Research:పరిశోధనలకు పునాది

మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో అత్యున్నత మానవ వనరులను రూపొందించడం, వారిని పరిశోధనల దిశగా ప్రోత్సాహించే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలలో ఐఐఎస్‌ఈఆర్‌లు నెలకొల్పారు. నాణ్యమైన బోధన, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ, వసతి సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి....

Updated : 04 May 2022 05:53 IST

ఐసర్‌లలో డ్యూయల్‌ డిగ్రీలు

దేశంలో సైన్స్‌, మ్యాథ్స్‌ కోర్సుల నిమిత్తం ఉన్న ప్రసిద్ధ సంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు ముఖ్యమైనవి. భవిష్యత్తులో పరిశోధనల దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఈ సంస్థలు అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఆప్టిట్యూడ్‌ టెస్టులో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభావంతులు, కేవీపీవైకి ఎంపికైనవారినీ కోర్సుల్లో చేర్చుకుంటారు. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులు ప్రతినెలా స్టైపెండ్‌ సైతం అందుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!

మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లో అత్యున్నత మానవ వనరులను రూపొందించడం, వారిని పరిశోధనల దిశగా ప్రోత్సాహించే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురంలలో ఐఐఎస్‌ఈఆర్‌లు నెలకొల్పారు. నాణ్యమైన బోధన, అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ, వసతి సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి.

ఈ సంస్థల్లో బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండేళ్లు సైన్స్‌లో ప్రాథమికాంశాలు బోధిస్తారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్‌అండ్‌డి సంస్థలు, సైన్స్‌ అంశాలతో ముడిపడిఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండేళ్లు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్‌ కోర్సులు, ఆర్ట్‌, ఎర్త్‌సైన్స్‌ల గురించి అభ్యసిస్తారు. ఐదేళ్ల కోర్సులో పది సెమిస్టర్లు ఉంటాయి.


ఇవీ కోర్సులు...

బీఎస్‌ - ఎంఎస్‌: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, డేటా సైన్స్‌, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్‌ / ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, జియలాజికల్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.

బీఎస్‌ కోర్సులు (భోపాల్‌లో మాత్రమే): ఇంజినీరింగ్‌ సైన్సెస్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), ఎకనామిక్స్‌ సైన్సెస్‌. వ్యవధి నాలుగేళ్లు. బీఎస్‌ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. ఎకనామిక్స్‌ కోర్సులో చేరినవారు బీఎస్‌ తర్వాత మరో ఏడాది చదువు పూర్తిచేసుకుంటే ఎంఎస్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

బీఎస్‌-ఎంఎస్‌ సీట్ల వివరాలు: ఐఐఎస్‌ఈఆర్‌: బరంపురం -224, భోపాల్‌ - 252, కోల్‌కతా - 250, మొహాలీ - 244, పుణె - 288, తిరువనంతపురం - 302, తిరుపతి - 174. ఏడు సంస్థల్లోనూ కలిపి 1734 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా భోపాల్‌లో బీఎస్‌: ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో 73, ఎకనామిక్‌ సైన్సెస్‌లో 42 సీట్లు ఉన్నాయి.


ఆప్టిట్యూడ్‌ పరీక్ష ఇలా

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 15 చొప్పున 60 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ముప్పావు మార్కు తగ్గిస్తారు. మొత్తం 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షకు ముందు మాక్‌ టెస్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, ఆప్టిట్యూడ్‌ టెస్టు... వీటిలో ఏ విధానంలో సీటు ఆశించినప్పటికీ ఇంటర్‌లో నిర్ణీత కటాఫ్‌ మార్కులు సాధించడం తప్పనిసరి. ద్వితీయ సంవత్సరం ఐదు సబ్జెక్టులను ఎంచుకుని ఒక్కో సబ్జెక్టులో సాధించిన మార్కులను వందకు కుదించి 500కు గానూ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో కేటగిరీలవారీ నిర్దేశిత పర్సంటైల్‌ లోపు ఉన్న విద్యార్థులకే ఐఐఎస్‌ఈఆర్‌ సీట్లకు పోటీపడే అవకాశం దక్కుతుంది. వీటిని ఆయా బోర్డులు, రాష్ట్రాలవారీ నిర్ణయిస్తారు.


ప్రవేశ విధానం

కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజనకు ఎంపికైనవారు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రతిభ చూపినవారితో 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు. మిగిలినవి ఆప్టిట్యూడ్‌ టెస్టు ద్వారా నింపుతారు. జేఈఈ ర్యాంకర్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కి ఎంపికైనవాళ్లు సైతం ఆప్టిట్యూడ్‌ పరీక్షను రాసుకోవచ్చు. ఐఐటీ-జేఈఈ, కేవీపీవై విభాగాలకు కేటాయించిన సీట్లు ఖాళీగా ఉంటే ఆప్టిట్యూడ్‌లో ప్రతిభ చూపినవారితో భర్తీ చేస్తారు. ఈ సంస్థల్లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లిస్తారు.


సన్నద్ధత

ముందుగా ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకోవడం తప్పనిసరి.

సిలబస్‌లో పేర్కొన్న పాఠ్యాంశాలు బాగా చదివిన తర్వాత ఐఐఎస్‌ఈఆర్‌ పాత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయాలి. ఏ చాప్టర్ల నుంచి ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గమనించి సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.

ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, బిట్‌శాట్‌...తదితర ప్రశ్నపత్రాల అధ్యయనం ఉపయోగపడతుంది.

పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి.

రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయడమే మంచిది.


ముఖ్యమైన తేదీలు

అర్హత: ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో 2021 లేదా 2022లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55) శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 29 వరకు స్వీకరిస్తారు. (కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సెప్టెంబరు 11 నుంచి సెప్టెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు)

దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000

ఆప్టిట్యూడ్‌ పరీక్ష తేదీ: జులై 3 .

వెబ్‌సైట్‌:  https://www.iiseradmission.in/n


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని