UPSC: బీటెక్‌ చదివినా.. గెలుపు ఆర్ట్స్‌తోనే!

ప్రతిష్ఠాత్మక సివిల్స్‌ పరీక్ష రాసే వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్నవారే. కొలువుకు ఎంపికయ్యే వారిలోనూ అత్యధికులు వారే. ప్రధాన పరీక్షలో వారి ఐచ్ఛిక సబ్జెక్టులు ఆర్ట్స్‌ గ్రూపువి కావడం విశేషం. కేవలం 4.7 శాతం మందే ఇంజినీరింగ్‌ సబ్జెక్టులను ఐచ్ఛికాలుగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో అంశాలను  యూపీఎస్‌సీ 71వ వార్షిక నివేదిక వెల్లడించింది...

Updated : 25 May 2022 06:22 IST

సివిల్స్‌ విజేతల్లో 63 శాతం టెకీలే
యూపీఎస్‌సీ తాజా నివేదిక

ప్రతిష్ఠాత్మక సివిల్స్‌ పరీక్ష రాసే వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్నవారే. కొలువుకు ఎంపికయ్యే వారిలోనూ అత్యధికులు వారే. ప్రధాన పరీక్షలో వారి ఐచ్ఛిక సబ్జెక్టులు ఆర్ట్స్‌ గ్రూపువి కావడం విశేషం. కేవలం 4.7 శాతం మందే ఇంజినీరింగ్‌ సబ్జెక్టులను ఐచ్ఛికాలుగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో అంశాలను  యూపీఎస్‌సీ 71వ వార్షిక నివేదిక వెల్లడించింది.

తాజాగా విడుదలైన ఈ నివేదికలో సివిల్‌ సర్వీసెస్‌- 2019పై విశ్లేషించింది. ప్రాథమిక పరీక్షకు మొత్తం 11.35 లక్షల మంది దరఖాస్తు చేసినా రాసింది 5.68 లక్షల మందే. అందులోంచి 11,845 మంది ప్రధాన పరీక్షకు ఎంపికైనా 11,474 మందే రాశారు. చివరకు ఇంటర్వ్యూ తర్వాత 922 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర సర్వీసెస్‌లకు ఎంపికయ్యారు.

అత్యధికులది బీటెక్‌ నేపథ్యమే

మొత్తం 2,302 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా వారిలో అండర్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 1736. అందులో 672 మంది విజేతలయ్యారు. వారిలోనూ 524 మంది బీటెక్‌ అభ్యర్థులే. పీజీ చదివిన 566 మంది ముఖాముఖీకి ఎంపిక కాగా 250 మంది విజయం సాధించారు. వారిలోనూ 58 మంది ఇంజినీరింగ్‌ విద్యార్హత కలిగినవారే. అంటే 922 మంది విజేతల్లో ఇంజినీరింగ్‌ విద్యాధికులే 582 మంది (63.14 శాతం).

ఇంజినీరింగ్‌ చదివిన వారిలోనూ 83 శాతం మంది ఆర్ట్స్‌ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకున్నారు. 2018లో మొత్తం 832 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేయగా.. అందులో 62.70 శాతం మంది ఇంజినీరింగ్‌ చదివినవారే. ఈసారి స్వల్పంగా వారి శాతం పెరిగింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ అభ్యర్థుల సక్సెస్‌ శాతం 38.70 కాగా.. పీజీ అభ్యర్థులది 44.20 శాతం ఉండటం గమనార్హం.

అమ్మాయిలు పెరుగుతున్నారు

సివిల్స్‌ 2018లో 193 మంది(14.20 శాతం) అమ్మాయిలు ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. 2019లో ఈ సంఖ్య 220(24 శాతం)కు పెరిగింది. 1510 మంది మహిళలు మెయిన్‌ పరీక్ష రాయగా...వారిలో 454 మంది ఇంటర్వ్యూ కు ఎంపికయ్యారు.

భౌగోళిక శాస్త్రంపై మక్కువ

సివిల్స్‌-2019 ప్రధాన పరీక్షలకు అభ్యర్థులు 42 ఐచ్ఛిక సబ్జెక్టులను ఎంచుకున్నారు. అత్యధికంగా 1916 మంది జాగ్రఫీ (భౌగోళిక శాస్త్రం)ని కోరుకున్నారు. రాజనీతిశాస్త్రాన్ని 1662 మంది, సోషియాలజీ- 1263, ఆంత్రోపాలజీతో 1189 మంది హాజరయ్యారు. తెలుగును 22 మంది ఎంచుకోగా వారిలో ఇంటర్య్యూకు ఎంపికైంది ఒక్కరే.

మాతృభాషలోన్లే 206 మందికి ఇంటర్వ్యూ

సివిల్స్‌ ముఖాముఖీకి 2,302 మంది హాజరయ్యారు. వారిలో 206 మంది ప్రాంతీయ భాషల్లో సమాధానాలు ఇచ్చారు. వారిలో అత్యధికంగా 179 మందికి హిందీలోనే ఇంటర్వ్యూ జరిగింది. మరాఠీలో 11 మంది.. తెలుగు, కన్నడ భాషల్లో ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూను ఎదుర్కొన్నారు.

-  ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని