APPSC Group1:మౌఖిక పరీక్షలో మెరిసేలా!

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాల్లో 325 మంది నెగ్గి, మౌఖిక పరీక్షలకు అర్హత సంపాదించారు. జూన్‌ 15 నుంచి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ‘ఇంటర్వ్యూ చేసే 15- 30 నిమిషాల సమయంలో నిజంగా అభ్యర్థుల ప్రవర్తన, మూర్తిమత్వ లక్షణాలు రాబట్టగలరా?...

Updated : 31 May 2022 05:45 IST

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూ మెలకువలు

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాల్లో 325 మంది నెగ్గి, మౌఖిక పరీక్షలకు అర్హత సంపాదించారు. జూన్‌ 15 నుంచి ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ‘ఇంటర్వ్యూ చేసే 15- 30 నిమిషాల సమయంలో నిజంగా అభ్యర్థుల ప్రవర్తన, మూర్తిమత్వ లక్షణాలు రాబట్టగలరా?’ అనే ధర్మ సందేహం చాలామందిలో ఉంటుంది. అనుభవజ్ఞులైన సభ్యులు బోర్డులో ఉంటే అభ్యర్థులను కచ్చితంగా అంచనా వేయటం అంత కష్టమైన విషయమేమీ కాదు.

గ్రూప్‌-1 స్థాయి ఇంటర్వ్యూల్లో ప్రధానంగా అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు ఎంతవరకు సరిపోతారో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో అభ్యర్థి జ్ఞాన స్థాయి, ప్రవర్తన, మూర్తిమత్వ లక్షణాలు, ఉద్యోగ సంబంధిత విషయాలను పరిశీలిస్తారు.

జ్ఞాన సంబంధిత అంశాలు

అభ్యర్థి విద్యా సంబంధమైన, పరిసర సంబంధ, వర్తమాన విషయాలను జ్ఞాన సంబంధ విషయాలుగా గుర్తిస్తారు. అంటే అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో చదివిన వివిధ సబ్జెక్టులపై మౌఖిక పరీక్షలో ప్రశ్నలు సంధిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా, ఎంత కచ్చితంగా ఇస్తున్నారో పరిశీలిస్తారు. ఒకవేళ సమాధానం తెలియకపోతే ‘తెలియదు’ అని చెప్పటం కూడా కచ్చితంగానే పరిగణించవచ్చు.

చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రాగానే అప్పటివరకు చదివిన పోటీ పరీక్షల సిలబస్‌నూ, డిగ్రీ, పీజీ సబ్జెక్టులనూ విపరీతంగా చదువుతూ బాగా సిద్ధమైపోతున్నామని భావిస్తారు. ఈ తరహా ప్రిపరేషన్‌ చాలా అహేతుకమైనది. పోటీ పరీక్షలు జ్ఞాన సంబంధితమైన పరీక్షలు. వాటిని దాటి వచ్చారు కాబట్టి మళ్లీ జ్ఞాన స్థాయిని పరిశీలించాలని బోర్డు అనుకోదు. జ్ఞాన సంబంధిత ప్రశ్నలకు అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తున్నారనేదానికి ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాన సంబంధ ప్రశ్నలకు ముఖ్యంగా గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేకపోయినా మార్కులకు ఇబ్బందేమీ లేదు. కానీ ఆ సమాధానం చెప్పలేనన్న విషయాన్ని బోర్డుకి చెప్పగలిగితే అభ్యర్థి విజయవంతంగా సమాధానం ఇచ్చినట్లే. ఉదాహరణకు 10 ప్రశ్నలకు గాను 9 ప్రశ్నలకు అభ్యర్థికి సరైన సమాధానం తెలియనప్పుడు ‘తెలియదు’ అన్న విషయం చెప్పగలిగితే ఇంటర్వ్యూ విజయవంతంగా చేసినట్లే.

ఒక గ్రూపు-1 బోర్డులో ఒక అభ్యర్థి దాదాపు 80% ప్రశ్నలకు ‘క్షమించండి సమాధానం చెప్పలేక పోతున్నా’ అని చెప్పాడు. ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కాబట్టి మంచి మార్కులు రావని అభిప్రాయపడతారు. కానీ చాలా స్పష్టంగా చెప్పటంలోనే అభ్యర్థి ఆత్మవిశ్వాసం, ఆలోచనలో స్పష్టత, నిర్భయత్వం, న్యూనతాభావం లేకుండటం మొదలైన ఉత్తమ లక్షణాలను బోర్డు గ్రహించింది. మంచి మార్కులు ఇచ్చింది.

* జ్ఞాన సంబంధిత విషయాల్లో ఒక విషయం గుర్తించాలి. నాలుగు లేదా 3 సంవత్సరాలు చదివిన గ్రాడ్యుయేషన్‌ సంబంధిత మౌలిక సమాచారం, సంబంధిత వర్తమాన సమాచారం, సబ్జెక్టుపై స్థూల అవగాహన అభ్యర్థులకు తప్పనిసరి. అలాంటివాటిని చెప్పకపోతే అభ్యర్థి బాధ్యతగా వ్యవహరించడం లేదని బోర్డు భావించే అవకాశం ఉంది.

గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులు వృత్తి సంబంధమైనవి అయితే తప్పనిసరిగా జ్ఞాన సంబంధిత విషయాలకు ఇంటర్వ్యూలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. గ్రూపు-1 ఉద్యోగాలు పరిపాలన సంబంధిత ఉద్యోగాలు కాబట్టి గ్రాడ్యుయేషన్‌ స్థాయి విజ్ఞాన సంబంధిత ప్రశ్నలకు పైన చెప్పిన రీతిలో సమాధానం చెప్పినా పెద్ద నష్టమేమీ ఉండదు. అసలు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది.

గ్రూపు-1 పరిపాలన ఉద్యోగాలకు పోటీ పరీక్షల్లో ఉండే సిలబస్‌పై ప్రశ్నలు రావడానికి అవకాశముంది. అందువల్ల లభించే ఈ స్వల్పకాలంలో పోటీ పరీక్షల సిలబస్‌ అంశాలను ఒకసారి పునశ్చరణ (రివిజన్‌) చేసుకోవటం మంచిది.

జ్ఞాన సంబంధిత ప్రశ్నల్లో మరొక కోణంగా కరెంట్‌ అఫైర్స్‌ అంశాలను గుర్తించవచ్ఛు కరెంట్‌ అఫైర్స్‌ అనేవి ఇటు అభ్యర్థికీ, అటు బోర్డుకూ తెలిసిన ఉమ్మడి సమాచారం. అందువల్ల అభ్యర్థులను అంచనా వేసే క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వర్తమాన అంశాలను సాధనాలుగా బోర్డు వినియోగిస్తుంది. వర్తమాన అంశాల్లో కూడా గణాంక సమాచారానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏవైనా గణాంక సంబంధిత ప్రశ్నలు వస్తే సున్నితంగా ‘క్షమించండి, సమాధానం చెప్పలేక పోతున్నా’ అని చెబితే చాలు. కానీ ఆ అంశానికి సంబంధించిన స్థూల అవగాహన అవసరమే.

ఉదాహరణకు ‘ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా మొట్టమొదట బాంబు ఎక్కడ వేసింది?’ అని బోర్డు అడిగితే చెప్పలేకపోయాననే బాధ అభ్యర్థికి ఉండాల్సిన అవసరం లేదు. తెలియదని చెబితే కొంపలు మునిగిపోయే పరిస్థితి ఉండదు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అభ్యర్థి జిల్లా నుంచి విడగొట్టిన కొత్త జిల్లా విస్తీర్ణం, జనాభా సంఖ్య, అందులో ఎస్సీ ఎస్టీల జనాభా శాతాలు, ఆ జిల్లాలో పంటలు దిగుబడులు.. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ధైర్యంగా బోర్డు వైపు చూడండి. నవ్వుతూ ‘తెలియదు’ అని చెప్పండి. మార్కులకేమీ ఢోకా ఉండదు.


ప్రవర్తన పరంగా..

ఒక విధంగా అభ్యర్థి ఇంటర్వ్యూ మార్కులను నిర్ణయించేది అభ్యర్థి ప్రవర్తనే! ప్రవర్తన అంటే పరిసరాల పట్ల ప్రతిస్పందన. ఇక్కడ బోర్డు రూమ్‌ పరిసరం. బోర్డు రూమ్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి అక్కడి నుంచి బయటకు వచ్చేంతవరకు వివిధ సందర్భాల్లో అభ్యర్థి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు? అనేది బోర్ఢు. అభ్యర్థికి ఎన్ని మార్కులు వేయాలో నిర్ణయిస్తుంది. అభ్యర్థి రూపురేఖలు, దుస్తుల అలంకరణ, ముఖకవళికలు, హావభావాలు, శరీర కదలికలు, మాటల ధ్వని తీవ్రత, భావ వ్యక్తీకరణ మొదలైనవన్నీ ప్రవర్తన రూపంలో బయటపడతాయి. అందువల్ల అభ్యర్థులు అనుభవజ్ఞుల వద్ద మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించుకుని ప్రవర్తన సంబంధిత విషయాలపై సరైన అంచనాకు రావాలి. లోపాలను సరిదిద్దుకుని ప్రయత్నం దృఢంగా చేయాలి. ప్రవర్తనా సంబంధిత విషయాల్లో చిన్న తేడా కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది.


మూర్తిమత్వ అంశాలు

వ్యక్తులకు ఉండే విలువలను బట్టే వారి స్వభావం ఏర్పడుతుంది. విలువలను అంచనా వేసినప్పుడే ఆ అభ్యర్థి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాలకు సరిపోతారో లేదో నిర్ణయిస్తారు. అభ్యర్థి సమాధానాల్లో అంకితభావం, నిబద్ధత, చేస్తున్న పని పట్ల ఆశావహ ధోరణి గమనిస్తారు. విధేయత, చిత్తశుద్ధి, స్వయం నియంత్రణ, శాంతికాముకత, దృఢ సంకల్పం, సహకారం, సహనశీలత మొదలైన లక్షణాలను బట్టి అభ్యర్థి ఉద్యోగానికి అర్హులో కాదో పరిశీలిస్తారు. అందువల్ల అభ్యర్థులు తమ సమాధానాల్లో ఆయా లక్షణాలు ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఉద్యోగ సంబంధిత విషయాలు

ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఉన్న ఉద్యోగాలు, వాటి విధులు, పరిపాలనలో స్థాయి మొదలైన సమాచారం తెలుసుకుని ఉండాలి. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన జీతభత్యాలు, పదోన్నతులపై అవగాహన కూడా ఉండాలి. ముఖ్యంగా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఉద్యోగాల ప్రాధాన్య క్రమంపై స్పష్టత అవసరం. ఇలాంటి అంశాలపై తడబాటు లేకుండా బోర్డుకు చెప్పగలగాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు