ఏ సబ్జెక్టు ఎలా చదవాలి?

మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన నీట్‌- 2022 (యూజీ) పరీక్ష తేదీ దగ్గరపడుతోంది. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు తెచ్చుకోవాలంటే వివిధ సబ్జెకులను ఎలా చదవాలో...

Published : 26 Apr 2022 02:29 IST

నీట్‌- 2022 (యూజీ)

మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన నీట్‌- 2022 (యూజీ) పరీక్ష తేదీ దగ్గరపడుతోంది. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు తెచ్చుకోవాలంటే వివిధ సబ్జెకులను ఎలా చదవాలో తెలుసుకోవాలి. అందుకు ఉపకరించే సూచనలివిగో!


బోటనీ

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి పాఠ్యాంశంలోనూ ప్రతి లైనూ చదవాలి.

చాప్టర్‌లలో ఉన్న ముఖ్యమైన బొమ్మల్ని గుర్తుంచుకోవాలి. వాటిలో ముఖ్యాంశాలను ప్రశ్నపత్రంలో అడిగే అవకాశం ఉంది.

బోటనీలో ముఖ్యమైన అధ్యాయాలు: ప్లాంట్‌ ఫిజియాలజీ (19 శాతం), ఎకాలజీ (17 శాతం), జెనెటిక్స్‌ (20 శాతం), సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్‌ (10 శాతం), స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ప్లాంట్స్‌ (10 శాతం), డైవర్సిటీ ఇన్‌ లివింగ్‌ వరల్డ్‌ (10 శాతం). వీటితోపాటు మిగిలిన అధ్యాయాలను కూడా పూర్తిగా చదవాలి. (బ్రాకెట్లలో ఇచ్చిన శాతాలు సుమారుగా ఆయా చాప్లర్ల ప్రాధాన్యాన్ని సూచిస్తాయి).

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ని దాటి కూడా ఒకటి రెండు ప్రశ్నల్ని అడగొచ్చు. మీ దగ్గరున్న స్టడీ మెటీరియల్‌లో వాటిని సాధన చేయాలి.

ప్రతి చాప్టర్‌లో ప్రధాన పాఠ్యాంశంతోపాటు ఇంట్రడక్షన్‌ లేదా ప్రివ్యూ చదవడం కూడా తప్పనిసరి.


జువాలజీ

బోటనీలో మాదిరిగానే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రతి పాఠంలో ప్రతి లైనూ చదవాలి. బొమ్మల్ని గుర్తుంచుకోవాలి.

బయోటెక్నాలజీ, ప్రస్తుత పర్యావరణ సంబంధ అంశాల్లో అప్‌డేట్‌గా ఉండాలి.

హ్యూమన్‌ ఫిజియాలజీలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇచ్చిన డిజార్డర్స్‌ ముఖ్యం.

హ్యూమన్‌ రీప్రొడక్షన్‌, రీప్రొడక్టివ్‌ హెల్త్‌ అధ్యాయాల్లో ప్రశ్నల్ని ఎన్‌సీఈఆర్‌టీ పరిధి కూడా దాటి అడిగే అవకాశం ఉంది.

విభిన్న మెకానిజమ్స్‌కి సంబంధించిన బొమ్మలు, ఫ్లోచార్ట్‌లను బాగా సాధన చేయాలి.


ఫిజిక్స్

చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సబ్జెక్టును కష్టతరంగా భావిస్తారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన భావన.

మంచి ర్యాంకు సాధనకు మిగిలిన సబ్జెక్టులతో పాటు ఫిజిక్స్‌లో కూడా మంచి మార్కులు సాధించాలి.

నిర్దిష్టంగా ఏ అధ్యాయం ముఖ్యమైనదో నిర్ణయించకపోయినా ప్రాధాన్యపరంగా మోడర్న్‌ ఫిజిక్స్‌, సెమీ కండక్టర్స్‌, మెకానిక్స్‌, ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నటిజం, హీట్‌ లాంటి చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ సబ్జెక్టులో థియరీ ప్రశ్నల కంటే లెక్కలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. థియరీ ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయాలను చదివితే మంచిది.

గ్రావిటేషన్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌, మాగ్నటిజంలో విభిన్న అంశాలు, అనువర్తనాలు, ఫార్ములాలు పోల్చదగినవి. కాబట్టి ఈ అధ్యాయాలను విడివిడిగా కాకుండా సారూప్య అంశాను గమినిస్తూ అభ్యసిస్తే సమయం ఆదా అవుతుంది.

ఎలక్ట్రిసిటీలో సర్క్యూట్‌ ఆధారిత లెక్కలను సాధన చేయాలి.

మెకానిక్స్‌ విభాగంలో కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ లీనియర్‌ అండ్‌ యాంగ్యులర్‌ మొమెంటమ్‌, ఎనర్జీ లాంటి అంశాలపై పట్టు సాధించాలి.


కెమిస్ట్రీ

బయాలజీ తర్వాత ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కెమిస్ట్రీ బాగా ఉపయోగకరం. బయాలజీ మాదిరిగానే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను పూర్తిగా చదవాలి.

ఫిజికల్‌ కెమిస్ట్రీ విభాగం నుంచి 15-20 ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉంది. అధిక శాతం లెక్కలుంటాయి. ఈ విభాగంలో ప్రధాన అంశాలు - కెమికల్‌ అండ్‌ అయానిక్‌ ఈక్విలిబ్రియం, రెడెక్స్‌ రియాక్షన్స్‌, సొల్యూషన్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ. వీటితోపాటు మిగిలిన అధ్యాయాలనూ చదవాలి.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం నుంచీ 15-20 ప్రశ్నలు రావొచ్చు. ఈ విభాగలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఐసోమెరిజమ్‌ అనువర్తనాలు ముఖ్యమైనవి. వీటితోపాటు హైడ్రోకార్బన్స్‌, ఆల్కహాల్స్‌, ఆల్డిహైడ్స్‌, ఎమీన్స్‌ లాంటివి ప్రధానమైనవే.

ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం నుంచి 12-18 ప్రశ్నలు అడగొచ్చు. ఈ విభాగంలో ముఖ్యమైనవి- కెమికల్‌ బాండింగ్‌, సీబ్లాక్‌, కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌. అన్ని గ్రూపుల్లో ముఖ్య ధర్మాలు, విభేదాలు సాధన చేయాలి.

ముఖ్యమైన ఫార్ములాలు, గ్రాఫులు, పట్టికలను విడిగా రాసి ఉంచుకుని పునశ్చరణ చేస్తూ ఉండాలి.


ప్రతి సబ్జెక్టులో సింగిల్‌ స్టేట్‌మెంట్‌, రెండు లేదా మూడు ప్రతిపాదనలతో జతపరిచేలా రెండు కాలమ్స్‌ ఇస్తూ, సరైన సమాధానం కాక తప్పు సమాధానాన్ని గుర్తించేలా, బొమ్మ లేదా గ్రాఫ్‌ ఆధారంగా.. ఇలా రకరకాల మోడల్స్‌లో ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల మోడల్స్‌ని సాధన చేయడం అభిలషణీయం. కొత్త, కష్టమైన అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నించకుండా అప్పటివరకూ నేర్చుకున్నవాటిని ఇంకా బలపరుచుకోవాలి. సమయపాలన మెలకువలను పాటిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని నేర్పుగా అదుపు చేయగలిగితే నీట్‌లో మంచి ర్యాంకు సాధ్యమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని