Updated : 14 Jun 2022 11:34 IST

ఆలోచనా పరిధి పెంచే కోర్సు!

ఐఐటీ మద్రాస్‌ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌లో

సుడోకు పజిల్‌ పూరించడం దగ్గర నుంచి ప్రాజెక్టు పనులను ఇతరులకంటే మెరుగ్గా పూర్తిచేయాలన్నా తార్కికంగా, అనూహ్య కోణంలో ఆలోచించడం ఎంతో అవసరం. ఆ దృక్పథాన్ని ప్రాథమిక స్థాయిలో పెంచే ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును ఐఐటీ మద్రాస్‌ ప్రవేశపెట్టింది!

‘నీ ఆలోచనలన్నీ ఎప్పుడూ సమస్యల చుట్టూనే తిరిగి అక్కడే ఆగిపోతున్నాయి. ఆ పరిధిని దాటి కాస్త విస్తృతంగా ఆలోచించి చూడు. సమస్యలన్నింటికీ తప్పకుండా పరిష్కారం దొరుకుంది’ అని స్నేహితులు ఏదో ఒక సందర్భంలో చెప్పే ఉంటారు.

‘అప్పగించిన పనిని సంవత్సరాల తరబడి ఒకేలా చేసుకుంటూ పోవడమేనా? కాస్త విభిన్నంగా ఆలోచించలేవా? అసలు దాని కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయవా?’ అంటూ ఆఫీసుల్లో బాస్‌లు అసహనం చూపిన సందర్భా.లకూ కొదవుండదు.

స్నేహితులు ప్రేమతో సలహాలు ఇచ్చినా.. బాస్‌లు ఆగ్రహంతో చెప్పినా ... ఇవన్నీ ‘అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ థింకింగ్‌’ ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతుంటాయి. అంతేకాదు- పోటీ పరీక్షలను మీతోపాటుగా కొన్ని లక్షలమంది రాస్తుంటారు. వారందరికంటే మీరు రాసిన అంశాలు భిన్నంగా ఉండాలంటే మీ ధోరణి విభిన్నంగా ఉండాల్సిందే. అలా ఉండాలంటే ‘అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ థింకింగ్‌’ నైపుణ్యం మీకు తప్పనిసరిగా కావాల్సిందే. ఇంటర్వ్యూల్లో మీ ప్రత్యేకతను చాటుకోవాలన్నా, జీవితంలో త్వరగా స్థిరపడాలన్నా ఇలా ఆలోచించడం ఎంతో అవసరం. వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో ఎదుగుదలకు ఇది ఒక విధంగా నిచ్చెనలా ఉపయోగపడుతుంది. మరి ఇలా ఆలోచించగలగడం అందరికీ సాధ్యం కాదుగా.. అందుకే యువతను ఆ దిశగా ఆలోచించేలా ప్రోత్సహించడానికి ఐఐటీ మద్రాస్‌ ‘అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ థింకింగ్‌’ కోర్సుకు రూపకల్పన చేసింది.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) ‘అవుట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ థింకింగ్‌’ కోర్సును దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెడుతోంది. ఈ కోర్సు జులై 1న ప్రారంభమవుతుంది. సుమారు పది లక్షల మంది స్కూలు, కాలేజీ విద్యార్థులతోపాటు నిపుణులు, పరిశోధకులకు ఈ కోర్సును అందించాలనే ఉద్దేశంలో దీన్ని మొదలుపెట్టబోతున్నారు.

ఉచితంగా నేర్చుకోవచ్చు: ఈ ఆన్‌లైన్‌ కోర్సును దేశ, విదేశాల్లోని విద్యార్థులు, ఆసక్తి ఉన్న ఉద్యోగులకు ఉచితంగా అందజేస్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

ప్రత్యేకతలు ఎన్నో..: ఈ కోర్సులో భాగంగా సంప్రదాయ విధానానికి భిన్నంగా.. సమస్యా పరిష్కార నైపుణ్యాలను బోధిస్తారు. గణితాన్ని తార్కికంగా అవగాహన చేసుకుంటూ వివిధ కోణాల్లో సమస్యలను పరిష్కరించడాన్ని నేర్పిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తోంది. ఆ వేగాన్ని అందుకునే విధంగా విద్యార్థులను తయారుచేస్తారు.

బోధించేదెవరంటే..: ఆర్యభట్ట ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ ఫౌండర్‌- డైరెక్టర్‌, గణిత విద్యావేత్త సదగోపన్‌ రాజేష్‌ ఈ కోర్సును బోధిస్తారు. ఈయనకు గణిత బోధనలో 30 ఏళ్ల అపార అనుభవం ఉంది. పదేళ్ల పిల్లల నుంచి పెద్దల వరకు లెక్కలు బోధిస్తూ.. అవంటే సహజంగా ఉండే భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ ప్రోగ్రామ్‌లనూ నిర్వహిస్తారు.


ముఖ్యాంశాలు

* మూడు నెలల ఈ ఆన్‌లైన్‌ కోర్సులో చేరడానికి చివరి తేది: జూన్‌ 24.

* మొదటి బ్యాచ్‌ జులై 1న ప్రారంభమవుతుంది. తుది పరీక్షా సమయంలో నామమాత్రపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఫైనల్‌ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు.

* ఈ కోర్సు నాలుగు స్థాయుల్లో ఉంటుంది. సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను నాలుగు గ్రేడులుగా విభజిస్తారు. ఆసక్తి ఉన్న నిపుణులు, పరిశోధకులు కూడా చేరొచ్ఛు విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని పెంచడమే ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం.

* లింకు: www.pravartak.org.in/out-of-box-thinking.html


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని