పరిశ్రమకు తయారవుదాం...

చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో నిపుణులైన యువత అవసరం ఎప్పుడూ ఉంటుంది. అటువంటి వారిని తయారు చేసేందుకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ కృషి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ సీఐటీడీ

Updated : 07 Jul 2022 06:27 IST

చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్లో నిపుణులైన యువత అవసరం ఎప్పుడూ ఉంటుంది. అటువంటి వారిని తయారు చేసేందుకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ కృషి చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ సీఐటీడీ కేంద్రంగా నడిచిన ఈ సంస్థ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో చేరితే తక్కువ సమయంలోనే స్థిరపడవచ్చు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఎంఈ) పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సాంకేతిక విద్యాలయం. పదోతరగతి చదివిన విద్యార్థుల నుంచి డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ ఇలా ఏ విద్యార్హత ఉన్న వారికైనా సాంకేతిక అంశాలపై అవసరమైన శిక్షణ అందించి కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా ఇక్కడ తీర్చిదిద్దుతారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో రూ.200 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. సువిశాలమైన భవనాలు, బాలబాలికలకు వేరువేరుగా వసతిగృహాలు, ఆడిటోరియం, భోజనశాల, క్రీడా మైదానాలను సుందరంగా తీర్చిదిద్దారు.

అత్యాధునిక వసతులు

ఈ కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు. ప్రొజెక్టర్లతో కూడిన ఏసీ గదులు, 24 గంటలు అంతర్జాల సౌకర్యం కలిగిన కంప్యూటర్లతో ఏసీ గ్రంథాలయం, పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులను తయారుచేసే ప్రొడక్షన్‌ యూనిట్‌, 300 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా క్యాంటీన్‌ వంటి వసతులన్నీ ఉన్నాయి.

* కంపెనీల్లో ఎటువంటి యంత్రాలు వినియోగిస్తారో అటువంటి వాటితోనే విద్యార్థులకు నేర్పిస్తున్నారు. సీఎన్‌సీ మిల్లింగ్‌-3, డై-స్పాటింగ్‌ ప్రెస్‌, సీఎన్‌సీ లేత్‌, ఆడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ 3డీ ప్రింటింగ్‌/ఆర్‌పీటీ (మెటల్‌ అండ్‌ ప్లాస్టిక్‌), సర్ఫేస్‌ గ్రిల్లింగ్‌, హైడ్రాలిక్‌ ప్రెస్‌, రేడియల్‌ డ్రిల్లింగ్‌ మెషీన్‌, మెకట్రానిక్‌ ప్రెస్‌, సిలిండ్రికల్‌ గ్రైడింగ్‌, రేడియల్‌ డ్రిల్లింగ్‌ మెషీన్‌, ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ మెషీన్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి.

* నాణ్యతాప్రమాణాలతో నిర్మించిన ల్యాబ్స్‌ను అందుబాటులో ఉంచారు. ఏఆర్‌/వీఆర్‌, ఆటోమేషన్‌, కమ్యూనికేషన్‌, క్యాడ్‌/క్యామ్‌, మెట్రాలజీ, సైన్స్‌, హైడ్రోపెనోమెటిక్‌, రోబోటిక్‌ పరిశోధనశాలలను విద్యార్థుల శిక్షణ కోసం సిద్ధం చేశారు.

ఇతర సంస్థలతో ఒప్పందాలు

శిక్షణ పొందే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు కల్పించడంతోపాటు తరగతుల అనంతరం ఉద్యోగ కల్పన బాధ్యతను కూడా ఎంఎస్‌ఎంఈ తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్‌, బీఈఎల్‌, అల్ట్రాడైమన్షన్‌ కంపెనీ, విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, అచ్యుతాపురం సెజ్‌లోని వివిధ అంతర్జాతీయ పరిశ్రమలు, ఆంధ్రా యూనివర్సిటీ, బీహెచ్‌ఈఎల్‌తో ఎంఎస్‌ఎంఈ ఒప్పందాలు చేసుకొంది.

తమ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా వి-గార్డ్‌, బీసీహెచ్‌ ఎలక్ట్రిక్‌ లిమిటెడ్‌, టాటా, టర్బో టెక్నాలజీ, టయోటా కిర్లోస్కర్‌, జేడీఎస్‌టీ, సోమన్య, అపాన్‌ష్యూస్‌, మెక్స్‌, హుండాయ్‌, వీడియోకాన్‌, జిందాల్‌, లాంబా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, స్కోడా, ఏఎస్‌ఐ, టిమ్‌కెన్‌, టీవీఎస్‌, గోద్రెజ్‌, హోండా, తేజ్‌గ్రూప్‌, హనీవెల్‌, కమిన్స్‌ వంటి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.

* దేశంలో పేరొందిన విద్యాసంస్థలను ఈ శిక్షణలో భాగస్వాములుగా చేస్తుంది. లూథియానా కేంద్రంగా నడిచే సీటీటీ, భువనేశ్వర్‌లోని సీటీటీసీ, అహ్మదాబాద్‌లో సీఐటీడీ, వివిధ రాష్ట్రాల్లో ఐడీటీఆర్‌, పీపీడీసీ, టీఆర్‌టీసీ, సీటీటీసీ, ఐఎస్‌ఎల్‌టీ, ఐడీఈఎంఈ, ఎఫ్‌ఎఫ్‌డీసీ, ఎంఈఈఆర్‌యూటీ వంటి సాంకేతిక నైపుణ్య శిక్షణలో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం...

ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తారు. ఇతరులకు ఎంచుకున్న కోర్సునుబట్టి ఫీజు ఉంటుంది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అవకాశం ఉంది. వసతిగృహాల్లో నివాసం ఉండలేని విద్యార్థులకు విశాఖ నుంచి ప్రతిరోజూ మూడు ఆర్టీసీ బస్సులు ఈ కేంద్రానికి తిరిగేలా ఏర్పాట్లు చేశారు.- శివలంక సూర్యచంద్రరావు, అచ్యుతాపురం

దరఖాస్తుల ఆహ్వానం

ప్రస్తుతం ఈ కేంద్రంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్‌)లో ఫ్లాట్‌ నంబర్‌ 6, ఐసీ-పూడి అచ్యుతాపురం, విశాఖపట్నం ఏపీ-531011 చిరునామాలో గల ఎంఎస్‌ఎంఈ కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తులు చేయవచ్చు. 

ఫోన్‌ నంబర్‌ 9515397553, 08924282600

మరిన్ని వివరాలకు: info.tcmsmepudi@gmail.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని