కాలేజీలో చేరే ముందు...

ప్రస్తుతం కళాశాలల్లో చేరే సమయం. ఏ కోర్సు ఎంచుకున్నా, ఏ కాలేజీలో చేరాలన్నా... ఫీజు, ఇంటికి ఎంత దూరం లాంటివి ప్రధానంగా ఆలోచిస్తాం. అయితే ఒక కాలేజీని ఎంచుకోవడానికి ఇవి మాత్రమే

Published : 12 Jul 2022 01:04 IST

ప్రస్తుతం కళాశాలల్లో చేరే సమయం. ఏ కోర్సు ఎంచుకున్నా, ఏ కాలేజీలో చేరాలన్నా... ఫీజు, ఇంటికి ఎంత దూరం లాంటివి ప్రధానంగా ఆలోచిస్తాం. అయితే ఒక కాలేజీని ఎంచుకోవడానికి ఇవి మాత్రమే సరిపోవు. మూడునాలుగేళ్లపాటు అందులో చదువుకుని, అది పూర్తయ్యాక ఒక చేతిలో పట్టా, మరో చేతిలో నియామక పత్రంతో ఆనందంగా బయటకు రావాలి అనుకున్నప్పుడు మరికొన్ని విషయాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే మీకోసం ఈ చెక్‌లిస్ట్‌..

అధ్యాపకులు: ఒక కాలేజీ తరగతులు బాగా జరుగుతున్నాయా, విద్యార్థుల అభివృద్ధి ఎలా ఉంది అనేది అక్కడున్న అధ్యాపకులపైనే ఆధారపడి ఉంటుంది. నిపుణులైన, నిబద్ధతతో పనిచేసే బోధకులుంటేనే సరిగ్గా పాఠాలు చదువుకోగలుగుతాం. అందువల్ల అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి.

భవనాలు: రోజూ వెళ్లే చోటు కావడంతో సౌకర్యవంతమైన పరిసరాలు, భద్రమైన భవంతి ఉండటం అవసరం. నిబంధనల ప్రకారం ఒక కాలేజీలో ఎన్ని గ్రూపులు, సెక్షన్లు ఉంటే అన్ని తరగతి గదులు ఉండాలి. ఉదాహరణకు ఒక డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీకాం, బీఏ గ్రూపులు, ప్రతి దాంట్లోనూ మూడేసి చొప్పున సెక్షన్లు ఉన్నాయనుకుంటే మొత్తంగా 9 క్లాస్‌రూములు ఉండాలన్నమాట. అప్పుడే సౌకర్యంగా ఉంటుంది.

వసతిగృహాలు: ఇంటికి దూరంగా ఉండి చదువుకోవాల్సిన విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాల్సి వస్తుంది. అలాంటిప్పుడు తాము చేరుతున్న కాలేజీకి సొంతంగా హాస్టల్‌ ఉందా, ఉంటే అక్కడ కల్పిస్తున్న వసతులేంటి... ప్రైవేటు హాస్టల్‌లో చేరాల్సి వస్తే ఉండే మంచిచెడ్డలేంటి.. ఆహారం, రవాణా వంటి అంశాలన్నీ బేరీజు వేసుకోవాలి.

గ్రంథాలయం: ప్రతి కళాశాలకు తప్పనిసరిగా గ్రంథాలయం ఉండాలి. తరగతి పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర సాహిత్యం, పోటీపరీక్షలు, వార్తాపత్రికలు, మ్యాగజీన్లు వంటివన్నీ అందులో లభించాలి. ప్రశాంతంగా కూర్చుని చదువుకునేలా వాతావరణం ఉండాలి.

మైదానం: క్రీడలను ప్రోత్సహించేలా చక్కటి మైదానం అవసరం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక డిగ్రీ కాలేజీకి ఎకరం నుంచి రెండెకరాలు, ఇంటర్‌ కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలాన్ని మైదానం కోసం కేటాయించాలి. ఇది విద్యార్థుల శారీరక దృఢత్వానికీ, మానసిక వికాసానికీ తోడ్పడుతుంది.

పరిశోధనశాలలు: సైన్స్‌ గ్రూపుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇది కచ్చితంగా గమనించాల్సిన విషయం. ల్యాబ్స్‌ సరిగ్గా లేని చోట విద్యార్థులకు అనుభవపూర్వక జ్ఞానం పొందే అవకాశం ఉండదు. పూర్తి సామగ్రి, యంత్రాలు, రసాయనాలతో కూడిన ప్రయోగశాలలు ఉన్నాయో లేదో గమనించాలి. కొన్ని ప్రైవేటు కాలేజీలు దీన్ని నామమాత్రంగా నిర్వహిస్తుంటాయి. అందువల్ల తగిన పరిశీలన అవసరం.

సాఫ్ట్‌ స్కిల్స్‌: పాఠాలతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవడం ఈరోజుల్లో కీలకం. సరైన భాషానైపుణ్యాలు, సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉన్నవారు మాత్రమే చదువు పూర్తికాగానే పేరున్న సంస్థల్లో కొలువులు సాధించగలరు. సదరు కాలేజీలో ఈ సౌకర్యం ఉందో లేదో చూడాలి.

ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌: కళాశాలలో తరగతులతోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు ఎలాంటి ప్రాముఖ్యం ఇస్తున్నారో చూడాలి. కళలు, సాహిత్యం, సంగీతం, క్రీడలు, సేవా కార్యక్రమాల వంటివి విద్యార్థి జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆ అనుభవం, ఆ ప్రక్రియలో ఏర్పడిన పరిచయాలు జీవితాంతం ఉండిపోతాయి.

బ్రాండ్‌ ఇమేజ్‌: మనం చదివిన డిగ్రీతోపాటు ఏ కళాశాలలో చదివాం అనేది కూడా ఉద్యోగాన్వేషణలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. కళాశాలకు ఉన్న పేరు ప్రఖ్యాతులను లెక్కలోకి తీసుకోవాలి.

క్రమశిక్షణ: క్యాంపస్‌లలో క్రమశిక్షణ చర్యలు ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యం. ప్రధానంగా అక్కడే ఉండి చదువుకునే వారికి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుపై ఫోకస్‌ చేయాల్సి వచ్చినప్పుడు చక్కని వాతావరణం, ఆరోగ్యకరమైన పరిసరాలు తప్పనిసరి. క్యాంపస్‌లో విద్యార్థుల ప్రవర్తనను ఎలా పరిశీలిస్తున్నారు, క్రమశిక్షణను ప్రోత్సహిస్తున్నారా లేదా అన్నది చూడాలి.

స్కాలర్‌షిప్స్‌: ఇప్పుడు విద్యార్థులకు ఉపకార వేతనాలతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం అందుతోంది. అయితే ఎంచుకోబోయే కళాశాలలో వీటిని ఎలా అమలు చేస్తున్నారు, ఏవైనా ప్రాక్టికల్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అనేది ముందే మాట్లాడి   తెలుసుకోవాలి. 

ఉత్తీర్ణత శాతం/ప్రాంగణ ఎంపికలు: ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. గత కొన్నేళ్లలో ఆ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు చదివారు, వారికి  మార్కులు ఎలా వచ్చాయి, ప్రాంగణ ఎంపికల కోసం వచ్చిన సంస్థలు ఏమిటి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అత్యధిక ప్యాకేజీ ఎంత... ఇటువంటి మొత్తం విషయాలను సరిచూసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని