ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏవి ఎంచుకుంటే మేలు?

నిర్వహణ శాస్త్రంలో ప్రతి పనికీ ఓ ఉత్తమ మార్గం ఉంటుంది.అనేక ఎంపికల్లోంచి ఆ మార్గాన్ని ఎంచుకుంటే కచ్చితంగా లక్ష్యాలను చేరుతారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగార్థుల ముందున్న పరిస్థితి ఇదే! ఒకేసారి అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన

Updated : 06 Sep 2022 08:57 IST

నిర్వహణ శాస్త్రంలో ప్రతి పనికీ ఓ ఉత్తమ మార్గం ఉంటుంది.అనేక ఎంపికల్లోంచి ఆ మార్గాన్ని ఎంచుకుంటే కచ్చితంగా లక్ష్యాలను చేరుతారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగార్థుల ముందున్న పరిస్థితి ఇదే! ఒకేసారి అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తుండటంతో ఎన్నో సందేహాలు... ఏ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను  ఎంచుకోవాలనే విషయంలో సందిగ్ధత. ఈ అంశాలపై స్పష్టతనిస్తూ మార్గదర్శనం చేసే కథనం ఇదిగో!

‘ఏ నోటిఫికేషన్‌కు సిద్ధపడాలి?’ అనే విషయంలో- ఉద్యోగ స్వభావాన్ని బట్టి, జిల్లాల వారీగా, జోన్ల వారీగా, రాష్ట్రస్థాయిలో రోస్టర్‌ పాయింట్స్‌ని బట్టి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేదాన్ని ముందు ప్రమాణంగా నిర్ణయించుకోవాలి. ఇది అనుకూలంగా ఉంటే నోటిఫికేషన్‌లోని ఉద్యోగాలు తమ సామర్థ్యాలకు తగినవని భావిస్తే... పోటీ పరీక్షల యుద్ధంలోకి దిగాలి. కనిపించిన ప్రతి నోటిఫికేషన్‌కూ దరఖాస్తు చేయటం, దశ- దిశ, లక్ష్యం లేకుండా ప్రయత్నం చేయటం వల్లే అనేకమంది అభ్యర్థులు విఫలమవుతారు. నిరాశ, నిర్వేదానికి గురవుతారు. అలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే పైన చెప్పిన రెండు విషయాలనూ పాటించాలి.

గ్రూప్‌-1

నోటిఫికేషన్‌ వెలువడగానే భవిష్యత్తులో ఏయే నోటిఫికేషన్లు వస్తాయో తెలియక వచ్చిన ఒక్క అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే తపనతో పెద్దఎత్తున నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. కానీ తమ సామర్థ్యాలను సరిగా అంచనా వేసుకుని ఉండకపోవచ్చు. తర్వాత ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో గ్రూప్‌-1 సన్నద్ధత వదిలేసి మరలా ఆయా నోటిఫికేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రిపరేషన్‌లో కొనసాగుతున్న గ్రూప్‌-1 అభ్యర్థులు కింది లక్షణాలు ఉన్నప్పుడే విజయం సాధించే అవకాశం ఉంది. ఆ లక్షణాలు లోపించినట్లయితే మిగతా నోటిఫికేషన్ల వైపు దృష్టి సారించడం మంచిది.

* బలమైన భావ వ్యక్తీకరణ 

* వివిధ విషయాలను విశ్లేషించగలగడం

* అర్థవంతంగా గణాంకాలను వినియోగించడం

* చక్కగా, అర్థమయ్యేలా రాసే నేర్పు 

* రాత పరీక్షలో అడిగే వివిధ రకాలైన ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు రాసే నైపుణ్యం

* సొంత ఆలోచనలతో నోట్సు తయారు చేసుకోవడం 

* ప్రతిభావంతులైన పోటీదారులను ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం, ఉత్సాహం

* దీర్ఘకాలిక సన్నద్ధతకు కావలసిన వనరులను సమకూర్చుకునే సమర్థత 

* ఒక విషయాన్ని విస్తృతీకరించగలగటం, సంక్షిప్తీకరించగలగటం

* క్రమం తప్పకుండా, నిరంతరాయంగా సమయ ప్రణాళిక ప్రకారం చదివే సహనం, ఓపిక 

వీటిలో ఏ ఒక్క లక్షణం లోపించినా విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. అందుకని నిష్పాక్షిక అంచనా వేసుకుని ముందుకెళ్లటం లేదా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవటం మేలు. 

గ్రూప్‌-2

ఆబ్జెక్టివ్‌ పరీక్ష విధానం కాబట్టి సాధారణంగా చాలామంది అభ్యర్థులు ఉత్సాహం చూపుతారు. గ్రూప్‌-2ని పకడ్బందీగా చదివితే గ్రూప్‌-3, ఇతర పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ విభాగాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఈ దృక్పథంతోనే చాలామంది 
గ్రూప్‌-2 పరీక్ష పట్ల ఆసక్తి చూపుతారు. గ్రూప్‌-2లో విజయం సాధించేందుకు ఈ లక్షణాలు ఉండాలి.

* చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు విస్తృత అధ్యయనం (ఎందుకంటే ఏ మూల నుంచైనా బిట్లు రావొచ్చు) 

* తెలుగు అకాడమీ ప్రత్యేక ప్రచురణలు, విశ్వవిద్యాలయాల పుస్తకాలు, ప్రభుత్వ అధికారిక ప్రచురణలు, వెబ్‌సైట్లు మొదలైన అనేక వనరులను పేపర్ల వారీగా, చాప్టర్ల వారీగా, అంశాల వారీగా చదవగలిగిన నేర్పరితనం

* గ్రూప్‌-1 పరీక్షలో విశ్లేషణ పరిజ్ఞానం ప్రధానమైతే గ్రూప్‌-2 పరీక్షలో విషయపరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం. కాబట్టి అవసరమైతే బట్టీ పట్టయినా కొంత సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోగలిగే సామర్థ్యం

* ఎకానమీలాంటి పేపర్లో విస్తృతమైన గణాంకాలను గుర్తుంచుకునే సామర్థ్యం

* భారతదేశ, తెలంగాణ చరిత్రల్లో, తెలంగాణ ఉద్యమంలో అనేక వాస్తవ ఆధారిత అంశాలను జ్ఞాపకం ఉంచుకోగలిగే సత్తా

* రాజ్యాంగ సంబంధ వివిధ రకాలైన ఆర్టికల్స్, కోర్టు కేసులపై పట్టు, విశ్లేషణ సామర్థ్యాలు

* భారత సామాజిక సమస్యలపై స్థూల- సూక్ష్మ అవగాహన. వీటిని తెలంగాణ సమాజానికి అన్వయించుకునే దృష్టి

* విస్తృతమైన జనరల్‌ స్టడీస్‌ విభాగాలను చదివేందుకు మౌలిక పరిజ్ఞానంతో పాటు వర్తమాన అనువర్తన పరిజ్ఞానాన్నీ అలవర్చుకునే నైపుణ్యాలు. అప్పుడే జనరల్‌ స్టడీస్‌లో కనీసం 65% మార్కులు, విజయావకాశాల మెరుగుదల సాధ్యం

గ్రూప్‌-3

గ్రూప్‌-2లో ఉన్న సిలబస్‌ అంశాలన్నీ గ్రూప్‌-3లోనూ ఉన్నాయి. అందువల్ల గ్రూప్‌-2 గట్టిగా ప్రిపేరయితే గ్రూప్‌-3 సులభంగానే సాధించవచ్చు. గ్రూప్‌-2లో పేర్కొన్న లక్షణాలన్నీ గ్రూప్‌-3 అభ్యర్థులకు కూడా ఉండాలి. అయితే కొంతమంది గ్రూప్‌-2 స్థాయిలో తాము చదవలేమని భావిస్తూ గ్రూప్‌-3 మాత్రమే రాయాలనుకుంటారు. ఇలాంటి అభ్యర్థులు ఈ కింది లక్షణాలను అలవర్చుకోవాలి.

* సిలబస్‌లోని అంశాలపై ప్రాథమిక అవగాహన

* సగటు స్థాయి, సులభ స్థాయి ప్రశ్నలపై దృష్టి

* ప్రధానంగా ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు, సమాచారంపై ఆధారపడిన ప్రిపరేషన్‌.

* గ్రూప్‌-2 అభ్యర్థులతో పోటీపడేందుకు విశ్లేషణాత్మక, అన్వయాత్మక ప్రశ్నలకు కూడా తయారయ్యేలా సమయం కేటాయించుకునే ప్రణాళిక, అమలు. 

గ్రూప్‌-4

ఇది దిగువ స్థాయి పరీక్ష అయినా ప్రతి నిరుద్యోగీ రాసే పరీక్ష అని చెప్పవచ్చు. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. కేవలం గ్రూప్‌-4 మాత్రమే రాసే అభ్యర్థులు తీవ్రమైన పోటీని దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున ప్రిపేర్‌ అవ్వటమే మంచిది.

* గ్రూప్‌-3 పరీక్షలో మాదిరిగానే ఫ్యాక్ట్‌ ఆధారిత  ప్రశ్నలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయా విషయాలపై దృష్టి పెట్టడం సరైన నిర్ణయం.

* సెక్రటేరియల్, మానసిక సామర్థ్యాల అంశాలపై పట్టు సాధించేందుకు నిరంతర సాధన ఉపయోగపడుతుంది. ఆ సామర్థ్యం ఉన్నప్పుడే రాణించగలమని గుర్తించాలి.

* వీలైనన్ని పాత ప్రశ్నపత్రాలను సాధన చేసే సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. తెలంగాణ సంబంధిత వివిధ అంశాలు ప్రశ్నల రూపంలో వచ్చే అవకాశం ఉన్నందున ఆ పరిజ్ఞానంపై పట్టు సాధించాలి.

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌/డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్, ఇతర నోటిఫికేషన్లు 

గ్రూప్స్‌ నోటిఫికేషన్లతో పోల్చినప్పుడు ఈ నోటిఫికేషన్‌లకు పోటీ నామమాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లుగా మహిళలకు మాత్రమే అవకాశం ఉండటం, అది 11 వివిధ రకాల డిగ్రీలున్నవారికే అవకాశం ఇవ్వటం వల్ల పోటీ పెద్దగా ఉండదు. డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ నోటిఫికేషన్‌లో కూడా కొన్ని సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ ఉన్నవారిని అర్హులుగా ప్రకటించడంతో అక్కడ కూడా పోటీ నామమాత్రమే. ఇలా ఒక ప్రత్యేక సబ్జెక్టు ద్వారా నిర్వహించే పోటీ పరీక్షల్లో ఆయా అభ్యర్థులకు అవకాశాలు అధికం కాబట్టి ముందస్తుగా ఆయా నోటిఫికేషన్ల వైపు చూడటమే సరైన నిర్ణయం అవుతుంది. జనరల్‌ స్టడీస్‌కూ, సబ్జెక్ట్‌ పేపర్‌కూ సమ ప్రాధాన్యం ఇచ్చి సిద్ధమైతేనే ముందుగా ఒక ఉద్యోగాన్ని ఆశించవచ్చు. కేవలం సబ్జెక్టు పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. జనరల్‌ స్టడీస్‌పై కూడా పట్టు సాధించేందుకు అధిక సమయానికి కేటాయించగలిగే సామర్థ్యం అవసరం.

తాజాగా 1540 ఏఈఈ పోస్టులు

ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన ఈ ఉద్యోగాల్లో జనరల్‌ స్టడీస్‌తో పాటు సబ్జెక్టు ఓరియెంటెడ్‌ పేపర్‌ కూడా ఉంటుంది. ప్రాథమిక దశలో ఇంజినీరింగ్‌ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి చదువుతూ జనరల్‌ స్టడీస్‌పై పట్టు తెచ్చుకోవాలి. గతంలో గ్రూప్‌-1, 2 లాంటి పరీక్షలు సిద్ధమైనవారికి జనరల్‌ స్టడీస్‌లో అత్యధిక మార్కులు వచ్చే అవకాశం ఉంది. వారు సబ్జెక్టు పేపర్లో కూడా రాణిస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫ్రెష్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సబ్జెక్టు పేపర్‌తో పాటు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌పై గట్టిపట్టు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి.

జేఎల్, డీఎల్‌ నోటిఫికేషన్లు 

ఇవి త్వరలో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరీక్షల్లో కూడా సబ్జెక్టు ఆధారిత ప్రశ్నపత్రంతో పాటు జనరల్‌ స్టడీస్‌ కూడా కీలక పాత్రను పోషిస్తుంది. సంబంధిత సబ్జెక్టులో పట్టు తెచ్చుకుంటూనే జనరల్‌ స్టడీస్‌పై కూడా పూర్తిస్థాయి అవగాహన కలిగే విధంగా అధ్యయన తీరు తెన్నులు ఉండాలి. ఇలాంటి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఈ తరహా పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది.

ఒకటికి మించిన నోటిఫికేషన్లకు సిద్ధపడటం

పరీక్షల తేదీలను బట్టి మాత్రమే ఒకటికి మించిన నోటిఫికేషన్లకు సిద్ధపడే వ్యూహం రచించుకోవాలి. ఎక్కువ రాళ్లు వేస్తే ఏదో ఒకటి తగులుతుందనే ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి. సిలబస్, అందుబాటులో సమయం ఆధారంగా ఏ నోటిఫికేషన్‌ అనుసంధానం చేసుకుంటే గరిష్ఠ ఫలితం సాధించగలమో విశ్లేషించుకుని ఒకటికి మించిన నోటిఫికేషన్లకు సిద్ధపడవచ్చు.

* గ్రూప్‌-2, 3 పరీక్షలను ఒకే ప్రిపరేషన్‌తో ఎదుర్కోవచ్చు.

* అదనంగా సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ లాంటి సబ్జెక్టుకి మరో గంట కేటాయిస్తే గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లు మూడింటినీ ఎదుర్కోవచ్చు.

* ప్రత్యేక సబ్జెక్టు పేపర్‌గా ఉన్న అభ్యర్థులు మాత్రం గ్రూప్స్‌తో లభించే సమయాన్ని బట్టి అనుసంధానించుకుని చదవచ్చు.

* గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లను ఒకేసారి ఎదుర్కొనే ఆలోచన ఉన్న అభ్యర్థులు ఏం చేయాలి? పైన పేర్కొన్న లక్షణాలు తమలో ఉన్నాయో లేదో విశ్లేషించుకుని, అదనంగా మరో రెండు గంటలు కష్టపడగలిగే తత్వం ఉన్నప్పుడే ముందుకు సాగాలి. ఈ రెండు పరీక్షల మధ్య విస్తృతమైన సమయం ఉన్న సందర్భంలో కూడా రెండిట్లోనూ ఒకేసారి నెగ్గినవారి శాతం చాలా స్వల్పం. ఈ సత్యాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలి! 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని