టీచర్లవుదాం పదండి!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ తరఫున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది. దీని ద్వారా ఏదైనా యూనివర్సిటీ/ ఎయిడెడ్‌/ ప్రభుత్వ/ ప్రైవేటు కళాశాలలో రెండేళ్ల బీఎడ్‌, స్పెషల్‌ బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు....

Updated : 24 Nov 2022 15:13 IST

బీఎడ్‌ ప్రవేశాలకు ఎడ్‌సెట్‌

గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే ఆశయం ఉన్నవారి కోసం ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్లు ఆహ్వానం పలుకుతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 2022 - 2024 విద్యా సంవత్సరానికి బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి.  బీఎడ్‌ అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా రాణించవచ్చు. ఏపీ/టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష విధానం, సన్నద్ధత, మెరుగైన ర్యాంకుకు మెలకువలు తెలుసుకుందాం...


ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ తరఫున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది. దీని ద్వారా ఏదైనా యూనివర్సిటీ/ ఎయిడెడ్‌/ ప్రభుత్వ/ ప్రైవేటు కళాశాలలో రెండేళ్ల బీఎడ్‌, స్పెషల్‌ బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.


అర్హత: ఏదైనా డిగ్రీ. కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
వయసు: 19 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్ఠ పరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు: రూ.650/-, బీసీలకు రూ.500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.450/-
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 7
ఆలస్య రుసుం రూ.1000తో: జూన్‌ 15
ఆలస్య రుసుం రూ.2000తో: జూన్‌ 22
పరీక్ష తేదీ: జులై 13
సమయం: ఉదయం 9 గం. - 11 గం

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in/EDCET


ఇంగ్లిష్‌ మెథడాలజీకి తప్పించి మిగతా అన్నింటికీ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. ఉర్దూ మీడియంలో పరీక్ష రాయాలి అనుకునే వారు కర్నూలును పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవాలి.

పరీక్షలో అర్హతకు కనీసం 37 మార్కులు  పొందాలి. వీరికే ర్యాంకులు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఫిజికల్‌ సైన్సెస్‌, గణితం మెథడాలజీలు ఎంచుకున్న మహిళలకూ ఈ నిబంధన వర్తించదు.

‘ఏపీఎస్‌సీహెచ్‌ఈ మైసెట్‌’ మొబైల్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో దొరుకుతుంది. దీని ద్వారా ఎడ్‌సెట్‌తోపాటు ఇతర అన్ని రాష్ట్ర సంబంధిత ప్రవేశపరీక్షల గురించి పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.

పరీక్ష విధానం..

150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో పేపర్‌ ఉంటుంది. 2 గంటల్లో జవాబులు రాయాలి. ప్రశ్నపత్రాన్ని 3 భాగాలుగా విభజించారు.
పార్ట్‌ ఏ: జనరల్‌ ఇంగ్లిష్‌ (25 ప్రశ్నలు)
పార్ట్‌ బి: జనరల్‌ నాలెడ్జ్‌ (15 ప్రశ్నలు) టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ (10 ప్రశ్నలు)
పార్ట్‌ సి: మెథడాలజీ (ఇచ్చిన సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని అభ్యర్థి ఎంచుకోవాలి. అందులోంచి 100 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులు)

గణితం - 100 ప్రశ్నలు
ఫిజికల్‌ సైన్సెస్‌ - భౌతిక శాస్త్రం (50), రసాయన శాస్త్రం (50)
బయోలాజికల్‌ సైన్సెస్‌ - వృక్షశాస్త్రం (50), జంతుశాస్త్రం (50)
సోషల్‌ స్టడీస్‌ - భూగోళశాస్త్రం (35), చరిత్ర (30), పౌరశాస్త్రం (15), అర్థశాస్త్రం (20) 8 ఇంగ్లిష్‌ - 100 ప్రశ్నలు

ఎలా చదవాలి..

పార్ట్‌ ఏ జనరల్‌ ఇంగ్లిష్‌లో ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించడానికి పాసేజ్‌లు చదవడం అలవాటు చేసుకోవాలి. ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, స్పెలింగ్‌లు చదువుకోవాల్సి ఉంటుంది. వాక్యాల్లో తప్పులను గుర్తించడం, టెన్స్‌లు ఉపయోగించడం నేర్చుకోవాలి. వీలైనన్ని కొత్త పదాలు నేర్చుకుని ఒకాబ్యులరీ వృద్ధి చేసుకోవడంలో భాగంగా పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలను తెలుసుకోవాలి. ఒక వాక్యాన్ని ఇస్తే దాన్ని సింపుల్‌, కాంపౌండ్‌, కాంప్లెక్స్‌ రూపాల్లోకి మార్చడం, డైరెక్ట్‌ - ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌ల్లోకి రాయడం వంటివన్నీ సాధన చేస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.

పార్ట్‌ బి జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి స్టాటిక్‌ జీకేతోపాటు కరెంట్‌ అఫైర్స్‌ కూడా చదవాలి. కోచింగ్‌ సెంటర్ల మెటీరియల్‌ అధ్యయనం చేయడంతోపాటు బిట్లు సాధన చేయడం వల్ల తేలిగ్గా సమాధానాలు ఇవ్వగలుగుతాం. దేశ సరిహద్దులు, నదులు, పర్వతాలు, రైల్వే లైన్లు, సీజన్ల వారీ పంటలు, భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రణాళికలు, జాతీయాదాయం అంశాలతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చదువుకోవాలి. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో పిల్లలతో ప్రవర్తించాల్సిన తీరు, కేస్‌ స్టడీస్‌ ఆధారిత ప్రశ్నలు వస్తాయి.

అభ్యర్థి మెథడాలజీ ఎలా ప్రిపేర్‌ అయ్యారనే అంశం మీదే ర్యాంకు ఆధారపడి ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్టులో డిగ్రీ స్థాయి సిలబస్‌ను పూర్తిగా చదువుకోవాలి. 8, 9, 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ పాఠ్య పుస్తకాలు చదువుకున్న తీరును బట్టి జవాబులు ఇవ్వగలుగుతాం. ఇవన్నీ ఇప్పటికే చదివిన అంశాలే కావడం వల్ల... ఒకసారి పునశ్చరణ చేస్తే సరిపోతుంది. అయితే పాత, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం మాత్రం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల పరీక్షలో తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించవచ్చు.


తెలంగాణ

స్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ). దీని ద్వారా రెండేళ్ల బీఎడ్‌ కోర్సులో ప్రవేశాలు పొందొచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఈ పరీక్ష సిలబస్‌ డిగ్రీ స్థాయి వరకూ ఉండేది. కానీ ఇప్పుడు 10వ తరగతి స్థాయిలో అన్ని సబ్జెక్టులూ కలిపి ఇస్తున్నారు. ఇందులో అర్హత పొందాలంటే కనీసం 25 శాతం అంటే 38 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన లేదు.


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 50 శాతం మార్కులు తప్పనిసరి. చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.
వయసు: జులై 19, 2022 నాటికి కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్‌ 15
దరఖాస్తు ఫీజు: రూ.650 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.450)
ఆలస్య రుసుం రూ.250తో: జులై 1
ఆలస్య రుసుం రూ.500తో: జులై 15
పరీక్ష మీడియం: ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ
పరీక్ష సమయం: 2 గంటలు.
మొత్తం ప్రశ్నలు: 150
పరీక్ష తేదీలు: జులై 26, 27
పరీక్ష సమయం: ఉదయం 10-12 గం., మధ్యాహ్నం 3 గం.- 5 గం.


ఏయే అంశాలపై..

పేపర్‌లో మొత్తం 8 రకాల అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. లెక్కలు, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ - ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలపై అడుగుతున్నారు. మొత్తం 150 మార్కులను సబ్జెక్టుల వారీగా పైన పట్టికలో చూపిన విధంగా విభజించారు.

ఎలా చదవాలి..

ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సిలబస్‌ ఆరు నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. గణితం, సైన్స్‌, సోషల్‌ విభాగాల్లో ప్రశ్నలన్నీ వాటి నుంచే అడుగుతారు. అందువల్ల వాటికోసం ఎక్కువ సమయం కేటాయించాలి. బీఎడ్‌ ప్రవేశ పరీక్షలో  అన్ని సబ్జెక్టులూ ఇవ్వడమనే విధానాన్ని గత ఏడాదే ప్రవేశపెట్టారు. అందువల్ల ఒక్క ప్రశ్నపత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేసి, మెరుగైన మార్కులు పొందవచ్చు. కొందరు ఆల్‌ ఇన్‌ వన్‌ పుస్తకాలపై ఆధారపడతారు. వాటికంటే అకాడమీ పుస్తకాలే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఆలోచించి.. జవాబులు

జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్‌ తెలుసుకోవాలి. సిలబస్‌లో ఇచ్చిన అంశాలను ప్రశ్నలవారీగా ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో చదివి సమాధానాలు ఇచ్చే వాటి కంటే ఆలోచించి జవాబులిచ్చే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటికోసం మాదిరి ప్రశ్నలు చూడటం ఫలితాన్నిస్తుంది. కేస్‌ స్టడీస్‌ చూసి అధ్యయనం చేయాలి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో ప్రాథమిక అంశాలతోపాటు, కరెంట్‌ అఫైర్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పరీక్ష జులైలో ఉంది కాబట్టి... ఈ ఏడాది జనవరి నుంచి ప్రశ్నలు చదువుకోవాలి. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌కు సంబంధించి కొంతవరకూ మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో లభిస్తోంది. వాటితో సన్నద్ధం కావడం వల్ల ఉపయోగం ఉంటుంది.

 మొత్తం 60 ప్రశ్నలు మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులపై ఉంటాయి. పదో తరగతి వరకూ అందరూ అన్నీ చదువుకున్నవే అయినా ఇంటర్‌ తర్వాత అందరికీ ఏవో  ఒకట్రెండు సబ్జెక్టులపైనే గురి ఉంటుంది. అందువల్ల బాగా తెలిసిన విభాగాన్ని మొదట ప్రిపేర్‌ అవ్వడం వల్ల 20 నుంచి 30 ప్రశ్నలకు ధీమాగా జవాబులు ఇచ్చేయొచ్చు. మొత్తం అన్ని అంశాలు చదువుకున్నాక బిట్లు సాధన చేయడం తప్పనిసరి.

 టీఎస్‌ ఎడ్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు త్వరలో అందుబాటులోకి రానుంది. దాన్ని తప్పనిసరిగా రాయాలి. అందులో ఇచ్చిన ప్రశ్నల ఎంపిక, పేపర్‌ విధానం అసలైన ప్రశ్నపత్రంలో కూడా 50 నుంచి 60 శాతం వరకూ అదేవిధంగా ఉంటుందనేది నిపుణుల అంచనా. అందువల్ల దాన్ని కచ్చితంగా సాధన చేయాలి.

మరిన్ని వివరాలకు: https://edcet.tsche.ac.in


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు