Updated : 25 Aug 2022 04:31 IST

జేఈ కొలువులకు మీరెంత సిద్ధం?

జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచిల్లో డిప్లొమా చదివిన విద్యార్థులూ, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చేసినవారూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు! రెండు అంచెల విధానంలో పరీక్షలు నిర్వహించి మెరుగైన ప్రతిభ చూపినవారిని కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. 

పేపర్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, పేపర్‌-2 రాత పరీక్షలో మేటి మార్కులతో నెగ్గినవారు గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌)లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులో నియమితులవుతారు. జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టు విభాగంలో సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం దాదాపుగా రూ.35,400-1,12,400 స్కేలుతో సుమారుగా రూ.50 వేల నుంచి రూ.55 వేల జీతం లభిస్తుంది. వీరికి కేంద్ర జలసంఘం, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్‌, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌, ఓడ రేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వ శాఖ తదితర సంస్థల్లో పనిచేసే అకాశం లభిస్తుంది. 

ఉద్యోగ బాధ్యతలు

* పని పర్యవేక్షణ: మొదటగా వీరు తాము చేయవలసిన ఉద్యోగ విధులకు సంబంధించిన విషయాలను పూర్తిగా పర్యవేక్షణ చేయాలి.   

* ప్రణాళిక: చిన్నచిన్న ప్రణాళికలు తయారుచేయడం, మరమ్మతులు లేదా పునరుద్ధరణ పనులకు అంచనా వేయాలి. తర్వాత తమ విభాగంలో ప్రధాన కార్యాచరణ సమగ్ర ప్రణాళికను తయారుచేయాలి. 

* అకౌంట్స్‌: తమ విభాగంలో కాంట్రాక్టర్ల ద్వారా చేయించిన పనికి సంబంధించిన రసీదులు, ఖర్చులకు బాధ్యత వహించాలి. అదేవిధంగా తమ విభాగంలోని స్టాక్‌ నిర్వహణ చేయాలి. 

* పథకాల అమలు: వివిధ ప్రభుత్వ పథకాల అమలులో జూనియర్‌ ఇంజినీర్‌ ముఖ్య పాత్ర వహించాలి. ఈ పథకాల అమలులో పనులు సులభంగా జరిగేలా చూసుకోవడం వీరి బాధ్యత. 

* ఉన్నతాధికారులకు సహాయపడటం: జూనియర్‌ ఇంజినీర్‌ తమ విభాగానికి సంబంధించిన ఎలాంటి బాధ్యతలైనా తానే చూసుకోవాలి. కానీ ముఖ్యమైన ప్రాజెక్టులను చేసేటప్పుడు తనపై అధికారులకు ప్రతిరోజూ నివేదిక పంపాలి. 

* ఉద్యోగ వృద్ధి అవకాశాలు: జూనియర్‌ ఇంజినీర్‌ అదే విభాగంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువ. వారి విభాగానికి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌ పరీక్షలను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిర్వహిస్తారు. ఇందులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా పదోన్నతి పొందుతారు.

పరీక్ష విధానం 

* పేపర్‌-1లో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులను పేపర్‌-2 రాయడానికి అనుమతిస్తారు.
* పేపర్‌-1 ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ¨ 0.25 రుణాత్మక మార్కులు.
* పేపర్‌-2 రాత పరీక్ష రాసేటప్పుడు సమాధానాలను పూర్తిగా హిందీలోగానీ లేదా ఇంగ్లిష్‌లోగానీ రాయాలి. కొన్ని సమాధానాలు ఇంగ్లిష్‌లో, మరికొన్ని హిందీలో రాస్తే ఎలాంటి మార్కులూ ఇవ్వరు.
* పేపర్‌-2 పరీక్షకు స్లయిడ్‌ రూల్‌, కాలిక్యులేటర్‌, లాగరిథమ్‌ టేబుల్స్‌, స్టీమ్‌ టేబుల్స్‌ను అభ్యర్థులు సొంతంగా తీసుకు వెళ్లవచ్చు.

పేపర్‌-1లో ఏవి ముఖ్యం? 

* ఈ పేపర్‌ను 3 భాగాలుగా విభజించారు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. సమయం మాత్రం 120 నిమిషాలు ఉంటుంది. దీన్ని బట్టి పరీక్ష రాసేటప్పుడు సమయపాలన అనేది ఎంత కీలకమో అర్థం చేసుకోవాలి.  
* ప్రశ్నలు చాలా సులభంగా డిప్లొమా స్థాయిలో ఉంటాయి. థియరీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ తగినంత సమయం కేటాయించాలి. కాబట్టి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడంతోపాటు ఎంత త్వరగా సమాధానాలు గుర్తించామనేది కూడా ముఖ్యం. సమాధానాలు త్వరగా రాయాలంటే అభ్యర్థులకు విస్తృతమైన సాధన అవసరం.
* పరీక్ష సమయంలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగిన ప్రశ్నలను మొదటగా ఎంచుకోవాలి. తక్కువ సమయంలో పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని ఎక్కువ సమయం పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్చు.

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ముఖ్యంగా వర్చువల్‌, నాన్‌వర్చువల్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్‌, క్లాసిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌, అనాలజీస్‌పై ప్రశ్నలు అడుగుతారు. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివిన అభ్యర్థులకు ఈ అంశాలు వాళ్లు చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్లు సాధన చేస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

2. జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహన, సమాజంపై అవి చూపే ప్రభావం పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. సాధారణంగా ఇలాంటి అంశాలపై డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ రోజువారీ వార్తా పత్రికలు, ముఖ్యమైన వార్తా సంచికలు, ప్రామాణిక పాఠ్య పుస్తకాలు చదివితే ప్రశ్నల సాధన సులభమవుతుంది.

3. జనరల్‌ ఇంజినీరింగ్‌: ఇందులో సంబంధిత విభాగానికి చెందిన ప్రశ్నలు అడుగుతారు. అంటే సివిల్‌ విద్యార్థులు సివిల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అలాగే మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఆయా విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

సివిల్‌ ఇంజినీరింగ్‌: అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహన పొంది అభ్యాసం మొదలుపెట్టడం మంచిది. పూర్వ సంవత్సరపు ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్‌, సాయిల్‌ మెకానిక్స్‌, ఫౌండేషన్‌, సర్వేయింగ్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడాన్ని గమనించవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ఎంతో కీలకం.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌: ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషీన్స్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. 

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

పేపర్‌-2 (కన్వెన్షనల్‌ టైప్‌)  
పూర్వ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇందులో మొత్తం ఆరు ప్రశ్నలు అడిగారు. ప్రతి ప్రశ్నకూ 60 మార్కులు కేటాయించారు. కానీ ప్రతీ ప్రశ్నలో మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించారు. ప్రతి విభాగానికీ 10 నుంచి 20 మార్కులు కేటాయించారు. మొత్తం ఆరు ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

సివిల్‌ ఇంజినీరింగ్‌లో గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్‌, సర్వేయింగ్‌, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్‌, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, స్ట్రక్చర్‌ అనాలిసిస్‌ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి వస్తే ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషీన్స్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఐసీ ఇంజిన్స్‌, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ సబ్జెక్టులు ముఖ్యమైనవిగా గమనించవచ్చు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విషయానికొస్తే ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, పవర్‌సిస్టమ్స్‌లను ప్రాధాన్యమున్న సబ్జెక్టులుగా భావించవచ్చు.


ఎవరు అర్హులు?

* సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచిల్లో డిప్లొమా / బీటెక్‌ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు.
* కొన్ని నియామకాలకు డిప్లొమాతోపాటు సంబంధిత విభాగాల్లో రెండు సంవత్సరాల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. లేదా తత్సమాన డిగ్రీ చదివినా సరిపోతుంది.
* పోస్టులకు అనుగుణంగా 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వయసువారు అర్హులు. వివిధ కేటగిరీల అభ్యర్థులకు కొంత వయసు సడలింపు ఉంది.

దరఖాస్తు 

* అభ్యర్థులు https://ssc.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను పూరించాలి. చేతిరాత ద్వారా లేదా పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులను స్వీకరించరు.
* పరీక్ష రుసుము రూ.100. దీన్ని యూపీఐ, భీమ్‌, ఎస్‌బీఐ చలాన్‌, నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించవచ్చు.
* మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీవారికి పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులూ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు.  


ముఖ్య తేదీలు

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 02.09.2022
* ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుం చెల్లించడానికి చివరి తేదీ: 03.09.2022
* ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష రుసుం చెల్లించడానికి చలాన్‌ జనరేట్‌ చేయడానికి చివరి తేదీ: 02.09.2022
* చలాన్‌ ద్వారా రుసుం చెల్లించడానికి చివరి తేదీ : 03.09.2022
* పేపర్‌-1 (ఆబ్జెక్టివ్‌) పరీక్ష తేదీ: నవంబరు 2022.
* పేపర్‌-2 (కన్వెన్షనల్‌) త్వరలో ప్రకటిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌. 

ఆంధ్రప్రదేశ్‌: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


ఇలా సన్నద్ధం కావాలి

ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్‌ స్టాండర్డ్‌ ఆధారంగా ఉంటాయి. డిప్లొమాతోపాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీ పడతారు. కాబట్టి డిప్లొమా విద్యార్థులు కొంత ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది.
* ముందుగా పరీక్ష విధానాన్నీ, సిలబస్‌నూ పూర్తిగా అవగతం చేసుకోవాలి. సన్నద్ధతకు ఇది మొదటి మెట్టు.
* సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ అంశాలు చదవాలో, వేటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలో అర్థమవుతుంది.
* అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికే అభ్యర్థులకు పరీక్షలో మంచి మార్కులు సాధించిపెట్టడానికి తోడ్పడుతుంది.
* రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా ప్రణాళిక ఉండాలి.  
* తమ స్థాయిని బట్టి సొంతంగా ప్రిపేర్‌ కావాలా లేదా కోచింగ్‌ అవసరమా అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ కోచింగ్‌ అవసరమైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ కోచింగ్‌లను ఎంచుకోవచ్చు.
* ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రి (మెటీరియల్‌)ని ఎంచుకోవడం సన్నద్ధతకు ప్రధానం.
* ప్రాథమికాంశాలపై సరైన అవగాహన తెచ్చుకుని తర్వాత గత సంవత్సరాల ప్రశ్నలూ, ఆన్‌లైన్‌ మాదిరి ప్రశ్నలూ సాధన చేయాలి.
* ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి.
* గత ప్రశ్నపత్రాలతో పాటు గేట్‌ లాంటి ఇతర పోటీ పరీక్ష ప్రశ్నపత్రాలను ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్ష స్థాయిలో సాధన చేయాలి.
* పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు ప్రతి చాప్టర్‌కూ సంబంధించి ముఖ్యాంశాలను చిన్నచిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి.
* చదివిన ప్రతి అంశాన్నీ పునశ్చరణ చేయాలి.
* ప్రిపరేషన్‌ తర్వాత ఎస్‌ఎస్‌సీ జేఈ మాక్‌ టెస్టులు రాయడం చాలా ముఖ్యం. ఇవి రాసిన తర్వాత చేసిన తప్పులను సవరించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts