ప్రిలిమ్స్‌ నేర్పే పాఠాలు

అనూహ్యంగా, ఆశ్చర్యపరిచేలా ప్రశ్నపత్రం ఇవ్వటం యూపీఎస్‌సీకి కొత్తేమీ కాదు. సివిల్స్‌ ప్రిలిమినరీలో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరే ఉంది. కానీ ఎంచుకోవలసిన సమాధానాలను విభిన్నంగా ఇచ్చారు.

Published : 07 Jun 2022 01:09 IST

సివిల్స్‌-2022 విశ్లేషణ

అనూహ్యంగా, ఆశ్చర్యపరిచేలా ప్రశ్నపత్రం ఇవ్వటం యూపీఎస్‌సీకి కొత్తేమీ కాదు. సివిల్స్‌ ప్రిలిమినరీలో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరే ఉంది. కానీ ఎంచుకోవలసిన సమాధానాలను విభిన్నంగా ఇచ్చారు. ఈ ఆకస్మిక మార్పు అభ్యర్థులను విస్మయ పరిచింది! దీన్నుంచి ఏ పాఠాలు నేర్చుకోవాలి?  

1) ప్రిలిమినరీ పరీక్ష అనేది మొత్తం సివిల్స్‌ నియామక ప్రక్రియలోనే ఎంతో తేలిక.

2) ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉండే ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో నాలుగు ఆప్షన్లూ అక్కడే ఉంటాయి కాబట్టి సబ్జెక్టు పరిజ్ఞానం లేకపోయినా, సరైన జవాబును సులువుగానే ఊహించవచ్చు.

3) ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో సిద్ధమైతే.. అవసరమైనదానికంటే కూడా ఎక్కువే చదివినట్టు.

4) మెయిన్స్‌పై దృష్టిపెట్టటం మేలు. ప్రిలిమ్స్‌ అంత ముఖ్యమేమీ కాదు.

ఎ) 1 బి) 1,2 సి) 1,2,3 డి) వీటిలో ఏదీ కాదు

ఆదివారం జరిగిన సివిల్స్‌ ప్రిలిమినరీ రాసిన ఏ అభ్యర్థులైనా ‘డి’నే సరైనదిగా గుర్తిస్తారు.

‘‘పేరున్న ఇన్‌స్టిట్యూట్ల నుంచి స్టడీ మెటీరియల్‌ సేకరించాను. వాటి నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. ప్రసిద్ధ మెంటర్ల యూట్యూబ్‌ వీడియోలూ చూశా. ఉపయోగం లేకపోయింది’’.

‘‘చాలా టెస్ట్‌ సిరీస్‌లు రాశాను. వాటిలో నుంచి ఏదీ రాలేదు’’

ఇలాంటి స్పందనలే అభ్యర్థుల నుంచి వస్తున్నాయి.  

సివిల్స్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో చాలా కఠినంగా ఇచ్చిన పరీక్ష ఈ ఏడాది ప్రిలిమ్స్‌. నాలుగు, ఐదు సార్లుగా రాస్తున్న అభ్యర్థుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని టాపిక్స్‌ నుంచీ ప్రశ్నలు వచ్చాయి. వాటి కఠినత్వం ఎలా ఉందంటే.. అభ్యర్థులు  ‘‘ఈ సమాధానం కచ్చితంగా సరైనది’’ అని చెప్పగలిగే పరిస్థితి కనిపించలేదు.


ఇప్పుడేం చేయాలి?

ప్రిలిమ్స్‌ ఫలితాలు జూన్‌ 24న వెలువడవచ్చు. సుమారు 13250 మందికి మెయిన్స్‌ రాసే అవకాశం దక్కుతుంది.

* ప్రిలిమ్స్‌ బాగా రాసినవాళ్లు ఫలితాలు వచ్చే వరకు సమయాన్ని వృథా చేయకుండా సన్నద్ధత ప్రారంభించాలి. మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ విరామం తీసుకోవద్దు. ఫలితాలు వెలువడేసరికి ఆప్షనల్‌, ఎథిక్స్‌ పూర్తిచేసుకోవాలి.

* ఒకవేళ మీరు ప్రిలిమినరీ బాగా రాయలేకపోతే దిగులు చెందవద్దు. ఎక్కువమంది విషయంలో తొలి ప్రయత్నంలో ఇలాగే జరుగుతోంది. నిరాశ చెందకుండా సన్నద్ధత కొనసాగించండి. అర్హత ఉన్న ఇతర పరీక్షలనూ రాయండి. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పరీక్షలతో మంచి అనుభవాన్ని పొందవచ్చు. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌ 1కు దరఖాస్తు చేసుకున్నవారు దానిపైనే దృష్టి సారించాలి.

* మీరు చేసిన తప్పులు తెలుసుకుని కారణాలు విశ్లేషించుకోవాలి. పరిజ్ఞానం లేకపోవడం, అతివిశ్వాసం, పరీక్ష హాల్‌లో పొరబడటం- వీటిలో తప్పులకు ఏవి కారణాలో తెలుసుకుని, పునరావృతం కాకుండా చూసుకోవాలి.


గమనించదగ్గ అంశాలు ఇవీ

* సైన్స్‌ ఖీ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు
చాలాకాలం తర్వాత బేసిక్స్‌ సైన్స్‌ నుంచి ప్రశ్నలు వచ్చాయి. వీటిలో వర్తమాన అంశాల నుంచి ప్రశ్నలను జోడించారు. ఇవి కూడా కఠినంగా ఉన్నాయి. లోతైన పరిజ్ఞానం ఉంటే తప్ప జవాబు గుర్తించలేనట్టుగా వచ్చాయి.

* పెరిగిన.. మల్టిపుల్‌ ఆన్సర్స్‌ ప్రశ్నలు

పేపర్‌-1లో రెండు రకాల ప్రశ్నలున్నాయి. మొదటివి డైరెక్ట్‌ ఆన్సర్‌ ఉండేవి. వీటిలో మనకు జవాబు తెలియటం కానీ, తెలియకపోవటం కానీ ఉంటుంది. ఒక్కోసారి సంబంధిత పరిజ్ఞానం బట్టి తెలివిగా జవాబును ఊహించవచ్చు. ఇక రెండో రకం- మల్టిపుల్‌ ఆన్సర్స్‌ ఉన్న ప్రశ్నలు.ఇక్కడ ఊహించటం అవసరమవుతుంది. ఎందుకంటే... అన్ని జవాబులూ ఎవరికీ తెలియవు. చాలా సందర్భాల్లో ఊహించిన సమాధానాలు తప్పయిపోయి పెనాల్టీ మార్కులు పడతాయి. ఈ నెగిటివ్‌ మార్కులు నెగ్గటాన్నీ, నెగ్గకపోవటాన్నీ నిర్ణయించగలిగేవిగానూ ఉండొచ్చు. ఈ ఏడాది డైరెక్ట్‌ చాయిస్‌లున్నవి అతి తక్కువ వచ్చాయి. 95 శాతానికి పైగా మల్టిపుల్‌ చాయిస్‌లున్నవే. ఇది గత ఏడాది కంటే ఎక్కువ.  

* పేపర్‌ నిడివి ఎక్కువగా ఉంది. మల్టిపుల్‌ ఆన్సర్స్‌ ప్రశ్నలు ఎక్కువుండటం వల్ల ఇది సహజమే. ప్రతి ప్రశ్నా చదవటం ఎక్కువ సమయం తీసుకుంది.

* పేపర్‌-2 (సీశాట్‌)లో న్యూమరసీ నుంచి కష్టమైన ప్రశ్నలు వచ్చాయి.

* ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ సులువుగా ఉంది.


కటాఫ్‌కి కాస్త అటుఇటుగా ఉన్నాను. ఫలితాల తర్వాతే ప్రధాన పరీక్షకు సన్నద్ధం కావాలా?

కటాఫ్‌ మార్కులు పూర్తి కచ్చితత్వంతో చెప్పడం సాధ్యంకాదు. అదికూడా పరీక్ష జరిగి ఒక్క రోజే అయింది. ఇప్పుడు ఊహిస్తోన్న కటాఫ్‌ అనుభవంతో చెబుతోన్న అంచనా మాత్రమే. మీరు కటాఫ్‌కి దగ్గరలో ఉన్నారు కాబట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా సన్నద్ధతను కొనసాగించండి.


ప్రిలిమ్స్‌ నిమిత్తం జనరల్‌ స్టడీస్‌ గత మూడు నెలల నుంచి చదువుతున్నాను. ఇప్పుడు సన్నద్ధత మళ్లీ జీఎస్‌ నుంచి కొనసాగించాలా లేదా ఆప్షనల్‌ సబ్జెక్టు చదవాలా?

ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడినంతవరకు మీరు ఆప్షనల్‌, ఎథిక్స్‌ పేపర్‌పై దృష్టి సారించండి. మళ్లీ జీఎస్‌ సన్నద్ధం కావడం కొంచెం బోర్‌గానూ అనిపిస్తుంది. ఫిబ్రవరి నుంచి ఆప్షనల్‌ వదిలేశారు కాబట్టి ఇప్పుడు దాన్నే కొనసాగించడం ఉత్తమం.


వచ్చే సంవత్సరం పేపర్‌ ఇలానే ఉంటుందని భావించవచ్చా?

లేదు. వచ్చే సంవత్సరాల్లో పేపర్‌ ఇప్పటిలా ఉండదు. సివిల్స్‌ ప్రశ్నపత్రం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. పరీక్షలకు సంబంధించి వివిధ కమిటీలు చేసిన సూచనలు యూపీఎస్‌సీ అనుసరిస్తుంది. శిక్షణ సంస్థల అంచనాలకు భిన్నంగా ఏటా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఈ కసరత్తులో ఎంత మంది పరీక్షను రాయవచ్చు అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.


ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో సమయం వృథా. యూట్యూబ్‌ వీడియోలు చూసుకుంటే సరిపోయేదని మా స్నేహితులు అంటున్నారు. నిజమేనా?

సన్నద్ధతలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కీలకం. ప్రాథమిక అవగాహనకు అవి ఎంతో ముఖ్యం. కోర్‌ విభాగాలు అర్థమైతేనే వర్తమానాంశాలను ఆకళింపు చేసుకోవడం వీలవుతుంది. యూట్యూబ్‌ వీడియోలతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు.


శిక్షణ తప్పనిసరా? కొందరేమో మంచిదనీ, కొందరు ఉపయోగం లేదనీ అంటున్నారు.

శిక్షణ పూర్తిగా వ్యక్తిగత అంశం. పోటీ పరీక్షలకు తీసుకునే శిక్షణతో ప్రాథమికాంశాలపై అవగాహన పొందవచ్చు. అకడమిక్స్‌, పోటీ పరీక్షలకు మధ్య వారధిలా శిక్షణ నిలుస్తుంది. అయితే విజయం మాత్రం వ్యక్తిగత కృషిపైనే ఆధారపడి ఉంటుంది.


మాదిరి ప్రశ్నల సాధన ఉపయోగమేనా?

మాదిరి ప్రశ్నలకు సమాధానాలు రాయడం మంచిదే. అయితే వాటిలో ఒక్కటీ పరీక్షలో అడగకపోవచ్చు. కానీ సమయపాలన, పరీక్ష నైపుణ్యాలు.. మాదిరి ప్రశ్నల సాధనతో మెరుగవుతాయి.


పరీక్ష బాగా రాయలేదు. ఒక ప్రయత్నం వృథా అయినట్లేనా?

మీరు సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి పరీక్షను ఎదుర్కొంటే ఒక ప్రయత్నం వృథా అయింది అనుకోవడం తప్పే అవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఈత నేర్చుకోవడం లాంటిదే. కొలనులోకి దిగకుండా ఈతను ఎప్పటికీ నేర్చుకోలేం. అందువల్ల చిత్తశుద్ధితో ప్రయత్నించడం ముఖ్యం. దీంతో తర్వాతి పరీక్షలో విజయానికి అవకాశం ఉంటుంది.


నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?

ప్రిలిమ్స్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. అభ్యర్థులందరికీ కఠినమైన అడ్డంకి ఇదే. చాలా మంది తాజా పట్టభద్రులు ప్రిలిమ్స్‌లో సునాయాసంగా గట్టెక్కవచ్చు అనుకుంటారు. అదే వాళ్లు చేసే పెద్ద తప్పు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని