1, 2 కాకుండా ఇతర పరీక్షల కోసం జనరల్‌ స్టడీస్‌ ప్రిపేర్‌ అయ్యేటప్పుడు ప్రాంతీయ చరిత్రలు మాత్రమే సిలబస్‌లో ఉంటే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఈ విభాగాన్ని లోతుగా చదవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని