TS Exams 2022: సరిచేసుకుని.. బరిలో నిలవండి!

ఏ పోటీ పరీక్షలోనైనా అతి తక్కువమంది మాత్రమే నెగ్గి ముందుకు వెళ్తుంటారు. మరి మిగతా అభ్యర్థులో! ప్రత్యేకంగా.. సివిల్స్‌ పరీక్షలో వడపోత పరీక్ష అయిన ప్రిలిమినరీలో తొలిసారే నెగ్గగలిగేవారు చాలా తక్కువమంది. ఇటీవల వెలువడిన ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇలాంటివారు నిరాశతో ఆగిపోకూడదు. వీరందరూ లక్ష్యసాధనలో ఎలా ముందడుగు వేయాలి? ఇతర అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?

Updated : 30 Jun 2022 04:34 IST

ప్రిలిమ్స్‌ నెగ్గనివారికి సేఫ్టీ నెట్‌.. గ్రూప్‌-1

ఏ పోటీ పరీక్షలోనైనా అతి తక్కువమంది మాత్రమే నెగ్గి ముందుకు వెళ్తుంటారు. మరి మిగతా అభ్యర్థులో! ప్రత్యేకంగా.. సివిల్స్‌ పరీక్షలో వడపోత పరీక్ష అయిన ప్రిలిమినరీలో తొలిసారే నెగ్గగలిగేవారు చాలా తక్కువమంది. ఇటీవల వెలువడిన ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇలాంటివారు నిరాశతో ఆగిపోకూడదు. వీరందరూ లక్ష్యసాధనలో ఎలా ముందడుగు వేయాలి? ఇతర అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి?

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరవుతోన్న అభ్యర్థుల సంఖ్య ఈమధ్య పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రాశారని అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 6 కేంద్రాల్లో 80,707 మంది హాజరయ్యారు. పరీక్షను నిర్వహించిన 17 రోజుల్లోనే ఫలితాలను (ఇప్పటివరకు ఇదే తక్కువ సమయం) వెల్లడించారు. జాతీయ స్థాయిలో 13,090 మంది అర్హత సాధిస్తే అందులో 600 మంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందినవారు ఉంటారని అంచనా.

ఈ పరీక్షలో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు సుమారు 4.80 లక్షల మంది ఉన్నారు. వీరంతా పరీక్ష రాయడానికి వచ్చే ఏడాది వరకూ ఎదురుచూడాల్సి ఉంటుంది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసి, పోటీ పరీక్షలు రాసిన అనుభవంలేని అభ్యర్థులకు ఈ ఫలితం నిరాశను కలిగిస్తుంది. అలాంటి అభ్యర్థులకు తలెత్తే వివిధ సందేహాల నివృత్తి, అవసరమైన కార్యాచరణల గురించి తెలుసుకుందాం.

స్కూల్లో, కాలేజీలో నేనే టాపర్‌ని. కానీ ఈ సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించలేకపోయాను. ఎక్కడ తప్పు జరిగింది?

జ: స్కూలు, కాలేజీలో టాపర్‌గా నిలవడం అనేది సాధారణ విషయం కాదు. ఆ విజయానికి మిమ్మల్ని తప్పకుండా అభినందించాల్సిందే. అయితే మీరు ఇక్కడో ప్రశ్న వేసుకోవాలి. మీ తరగతి/గ్రూప్‌/కాలేజీలోని ఎంతమందితో మీరు పోటీపడ్డారు? సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఎంతమందితో పోటీపడ్డారు? ఇప్పుడు మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది.

మరోసారి పరీక్ష రాయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ మళ్లీ పరీక్షలో ఫెయిలైతే ఏం చేయాలి?

జ: ‘లైఫ్‌’ అనే ఇంగ్లిష్‌ పదంలో నాలుగు అక్షరాలున్నాయి కదా. అందులో రెండు అక్షరాలు ఐఎఫ్‌.. అంటే ‘ఇఫ్‌’. జీవితంలో సగ భాగం అనిశ్చితితో ఉంటుంది. పరీక్షల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రమాదం అనేది ఎప్పుడూ ఉంటుంది. నౌకాశ్రయంలో ఉన్నంతసేపూ నౌక ఎప్పుడూ పదిలంగానే ఉంటుంది. కానీ నౌకలు తయారయింది సముద్రంలో ప్రయాణించడానికి గానీ నౌకాశ్రయంలో నిశ్చలంగా ఉండటానికి కాదు. మీరు మీ సన్నద్ధతను కొనసాగించండి. ఫెయిలైతే ఏమిటనే ప్రశ్నకు బదులు పాసైతే ఏమిటనేది ఆలోచించాలి!

రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు

ఈ ఏడాది గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల కావడం విద్యార్థులకు వరమనే చెప్పాలి. సివిల్స్‌లో అర్హత సాధించని విద్యార్థులకైతే ఇది మరింత ప్రయోజనకరం. ఉదాహరణకు సర్కస్‌లో సమాంతరంగా ఉండే రాడ్లపై తాళ్లతో విన్యాసాలు చేసే ట్రపీజ్‌ కళాకారుడినే తీసుకోండి. అతడికో రక్షక వల (సేఫ్టీ నెట్) ఏర్పాటుచేసి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోలేక ఎన్నోసార్లు వలలో పడిపోతుంటాడు. తిరిగి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచి చివరకు లక్ష్యాన్ని సాధిస్తాడు.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో ఈసారి మీరు నెగ్గివుండకపోతే మీరూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నట్టు! గ్రూప్‌-1ను సేఫ్టీ నెట్‌ అనుకోవాలి. దాని మీదే దృష్టిపెట్టి ప్రయత్నించండి. గ్రూప్‌-1కు మాత్రమే కాకుండా వచ్చే ఏడాది సివిల్స్‌కు కూడా సిద్ధం కావొచ్చు!  

గ్రూప్‌-1కు సిద్ధమయ్యే అవకాశం అన్ని రాష్ట్రాలవారికీ లేదు. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఈ ప్రకటన వెలువడింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వెలువడనుంది.


ఇలా ప్రయత్నించండి

కటాఫ్‌ మార్కులను ఎందుకు సాధించలేకపోయారు? కొన్ని విభాగాల్లో మీకు తగినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇలా జరిగిందా? పరీక్ష పత్రంలో అన్ని విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. మీరు ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో గుర్తించి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఆ విభాగం విసుగ్గా అనిపించి దాని మీద మీరు ఎక్కువ ఏకాగ్రతను నిలిపి ఉండకపోవచ్చు. (స్టాటిస్టిక్స్‌ ఎక్కువగా ఉండే ఎకనామిక్స్‌ విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతుంది). అలాంటి సబ్జెక్టుల మీద తగినంత ఏకాగ్రతను నిలపండి.

ఏయే అంశాల్లో బాగా బలహీనంగా ఉన్నారో గుర్తించాలి. బలమైన, బలహీనమైన అంశాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. మీరెక్కడ బలహీనంగా ఉన్నారో తెలుసుకోండి. ఆ అంశాలను చదవడం కాస్త కష్టంగా అనిపించినా అన్ని విధాలుగా ప్రయత్నించండి. అవసరమైతే ఆ అంశం మీద పట్టు సాధించినవారి సహాయం తీసుకుని నైపుణ్యం సంపాదించడానికి ప్రయత్నించండి.

వివిధ పోటీ పరీక్షల క్వశ్చన్‌ బ్యాంక్స్‌కు సమాధానాలు రాయటం మొదలుపెట్టండి. దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు జరుగుతుంటాయి. ప్రతినెలా కనీసం ఒక ప్రధాన పరీక్షయినా ఉంటుంది. ఈ ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్లు లేదా పోటీ పరీక్షల పత్రికల్లో అందుబాటులో ఉంటాయి. ఈ పేపర్లకు సమాధానాలు రాయడం మొదలుపెట్టండి. ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోండి. తప్పులను గుర్తించి సరిదిద్దుకోండి. ఇలా ప్రయత్నిస్తూ ఉంటే మీ అభివృద్ధి మీకే స్పష్టంగా తెలుస్తుంది.

అర్హత ఉన్న పోటీ పరీక్షలన్నింటినీ రాయండి. వివిధ పోటీ పరీక్షల సిలబస్‌ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. ఈ పరీక్షల్లో విజయం సాధించినట్లయితే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదాహరణకు పాప్‌కార్న్‌ మెషీన్‌ను ఎప్పుడైనా గమనించారా? కాసేపు గింజలు అలా తిరుగుతూనే ఉంటాయి. సహనంతో ఎదురుచూడాల్సి ఉంటుంది. ఒక విత్తనం పేలగానే తర్వాత మరోటి, ఆ తర్వాత ఇంకోటి.. ఇలా వరసగా పేలతాయి. పోటీ పరీక్షల్లో కూడా ఇలాగే జరుగుతుంది. మీరు ఒకదాంట్లో విజయం సాధించడంతోనే ఆగిపోదు. మరోదాంట్లోనూ గెలుపొందుతారు. ఇలా మెరుగుపరుచుకుంటూ మరుసటి ఏడాది పరీక్షకు సిద్ధం కావచ్చు.


ఇవి గుర్తుంచుకోండి

1. ఒక పరీక్షలో తప్పినంతమాత్రాన మీరు విఫలమైనట్టు కాదు. దాన్ని ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అలాచేస్తే మీ ఆత్మగౌరవమూ, ఆత్మవిశ్వాసమూ దెబ్బతింటాయి.

2. వైఫల్యానికి మీరే బాధ్యత వహించాలి. స్నేహితులు, తల్లిదండ్రులు సహకరించలేదని నిందించకూడదు. సరిగ్గా పరీక్షకు ముందే బంధువులు వచ్చారనో, బంధువుల పెళ్లి.. పరీక్షకు ముందు జరిగిందనో, కొవిడ్‌ కారణాన్ని చూపుతూనో నెపాన్ని ఇతరుల మీదకు నెట్టేయకూడదు. ఇవన్నీ పైపై కారణాలే అవుతాయి.

3. వైఫల్యాన్ని విశ్లేషించుకోవాలి. కోపం, చిరాకు, ఇతరుల మీదకు నెపాన్ని నెట్టివేయడం, బాధపడటం.. లాంటివి వదిలిపెట్టాలి. ఆలోచనలు ఎప్పుడూ అభివృద్ధి పథంలో సాగాలి.

4. కారణాలను లోతుగా తవ్వుకుంటూ కూర్చోకూడదు. ఇలా చేయడం వల్ల ఫలితం మారకపోగా పరిస్థితి మరింత క్లిష్టంగా తయారవుతుంది.  

5. ‘నేను ఫెయిల్‌ అయితే ఎదుటివాళ్లు నా గురించి ఏమనుకుంటారో...’ అని ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం సరి కాదు.

6. అసలు పరీక్షే రాయలేదనో లేదా పాస్‌ అయ్యాననో అబద్ధాలు చెప్పకూడదు. పరీక్ష ఫెయిల్‌ అయ్యారనే విషయాన్ని ధైర్యంగా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది.

7. ఎదుటి వ్యక్తి నిజమని నమ్మింది.. వాస్తవానికి నిజం కానక్కరలేదు. ఎదుటివారి అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదు.
8. కొత్త కోణంలో ఆలోచించడం మొదలుపెట్టండి. వైఫల్యాన్ని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనారోగ్యకర వైఖరిగా పరిగణించడం చాలామందికి అలవాటు. ఇలాంటి ప్రతికూల ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లడం నేర్చుకోవాలి.


‘నాకు వినడం అంటే ఇష్టం. జాగ్రత్తగా వినడం వల్ల గొప్ప విషయాలెన్నో నేర్చుకున్నాను. చాలామంది అసలు వినరు.’

- ఎర్నెస్ట్‌ హెమింగ్వే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు