మెడికల్‌ కోడింగ్‌తో.. మెరుగైన కొలువులు!

వైద్యరంగంలో మెడికల్‌ కోడింగ్‌ ఇప్పుడొక ట్రెండీ కెరియర్‌ ఆప్షన్‌! విదేశాల్లో ఈ భారతీయ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతుండటమే దీనికి కారణం. బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ లెక్కల ప్రకారం ప్రస్తుతం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న 20 వృత్తుల్లో మెడికల్‌ కోడింగ్‌ ఒకటి. కనీస డిగ్రీ అందుకున్న తర్వాత కొన్ని స్వల్పకాలిక కోర్సులు చేయడం ద్వారా ఇందులో మెరుగైన కొలువులు సాధించే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో మనమూ చూసేద్దాం.

Updated : 26 Jul 2022 07:50 IST

వైద్యరంగంలో మెడికల్‌ కోడింగ్‌ ఇప్పుడొక ట్రెండీ కెరియర్‌ ఆప్షన్‌! విదేశాల్లో ఈ భారతీయ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతుండటమే దీనికి కారణం. బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ లెక్కల ప్రకారం ప్రస్తుతం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న 20 వృత్తుల్లో మెడికల్‌ కోడింగ్‌ ఒకటి. కనీస డిగ్రీ అందుకున్న తర్వాత కొన్ని స్వల్పకాలిక కోర్సులు చేయడం ద్వారా ఇందులో మెరుగైన కొలువులు సాధించే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో మనమూ చూసేద్దాం.

మెడికల్‌ కోడింగ్‌ అంటే సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో భద్రపరిచే ప్రక్రియ. రోగుల వివరాలు, వైద్యంలో అనుసరించిన పద్ధతులు, మందులు, ఉపయోగించిన పరికరాలు..ఇలా ప్రతి విషయాన్నీ యూనివర్సల్‌ మెడికల్‌ ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్స్‌లోకి మార్చేదే ఈ విధానం. దీని ద్వారా పేషెంట్ల సమాచారాన్ని ఎటువంటి తప్పులు లేకుండా సులభంగా భద్రపరిచేందుకు, అవసరమైనప్పుడు వెంటనే తీసేందుకు వీలు కలుగుతుంది.

ఏమిటీ కోడ్‌?

ప్రపంచవ్యాప్తంగా ఏ భాషవారికైనా వెంటనే అర్థమయ్యేలా వైద్యరంగంలో అభివృద్ధి చేసిన కోడ్‌ భాషే మెడికల్‌ ఆల్ఫాన్యూమరిక్‌ కోడ్‌. ఇందులో ఐసీడీ-10, సీపీటీ, హెచ్‌సీపీసీఎస్‌ లెవెల్‌ 11 వంటి వివిధ రకాలున్నాయి. ఇవి వైద్యంలో అవసరయ్యే ప్రతి పదాన్నీ ప్రత్యేకమైన కోడ్‌ రూపంలో చెబుతాయి. ఈ కోడ్‌ ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా ఈ పరిశ్రమలోకి ప్రవేశించవచ్చు. దీన్ని వైద్యంలోనే కాక వైద్య పరిశోధనల్లోనూ వినియోగిస్తున్నారు.

బాధ్యతలేంటి?

ఈ మెడికల్‌ కోడర్స్‌ తమవద్దనున్న సమాచారాన్ని ఈ కోడ్‌ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. అలాగే ఇతర సమాచారం ఈ కోడ్‌ రూపంలో వచ్చినప్పుడు దాన్ని సాధారణ రూపంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. బిల్లింగ్‌, బీమా క్లెయిమ్‌ సందర్భాల్లో రోగి, ఆసుపత్రి, బీమా కంపెనీ... ఎవరూ నష్టపోకుండా, ఎటువంటి తప్పులూ జరగకుండా సరైన సమాచారాన్ని ఇవ్వడం వంటి విధులుంటాయి.

వైద్య విధానాలు ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో కోడర్స్‌ అవసరం చాలా పెరిగింది. కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ల్యాబ్స్‌, ఫార్మా కంపెనీల్లో వీరి సేవలు అవసరం. యూఎస్‌, యూకే, ఇతర దేశాలకు పనిచేసేందుకు భారత యువతకు కొన్ని కంపెనీలు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. కొంత పని అనుభవం తర్వాత విదేశాల్లోనూ రాణించే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం తర్వాత ఈ విభాగంలో నిపుణుల కొరత ఎక్కువైంది. మార్కెట్లో మెడికల్‌ కోడర్స్‌కు ఉన్న డిమాండ్‌కు, సప్లైకు మధ్య తేడా దాదాపు 40 శాతం ఉందని ఒక అంచనా. గత రెండేళ్లుగా ఇది ఇంకా పెరుగుతోంది.

ఈ నిపుణులకు సమాచారాన్ని భద్రంగా ఉంచే నేర్పు ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని క్రోడీకరించే సమయంలో రోగి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవాలి. అలాగే డేటాలో తప్పులు లేకుండా చూడటం కూడా చాలా అవసరం. హ్యూమన్‌ ఎనాటమీ, ఫార్మా, బయాలజీల గురించి కనీస అవగాహన ఉండాలి. డెస్క్‌ జాబ్స్‌ ఇష్టపడేవారికి ఇది బాగా నప్పుతుంది. ముఖ్యంగా యువతులకు సౌకర్యవంతమైన పనివేళలు ఉంటాయి.

కోర్సులు... సర్టిఫికేషన్‌

మెడికల్‌ కోడింగ్‌ చదవాలంటే అభ్యర్థి డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. లైఫ్‌ సైన్సెస్‌ చదువుకున్నవారికి పని మరింత సులువుగా ఉంటుంది. వైద్యపరిభాష, డేటా ఎంట్రీ, బిల్లింగ్‌పై అవగాహన ఉండాలి. సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం కావాలి. హెన్రీ హార్విన్‌, ఎక్స్‌పర్ట్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌, మెడోస్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌, మ్యాగ్నెట్‌ మెడికల్‌ కోడింగ్‌ సొల్యూషన్స్‌, అకాడెమీ ఆఫ్‌ మెడికల్‌ కోడర్స్‌ ఇన్‌ ఇండియా, యుడెమీ, సిగ్మా మెడికల్‌ కోడింగ్‌ అకాడెమీ, జీనియస్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌, అపెక్స్‌ మెడ్‌కామ్‌ వంటి సంస్థలు 3 నెలల నుంచి ఏడాదిన్నర] కాలవ్యవధి గల మెడికల్‌ కోడింగ్‌ కోర్సులను అభ్యర్థులకు అందిస్తున్నాయి. ఇవి చేసిన తర్వాత పరీక్ష రాసి ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ పొందాలి. ఏటా దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఏఏసీపీ ద్వారా సీపీసీ (సర్టిఫైడ్‌ ప్రొఫెషన్‌ కోడర్‌), ఏహెచ్‌ఐఎంఏ ద్వారా సర్టిఫైడ్‌ కోడింగ్‌ స్పెషలిస్ట్‌ (సీసీఎస్‌), సర్టిఫైడ్‌ కోడింగ్‌ స్పెషలిస్ట్‌- ఫిజీషియన్‌ బేస్డ్‌ (సీసీఎస్‌-పీ) తదితరాల్లో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది. ధ్రువపత్రం అందుకున్నాక ఈ రంగంలో సులువుగా కెరియర్‌ను నిర్మించుకోవచ్చు.

ఈ ధ్రువపత్రం అందుకున్నాక వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించ వచ్చు. కొన్ని సంస్థలు సర్టిఫికెట్‌ లేకుండానే ఉద్యోగం ఇచ్చి, కొన్నాళ్ల తర్వాత అందజేయమని అడుగుతాయి. అయితే వీటికి జీతాలు తక్కువ ఉంటాయి. ఒక సర్టిఫైడ్‌ కోడర్‌ ప్రారంభ వేతనం 25 వేల రూపాయల వరకూ ఉంటుంది. యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌, ఒమేగా, సదర్లాండ్‌ హెల్త్‌ కేర్‌, ఫైకేర్‌, ఎలికో హెల్త్‌ కేర్‌, ఏజిస్‌, మెడ్‌టెక్‌ వంటి సంస్థలు ఈ కోడర్స్‌కు కొలువులు అందిస్తున్నాయి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని