ఏ పోలికలు? ఏ ప్రత్యేకతలు?

ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌/ ఈఏపీసెట్‌ ర్యాంకు ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న తరుణమిది. విభిన్న రకాల బ్రాంచీలు అందుబాటులో ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)కే అధిక ఆకర్షణ కనిపిస్తోంది. ఇంత గిరాకీ ఉన్న ఈ బ్రాంచి విశిష్టతలు ఏమిటి? దీనికీ ఐటీ (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ) బ్రాంచికీ సారూప్యాలు ఏమిటి?

Updated : 05 Sep 2022 09:48 IST

కంప్యూటర్‌ సైన్స్‌ & ఐటీ 

ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌/ ఈఏపీసెట్‌ ర్యాంకు ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న తరుణమిది. విభిన్న రకాల బ్రాంచీలు అందుబాటులో ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)కే అధిక ఆకర్షణ కనిపిస్తోంది. ఇంత గిరాకీ ఉన్న ఈ బ్రాంచి విశిష్టతలు ఏమిటి? దీనికీ ఐటీ (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ) బ్రాంచికీ సారూప్యాలు ఏమిటి?

ఇంచుమించు ప్రతి రంగంలోనూ రోజూ ఏదో ఒక కొత్త రకం ఉపకరణమో, సేవలో మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. ఈ ఆవిష్కరణలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కంప్యూటర్‌ వ్యవస్థ కారణమవుతోంది. నిత్య నూతన ఆవిష్కరణలతో వివిధ స్థాయుల్లో విస్తృత ఉపాధి కల్పిస్తోంది కంప్యూటర్‌ రంగం. ఈ కారణంగానే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో దీనిది ప్రత్యేక స్థానం, స్థాయి.  

ఐతే ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారందందరికీ ఈ కోర్సులో ప్రవేశం దొరకదు కదా! విద్యార్థులు, తల్లిదండ్రులూ కూడా సీఎస్‌ఈకి సమానంగా ఐటీ రంగంలో అవకాశాలు అందివ్వగల ప్రత్యామ్నాయ కోర్సుల కోసం వెతకడం మామూలే. మూడు విషయాలు వీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.

1 ఏ ఇంజినీరింగ్‌ కోర్సూ వేరే ఏ ఇంజినీరింగ్‌ కోర్సుకు ప్రత్యామ్నాయం కాదు. పోటీ కూడా కాదు. మన శరీరంలోని అంగాల మాదిరిగానే వేటికవి ప్రత్యేకతలు సంతరించుకుని ఉంటాయి. కుడి చెయ్యి ఎడమ చెయ్యికి ప్రత్యామ్నాయం కాదు. అలాగే ఒక వస్తువు ఉన్న స్థానాన్ని కచ్చితంగా కనుక్కోవాలంటే రెండు కళ్ళూ అవసరమే కదా!

2 అన్ని బ్రాంచీల ఇంజినీరింగ్‌ అభ్యర్థులనే కాదు, ఏ రంగంలోనైనా కనీస అర్హతలు, మెలకువలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో నియమించుకుంటాయి. కంప్యూటర్‌ అనేది ఒక ఉపకరణం మాత్రమే. దాని అనువర్తనం (అప్లికేషన్‌) ఏ రంగంలోనైనా చేసుకోవచ్చు. కరోనా ప్రభావంతో విద్యారంగంలోనూ కంప్యూటర్‌ అధారిత విద్యా బోధన జరిగింది. కంప్యూటర్‌ నైపుణ్యాలతో విలక్షణంగా విద్యా బోధన చేసే మెలకువలున్న కొత్త తరం ఉపాధ్యాయులెందరికో మంచి జీతాలతో అవకాశాలు దొరికాయి.

3 మనిషి నాణ్యమైన జీవనం కోసం సైన్స్‌ రంగంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఆ పరిశోధనల ఫలితాలే నూతన టెక్నాలజీలు. కాబట్టి నేర్చుకున్న విద్యా సంపదను సమాజం బాగుకు ఉపయోగించాలనే మంచి ఆలోచనతో కష్టపడే ప్రతి ఒక్కరికీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఉంటుంది.

ఏ ఉద్యోగాలు ఉంటాయి?

సీఎస్‌ఈ, ఐటీ... రెండు స్పెషలైజేషన్ల వారూ అన్ని ఉద్యోగాలకు సమాన అవకాశాలు పొందినా కొన్ని  నిర్దిష్ట ఉద్యోగాలు ఆయా స్పెషలైజేషన్‌ వారికే సొంతం.

సి.ఎస్‌.ఇ. ప్రత్యేకం

* వెబ్‌ డెవలపర్‌

* డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌

* సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌

* కంప్యూటర్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌

* కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌

ఐటీకి ఇవి ప్రత్యేకం

* నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌

* ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజర్‌

* కంప్యూటర్‌ సపోర్ట్‌ స్పెషలిస్ట్‌

* డేటా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌

* ఎథికల్‌ హ్యాకర్‌  

* కంప్యూటర్‌ టెక్నీషియన్‌

* డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌

* ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజర్‌.

కంప్యూటర్‌ రంగం అంటే ఏసీ రూములూ, పీజాలు, బర్గర్లు, థమ్స్‌ అప్‌లు కాదు. అలాగే సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్ట్రికల్‌ అంటే మట్టి, దుమ్మూ ధూళీ కాదు. రెండో కోవకు చెందినవారు ఎండలో చెమటోడిస్తే మొదటి కోవకు చెందినవారు ఏసీ రూముల్లోనే లోలోపలే ఒత్తిడి పడుతూ ఉంటారనేది మరవకూడదు. సి.ఎస్‌.ఇ.కి ఆదరణ ఎంత కనిపిస్తున్నా వేరే బ్రాంచిలు బాగా లేవు అనుకోవడం సరైన దృష్టి కాదు. మన శరీరంలో వేర్వేరు భాగాలు చక్కగా మేళవించి పని చేసినట్లే వివిధ ఇంజినీరింగ్‌ శాఖలు పరస్పర సమ్మేళనంతో అవసరమైనవరకు అనుసంధానం చేసుకుంటూ సమాజానికి సేవలందిస్తున్నాయి.  


ఏమిటి వ్యత్యాసం?

సి.ఎస్‌.ఇ.- ఐ.టి. అవినాభావ సంబంధం ఉన్న బ్రాంచీలే. రెండు కోర్సుల్లోనూ ఇంచుమించు అవే సబ్జెక్టులు ఉంటాయి. వీటి ముఖ్యమైన వ్యత్యాసాలు చూద్దాం.

* సిలబస్‌ పరమైనవి.  

* సి.ఎస్‌.ఇ.లో ముఖ్యంగా వివిధ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థల రచన, నిర్మాణం, అభివృద్ధి, పరీక్ష, నిర్వహణలకు అనుగుణంగా కోర్సు బోధన ఉంటుంది. ఐటీలో ప్రధానంగా ఇంజినీరింగ్‌ ద్వారా అభివృద్ధి చేసిన టెక్నాలజీని ప్రజల అవసరం, ఉపయోగం, ధర, ఎక్కువ మోతాదుల్లో (బల్క్‌ ప్రొడక్షన్‌) ఉత్పత్తిలను అనుసరించి మార్పులు చేసేలా విద్యా బోధన ఉంటుంది

* అనువర్తన పరంగా (అప్లికేషన్‌ డొమెయిన్‌) గమనిస్తే... వివిధ వ్యవస్థలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, కంప్యూటర్‌ మైక్రో ప్రాసెసర్ల అభివృద్ధి, కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ మొదలైన రంగాల్లో సీఎస్‌ఈ నిపుణుల అవసరం ఉంటుంది.

టెలి కమ్యూనికేషన్స్‌ లాంటి సమాచార వ్యవస్థల రచన, నిర్మాణం, నిర్వహణ, డేటా బేస్‌ వ్యవస్థల- నెట్‌వర్క్‌ వ్యవస్థల ఏర్పాటు లాంటి మౌలిక సదుపాయాల అవసరాలు ఐటీ చూస్తుంది. అలాగే సి.ఎస్‌.ఇ. వారు అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లు ప్రజా వినియోగం నిమిత్తం ఈ-సేవ లాంటి ఐటీ సేవల రంగంలోనూ ఉంటాయి.

*. కెరియర్‌ పరంగా చూస్తే... కంప్యూటర్‌ రంగం ఇంకా బాల్య దశలోనే ఉంది, కంప్యూటర్‌ ఆధారిత సేవలు ఇప్పటివరకూ తక్కువగానే లభిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంకా అన్ని రంగాలకూ అందుబాటులో లేనందువల్ల ఈ రెండు బ్రాంచీల వారికీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి చేతినిండా పని ఉంటుంది. అందుకే సి.ఎస్‌.ఇ. వారికి సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లుగా అవకాశాలు కొద్దిగా ఎక్కువ అనే చెప్పవచ్చు. కానీ కోర్సు, శిక్షణ, మెలకువల పరంగా, పరిశ్రమల అవసరాల పరంగా ఎలా చూసినా ఐటీ వారికి కూడా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లుగా అదనంగా అవకాశాలున్నాయి. ప్రోగ్రామర్ల స్థాయి మొదలుకొని డెవలపర్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ మొదలైన ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి.

అంకుర సంస్థలు (స్టార్టప్‌) మొదలుకొని బడా సంస్థల్లో అపారంగా ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థిక రంగం, సామాజిక శాస్త్ర రంగం, వైద్య, విద్య, మీడియా, సినిమా తదితర వైవిధ్య రంగాల్లో వీరి అవసరం ఉంది. ఆటోమేషన్‌ వ్యవస్థల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వీరిదే. టీసీఎస్‌, విప్రో, ఆక్సెంచర్‌ లాంటి ప్రముఖ సంస్థలు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. రెండు రంగాలకు చెందినవారికీ ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి. చేసే ఉద్యోగం,    మెలకువలు, నైపుణ్యాలు, ప్రతిభ, సామర్థ్యాలను బట్టి జీతం నిర్ణయిస్తారు. రెండు ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిలలో మంచి పట్టు, డేటా స్ట్రక్చర్స్‌లో బాగా ఉండాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ మెలకువలు బాగా తెలిసుంటే మంచి జీతం వస్తుంది.


కొత్త టెక్నాలజీలూ.. నైపుణ్యాలూ

ఈ రంగంలో ఎన్నో  కొత్త నైపుణ్యాలు కాలంతోపాటు పుట్టుకొస్తున్నాయి. అలాగే పరిశ్రమలు డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌ వైపు మొగ్గు చూపుతుండటంతో పాత తరహా ఉద్యోగావకాశాలు తగ్గి, కొత్త రకం ఉద్యోగాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వేగానికి తగినట్టు కొత్త మెలకువలను నేర్చుకోకపోతే వెనుకబడిపోవడమే కాకుండా ఉద్యోగానికే ముప్పు రావొచ్చు. సంవత్సరానికి ఐదు లక్షలకు మించి జీతం తీసుకోవాలంటే సగటు స్థాయి నైపుణ్యాలు సరిపోవు. మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ లాంటి రంగాల్లో అదనపు నైపుణ్యాలు, సేల్స్‌ ఫోర్స్‌ లాంటి టూల్స్‌ నేర్చుకోవడం ఎంతో అవసరం. అన్ని రంగాల మాదిరే సాఫ్ట్‌వేర్‌ విభాగంలోనూ ఆటోమేషన్‌ ప్రక్రియ నడుస్తోంది. సమాంతరంగా ప్రోగ్రాం కోడ్‌ అభివృద్ధి చేసే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిలూ, ప్లాట్‌ఫారాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఐటీ పరిశ్రమలనుంచి మద్దతు లభిస్తోంది. పరిశ్రమలు వీటిని కొనుగోలు చేసి తక్కువ తప్పులతో, స్వల్పకాలంలో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసేందుకే మొగ్గు చూపిస్తున్నాయి. ఇటువంటి వాటి పట్ల అవగాహన ఉంటే ఎక్కువ జీతం తెచ్చుకునే అవకాశం ఉంది.

సి.ఎస్‌.ఇ. వారికి కావలసినవి  

* ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌

* క్రియేటివ్‌ థింకింగ్‌

* క్రిటికల్‌ థింకింగ్‌

* డేటా ఎనాలిసిస్‌ అండ్‌  డేటాబేస్‌ టూల్స్‌

* ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌

* లాజికల్‌ రీజనింగ్‌    

* అల్గారిథం డిజైనింగ్‌

* కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

ఐటీ¨ వారికి ఏం అవసరమంటే..

* యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ డిజైన్‌

* అనలిటికల్‌ థింకింగ్‌

* క్రియేటివ్‌ థింకింగ్‌

* ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌

* ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌

* కమ్యూనికేషన్‌, నెట్‌వర్కింగ్‌ అండ్‌ లీడర్‌షిప్‌ స్కిల్స్‌

* టెక్నికల్‌ రైటింగ్‌ అండ్‌ మల్టీ టాస్కింగ్‌ స్కిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని