వ్యవసాయ కోర్సుల్లోకి ఏఐఈఈఏ

దేశవ్యాప్తంగా పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం, అనుబంధ విభాగాల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశానికి రాష్ట్రాల వారీ వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆయా డిగ్రీల వారీ 15 నుంచి 25 శాతం సీట్లను జాతీయ స్థాయిలో నిర్వహించే ... ఆలిండియా

Updated : 03 Aug 2022 00:51 IST

దేశవ్యాప్తంగా పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం, అనుబంధ విభాగాల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశానికి రాష్ట్రాల వారీ వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆయా డిగ్రీల వారీ 15 నుంచి 25 శాతం సీట్లను జాతీయ స్థాయిలో నిర్వహించే ... ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ అడ్మిషన్‌ (ఏఐఈఈఏ)తో భర్తీ చేస్తారు. కొన్ని జాతీయ సంస్థల్లో మొత్తం సీట్లకు ఈ స్కోరే ప్రామాణికం. ఈ విధానంలో ప్రవేశాలు పొందినవారు ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకోవచ్చు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం...


అగ్రికల్చర్‌ యూజీ

అర్హత: కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40) శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఇలా: వ్యవధి రెండున్నర గంటలు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 చొప్పున మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఝాన్సీ, కర్నాల్‌, న్యూదిల్లీ, పూసాల్లో ఉన్న మొత్తం యూజీ సీట్లను భర్తీ చేస్తారు. దేశంలోని సుమారు 70 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం యూజీ సీట్లకు పోటీ పడడానికి ఈ పరీక్ష రాయడం తప్పనిసరి. మొత్తం 11 బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.

బీఎస్సీ: అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫిషరీ సైన్స్‌, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, సెరీకల్చర్‌.

బీటెక్‌: అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, డైరీ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ కోర్సులు ఆయా సంస్థల్లో అందిస్తున్నారు. కోర్సులను బట్టి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు అర్హులు. కొన్ని కోర్సులకు రెండు గ్రూపులవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష స్కోరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.3000 స్టైపెండ్‌ అందిస్తారు.


అగ్రికల్చర్‌ పీజీ

పీజీ కోర్సులకు నిర్వహించే పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో 25 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 4 జాతీయ సంస్థల్లో మాత్రం వంద శాతం సీట్లకు ఈ స్కోరే ప్రామాణికం. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ వెటరినరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, నేషనల్‌ డైరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఎడ్యుకేష  న్‌ల్లో సీట్లకు ఈ స్కోరే ప్రామాణికం. దేశ వ్యాప్తంగా పీజీ స్థాయిలో 19 విభాగాల్లో 79 సబ్‌ సబ్జెక్టు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరిట్‌ సాధించిన 600 మంది విద్యార్థులకు ఐసీఏఆర్‌ పీజీ స్కాలర్‌షిప్పు అందుతుంది. దీని ప్రకారం నెలకు రూ.12640 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇది దక్కనివారికి నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్పు కింద ప్రతి నెల రూ.5000 ఇస్తారు.

అర్హత: అగ్రికల్చర్‌, అనుబంధ విభాగాల్లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50) శాతం మార్కులతో యూజీ కోర్సులు పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఇలా: పీజీ పరీక్ష వ్యవధి రెండు గంటలు. సంబంధిత సబ్జెక్టుల నుంచి 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.


జేఆర్‌ఎఫ్‌/ఎస్‌ఆర్‌ఎఫ్‌

దేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం, మరో అయిదు సంస్థల్లో వంద శాతం పీహెచ్‌డీ (జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌) సీట్లను ఐసీఏఆర్‌ ఆల్‌ ఇండియా కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌తో భర్తీ చేస్తారు. వ్యవసాయం, అనుబంధ విభాగాలకు చెందిన 70 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీహెచ్‌డీలో చేరినవారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 మూడో ఏడాది నుంచి నెలకు రూ.35,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.
అర్హత: సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సులను 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50) శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఇలా: వ్యవధి రెండు గంటలు. 120 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ ఎలో జనరల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 20; పార్ట్‌ బి, సి ఒక్కో దాంట్లో 50 చొప్పున సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 19 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు (అన్ని కోర్సులకూ)

పరీక్షలు: తేదీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో యూజీ కోర్సులకు అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో కేంద్రాలున్నాయి. పీజీ, పీహెచ్‌డీలకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో నిర్వహిస్తారు. తెలంగాణలో (అన్ని కోర్సులకూ) హైదరాబాద్‌/ సికింద్రాబాద్‌/ రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌. ఖమ్మం (యూజీకి మాత్రమే)  
వెబ్‌సైట్‌: https://icar.nta.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని