విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ శాఖలో సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) నోటిఫికేషన్‌ ద్వారా 70 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థుల ఎంపిక 100 శాతం రాత పరీక్షపైనే ఆధారపడి ఉంటుంది.

Published : 16 Jun 2022 02:00 IST

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ శాఖలో సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) నోటిఫికేషన్‌ ద్వారా 70 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థుల ఎంపిక 100 శాతం రాత పరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పరీక్షలో మెరుగైన స్కోరు సాధించాలంటే ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!

హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) ఏపీఎన్‌ఈబీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా తెలంగాణలో విద్యుత్‌ పంపిణీ నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 15 జిల్లాల విద్యుత్‌ అవసరాలను ఇది సమకూరుస్తుంది.

ఏఈ ఉద్యోగానికి పే స్కేలు (రూ.64,299- రూ.99,435) ఉంటుంది. ఈ తరహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలను తెలుసుకుంటే అభ్యర్థులకు లక్ష్యసాధనకు అవసరమైన ప్రేరణ వస్తుంది. అవేమిటంటే..

* సొంత రాష్ట్రంలో సగర్వంగా జీవించవచ్చు.

* జీతభత్యాలు కూడా దాదాపుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే ఉంటాయి.

* బదిలీలు పరిమిత పరిధిలోనే ఉంటాయి.

* భాషా సమస్య ఉండదు.

పరీక్ష తేదీ: 17.07.2022  రాత పరీక్ష 100 మార్కులకు 100 బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.


పరీక్ష విధానం, సిలబస్‌

సెక్షన్‌-ఎ 80 ప్రశ్నలు: ఇది రెండు భాగాలు.

1) ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌: ఇందులో లీనియర్‌ ఆల్జీబ్రా, కాల్‌క్యులస్‌, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, కాంప్లెక్స్‌ వేరియబుల్స్‌, ప్రాబబిలిటీ అండ్‌ స్టాటిస్టిక్స్‌, న్యూమరికల్‌ మెథడ్స్‌, ట్రాన్స్‌ఫామ్‌ థియరీ ఉన్నాయి.

2) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: ఇది అభ్యర్థుల కోర్‌ సబ్జెక్టుకు సంబంధించింది. ఇందులో ఎలక్ట్రిక్‌ సర్క్యూ ట్స్‌, ఎలక్ట్రోమాగ్నెటిక్‌ ఫీల్డ్స్‌, సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ మెషీన్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్‌, ఎనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉన్నాయి.

సెక్షన్‌ బి: 20 ప్రశ్నలు. (ఎనలిటికల్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, తెలంగాణ కల్చర్‌ అండ్‌ మూవ్‌మెంట్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉంటాయి.

* రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులనే కమ్యూనిటీ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలో పిలుస్తారు.

* ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

* పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిట్‌ కార్డును అందుబాటులో ఉంచుతారు. పోస్టు ద్వారా పంపరు.

* పరీక్షలో బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను మాత్రమే వాడాలి.

* పరీక్ష కేంద్రంలోకి పరీక్ష మొదలయ్యే 60 నిమిషాల ముందుగా అనుమతిస్తారు. పరీక్ష మొదలైన తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

* పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలనూ అనుమతించరు.

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష:  ప్రశ్నపత్రంలోని 100 ప్రశ్నలను 120 నిమిషాల్లో రాయాలి. అంటే సగటున ఒక ప్రశ్నకు ఒక నిమిషంపైనే ఉంటుంది. కాబట్టి అన్ని ప్రశ్నలకూ జవాబులను రాబట్టడం సులువవుతుంది. కాల్‌క్యులేటర్‌కు అనుమతి లేనందువల్ల కఠినమైన న్యూమరికల్‌ ప్రశ్నలు ఉండకపోవచ్చు.

* గత ఎన్‌పీడీసీఎల్‌ పేపర్‌లతోపాటు పూర్వపు గేట్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లోని చిన్నచిన్న ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను చదవడం వల్ల ఈ పరీక్ష సాధన సులభమవుతుంది.


ఏ అంశాలు ముఖ్యమైనవి?

* ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌ సబ్జెక్ట్‌ అనేది ఎలక్ట్రికల్‌ విద్యార్థులకు ప్రాథమిక సబ్జెక్టుగా చెప్పవచ్చు. అభ్యర్థులు ఈ సబ్జెక్టును పూర్తిగా చదివి అవగతం చేసుకోవాలి. దీని ద్వారా మరికొన్ని సబ్జెక్టుల ప్రిపరేషన్‌ సులభమవుతుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఇందులో మార్కుల వెయిటేజీ కూడా ఎక్కువగానే ఉంది.

* ఎనలాగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టు దాదాపుగా ఎలక్ట్రిక్‌ సర్య్యూట్‌ సబ్జెక్టుకు దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌ తర్వాత ఎనలాగ్‌ సర్క్యూట్స్‌ చదవడం వల్ల సులభంగా అర్థమవుతుంది.

* సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ విషయానికొస్తే సాంప్లింగ్‌ థీరమ్‌, ఫోరియర్‌ ట్రాన్స్‌ఫామ్స్‌ అప్లికేషన్స్‌, లాప్లాస్‌ ట్రాన్స్‌ఫామ్స్‌ అండ్‌ జెడ్‌ ట్రాన్స్‌ఫామ్స్‌ పై దృష్టి సారించాలి. ఇందులో మిగిలిన అంశాలు సలభంగానే ఉంటాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ను త్వరగానే పూర్తిచేయొచ్చు.

* ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌, సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌- రెండు సబ్జెక్టుల్లో నిష్ణాతులైతే పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రిపేర్‌ అవడం సులభమవుతుంది.

* ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌ ప్రిపరేషన్‌లో చాలా అంశాలు ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌పై ఆధారపడి ఉంటాయి.

* పవర్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌లో కూడా ఎక్కువ వెయిటేజ్‌ ఉన్నందున ఈ రెండు సబ్జెక్టులపై దృష్టి సారించాలి.

* మ్యాథమెటిక్స్‌పై కూడా తగినంత శ్రద్ధ వహించాలి. ఇందులోనూ 10 మార్కుల వరకు ప్రశ్నలు అడుగుతున్నారు.


జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ

* గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, తెలంగాణ హిస్టరీ అండ్‌ కల్చర్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లలో ప్రతి దాని నుంచి నాలుగు ప్రశ్నలు అడిగారు.

* గణితశాస్త్రంలో సంఖ్యాశాస్త్రాన్ని సూచించే నిష్పత్తులు, శాతాలు, భాగస్వామ్యాలు, కాలం-పని, కాలం-దూరం లాంటి వాటి నుంచి సమస్యలను అడుగుతున్నారు.

* జాతీయ వర్తమాన అంశాల్లో జాతీయ పథకాలు, భారతదేశ విదేశీ సంబంధాలు, క్రీడలు, సదస్సులు, అవార్డుల మీద దృష్టిపెట్టాలి.

* అంతర్జాతీయ అంశాల నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థి ప్రధానమైన అంతర్జాతీయ సంఘటనలపై మాత్రమే దృష్టి పెట్టాలి.

* ఇంగ్లిష్‌ వ్యాకరణం, పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, జతపరచడం లాంటి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

* తెలంగాణ తొలిదశ, మలిదశ పోరాటాల గురించి, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి అవగాహన అవసరం.

* కంప్యూటర్‌ నాలెడ్జిలో కంప్యూటర్‌కు సంబంధించిన విడి భాగాలు, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, అంతర్జాలానికి సంబంధించిన ప్రాథమికాంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఎలా సన్నద్ధం కావాలి?

* అసిస్టెంట్‌ ఇంజినీర్‌- 2022 పరీక్ష సన్నద్ధతకు ఇప్పుడున్న వ్యవధిలో రోజూ కనీసం 9-10 గంటలు కేటాయించాలి. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.

* తొలిసారి సిద్ధమయ్యేటప్పుడు ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్య విషయాలను చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందు రోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం.

* ఈమధ్య జరిగిన టీఎస్‌ ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌, ఇతర డిస్కమ్‌ పరీక్ష పత్రాలను గమనిస్తే ప్రశ్నల నిడివి చిన్నగానూ, కాన్సెప్ట్‌పరంగానూ ఉన్నాయి.

* కాల్‌క్యులేటర్‌కు అనమతి లేనందున గేట్‌ తరహా కష్టమైన న్యూమరికల్‌ ప్రశ్నలు రాకపోవచ్చు. కాబట్టి కాన్సెప్ట్‌ను సరిగ్గా అర్థం చేసుకుని ప్రాథమిక స్థాయి ప్రశ్నలను బాగా సాధన చేయాలి.

* మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం. అందుబాటులో ఉన్న సమయంలో ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.

* పూర్వపు ప్రశ్న పత్రాలతో (ఎస్‌పీడీసీఎల్‌, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీˆడీసీఎల్‌) పాటు జె.బి.గుప్తా పుస్తకంలోని ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను సాధన చేయడం ఎంతో మంచిది.

* రెండు గంటల పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.

* ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్‌లను తప్పనిసరిగా సాధన చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని