ప్రిలిమ్స్‌ లోపాల సవరణతో విజయానికి ఆస్కారం!

గ్రూప్‌ 4, ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయ్యాయి. మెయిన్స్‌ నిర్వహణ దిశగా ఏపీపీఎస్సీ అడుగులేస్తున్న నేపథ్యంలో.. వాటి సన్నద్ధతకు సంబంధించిన మెలకువలు ఇవిగో!

Updated : 08 Sep 2022 16:03 IST

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-4    
ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ మెయిన్స్‌

గ్రూప్‌ 4, ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలు పూర్తయ్యాయి. మెయిన్స్‌ నిర్వహణ దిశగా ఏపీపీఎస్సీ అడుగులేస్తున్న నేపథ్యంలో.. వాటి సన్నద్ధతకు సంబంధించిన మెలకువలు ఇవిగో!

మెయిన్స్‌ పరీక్ష ప్రిలిమినరీ మాదిరిగానే ఉంటుందా?లేదా లోతైన విశ్లేషణలతో కూడిన ప్రశ్నలు వస్తాయా? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సందేహాలు చాలామంది అభ్యర్థుల్లో ఉన్నాయి. అయితే ప్రశ్నపత్రం సాధారణ స్థాయిలో ఉంటుందా, కఠినత్వం పెంచుతారా అనే ఆలోచనలు పెట్టుకోకుండా సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో మరోసారి సన్నద్ధం కావడం సరైన నిర్ణయం అవుతుంది.

ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ పరీక్షలో అన్ని విభాగాలకూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తే ప్రిలిమినరీలో ప్రాధాన్యం ఇచ్చిన విభాగాల్ని మాత్రమే మెయిన్స్‌లోనూ చదివితే సరిపోదా.. ఈ తరహా ఆలోచన కూడా మంచిది కాదు. ఎందుకంటే పేపర్‌ తయారీదారులు చేసిన తప్పుల్ని సరిచేసుకోవచ్చు. అన్ని విభాగాలకూ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. లేదా ప్రిలిమినరీలో మాదిరిగానే కొన్ని విభాగాలకే ప్రాధాన్యం పరిమితం చేయవచ్చు. అందువల్ల వివిధ విభాగాలకు ఇచ్చే వెయిటేజిని ఊహించుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా అన్ని విభాగాలకూ సమప్రాధాన్యం ఇచ్చి ప్రిపేర్‌ అవటం సముచితం.

విస్తృతంగా సిద్ధం కావాలి
*
మెయిన్స్‌ పరీక్ష తర్వాత 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకని మెయిన్స్‌లో మరింత విస్తృతంగా సిద్ధమవుతూ స్కోరు పెంచుకునేందుకు అంకితం అవ్వాలి.
* ప్రిలిమినరీలో స్కోరు తగ్గటానికి ప్రాథమిక కారణాలు వెతకాలి. ప్రిపరేషన్‌ సరిపోక స్కోరు తగ్గితే ఆయా విభాగాలను గుర్తించి ప్రభావవంతంగా వాటిని చదవాలి. ప్రశ్నపత్రం తయారీదారుల లోపాల వల్ల స్కోరు తగ్గితే ప్రిలిమినరీలో అనుసరించిన సన్నద్ధతను మెయిన్స్‌కు కూడా అన్వయించుకోవచ్చు.
* ప్రిలిమినరీలో వచ్చిన స్కోరు సరైనదా కాదా అని ఎలా నిర్ణయించుకోవాలనే సందేహంతో చాలామంది అభ్యర్థులున్నారు. జిల్లా స్థాయి పోటీ కాబట్టి ప్రిలిమినరీలో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ ఎంపిక చేసినట్లయితే 70 మార్కులకు అటుఇటుగా ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో మెయిన్స్‌ అవకాశాలు ఉంటాయని అంచనా వేసుకోవచ్చు.
* పోస్టులు తక్కువగా ఉన్న జిల్లాలో కటాఫ్‌ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
* అయితే కటాఫ్‌ అటుఇటుగా ఉన్నవారు మెయిన్స్‌కు క్వాలిఫై అవ్వవచ్చేమో కానీ అవి విజయానికి కావలసిన మార్కులు కాదని గుర్తించాలి.
* సాధారణంగా పోటీ పరీక్షల్లో సగటు స్థాయిలో ప్రశ్నపత్రం ఉన్నప్పుడు 65 నుంచి 70 శాతం మార్కులు ఉద్యోగ ఎంపికకు ప్రామాణికంగా ఉంటాయి. అంటే 150 మార్కులకు 90 నుంచి 100 మార్కుల వరకు సాధించగలిగితే ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది.
* ఇలాంటి సాధారణ ప్రామాణికతను దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు అంతిమ విజయానికి సరిపోతాయా లేదా అని నిర్ధారించుకోవాలి. ఆ మేరకు ప్రిపరేషన్‌ను మెరుగుపరుచుకోవాలి.


గ్రూప్‌ 4

ప్రిలిమినరీలో జనరల్‌ స్టడీస్‌లో 100 ప్రశ్నలకే అవకాశం ఉన్నందువల్ల కొన్ని విభాగాల ప్రాధాన్యం తగ్గి ఉండవచ్చు. కానీ మెయిన్స్‌ పరీక్షలో 150 ప్రశ్నలకు అవకాశం ఉన్నందున కవర్‌ చేసే అవకాశం ఉండవచ్చు

ఇంగ్లిష్‌, తెలుగు భాషలు  
ప్రిలిమినరీ పరీక్షలో సాధారణ ప్రశ్నలు మాత్రమే అడిగారు. చాలా ప్రశ్నలకు ప్రిపరేషన్‌ లేకుండా కూడా సమాధానాలు గుర్తించే స్థాయిలో ప్రశ్నలున్నాయి. అదే రీతిలో మెయిన్స్‌లో కూడా ప్రశ్నలు వస్తాయా అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. గ్రూప్‌ 4 ఉద్యోగం మొత్తం ఉద్యోగ వ్యవస్థలో దిగువ స్థాయి ఉద్యోగమే కాబట్టి ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఆశించవచ్చు. పరీక్షలు నిర్వహించేది ఏపీపీఎస్సీ కాబట్టి దాదాపుగా సాధారణ స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. కానీ ప్రిపేర్‌ అయ్యేటప్పుడు అంతిమ ఎంపిక కోసం మెయిన్స్‌ పరీక్ష హాజరవుతున్నారు కాబట్టి కాస్త లోతైన స్థాయిలోనే ప్రిపేర్‌ అవటం శ్రేయస్కరం.

ప్రిలిమినరీ పరీక్షలో రెండు భాషలకూ కేవలం 50 మార్కులే ఉన్నందువల్ల ఇచ్చిన ప్రశ్నల్లో వైవిధ్యం తక్కువగా ఉంది. ఆ తరహ ప్రశ్నలకే అవకాశం ఉంటుందా?  మరింత విస్తృతంగా విభిన్న ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుందా? అనే ఆలోచనలతో అభ్యర్థులు ఉన్నారు.
మెయిన్స్‌ పరీక్షలో 150 ప్రశ్నలకు రెండు భాషల నుంచి అవకాశాలు ఉన్నందువల్ల తప్పనిసరిగా సాధారణ ప్రశ్నలతో పాటు లోతైన ప్రశ్నలనూ ఈసారి ఆశించవచ్చు. రెండు భాషల్లో అనేక అంశాలపై విస్తృతంగా ప్రశ్నలకు అవకాశం ఉంటుంది. ఈ మార్పుని గమనించి సిద్ధమైనప్పుడే భాషల పేపర్లో కూడా మంచి స్కోరు సాధించగలుగుతారు. అంతిమంగా అప్పుడే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది.


ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌

ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌కు కేవలం 50 మార్కుల పరిధి ఉన్నందున అనేక విభాగాలపై ప్రశ్నలు నామమాత్రంగా వచ్చాయి. కానీ మెయిన్స్‌ పరీక్షలో 150 ప్రశ్నలకు జనరల్‌ స్టడీస్‌ పాత్ర ఉంది కాబట్టి విజయాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారణం వల్ల రాబోయే ఎండోమెంట్స్‌ పరీక్షకు జనరల్‌ స్టడీస్‌ని పూర్తిస్థాయిలో ప్రిపేర్‌ అవ్వాలి. సాధారణ స్థాయి కంటే కఠినత్వ స్థాయి ఎక్కువగానే ఉంటుందని భావించి సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
* గ్రూప్‌-2, గ్రూప్‌-1 ప్రిలిమినరీ స్థాయిలో జనరల్‌ స్టడీస్‌ చదవటం అన్నివిధాలా సరైన నిర్ణయం అవుతుంది. ప్రిలిమినరీ అనుభవాలతో అదే స్థాయిలో ప్రిపేరైతే మాత్రం ఇబ్బందికర స్థితి ఏర్పడవచ్చు.
* హిందూ తాత్వికత- దేవాలయ వ్యవస్థపై ప్రిలిమినరీలో 100 మార్కుల ప్రశ్నలే ఉన్నప్పటికీ మెయిన్స్‌లో 150 మార్కుల ప్రశ్నలున్నాయి. వివిధ రకాలైన ప్రశ్నలు, రిమోట్‌ ప్రశ్నలకు అవకాశం ఎక్కువ.
* ప్రిలిమినరీలో హిందూ తాత్వికత- దేవాలయ వ్యవస్థపై అడిగిన ప్రశ్నలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ మెయిన్స్‌ పరీక్షలో అదే స్థాయి ప్రశ్నలు ఉంటాయని ఆశించలేం. అందువల్ల విస్తృత పరిధిలో లోతైన అధ్యయనం చేయటం అన్ని రకాలగానూ ప్రయోజనకరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని