స్వయంగా.. నేర్చుకుందాం!

పేదరికంతో పెద్దపెద్ద కళాశాలల్లో చదవలేని వారు... అంతగా సౌకర్యాలు అందుబాటులో లేనివారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘స్వయం’ పోర్టల్‌కు ఈ జులై 9వ తేదీతో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటివరకూ 12 లక్షల

Updated : 28 Jun 2022 01:16 IST

పేదరికంతో పెద్దపెద్ద కళాశాలల్లో చదవలేని వారు... అంతగా సౌకర్యాలు అందుబాటులో లేనివారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘స్వయం’ పోర్టల్‌కు ఈ జులై 9వ తేదీతో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఇప్పటివరకూ 12 లక్షల మందికిపైగా ఇందులో రకరకాలైన కోర్సులు చదివి ధ్రువపత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఇందులో ఉన్న కొత్తకొత్త కోర్సులు, వాటిని నేర్చుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దాం.

స్వయం పూర్తిరూపం ‘స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌’. ఇది భారత ‘మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌’ - ఎంఓసీసీ ప్లాట్‌ఫాం. నాణ్యమైన విద్యను దేశంలో అందరు విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో 2017లో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు. ఇందులో 9వ తరగతి నుంచి పీజీ వరకూ చదివే విద్యార్థులకు కావాల్సిన పాఠాలున్నాయి. వీటిని ఎవరైనా, ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. ఈ పాఠాలన్నీ దేశంలో అత్యుత్తమ ఉపాధ్యాయులు 1000 మందికిపైగా కలిసి తయారుచేసినవి.

* ఈ పోర్టల్‌ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పాఠాలు దొరకడం మాత్రమే కాదు... ఏ స్ట్రీమ్‌ వారైనా తమకు ఆసక్తి కలిగిన అంశం నేర్చుకునేందుకు దోహదం చేస్తుంది. కరోనా సంక్షోభం తర్వాత.. ఆన్‌లైన్‌ పాఠాలు విద్యార్థులు చదువుకునే తీరునే మార్చేసిన తరుణంలో... వేలకువేలు ఫీజుతో ప్రైవేటు సంస్థలు సొంతంగా నడుపుతున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కంపెనీల్లో చేరలేని పేద విద్యార్థులకు ఈ పోర్టల్‌ ఎంతో సహాయకారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.


పాఠాలు ఏవిధంగా..

ఇందులో పాఠాలు నాలుగు విభాగాలుగా ఉంటాయి. మొదటిది వీడియో. అధ్యాపకులు చెప్పాల్సిన పాఠాన్నంతా వీడియో తీసి ఉంచుతారు.
రెండోది డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకునేలా అందుబాటులో ఉంచిన స్టడీ మెటీరియల్‌. మూడోది విద్యార్థులు తాము ఎంతవరకూ నేర్చుకున్నామో తెలుసుకునేలా జరిగే పరీక్షలు. నాలుగోది సందేహాలు నివృత్తి చేసేందుకు అధ్యాపకులతో ముఖాముఖి. ఇందులో ఉన్న కోర్సులన్నీ ఉచితంగా చదువుకోవచ్చు. అయితే ధ్రువపత్రం కావాల్సినవారు మాత్రం పరీక్షలకు దరఖాస్తు చేసుకుని కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్‌ అర్హత ఉన్న విద్యార్థులకు మాత్రమే ధ్రువపత్రాలు పొందే వీలుంటుంది.  యూనివర్సిటీలు, కాలేజీలు ఈ కోర్సులకు వచ్చిన క్రెడిట్లను పరిగణనలోకి తీసుకుంటాయి.

* ఈ మొత్తం ప్రక్రియకు దేశంలో విద్యావ్యవస్థతో అనుసంధానమై ఉన్న తొమ్మిది సంస్థలు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో ఏఐసీటీఈ, ఎన్‌పీటీఈఎల్‌, యూజీసీ, సీఈసీ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్‌, ఇగ్నో, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐటీటీటీఆర్‌ వంటివి ఉన్నాయి.


ఏయే కోర్సులు...?

ఇందులో నాలుగు వారాల నుంచి 24 వారాల వ్యవధిలో నేర్చుకునేలా యాన్యువల్‌ రిఫ్రెషర్‌ ప్రోగ్రాం ఇన్‌ టీచింగ్‌ (ఆర్పిట్‌), ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హెల్త్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ ఆర్ట్స్‌, లా, మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌, మ్యాథ్స్‌, సైన్స్‌, టీచర్‌ ఎడ్యుకేషన్‌, స్కూల్‌ విభాగాల్లో దాదాపు 2,700 కోర్సులున్నాయి!


ఐఐటీల పాఠాలు..

* దేశంలో ఉన్న అన్ని ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎం నుంచి పాఠాలు నేర్చుకునేలా ఎన్‌పీటీఈఎల్‌ -లోకల్‌ చాప్టర్స్‌ కృషి చేస్తోంది. ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌, సైన్స్‌ సబ్జెక్టుల నుంచి సొంతంగా పాఠాలు నేర్చుకునేలా దీన్ని తయారుచేశారు. తాజాగా విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని చేరువ చేసేందుకు ప్రతికళాశాలలోనూ ‘స్వయం-ఎన్‌పీటీఈఎల్‌’ పాయింట్‌ను నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో కోర్సు పూర్తిచేయడం కూడా చాలా సులువు. వెబ్‌సైట్‌లోకి లాగ్‌ఇన్‌ అయ్యి... మనకు కావాల్సిన కోర్సును ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఎన్‌రోల్‌ చేసుకునేందుకు పేరు, విద్యార్హతల వంటి కోరిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి కోర్సు ప్రారంభమైన తేదీ నుంచి చదువుకుంటే సరి.

* 2017లో ఈ పోర్టల్‌ను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ 12 లక్షలకు మందిపైగా విద్యార్థులు దీన్ని ఉపయోగించుకున్నారు. ఆసక్తికరంగా... విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా కొత్త తరహా కోర్సులు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. సైబర్‌ సెక్యూరిటీ, యానిమేషన్‌, ఆక్సెలరేటర్‌ ఫిజిక్స్‌, న్యూట్రిషన్‌, ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, కార్పొరేట్‌ స్ట్రాటజీ, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, అడ్వర్టైజింగ్‌ అండ్‌ మీడియా, ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టెబిలిటీ అండ్‌ కంట్రోల్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇన్‌కంటాక్స్‌ లా అండ్‌ ప్రాక్టీస్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.. ఇలా ఎన్నో విధాలైన కోర్సులను సులువుగా నేర్చుకోవచ్చు.

పోర్టల్‌ వెబ్‌సైట్‌: https://swayam.gov.in


చదువులో రాణించేందుకు మీరు మిగతా వారికంటే తెలివైనవారు కాకపోయినా పర్లేదు..

కానీ కచ్చితంగా వారికంటే క్రమశిక్షణ కలిగిన వారై ఉండాలి.

- వారన్‌ బఫెట్‌


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని