మెరుగైన స్కోరుకు మరో అవకాశం మెయిన్‌లో మెరిసేదెలా?

ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష సెషన్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసిన 7,69,589 మందిలో 14 మంది 300కు 300 మార్కులు (100 పర్సంటైల్‌) సాధించారు. అయితే మొదటి సెషన్‌లో ఆశించినమేర స్కోరు సాధించనివారు

Published : 14 Jul 2022 00:25 IST

ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష సెషన్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసిన 7,69,589 మందిలో 14 మంది 300కు 300 మార్కులు (100 పర్సంటైల్‌) సాధించారు. అయితే మొదటి
సెషన్‌లో ఆశించినమేర స్కోరు సాధించనివారు మెరుగు పరచుకోవడానికి మరో అవకాశం ఉంది. సెషన్‌ 2 పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరుగుతాయి. వీరంతా ఇప్పుడున్న వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన మార్కులు
తెచ్చుకునేందుకు ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు
నిర్వహించారు. ఇందులో మొత్తం 13 ప్రశ్నపత్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థుల అభిప్రాయం ప్రకారం..

* మ్యాథ్స్‌ సంక్లిష్టంగా..
* ఫిజిక్స్‌ తేలిక నుంచి మధ్యస్థంగా..
* కెమిస్ట్రీ తేలిక నుంచి కఠినంగా ఉంది..
పరీక్ష ఫలితాలు సైతం దాదాపు ఇలాగే ఉన్నాయి. అయితే పేపర్‌ కఠినమా, మధ్యస్థమా లేదా తేలికగా ఉందా అనేది పూర్తిగా విద్యార్థి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ సెషన్‌లో పరీక్ష రాసినవారి తెలివితేటలూ కీలకమే.


మ్యాథ్స్‌..
* ఇది సంక్లిష్టంగా ఎందుకు అనిపించిందంటే.. జేఈఈ మెయిన్‌కు అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో సన్నద్ధమైనవారికి ప్రతి పేపర్‌లోనూ దాదాపు 2 నుంచి 3 ప్రశ్నలు కాస్త సమయం ఎక్కువ తీసుకునే విధంగా ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం ఆ తరహా ప్రశ్నలు విద్యార్థులకు తెలిసినా.. అర్థం చేసుకుని సాధించడానికి నిర్దేశిత సమయం కంటే ఎక్కువ వ్యవధి
అవసరమైంది.

* జేఈఈ మెయిన్‌ పరీక్షను ఇంటర్మీడియట్‌ బోర్డు తరహా లేదా ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైనవారికి సుమారు 10 నుంచి 12 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి.
* మ్యాథ్స్‌లో ఎక్కువ శాతం విద్యార్థులు డిఫరెన్షియల్‌ కాలిక్యులస్‌, వెక్టార్స్‌, 3డీ, నంబర్‌ థియరీ సంబంధిత ప్రశ్నల్లో తప్పులు చేశారు.


ఫిజిక్స్‌...
* ఇది తేలిక నుంచి మధ్యస్థం ఎందుకు
అనిపించిందంటే.. ఎక్కువ శాతం ప్రశ్నలు నేరుగా, ఎలాంటి మెలికలు పెట్టకుండా
అడిగారు. అందుకే ఎక్కువ మంది ఈ
అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* ఎలక్ట్రోస్టాటిక్స్‌, ఈఎంఐ, మోడరన్‌ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌లో కొన్ని ప్రశ్నలు సంక్లిష్టంగానే ఉన్నాయి.
సెషన్‌-1లో అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఎక్కువ ప్రశ్నలు అసర్షన్‌ అండ్‌ రీజన్‌ లేదా స్టేట్‌మెంట్‌-1, స్టేట్‌మెంట్‌-2 తరహాలో ఉన్నాయి. కాన్సెప్ట్‌పై పట్టు లేనివారు, ఆ తరహా ప్రశ్నలను సాధన చేయనివారు ఎక్కువ తప్పులు చేశారు.


కెమిస్ట్రీ..
* ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలోని ప్రతి అంశంపైనా పట్టుసాధించిన విద్యార్థులకు ఈ విభాగంలో 90 శాతం ప్రశ్నలు సాధారణంగానే ఉన్నాయి.
* ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలోని గుర్తుంచుకోవాల్సిన అంశాలను సరిగా సాధన చేయనివాళ్లు ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. అందుకే వీరు పేపర్‌ మధ్యస్థంగా ఉందన్నారు.
* ఫిజికల్‌ కెమిస్ట్రీ నుంచి ముఖ్యమైన అధ్యాయాల నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడంతో అవి కఠినం అనిపించాయి.


కటాఫ్‌ పర్సంటైల్స్‌
జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021కు
అర్హత సాధించిన జేఈఈ మెయిన్‌
కటాఫ్‌ పర్సంటైల్స్‌
కేటగిరీ కటాఫ్‌
జనరల్‌ 87.8992241
ఈడబ్ల్యుఎస్‌ 66.2214845
ఓబీసీ-ఎన్‌సీఎల్‌ 68.0234470
ఎస్సీ 46.8825338
ఎస్టీ 34.6728999


ర్యాంక్‌ వర్సెస్‌ పర్సంటైల్‌ 2021
ర్యాంకు రేంజ్‌  పర్సంటైల్‌ కటాఫ్‌
10లోపు 100
100లోపు 99.9942523
1000లోపు 99.9261157
5000లోపు 99.5427531
10000లోపు 99.0264241
15000లోపు 98.4740863
20000లోపు 97.9198688
పై రెండు పట్టికల ద్వారా గమనించాల్సింది ఏమిటంటే.. ఎంత పర్సంటైల్‌ స్కోరుకు ఎంత ర్యాంకు వచ్చే ఆస్కారం ఉంది అన్న విషయం. అయితే దీనికి కొనసాగింపుగా ఎన్ని మార్కులకు ఎంత పర్సంటైల్‌ రావచ్చో తెలుసుకుంటే, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకుని, సెషన్‌-2లో మంచి ఫలితం సాధించవచ్చు.


ఎన్ని మార్కులకు ఎంత పర్సంటైల్‌?

జేఈఈ మెయిన్‌ 2022 సెషన్‌-1లో ఎన్ని మార్కులకు ఎంత పర్సంటైల్‌ స్కోరు సాధించారంటే... (పేపర్‌ స్థాయిని కఠిన, మధ్యమ, తేలిక ఇలా 3 విధాలుగా తీసుకుని మార్క్స్‌ వర్సెస్‌ పర్సంటైల్‌)
పర్సంటైల్‌ పేపర్‌ స్థాయిని బట్టి మార్కులు స్కోరు రేంజ్‌ కఠిన మధ్యమ తేలిక
100 290+ 295+ 300
99.99+ 265+ 280+ 290+
99.9+ 240+ 250+ 275+
99.8+ 215+ 230+ 260+
99.5+ 195+ 210+ 235+
99.0+ 175+ 185+ 206+
90.0+ 70+ 85+ 95+
(పట్టికలో 5 మార్కులు కాస్త అటుఇటుగా పరిగణించాలి)


ఉన్న వ్యవధిలో ఏం చేయాలంటే..

* కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించకండి.
* సెషన్‌-1లో మీరు రాసిన ప్రశ్నపత్రంతోపాటు మిగిలిన 12 ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి.
* ప్రతి సబ్జెక్టులోనూ కనీసం కొన్ని అసర్షన్‌ అండ్‌ రీజన్‌ లేదా స్టేట్‌మెంట్‌-1 అండ్‌ స్టేట్‌మెంట్‌-2 తరహా ప్రశ్నలను సాధన చేయాలి.
* సెషన్‌-1లో ప్రశ్నపత్రాల స్థాయి ఎలా ఉందో సెషన్‌-2లోనూ అలాగే ఉంటుందని భావించకుండా సన్నద్ధతను ఉన్న వ్యవధిలో వీలైనంత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.
* ఎన్‌టీఏ ప్రాక్టీస్‌ టెస్టులను తప్పకుండా రాయాలి.
* ఎంతలోపు ర్యాంకు ఆశిస్తున్నారో నిర్ణయించుకుని, అందుకు తగ్గ సాధన చేయాలి.

* జేఈఈ మెయిన్‌- 2021 మాదిరిగానే జేఈఈ మెయిన్‌- 2022 కటాఫ్‌ ఉండొచ్చు.

- ఎం. ఉమాశంకర్‌, శ్రీచైతన్య ఐఐటీ జాతీయ సమన్వయకర్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని