కొలువులకు కావాలి ఇవి!

టెక్నాలజీతో సావాసం చేస్తున్న నేటి యుగంలో కొత్త తరహా ఉద్యోగాలకు కొదవేమీ లేదు. ఉద్యోగాలిచ్చే ప్రసిద్ధ సంస్థలు సైతం ఉద్యోగుల నుంచి మేలైన నైపుణ్యాలనే ఆశిస్తున్నాయి. నచ్చిన రంగంలో నిలదొక్కుకోవాలన్నా, పెద్ద కంపెనీల్లో ఎక్కువకాలం కొనసాగాలన్నా..

Published : 20 Jul 2022 01:27 IST

టెక్నాలజీతో సావాసం చేస్తున్న నేటి యుగంలో కొత్త తరహా ఉద్యోగాలకు కొదవేమీ లేదు. ఉద్యోగాలిచ్చే ప్రసిద్ధ సంస్థలు సైతం ఉద్యోగుల నుంచి మేలైన నైపుణ్యాలనే ఆశిస్తున్నాయి. నచ్చిన రంగంలో నిలదొక్కుకోవాలన్నా, పెద్ద కంపెనీల్లో ఎక్కువకాలం కొనసాగాలన్నా.. ఉద్యోగి సామర్థ్యాలే గీటురాయి! మార్కెట్‌లో కొత్తరకం బ్రాండ్‌లు వచ్చినట్లే.. ఉద్యోగులకు సైతం బ్రాండ్‌ న్యూ-సెట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ ఉండాలంటున్నాయి.. ప్రముఖ జాబ్‌ సెర్చి సంస్థలు. ఇండీడ్‌, లింక్‌డిన్‌ లాంటి వెబ్‌సైట్‌లు చేసిన సర్వే ప్రకారం ఆ నైపుణ్యాలేమిటో మీరూ ఓ లుక్కేయండి మరి!

చ్చిన వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం, ప్రణాళికబద్ధంగా ఉండటం, సాంకేతిక నైపుణ్యాలను వినియోగించుకోవడం, బృందచర్చలు, సంస్థ/ వినియోగదారుల అవసరాలను నొప్పించకుండా, సంతృప్తికరమైన సేవలను అందివ్వడం, ఇచ్చిన టాస్క్‌పై అమితాసక్తి, పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయగల నేర్పు, విశ్వసనీయత, చిత్తశుద్ధి, సహనం పాటించడం, సమగ్రతను చాటుకోవడం... ఇవన్నీ సాధారణంగా ఉద్యోగులకుండాల్సిన ప్రాథమిక నైపుణ్యాలుగా పేర్కొనవచ్చు.

ఉద్యోగంలో చేరేముందు... ఏ అభ్యర్థిలోనైనా ప్రథమంగా పరిశీలించేవి.. విద్యార్హతలూ, భావ వ్యక్తీకరణ, ఇతర సాంకేతిక నైపుణ్యాలు. ఇవి ఉంటే చాలు ఇక ఉద్యోగం చిక్కినట్లే అని భావించేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. సాధారణ అర్హతలనుంచి అంతకుమించిన ప్రతిభ, ప్రత్యేకతలను చాటుకునేవారికే అగ్రతాంబూలం ఇస్తున్నాయి నియామక సంస్థలు. చదివిన డిగ్రీ, ఇతర సర్టిఫికెట్లు, ప్రోగ్రామింగ్‌ లాంటి నైపుణ్యాలన్నీ హార్డ్‌ స్కిల్స్‌గా చెప్పుకుంటే, కమ్యూనికేషన్‌, టీమ్‌వర్క్‌, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు లాంటివి సాఫ్ట్‌ స్కిల్స్‌.


కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

ద్యోగికి ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యం ఇది. కావాల్సిన సమాచారాన్ని (ఈ.మెయిల్‌/ సందేశం/ ఫోన్‌కాల్‌/ వీడియో చాట్‌)ల ద్వారా సరైన రీతిలో రాబట్టేందుకు ఇది తోడ్పడుతుంది. భావ ప్రసారం అనేది ఒకరి అభిప్రాయమే కాదు. ఇరువైపులా స్నేహపూర్వకంగా అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానం. అదే వృత్తిపరంగా అయితే సహోద్యోగులతో, పై స్థాయి అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడే ప్రక్రియ. ఒక్కోసారి మీటింగ్‌లో లేదంటే సాధారణ చర్చల్లో పడి నిరంతరాయంగా ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాం. ఎదుటివారు మాట్లాడేది వినడం కూడా ముఖ్యమే! అలా వినగలిగినప్పుడే ఉద్యోగపరమైన సత్సంబంధాలు బలపడతాయి. అంతేకాదు కమ్యూనికేషన్‌లో భాగంగా మనం చెప్పాలనుకునే విషయంలో కీలకంగా నిలిచేది మన బాడీ లాంగ్వేజ్‌ కూడా. మనలోని ఆత్మవిశ్వాసాన్నీ, ఆ విషయం పట్ల మనకున్న స్పష్టతనూ ఇది ఎదుటివారికి తెలియజేస్తుంది. చక్కని భాషానైపుణ్యం వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగానూ అత్యున్నత స్థాయికి చేర్చుతుంది. మొత్తానికి నాణ్యమైన టీమ్‌ని నిర్మించడంలో దోహదం చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చేలా, వినూత్నంగా ఆలోచింపజేసేలా చేస్తుంది. అత్యుత్తమ నిర్వహణను సాధిస్తుంది.


సమయపాలన

సమయాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక కళే! చేయదలచిన పనిని లాంగ్‌టర్మ్‌, షార్ట్‌టర్మ్‌లుగా విభజించుకోవడం, గడువుకు తగ్గ తేదీ ప్రణాళికలను ప్లాన్‌ చేసుకోవడం.. టైం మేనేజ్‌మెంట్‌ను పెంపొందించే అంశాలు.సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి చేసుకుంటూపోవడం, అనవసరమైన వ్యాపకాలు, పనులను వదిలేయడం వల్ల దీన్ని సాధించొచ్చు. ఫలితంగా ఒత్తిడి దరిచేరదు. సరైన సమయపాలన వల్ల సమయం ఆదా అవుతుంది. ఆపై దీన్ని వ్యక్తిగత జీవితానికి ఆపాదించుకోవచ్చు. పని నాణ్యత పెరిగి, మరిన్ని అవకాశాలు అందివస్తాయి. నిర్దేశిత గడువులోగా ఇచ్చిన లక్ష్యాలూ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడం ఉద్యోగికుండాల్సిన ముఖ్య నైపుణ్యంగా చెప్పవచ్చు.


టీంవర్క్‌, సహకార నైపుణ్యాలు

ఒక సంస్థలో రకరకాల ఉద్యోగులు, వివిధ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటారు. అటువంటి సమయంలో తోటి ఉద్యోగులతో పనిని సమన్వయపర్చుకుంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మొత్తంగా మంచి అవుట్‌పుట్‌కు కృషి చేయడాన్నే ‘టీమ్‌వర్క్‌’ అంటున్నాం. వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, ఇతర టీమ్‌ సభ్యుల్ని పర్యవేక్షించడం, ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం, ఎల్లప్పుడూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల తక్కువ వ్యవధిలోనే కోరుకున్న విజయం చేరువవుతుంది. టీమ్‌ సభ్యులపట్ల బాధ్యత వహించడం, అనుకూలధోరణితో వ్యవహరించడం, నిజాయతీగా ఉండటమూ అవసరమే.


సహానుభూతి

తోటి ఉద్యోగులతో సత్సంబంధాలతో ఉండటం సహానుభూతి (ఎంపథీ). వృత్తిలో భాగంగా మన సహోద్యోగుల ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలను గుర్తెరిగి నడుచుకోవడం, అందుకు తగ్గ సంభాషణలు జరపడం, ఆ దిశగా వారిని ప్రోత్సహించడం ఈ నైపుణ్యం కిందకు వస్తుంది. ఎదుటివ్యక్తి భావోద్వేగాల పట్ల అవగాహనతో ఉండటం కాగ్నిటివ్‌ ఎంపథీ. మీతో ఎదుటివారు పంచుకున్న భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఎమోషనల్‌ ఎంపథీ. అనుచిత భావోద్వేగాల నుంచి బయటపడేసే ప్రక్రియను కంపాషనేట్‌ ఎంపథీగా పిలుస్తారు. ఒకరు ఎదుర్కొనే సమస్య/ భావోద్వేగాలను ఎదుటివారి స్థానంలో ఉండి వినడం, వాటిని దూరం చేయడానికి చేసే ప్రయత్నమే ఎంపథీ స్కిల్‌. దీనివల్ల ఉద్యోగంలో మీ చుట్టూ ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన, ఆశావహ వాతావరణం ఏర్పడుతుంది.


అనుకూలత  

సంస్థ అవసరాలూ, ప్రయోజనాలను అవగతం చేసుకుని అనుకూలతతో వ్యవహరించడం ఉద్యోగికి చాలా అవసరం. ఒక్కోసారి చేసే పని మారొచ్చు, చేసే పద్ధతి మారొచ్చు. పని ప్రదేశమూ మారొచ్చు. కానీ అలా మార్పునకు తగ్గ పనితనం కనబర్చినప్పుడే ఆ సంస్థ అభివృద్ధి దిశగా సాగుతుంది. పనిచేసే చోట ఒక్కోసారి కొత్త ప్రాజెక్టులను చేపట్టాల్సి రావొచ్చు; కొత్త స్కిల్‌ నేర్చుకోవచ్చు. ఉద్యోగిగా కొత్త మార్పులనూ, కీలక బాధ్యతలనూ స్వీకరించడం, త్వరితగతిన స్పందించడం, క్లిష్టసమయాల్లో ఎదురైన సవాళ్లను పూర్తిచేయడంతో ఆ సంస్థకు ఉద్యోగిపై ఉన్న విశ్వసనీయత పెరుగుతుంది.


సృజనాత్మకత

ప్రతి ఒక్కరిలో కొత్తదనంతో ఆలోచించేతత్వం ఉంటుంది. మార్కులు, సర్టిఫికెట్లు ఎప్పుడూ సమర్థతకు ప్రామాణికం కావు. మీలోని సృజనాత్మకతను (క్రియేటివిటీ) సందర్భానుసారం బయటపెట్టినప్పుడే అది మరింతగా వృద్ధి చెందుతుంది. అప్పుడే మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. క్రియేటివిటీ వల్ల కొత్త ఆలోచనలకు బీజం పడుతుంది. సమస్యలను కొత్తకోణంలో పరిష్కరించగల దృక్పథం అలవడుతుంది. ఇది ఉద్యోగంలో మీ అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుంది.


డిజిటల్‌/ సాంకేతిక నైపుణ్యాలు  

ఏ రంగంలోనైనా సాంకేతిక పరిజ్ఞానం లేనిదే పురోగతి సాధించలేం. సంస్థ కీలక సమాచారాన్ని భద్రపరచడం, విశ్లేషించడం, ఇవేకాక డిజిటల్‌ సాధనాల వాడకంపై అవగాహనతో ఉండటం, డేటాను కావాల్సిన రీతుల్లో చేరవేయడం, సమీక్షించుకోవడం తప్పనిసరిగా ఉద్యోగికి ఉండాల్సిన నైపుణ్యంగా చెప్పవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని