స్థిరాస్థి రంగంలో.. స్థిరమైన కొలువులు

జనాభా ఎక్కువయ్యే కొద్దీ అవకాశాలు కూడా పెరిగే రంగాల్లో రియల్‌  ఎస్టేట్‌ ఒకటి. 2022 పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా ఇందులో దాదాపు 30 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందనీ... అలాగే 2025 చివరికి జాతీయాదాయంలో దీని వాటా 13 శాతానికి చేరుకుంటుందనీ అంచనా.

Updated : 21 Jun 2022 08:23 IST

జనాభా ఎక్కువయ్యే కొద్దీ అవకాశాలు కూడా పెరిగే రంగాల్లో రియల్‌  ఎస్టేట్‌ ఒకటి. 2022 పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా ఇందులో దాదాపు 30 లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందనీ... అలాగే 2025 చివరికి జాతీయాదాయంలో దీని వాటా 13 శాతానికి చేరుకుంటుందనీ అంచనా. అందువల్ల సాధారణ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడని, విభిన్నంగా వెళ్లాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ రంగం బాగుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా కోర్సులు సైతం ఉన్నాయి. కొత్తగా ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. రియల్‌ ఎస్టేఫట్‌లో ఎలాంటి ఉద్యోగాలున్నాయో, అవి అందిపుచ్చుకోవడానికి ఎలాంటి నైపుణ్యాలు కావాలో చూద్దామా!

ఏజెంట్లు

అభివృద్ధి చేసిన స్థిరాస్తులకు విపణిలో చక్కని ధర పలికేలా చూడటం, కొనుగోలుదారుల అవసరాలకు తగ్గ ప్రాపర్టీలను గుర్తించడం చేసే రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. పెద్దపెద్ద నగరాల్లో వేల కోట్ల టర్నోవర్‌ కంపెనీలు... ఇటువంటి నిపుణులకు ఎర్రతివాచీ పరుస్తున్నాయి. బీబీఏ, బీబీఏ - రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎంబీఏ - రియల్‌ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి పలు కోర్సులు చదవడం ద్వారా ఏజెంట్‌గా కెరియర్‌ను ప్రారంభించవచ్ఛు ప్రారంభదశలోనే టాప్‌ కంపెనీల్లో కొలువు సాధిస్తే ఆ వేగం అలాగే కొనసాగుతుంది.

అప్రైజర్‌

ఒక స్థిరాస్తిని చూపిస్తే దాని విలువను సరిగ్గా అంచనా వేసేవారే రియల్‌ ఎస్టేట్‌ అప్రైజర్‌. ఆ ఆస్తిని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం, ఆ సమాచారాన్ని క్రోడీకరించడం, దాన్ని బట్టి ఎటువంటి లోపాలూ లేకుండా సరైన విలువను అంచనా వేయడం అప్రైజర్‌ విధి. డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌ రియల్టీస్‌, ఫీనిక్స్‌ మిల్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియా బుల్స్‌, ఎన్‌బీసీసీ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. బీకాం డిగ్రీ ఉన్న వారు సైతం ఈ కొలువులకు పోటీ పడవచ్ఛు

కన్సల్టెంట్‌

పూర్తిగా కొనుగోలుదారుని కోణంలో ఆలోచించి పనిచేసే కొలువు ఇది. కస్టమర్‌ అవసరాలేంటో వివరంగా తెలుసుకుని, వీలైనంత తక్కువ ధరలో, ఇంతకంటే మంచి అవకాశం దొరకదని చెప్పే స్థాయిలో వెతికిపెట్టడం వీరి విధి. వీరికి, ఏజెంట్లకు మధ్య ఒక వ్యత్యాసం ఉంది. కన్సల్టెంట్లు సలహాలు మాత్రమే ఇస్తారు, లావాదేవీ జరిగేలా ఎటువంటి ఒత్తిడీ చేయరు. కొనుగోలుదారుడు నమ్మకంతో అప్పజెప్పే పని కావడం వల్ల అతడికి లాభం చేకూర్చేలా వ్యవహరించడం అవసరం. ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు చేయాల్సిన అవసరం లేకపోయినా, పనిచేస్తున్న చోట మొత్తం విపణిపై గట్టి పట్టుండటం ముఖ్యం. సివిల్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ చదివినవారు కూడా ఇందులో రాణించగలరు. ఏజెంట్లు, రియల్టర్లతో కలిసి పనిచేయడం ద్వారా క్లయింట్లకు మెరుగైన సేవలు అందించవచ్ఛు

లీజింగ్‌ ఏజెంట్‌

భవంతుల్లో అద్దెకుండేవారు, లీజు తీసుకునే వారిని గుర్తించడం కోసం ప్రాపర్టీ మేనేజర్లతో కలిసి పనిచేస్తారు వీరు. యజమాని ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని సరైన మార్కెట్‌ విలువ ఇచ్చే టెనెంట్స్‌ను గుర్తించాల్సి ఉంటుంది. లీజు ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు ఇతర వ్యవహారాలన్నీ చూసుకోవాలి. లీజు పునరుద్ధరణ సమయాల్లో న్యాయ సమస్యలు తలెత్తినప్పుడు వారి అనుభవంతో ఆ ఇబ్బందులను పరిష్కరించాల్సి ఉంటుంది.

మార్ట్‌గేజ్‌ నిపుణులు

ఇటీవలి కాలంలో స్థిరాస్తి వ్యాపారంలో వీరి ప్రాధాన్యం పెరిగింది. ఉన్నత స్థాయి సంస్థలు తమ కోసం మార్ట్‌గేజ్‌ నిపుణులను ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి. వీరు సంస్థ వ్యాపార లావాదేవీల్లో అవసరమైనచోట మార్ట్‌గేజ్‌ రుణాలు అందేలా బ్యాంకులతో సంప్రదింపులు చేస్తారు. ఉన్నవాటిలోకెల్లా ఉత్తమమైన రుణ సదుపాయం అందేలా చేయడం ముఖ్యం. లెండర్‌ అగ్రిమెంట్లు తీసుకోవడం, మార్ట్ట్‌గేజర్‌ శక్తిసామర్థ్యాలను అంచనా వేయడం, మొత్తం ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడం వంటి కర్తవ్యాలుంటాయి.

ప్రాపర్టీ మేనేజర్‌

సేల్స్‌ విభాగంలో అనుభవం ఉన్నవారికి ఇది బాగా నప్పుతుంది. ఒక ఆస్తిని భద్రంగా చూసుకునేందుకు అవసరమైన ఉద్యోగులను నియమించడం, దాని బాగోగులు పట్టించుకోవడం, యజమానులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇవ్వడం వంటివి వీరి విధులు. వీరికి రియల్‌ ఎస్టేట్‌ ఫర్మ్స్‌ లేదా ప్రైవేట్‌ ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది.

దిల్లీలో ఎన్‌ఐఆర్‌ఈఎం ఇన్‌స్టిట్యూట్‌ కార్పొరేట్‌ సంస్థల్లో ప్రవేశించాలని కోరుకునే వారికి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తోంది. ఇందులో ప్రాంగణ ఎంపిక సౌకర్యం కూడా ఉంది.

ముంబైలోని రెమీ - రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాల్యుయేషన్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ సిస్టం, మోడ్రన్‌ కన్‌స్ట్రక్షన్‌ మెథడ్స్‌, గ్రీన్‌ బిల్డింగ్స్‌ - రేటింగ్‌ సిస్టమ్స్‌ వంటి అనేక విధాలైన కోర్సులను చదువుకునే వీలు కల్పిస్తోందీ సంస్థ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని