ఎకానమీలో ఏవి ముఖ్యం?

పోటీ పరీక్షల అభ్యర్థుల్లో అత్యధికులు ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) విభాగాన్ని ఎలా చదవాలనే విషయంలో సందిగ్ధతకు లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా బీటెక్‌, సైన్స్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఈ విభాగం అంతగా మింగుడు పడదు.

Published : 16 May 2022 02:41 IST

పోటీ పరీక్షల్లో భారత ఆర్థిక వ్యవస్థ

పోటీ పరీక్షల అభ్యర్థుల్లో అత్యధికులు ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) విభాగాన్ని ఎలా చదవాలనే విషయంలో సందిగ్ధతకు లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా బీటెక్‌, సైన్స్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఈ విభాగం అంతగా మింగుడు పడదు. మొదటిసారి పోటీ పరీక్ష రాస్తున్నవారు సాధారణంగా ఈ విభాగాన్ని వదిలేయటానికి మానసికంగా సిద్ధపడుతుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. చుట్టూ ప్రపంచంలో ఆర్థికంగా జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకోగలిగితే ఆర్థిక వ్యవస్థలో మంచి మార్కులు సాధించవచ్చు!

జనరల్‌ స్టడీస్‌/గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో భారత ఆర్థిక వ్యవస్థ విభాగంపై 10 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ అంశాలను సాధారణ పరిభాషలో అర్థం చేసుకుని సరిగా అన్వయించుకుంటే తేలికగానే ఉంటుంది. పోటీ పరీక్షల్లో అర్థశాస్త్ర సైద్ధాంతిక (థియరీ)అంశాలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు. ‘ఆ సైద్ధాంతిక అంశాలు వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా ఉన్నాయి?’ అనేది అర్థం చేసుకుంటే చాలు.●

* ఆర్థిక వ్యవస్థ అంశాలను ప్రిలిమినరీకే పరిమితం చేసుకోకూడదు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో దీని ప్రభావం 200 మార్కుల వరకు ఉంటుంది. వ్యాసరచనలో సైతం అనేక సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థ అంశాలను ఉదాహరించాల్సివుంటుంది. ఇందుకు తప్పనిసరిగా భారతదేశ, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపైన పట్టు పెంచుకోవాలి.

* ఆర్థిక సంస్కరణల అనంతరం వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో వచ్చిన మార్పులను సంబంధిత విధానాల ద్వారా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పారిశ్రామిక రంగ విధానాలపై ప్రశ్నలు వస్తాయి.

* ఆర్థిక సంస్కరణల అనంతరం ద్రవ్య విత్తవ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సంబంధిత కమిటీలు, అంతిమ ఫలితాలు పరీక్ష కోణంలో చాలా విలువైన సమాచారంతో ఉంటాయి.

* ద్రవ్య వ్యవస్థలో ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగంపై ప్రశ్నపత్రం రూపొందించేవారి దృష్టి ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విధివిధానాలు చాలా సందర్భాల్లో ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి. ఆ విధానాల్లో ఉండే పదజాలం, ప్రస్తుతం వాటికి సంబంధించిన గణాంకాలు కూడా పరీక్ష కోణంలో ముఖ్యమైనవే.

* విత్త వ్యవస్థలో అంతర్భాగంగా పన్నుల వ్యవస్థలో వచ్చిన వివిధ సంస్కరణలు అనేక సందర్భాల్లో ప్రశ్నలుగా వస్తున్నాయి.

* ద్రవ్య విత్త వ్యవస్థల్లో మార్పులకు కారణమైన కమిటీలూ, అవి చేసిన సూచనలూ ప్రతి పరీక్షలో 1-2 బిట్ల రూపంలో కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయా కమిటీల సూచనలు, వచ్చిన మార్పులపై పూర్తి స్థాయి పట్టు ఉంటే మంచిది.

* చెల్లింపుల సమతుల్యత, ఎగుమతులు- దిగుమతులు కూడా పరీక్షలో ముఖ్యమే.

* సామాజిక ఆర్థిక సమస్యల విభాగంలో పేదరికం, నిరక్షరాస్యత, జనాభా సమస్య, నిరుద్యోగం మొదలైన పాఠ్యాంశాలను బేసిక్స్‌ నుంచి వర్తమాన గణాంకాల వరకు అధ్యయనం చేయాలి.


* గ్రూప్‌-1 మెయిన్స్‌లో కూడా అనేక సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాల (బేసిక్స్‌) గురించి రాయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రిలిమినరీ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను చదవడమంటే మెయిన్స్‌కు కూడా సిద్ధమవటమేనని భావించుకుని అధ్యయనం చేయాలి.●

* స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంస్కరణలకు ముందూ, తరువాతా అని విభజించుకోవాలి. సంస్కరణలకు ముందు ఆర్థిక వ్యవస్థను నడిపించిన సామ్యవాద తాత్వికతనూ, నియంత్రిత ఆర్థిక వ్యవస్థలో భాగంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణాలనూ అర్థం చేసుకోవాలి. పంచవర్ష ప్రణాళికలు, వివిధ నియంత్రిత విధానాలు ప్రశ్నల రూపంలో రావచ్చు.


వ్యూహాలు.. పథకాలు

పేదరిక నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, నిరుద్యోగ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ వ్యూహాలు చదవాల్సి ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకాలు ప్రశ్నల రూపంలో రావచ్ఛు పేదరికం, నిరుద్యోగం, వాటికి సంబంధించిన నిర్వచనాలు కూడా అడిగిన సందర్భాలున్నాయి.

సాంఘిక ఆర్థిక సమస్యలు, స్వాతంత్య్రానంతరం నుంచి నేటి వరకు కాలానుగుణంగా ఏ మార్పులకు గురయ్యాయో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలకు సంబంధించిన దేశవ్యాప్త గణాంకాలు ప్రశ్నలకు ఆధారం కావచ్ఛు ప్రిలిమినరీ స్థాయి పరీక్షల్లో ఈ విభాగం నుంచి రెండు మూడు ప్రశ్నలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.

* 2021-22 భారత ఆర్థిక సర్వే, 2022-23 భారత బడ్జెట్‌ అధీకృత సమాచారాలుగా భావించవచ్ఛు వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల గణాంకాలు ఈ సర్వే, బడ్జెట్‌ల నుంచి తీసుకునే అవకాశం ఎక్కువ. అందువల్ల ఈ సర్వే, బడ్జెట్‌లపై గట్టి పట్టు ఉండాలి. భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే, బడ్జెట్లు వందలాది పేజీల్లో ఉంటాయి కానీ అవి అంతా చదవాల్సిన అవసరం లేదు. పరీక్ష కోణంలో వెలువడిన పుస్తకాలు ఉపయోగకరం. తెలుగు అకాడమీ సర్వే, బడ్జెట్‌ అతి త్వరలో విడుదల కానుంది.

* ముఖ్యంగా బడ్జెట్‌ 2022-23లో ఇండియా ఎట్‌ టార్గెట్‌100 ఎంపిక చేసిన మూడు మార్గాలు, నాలుగు ప్రాధాన్యాలు అతి ముఖ్యమైనవని గుర్తించాలి.

* గ్రూప్‌-2 ఆర్థిక వ్యవస్థ స్థాయిలో ఎకానమీని అధ్యయనం చేయనవసరం లేదు. (దానిలో థియరీ భాగం ఎక్కువ). ప్రాథమిక స్థాయిలో వచ్చే ప్రశ్నల్లో సాధారణ పరిజ్ఞాన పరిశీలన ఎక్కువ ఉంటుంది. అందువల్ల గ్రూపు-2 స్థాయి ప్రశ్నల్ని నమూనాగా తీసుకొని అధ్యయనం చేయడం వల్ల అనవసరమైన ఒత్తిడితోపాటు సందిగ్ధత ఏర్పడుతుంది.●


రిఫరెన్స్‌ పుస్తకాలు

1. తెలుగు అకాడమీ భారత ఆర్థిక వ్యవస్థ

2. భారత ఆర్థిక సర్వే 2021-22, బడ్జెట్‌-2022-23 ప్రచురణలు

3. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని