కొంచెం ఎక్స్‌ట్రా ప్లీజ్‌!

కాలేజీ రోజులు ప్రతిఒక్కరి జీవితంలోనూ చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాదు, విద్యార్థిని అన్నివిధాలా అభివృద్ధి బాటలో పయనించేలా ప్రోత్సహిస్తాయి. విద్యేతర కార్యక్రమాలు (ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌) 

Published : 12 Jul 2022 01:13 IST

కాలేజీ రోజులు ప్రతిఒక్కరి జీవితంలోనూ చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాదు, విద్యార్థిని అన్నివిధాలా అభివృద్ధి బాటలో పయనించేలా ప్రోత్సహిస్తాయి. విద్యేతర కార్యక్రమాలు (ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌) ఆ బాటను మరింత సుస్థిరం చేస్తాయి. అందుకే కళాశాలలు మొదలవుతున్న ఈ తరుణంలో... ఎలాంటి వ్యాపకాలను ఎంచుకోవాలి, అవి మన ప్రొఫైల్‌ను ఎలా ఆసక్తికరంగా మారుస్తాయో ఒకసారి చూసేద్దామా... 

కరిక్యులమ్‌లో లేని- విద్యార్థి మానసిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాలను ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ అంటున్నాం. ఇందులో వివిధ రకాలున్నాయి. ఒక్కోటీ ఒక్కో విధమైన అనుభవాన్ని ఇస్తాయి. తద్వారా మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాదు, ఉద్యోగాల అన్వేషణలో ఉన్నప్పుడు మన రెజ్యుమేను ఆకర్షణీయంగా మలుస్తుంది. కేవలం మార్కులు, గ్రేడ్లే కాకుండా మనం పాల్గొన్న, నేర్చుకున్న ఇతర అంశాల వివరాలను అందులో జోడించడం ద్వారా మనపై రిక్రూటర్లకు మరింత ఆసక్తి కలుగుతుంది.

ఏయే లాభాలు?

ఈ విద్యేతర కార్యక్రమాలతో మనం నూతన నైపుణ్యాలెన్నో నేర్చుకోగలుగుతాం. మానసికంగా దృఢంగా తయారు కావడమేకాదు, మేధాపరంగానూ వృద్ధి చెందుతాం. సామాజిక సంబంధాలు - భాషా నైపుణ్యాలు పెంచుకోవడం, మాట్లాడే తీరు మెరుగుపడటం, బృందంతో కలిసి పనిచేయడం, సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించడం, నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టడం, సమస్యలను పరిష్కరించడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లాంటి అంశాలన్నీ అనుభవపూర్వకంగా నేర్చుకోగలుగుతాం.

ఏమేం ఉన్నాయి..

ఈ కార్యక్రమాలు ప్రధానంగా మూడు రకాలు. మొదటిది కళలు - సంగీతం - సాహిత్యం. ఫైన్‌ ఆర్ట్స్‌లో రాణించడానికి డిగ్రీల్లోనే నేర్చుకోవాల్సిన పని లేదు. హాబీగా కూడా చేయొచ్చు. మ్యూజిక్, పెయింటింగ్, రైటింగ్, ఫొటోగ్రఫీ, యాక్టింగ్, డాన్స్, సింగింగ్, మ్యాజిక్‌ వంటివి ఈ కోవలోకి వస్తాయి. రెండోది క్రీడలు - ఇక ఆటల్లో ఎన్ని రకాలున్నాయో మనందరికీ తెలుసు. క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటిన్, టెన్నిస్‌... మొదలైన వాటితోపాటు అథ్లెటిక్స్‌ కూడా నేర్చుకోవచ్చు. మూడోది సాఫ్ట్‌ స్కిల్స్‌. ఇవి ఓ రకంగా జీవన నైపుణ్యాలని చెప్పుకోవచ్చు. మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కల్పించేవన్నీ ఇందులోకి వస్తాయి. వివిధ సంఘాలతో కలిసి పనిచేయడం, సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, వాలంటీర్‌గా చేయడం వంటివాటి వల్ల మనకు మాత్రమే కాదు, సమాజానికి కూడా మేలు కలుగుతుంది... ఆపైన స్విమ్మింగ్, యోగా వంటివాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఆరోగ్యకరమైన, ఆమోదయోగ్యమైన అలవాట్లు

చూశారుగా... వీటితోపాటు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం - నేర్చుకోవడం, ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవడం, రాజకీయ - సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం వంటివన్నీ మన చదువుకు అదనపు అర్హతలు చేకూర్చేవే. ఉన్నతస్థాయి సంస్థలు తమ కంపెనీల్లోకి వచ్చేవారి నుంచి ఇటువంటి అదనపు అర్హతలను కూడా ఆశిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం... మీకు నచ్చినదేంటో గుర్తించి మొదలుపెట్టండి మరి! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని