TS EXAMS-2022:సాంకేతికతపై పట్టు.. మార్కులు సాధించిపెట్టు!

గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ అధ్యయనంలో భాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపైనా పట్టు సాధించాల్సివుంటుంది. ముఖ్యంగా వర్తమాన అంశాలతో ముడిపడి ఉన్న సాంకేతికత అంశాలకు సన్నద్ధతలో ప్రాముఖ్యం ఇచ్చి చదవాలి.

Updated : 04 May 2022 06:58 IST

జనరల్‌ స్టడీస్‌: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

గ్రూప్స్‌, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ అధ్యయనంలో భాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపైనా పట్టు సాధించాల్సివుంటుంది. ముఖ్యంగా వర్తమాన అంశాలతో ముడిపడి ఉన్న సాంకేతికత అంశాలకు సన్నద్ధతలో ప్రాముఖ్యం ఇచ్చి చదవాలి. అప్పుడే పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం సాధ్యమవుతుంది!

నరల్‌ స్టడీస్‌లో భాగమైన జనరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సిలబస్‌ వివరణ ఇలా ఉంటుంది- ‘‘జనరల్‌సైన్స్‌- భారతదేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో సాధించిన అభివృద్ధి’’. గ్రూప్‌-1, గ్రూప్‌-2 రెండింటిలో ఒకే రకమైన సిలబస్‌ ఉంది. ఇది అభ్యర్థులకు కలిసివచ్చే అంశం. ఒకే ప్రిపరేషన్‌ రెండు రకాల పోటీ పరీక్షలకూ ఉపయోగపడుతుంది. సన్నద్ధతలో భాగంగా సిలబస్‌ను వివిధ టాపిక్స్‌ ప్రకారం విభజించుకుని చదవాలి!

రక్షణరంగ టెక్నాలజీ: ఈ టాపిక్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. భారతదేశం అభివృద్ధి పరిచిన క్షిపణులు, జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, రాడార్‌లు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, ఇతర రక్షణరంగ ఆయుధాల గురించి తెలుసుకోవాలి.

బయోటెక్నాలజీ: దీనిలో భాగంగా దేశంలో రూపొందించిన జన్యు పరివర్తన పంటలైన బి.టి.కాటన్‌, బి.టి.రైస్‌, బి.టి.వంకాయ, జన్యుపరివర్తన ఆవాలు లాంటివి చదవాలి. ఇవేకాకుండా జన్యు ఇంజినీరింగ్‌, జన్యు ఎడిటింగ్‌, జీన్‌థెరపి లాంటివి చదవాలి.

అణుసాంకేతికత: ఈ విభాగంలో భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న అణురియాక్టర్ల వివరాలు, నిర్మాణంలో ఉన్న ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌, వివిధ పరిశోధనా రియాక్టర్ల ప్రత్యేకతలు, అణుఇంధనాలు, వివిధ ప్రాంతాల్లో ఏర్పరచదలుచుకున్న కొత్త విద్యుత్‌ రియాక్టర్లు, కొత్త యురేనియం గనులు, భారతదేశం అణుశక్తిని వినియోగించుకుంటున్న విధానం లాంటివి ఎక్కువగా చూసుకోవాలి.


రోబోటిక్స్‌: ఆండ్రాయిడ్‌, హ్యూమనాయిడ్‌ రోబోట్‌లు, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో రూపొందించిన రోబోట్‌లు, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించినవాటి వివరాలు, వీటి ప్రత్యేకతలను చదవాలి.


క్లోనింగ్‌: క్లోనింగ్‌ విధానం, దీనిలో ఉన్న మూల సూత్రం, భారతదేశంలో క్లోనింగ్‌ ద్వారా సృష్టించిన జంతువులు, వీటిపై ప్రయోగాలు చేసిన సంస్థలపై దృష్టి సారించాలి.

స్టెమ్‌సెల్‌ టెక్నాలజీ:  మూలకణాల రకాలు, వీటి ఉపయోగాలు, భారతదేశంలో మూలకణ టెక్నాలజీ ప్రయోగాలు ముఖ్యమైనవి.

అంతరిక్ష సాంకేతికత: దీన్ని రెండో ప్రాధాన్య అంశంగా చదవాలి. భారతదేశం ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపగ్రహ వాహక నౌకలైన పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీల ప్రత్యేకతలు, వీటిలోని రకాలు లాంటివి ముఖ్యమైనవి. ఇవేకాకుండా ఇస్రో గత రెండు సంవత్సరాల కాలంలో కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు, వీటి ఉపయోగాలు, చంద్రయాన్‌-1, 2, అంగారక గ్రహయాత్ర, ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు చేస్తున్న కృషి లాంటివి ముఖ్యమైనవి.


డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌: దీనిలో డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ విధానం, ఉపయోగాలు మన దేశంలో ఈ టెక్నాలజీలో కృషిచేస్తోన్న సంస్థలు, డీఎన్‌ఏ సాంకేతికత బిల్లు లాంటివి చదవాలి.


వ్యాక్సిన్‌లు: వ్యాక్సిన్‌ల పనితీరు, రకాలు, వ్యాధుల నివారణకు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు, మనదేశంలో రూపొందించిన వ్యాక్సిన్‌లు, ఇటీవల కొవిడ్‌-19 వ్యాధికి వాడుతున్న వ్యాక్సిన్‌లు లాంటివి ఎక్కువగా చదవాలి.

సమాచార సాంకేతికత: దేశంలో అభివృద్ధి చేసిన సూపర్‌ కంప్యూటర్‌లు, నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిషన్‌, ఈ-గవర్నెన్స్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ సాంకేతికత, ఇటీవల అభివృద్ధి చెందిన నూతన సాంకేతికతలైన బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌డేటా అనాలిసిస్‌ లాంటివి చదవాలి. వీటితోపాటుగా సమాచార సాంకేతిక అభివృద్ధికి భారతదేశ చర్యలపై దృష్టి సారించాలి.

నానో టెక్నాలజీ: నానో టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోపడుతున్న పరికరాలు, నానో కార్బన్‌ట్యూబ్‌లు, వివిధ రంగాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగాలు, దీని అభివృద్ధికి ఉపయోగపడుతున్న దేశీయ సంస్థలు, భారతదేశ నానోసైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మిషన్‌ లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.


ఇవీ మెలకువలు

1 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలను జనరల్‌ సైన్స్‌ అంశాలకు అంటే.. జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రాలకు అన్వయించుకుంటూ చదవాలి.

2 జనరల్‌ సైన్స్‌లో ఉన్న అంశాలను చదివి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చదివితే టెక్నాలజీ టాపిక్‌లు బాగా అర్థమవుతాయి.

3 వర్తమాన అంశాలతో ముడిపడి ఉన్న సాంకేతికత అంశాలను ఎక్కువగా చదివితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

4 అభ్యర్థులు టెక్నాలజీ సంబంధ పదాలను కష్టంగా భావిస్తుంటారు. వీటి అర్థాలను తెలుసుకుంటూ చదివితే గుర్తుంటాయి.

5 వివిధ టెక్నాలజీ అంశాలతో ముడిపడి ఉన్న మూల సూత్రాలూ, కారణాలను తెలుసుకుంటూ చదివితే సన్నద్ధత తేలికవుతుంది.

6 టెక్నాలజీలోని వివిధ అంశాలను అనుసంధానించుకుంటూ సన్నద్ధత సాగించాలి.

7 మనదేశం గడిచిన రెండు సంవత్సరాల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సాధించిన అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

8 టెక్నాలజీలో అంశాలకు, టెక్నాలజీకి సంబంధించిన వర్తమాన అంశాల సమాచారానికీ ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్‌లపై ఆధారపడొచ్చు.

9 మొత్తం టెక్నాలజీలో ఉన్న అంశాల్లో అంతరిక్ష రంగం, రక్షణరంగం అంశాలు చాలా ముఖ్యమైనవని గ్రహించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని