DEE CET: ఇంటర్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ

ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు చదవాలి. దీనిలో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష డీఈఈసెట్‌. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సివుంటుంది.  

Updated : 10 May 2022 05:31 IST

డీఈడీ ప్రవేశపరీక్ష  

ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు చదవాలి. దీనిలో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష డీఈఈసెట్‌. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సివుంటుంది.  

డీఈఈ సెట్‌ రాయాలంటే...ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఇంటర్‌ పరీక్ష రాస్తున్నవాళ్లూ అర్హులే. అయితే కోర్సులో చేరే సమయానికి పరీక్ష పాసై ఉండాలి. ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొంది ఉండాలి. ఒకేషనల్‌ కోర్సులతో ఇంటర్మీడియట్‌ పాసైనవారికి ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హతలేదు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలోనే మీడియాన్ని ఎంపిక చేసుకోవాలి.

వయసు: సెప్టెంబరు 1, 2022 నాటికి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. గరిష్ఠ వయఃపరిమితి నిబంధన లేదు.


ప్రశ్నపత్రం

తెలంగాణలో ప్రశ్నపత్రం మూడు పార్టులుగా, ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. పార్ట్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌కు చెందిన 10 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 10 మార్కులు ఉంటాయి. పార్ట్‌-2లో జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించిన 10 ప్రశ్నలు, జనరల్‌ తెలుగుకు చెందిన 20 ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగం 30 మార్కులకు ఉంటుంది. పార్ట్‌-3లో మ్యాథమేటిక్స్‌కు 20 ప్రశ్నలు, ఫిజికల్‌ సైన్స్‌కు 10 ప్రశ్నలు, బయోలాజికల్‌ సైన్స్‌కు 10 ప్రశ్నలు, సోషల్‌ స్టడీస్‌కు 20 ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగం మొత్తం 60 మార్కులకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నపత్రం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పార్ట్‌-ఎ 60 మార్కులకు, పార్ట్‌-బి 40 మార్కులకు ఉంటుంది. పార్ట్‌-ఎ టీచింగ్‌ ఆప్టిట్యూట్‌లో 5 ప్రశ్నలకు 5 మార్కులు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌కు చెందిన 5 ప్రశ్నలకు 5 మార్కులు, ఇంగ్లిష్‌ 5 ప్రశ్నలకు 5 మార్కులు, తెలుగులో 5 ప్రశ్నలకు 5 మార్కులు, ఆప్టెడ్‌ లాంగ్వేజ్‌ (తెలుగు/తమిళ్‌/ఉర్దూ/ఇంగ్లిష్‌)కు చెందిన 10 ప్రశ్నలకు 10 మార్కులు, మ్యాథమేటిక్స్‌ 10 ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్‌ సైన్స్‌ 10 ప్రశ్నలకు 10 మార్కులు, సోషల్‌ స్టడీస్‌ 10 ప్రశ్నలకు 10 మార్కులు ఉంటాయి. పార్ట్‌-బి 40 మార్కులకు ఉంటుంది. ఇది అభ్యర్థి ఇంటర్మీడియట్‌లో చదివిన గ్రూపు, ఎంచుకున్న విభాగాన్ని బట్టి ఇది మారుతుంది. మ్యాథమేటిక్స్‌లో 40 ప్రశ్నలు/ ఫిజికల్‌ సైన్స్‌ 40 ప్రశ్నలు ఇందులో ఫిజిక్స్‌కు 20, కెమిస్ట్రీకి 20 ఉంటాయి/ బయోసైన్స్‌లో బోటనీ నుంచి 20, జువాలజీ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి/ సోషల్‌ స్టడీస్‌లో హిస్టరీ నుంచి 13, ఎకనామిక్స్‌ నుంచి 13, సివిక్స్‌ నుంచి 13, హిస్టరీ/ఎకనామిక్స్‌/సివిక్స్‌ నుంచి అదనంగా ఒక ప్రశ్న వస్తుంది. పార్ట్‌-ఎలో ఆయా స్టేట్‌ సిలబస్‌ 6 నుంచి పదో తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-బిలో ఇంటర్మీడియట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంచుకున్న మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయొచ్చు.


ఎలా సన్నద్ధం కావాలి?

* ప్రతి అంశాన్నీ విశ్లేషించుకుంటూ చదవాలి. పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తూ ప్రవేశ పరీక్షకు సన్నద్ధం కావాలి.

* నిర్దేశించిన సిలబస్‌లోని ముఖ్యాంశాలను మాత్రమే కాకుండా మొత్తం సిలబస్‌ను చదవాలి.

* చదివిన అంశాలను అర్థంచేసుకుంటూ, అనువర్తించుకుంటూ సన్నద్ధతను కొనసాగించాలి.  

* ప్రవేశపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సాధారణంగా ఇంటర్మీడియట్‌ను ఈమధ్యే పూర్తిచేసి ఉంటారు. ఆ పాఠ్యాంశాల మీద మంచి పట్టు ఉండే ఉంటుంది. కాబట్టి ఆరు నుంచి పదో తరగతి పాఠ్యాంశాలపైన ఎక్కువగా దృష్టి సారించాలి.

* మోడల్‌ టెస్ట్‌లు రాస్తూ, తప్పులను సరిదిద్దుకుంటూ, ఎప్పటికప్పుడు సాధనను మెరుగుపరుచుకోవాలి.

* ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తేనే  డీఈడీలో సీటు సంపాదించగలమనే విషయాన్ని గుర్తుంచుకుని సన్నద్ధత కొనసాగించాలి.


టీఎస్‌ డీఈఈ సెట్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 30.6.2022
పరీక్ష తేదీ: 23-7-2022
http://deecet.cdse.telangana.gov.in

ఏపీ డీఈఈ సెట్‌ ప్రకటన వెలువడాల్సి ఉంది.
వెబ్‌సైట్‌: https://cse.ap.gov.in https://apdeecet.apcfss.in



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని