Updated : 27 Jun 2022 03:08 IST

మారిన పరిస్థితుల్లో ఇదిగో వ్యూహం!

తెలంగాణలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌, ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది అక్టోబర్‌ 16కు వాయిదా పడింది. దీంతో కొత్త అభ్యర్థులకు కూడా తగిన సమయం చిక్కింది. జనవరి/ ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వార్తలు రావడంతో పకడ్బందీగా ఈ పరీక్షకు తయారయ్యేందుకు కావలసిన పూర్తి సమయం లభించినట్టే!

జులై నెలాఖరులో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో... అప్పటి పరిస్థితులను బట్టి ముందుగా ప్రిలిమ్స్‌కు అధిక సమయం కేటాయించాలనీ, ఒకటి రెండు మెయిన్స్‌ పేపర్లకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనీ గతంలో సూచించాం. మారిన పరిస్థితుల్లో అందుతున్న సమాచారం ప్రకారం- మెయిన్స్‌ పరీక్ష 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తే... ప్రిలిమ్స్‌ అనంతరం మూడున్నర నెలల సమయం మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తోంది. అంత స్వల్ప వ్యవధిలో ఆరు పేపర్లలో విస్తరించి ఉన్న విస్తృత సమాచారంపై పట్టు చిక్కించుకుని విజయం సాధించడం దాదాపు అసాధ్యం. అందువల్ల...

* కొత్తగా ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఆగస్టు నెలాఖరు వరకు కూడా మెయిన్స్‌కు అధిక సమయం కేటాయించాలి. కఠోర శ్రమతో సన్నద్ధం కావాలి. సెప్టెంబర్‌, అక్టోబర్లో లభించే సమయాన్ని ప్రిలిమినరీకి పూర్తిగా కేటాయించవచ్ఛు ఇప్పుడు కూడా కనీసం ఐదు లేదా ఆరు గంటలు ప్రిలిమినరీ ప్రిపరేషన్‌కు వినియోగించాలి.

* టాప్‌ ర్యాంకు లక్ష్యంగా కొనసాగుతున్న సీనియర్‌ అభ్యర్థులు సెప్టెంబర్‌ 15 వరకు పూర్తి సమయాన్ని మెయిన్స్‌ పరీక్ష సన్నద్ధతకు వినియోగించాలి.

* ప్రిలిమినరీ ప్రిపరేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్‌లకు 50 శాతం చొప్పున సమయం కేటాయించుకోవడం సముచితం.

* ప్రిలిమినరీ పరీక్షకు మాత్రమే ప్రిపేర్‌ అవ్వడం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితంగా హేతుబద్ధ నిర్ణయం కాదు!

సొంత నోట్సుకు సమయమిదే!

మార్కెట్లో లభించే ప్రాచుర్యంలో ఉన్న పుస్తకాలు లేదా ఏదో ఒక కోచింగ్‌ సంస్థ పుస్తకాలు చదువుతూ దానిలోని సమాచారాన్ని ప్రశ్నలకు అన్వయించుకుంటూ ప్రిపేరయ్యే అభ్యర్థుల సంఖ్య మెజారిటీ శాతం.

విజేతలయ్యే అభ్యర్థులు ఒక నోట్స్‌ను ప్రధానంగా చేసుకుంటూ వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ సొంతంగా నోట్సు తయారు చేసుకుంటారు. దాన్ని చదివి వివిధ విషయాలపై పట్టు సాధిస్తారు. అవగాహన పెంచుకుంటారు. వివిధ విషయాల్ని పదపరిమితికి లోబడి ఏ విధంగా వేగవంతంగా రాయాలో నైపుణ్యాన్ని సాధిస్తారు.

ఇన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు.. తమకు లభించిన ఈ సమయంలో సొంత నోట్సు తయారీకి సిద్ధం కావాలి. ఇది శ్రమతో కూడుకున్నదైనా అత్యధిక ఫలితాలు ఇస్తుందని గుర్తించి పరిశ్రమించాలి.

మెయిన్స్‌లోని ఆరు పేపర్లకు సంబంధించిన అనేక పాఠాలకు తెలుగులో సరైన సమాచారం లేదు. అందువల్ల ఆంగ్లంలో లభిస్తున్న సమాచారాన్ని అనువదించుకుని పట్టు పెంచుకునేందుకు ఇది అనువైన సమయం!

టెస్ట్‌ సిరీస్‌కు హాజరవ్వండి

చాప్టర్ల వారీగా ప్రిపేర్‌ అవుతూ టెస్ట్‌ సిరీస్‌ రాయటం వల్ల చదువుతున్న విధానంలోని లోపాలు అర్థమవ్వటమే కాదు, పోటీ తీవ్రతా అర్థమవుతుంది. ఆ పోటీలో ఎవరు ఎక్కడ ఉన్నారనే స్పష్టత వల్ల మరింతగా పోటీ పడేందుకు ప్రేరణ వస్తుంది. అందువల్ల శాస్త్రీయమైన పద్ధతిలో ఈ పరీక్షల నిర్వహణ లభ్యమవుతున్నపుడు వినియోగించుకోవాలి.

సమాధానాలు రాసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలు, పద నిబంధన, సమయ నిర్వహణ మొదలైనవాటిపై కూడా అభ్యర్థులకు పట్టు దొరుకుతుంది. లభిస్తున్న సమయాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకునే ప్రణాళిక అవసరం.

* యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమినరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మెయిన్స్‌ అర్హత పొందలేకపోయిన అభ్యర్థులు సందిగ్ధావస్థలో ఉన్నారు. ఇలాంటివారు గ్రూప్‌-1 పై దృష్టి నిలిపి పూర్తిస్థాయిలో శక్తుల్ని కేంద్రీకరించి తాత్కాలికంగా సివిల్స్‌కి విరామం ఇవ్వాలా వద్దా అనే సందేహం..! ప్రిలిమ్స్‌ వాయిదా పడినట్లుగానే మెయిన్స్‌ కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగకపోతే 2023లో జరిగే ప్రిపరేషన్‌కి అంతరాయం ఏర్పడుతుందనే భావన ముందుకు వెళ్ళనీయటం లేదు. ఇటువంటి అభ్యర్థులందరూ- ఇప్పటివరకు వారు చేసిన ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ల్లో వచ్చిన ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవటం మేలు. కొన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకూ అనుకూల ఫలితాలు లేనట్లయితే తెలంగాణ గ్రూప్‌-1 సర్వీస్‌పై దృష్టి నిలపడం మంచిది.

* మొదటిసారి సివిల్స్‌ ప్రిలిమినరీ ప్రయత్నం 2023లో చేద్దామనుకున్న అభ్యర్థులు ఇప్పుడు పూర్తిస్థాయిలో గ్రూప్‌-1 పరీక్షపై దృష్టి పెట్టి సిద్ధమవటమే సరైన నిర్ణయం. సివిల్స్‌ తొలి ప్రయత్నాన్ని 2024కి వాయిదా వేసుకోవటం మంచి నిర్ణయం అవుతుంది. గ్రూప్‌-1 ప్రిపరేషన్‌లో గడించిన జ్ఞానం సివిల్స్‌ ప్రిపరేషన్‌కి పునాదిగా ఉపయోగపడుతుంది.

మిగతా పరీక్షల సంగతి?

* తెలంగాణ గ్రూప్‌-4 నోటిఫికేషన్‌కు రంగం దాదాపుగా సిద్ధమైంది. 10 లక్షలకు పైగానే అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నందున ఈ నోటిఫికేషన్‌ మీద మాత్రమే ఆశలు పెట్టుకున్నవారు ప్రకటన వెలువడుతుందా, లేదా అనే మీమాంసలు వదిలి సన్నద్ధతను మొదలుపెట్టాలి. ఇప్పటికే ప్రిపరేషన్‌ ప్రారంభించి నిరుత్సాహానికి గురై పక్కన పెట్టిన అభ్యర్థులు తిరిగి చదవటం ప్రారంభించటం మేలు.

* గ్రూప్‌-2 నోటిఫికేషన్‌పై కూడా స్పష్టత లేక చాలామంది ఇంకా ప్రిపరేషన్‌ను మొదలులేదనే చెప్పాలి. కచ్చితంగా ఇప్పుడే వస్తుంది అని చెప్పలేము కానీ, ప్రభుత్వ ప్రణాళికలో ప్రకటన ఇచ్చే ఆలోచన స్పష్టంగా ఉన్నందున ఆ నోటిఫికేషన్‌ కోసమే ఎదురు చూస్తున్నవారు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మరింత ప్రేరణతో చదవటమే ముఖ్యం.

* టెట్‌లో ప్రతికూల ఫలితాలు పొందిన అభ్యర్థులు.. తమ తదుపరి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గ్రూప్‌ 2, 4లపై దృష్టి కేంద్రీకరించేందుకు ఇది అనువైన సమయం. మళ్లీ టెట్‌ రాసి, అర్హత పొంది డీఎస్‌సీ ఎదుర్కోవాలనే ఆలోచన ఇటువంటివారికి అనుకూలం కాదు. ‘టెట్‌లోనే అర్హత పొందలేకపోయాం, ఇంకా గ్రూప్స్‌లో ఏ విధంగా విజయం సాధిస్తాం?’ అనే నిరాశ భావన వీడండి. నాలుగు నెలల గట్టి ప్రయత్నంతో మంచి పోటీని ఇవ్వవచ్చు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని