కేంద్రంలో 4300 ఎస్‌ఐ కొలువులు

కేంద్ర సాయుధ బలగాలతోపాటు దిల్లీ పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదలచేసింది. పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడొచ్చు. రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా నియామకాలుంటాయి.

Updated : 16 Aug 2022 09:18 IST

కేంద్ర సాయుధ బలగాలతోపాటు దిల్లీ పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదలచేసింది. పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడొచ్చు. రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా నియామకాలుంటాయి. విజయవంతంగా శిక్షణ ముగించుకుని, విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.60 వేల వేతనం పొందవచ్చు.

ఇప్పటికే తెలంగాణలో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎస్‌ఐ, పోలీస్‌ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. తాజాగా ప్రకటించిన 4300 పోస్టుల భర్తీ వీరందరికీ ఎంతో ఆనందించదగినదే. దాదాపు ఇప్పుడున్న సన్నద్ధతతోనే వీటికి పోటీ పడవచ్చు. జాతీయ స్థాయిలో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లతోపాటు దిల్లీ పోలీస్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల ఖాళీల కోసం ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా/రెండేళ్లకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)ల్లో ఎందులోనైనా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తించాలి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం తక్కువ. దిల్లీ పోలీస్‌ పోస్టులకు ఎంపికైనవారు దిల్లీలోనే సేవలు అందించాలి. వీటిని మినహాయిస్తే ఆకర్షణీయ వేతనం, తక్కువ వ్యవధిలో పదోన్నతులు అందుకోవచ్చు.

ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజయవంతమైనవారిని పేపర్‌ 2 రాయడానికి అవకాశమిస్తారు.పేపర్‌-1, 2 రెండింటిలోనూ వచ్చిన మార్కులు కలిపి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లో చేరిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు లెవెల్‌-6 ప్రకారం రూ.35,400 మూల వేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే సుమారుగా రూ.60,000 జీతం పొందవచ్చు. వీరు 10-15 ఏళ్ల సర్వీస్‌తో ఇన్‌స్పెక్టర్‌ హోదాకు, అనంతరం అనుభవం, ప్రతిభ ప్రాతిపదికన అసిస్టెంట్‌ కమాండెంట్‌, డెప్యూటీ కమాండెంట్‌, కమాండెంట్‌, సీనియర్‌ కమాండెంట్‌ స్థాయులకు చేరుకోవచ్చు.

పరీక్ష ఇలా

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజరింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్లవారీ కటాఫ్‌ ఉంది. పేపర్‌-1లో అర్హత సాధించినవారికి పీఈటీ నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధిస్తే పేపర్‌-2 రాయడానికి అవకాశమిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 200 మార్కులకు పేపర్‌-2 ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. రెండు పేపర్లలోనూ రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి రెండు పేపర్లలోనూ విడిగా జనరల్‌ అభ్యర్థులకు 30 శాతం, ఓబీసీ, ఈబీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 20 శాతం మార్కులు తప్పనిసరి. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి విభాగాల వారీ మెరిట్‌ ప్రాతిపదికన వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి స్థాయిని బట్టి 4 నుంచి 10 వరకు అదనపు మార్కులు లభిస్తాయి.

పీఈటీ

పురుషులు వంద మీటర్ల దూరాన్ని 16, మహిళలు 18 సెకన్లలో చేరుకోవాలి. 1.6 కి.మీ. పరుగును పురుషులు 6.5 నిమిషాల్లో, 800 మీటర్లను మహిళలు 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా 3.65 మీటర్ల దూరానికి జంప్‌ చేయాలి. అదే మహిళలైతే 3 ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 2.7 మీటర్ల దూరం అధిగమించాలి. హైజంప్‌లో పురుషులు 1.2 మీటర్ల ఎత్తుకు 3 ప్రయత్నాల్లో ఏదో ఒకసారి ఎగరగలగాలి. మహిళలైతే 0.9 మీటర్ల ఎత్తును చేరుకోవాలి. షాట్‌పుట్‌ పురుషులకు మాత్రమే ఉంటుంది. 3 ప్రయత్నాల్లో 16 ఎల్‌బీఎస్‌ (సుమారు 7.257 కి.గ్రా.) దిమ్మను 4.5 మీ. దూరానికి విసరాలి. పీఈటీకి మార్కులు లేవు. అయితే నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేస్తేనే అర్హులగా పరిగణిస్తారు. పీఈటీలో నెగ్గినవారికే పేపర్‌-2 రాయడానికి అవకాశం ఉంటుంది.


ముఖ్య అంశాలు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2022 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1997 జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది.
శారీరక ప్రమాణాలు: పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ.. పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. ఉంటే సరిపోతుంది. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 85 సెం.మీ, పీల్చక ముందు 80 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి (ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత కనీస వ్యత్యాసం 5 సెం.మీ. తప్పనిసరి)
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 30 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.
కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు: నవంబరులో నిర్వహిస్తారు.
ఖాళీల వివరాలు: మొత్తం 4300. వీటిలో సీఏపీఎఫ్‌ల్లో 3960 ఉన్నాయి. విభాగాల వారీ.. సీఆర్‌పీఎఫ్‌ 3112, బీఎస్‌ఎఫ్‌ 353, ఐటీబీపీ 191, సీఐఎస్‌ఎఫ్‌ 86, ఎస్‌ఎస్‌బీ 218 పోస్టులు భర్తీ చేస్తారు. దిల్లీ పోలీస్‌.. పురుషులకు 228, మహిళలకు 112 కేటాయించారు.  
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీ: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌.
వెబ్‌సైట్‌: 
https://ssc.nic.in


విభాగాలు.. అంశాలు

సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని ప్రాధాన్యం అనుసరించి అధ్యయనం చేయాలి. తాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. అనంతరం సంబంధిత అంశంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం అధ్యయనంలో మార్గదర్శిగా భావించాలి. వీటిని గమనిస్తే.. ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అన్ని విభాగాలూ చదువుకుంటూ ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలో వాటికి లభిస్తోన్న ప్రాధాన్యం గుర్తించి సమయం కేటాయించుకోవాలి.

* జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: క్లాసిఫికేషన్‌, ఎనాలజీ, డేటా సఫిషియన్సీ, పజిల్స్‌, ఆల్ఫాబెట్స్‌ (వర్డ్‌ టెస్టు), వెన్‌ డయాగ్రామ్స్‌, సిరీస్‌, డైరెక్షన్‌ అండ్‌ డిస్టెన్స్‌, మిస్సింగ్‌ నంబర్‌, కోడింగ్‌ డీకోడింగ్‌, ఆర్డరింగ్‌ అండ్‌ ర్యాంకింగ్‌ అంశాలను వరుస క్రమంలో చదవాలి.
* జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వర్తమాన వ్యవహారాలు (జాతీయ, అంతర్జాతీయ), హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీలకు అధిక ప్రాధాన్యం ఉంది.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ట్రిగనోమెట్రీ, సింప్లిఫికేషన్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్స్‌, జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, మెన్సురేషన్‌, సింపుల్‌ అండ్‌ కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, స్పీడ్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, మిక్స్చర్‌ ప్రాబ్లమ్స్‌, నంబర్‌ సిస్టమ్‌ బాగా చదవాలి..
* ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌: ఒకాబ్యులరీ (క్లోజ్‌ టెస్టు, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, స్పెల్లింగ్‌, ఇడియమ్‌ మీనింగ్‌), ఇంగ్లిష్‌ గ్రామర్‌ (ఎర్రర్‌ స్పాటింగ్‌, ఫ్రేజ్‌ రీప్లేస్‌మెంట్‌, యాక్టివ్‌ పాసివ్‌ వాయిస్‌, డైరెక్ట్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌), రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లకు అధిక ప్రాధాన్యం ఉంది.


పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే...

* ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలి...మొదలైనవి తెలుసుకోవటానికి పాత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి.  
* పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి వీలైనన్ని (కనీసం రోజుకి ఒకటి చొప్పున) మాక్‌ పరీక్షలు రాయాలి. జవాబులు సరిచూసుకుని తుది సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి.
* సెక్షన్లవారీ కటాఫ్‌లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు సాధించడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టంగా అనిపిస్తోన్న విభాగానికి అదనంగా సమయాన్ని కేటాయించుకోవాలి.  
* పేపర్‌-2 మొత్తం ఆంగ్లం విభాగం నుంచే ఉంటుంది. అందువల్ల ఎక్కువ ప్రాధాన్యంతో చదవాలి. అందులో సాధించిన మార్కులు విజయంలో కీలకమవుతాయి. విజేతగా నిలవడానికి ఆంగ్లంపై పట్టు తప్పనిసరి. పేపర్‌ 1 పరీక్ష తర్వాత ఉన్న సమయాన్నంతా ఫిజికల్‌ టెస్టులు, పేపర్‌ 2 కోసమే వెచ్చించాలి.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా వేగంగా గణించడం అలవడుతుంది.
* వర్తమాన వ్యవహారాలకు సంబంధించి జనవరి 2022 నుంచి వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతోన్న ముఖ్య పరిణామాలను నోట్సు రాసుకోవాలి. ఈ విభాగంలో అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, తాజా పరిశోధనలు బాగా చదవాలి. ఇటీవల జరిగిన క్రీడలపై అధిక దృష్టి సారించాలి.
పుస్తకాలు: అభ్యర్థులు తమకు సౌకర్యవంతమైన రచయిత, పబ్లిషర్ల పుస్తకాలను ఎంచుకోవచ్చు. ఒక్కో విభాగం నుంచి ఒక పుస్తకాన్నే వీలైనన్ని సార్లు చదవడం మంచిది. ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ - టాటా మెక్‌ గ్రాహిల్స్‌ లేదా చాంద్‌  పబ్లికేషన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌- ఆర్‌.ఎస్‌.  అగర్వాల్‌, జనరల్‌ నాలెడ్జ్‌ - లూసెంట్స్‌ తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని