Updated : 08 Sep 2022 04:06 IST

ఏఈఈ ఉద్యోగాలకు వ్యూహం

సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, అగ్రికల్చర్‌ పట్టభద్రులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్తను అందించింది. తాజా ప్రకటన ప్రకారం.. మొత్తం 1540 ఏఈఈ ఉద్యోగాలు (అత్యధికంగా సివిల్‌ ఇంజినీరింగ్‌) భర్తీ కానున్నాయి. పోటీ పరీక్షలో నెగ్గి కొలువు సాధించినవారికి మొదటి నెల జీతం సుమారుగా రూ.70,000 వరకు ఉంటుంది. వెంటనే పరీక్షకు సన్నద్ధత ఆరంభించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అభ్యర్థుల కర్తవ్యం. సన్నద్ధత ప్రణాళిక, మెలకువలు తెలుసుకుందాం!

గత పరీక్షల ప్రశ్నలు చూస్తే ప్రశ్నల కాన్సెప్టులకు సంబంధించి కొంత కఠినంగా ఉండొచ్చు. ప్రశ్నపత్రాలను నిష్ణాతులైన అధ్యాపక బృందం (ఐఐటీ, ఎన్‌ఐటీ) తయారుచేస్తుంది. కాబట్టి ప్రాథమికాంశాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలి.
* రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల సన్నద్ధత అవసరం.
* ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మాదిరి న్యూమరికల్‌ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి 2, 3, 5, 10 లాంటి సంఖ్యల స్క్వేర్‌ రూట్స్‌, ఇన్‌వర్స్‌ ఆఫ్‌ రూట్స్‌ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల నాలుగు ఆప్షన్స్‌లో దగ్గరి సమాధానం రాబట్టడం తేలికవుతుంది.
* గత టీఎస్‌పీఎస్సీ, ఇంజినీరింగ్‌ ప్రశ్నపత్రాల్లోని న్యూమరికల్‌ ప్రశ్నలు సాధన చేస్తే అనుభవం వస్తుంది. కాలిక్యులేటర్‌కు అనుమతి లేనందున కఠినమైన న్యూమరికల్‌ ప్రశ్నలు ఉండవు. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రధాన సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి.
* ఏమి చదవాలో, ఏమి చదవకూడదో నిర్ణయించుకోవాలి. మొదటగా తమకు ఏ సబ్జెక్టుల్లో పట్టు ఉందో వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. మిగతా వాటిల్లో ప్రాథమికాంశాలు చదివితే సరిపోతుంది.
చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి.  
* గత ప్రశ్నపత్రాల్లో సాలిడ్‌ మెకానిక్స్‌, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఆర్‌సీసీ, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హెచ్‌ఎం, ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, హైవే ఇంజినీరింగ్‌లో ఎక్కువ మార్కులకు ప్రశ్నలు ఇచ్చారు. ఈ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచి మార్కులు సాధించొచ్చు. తక్కువ వెయిటేజీ ఉన్న సబ్జెక్టుల్లోని ప్రాథమికాంశాలను క్షుణ్ణంగా సాధన చేయాలి.


జనరల్‌ స్టడీస్‌పై పట్టు సాధించడం ఎలా?
ఏఈఈ పరీక్షలో ప్రశ్నలను 2015లో సరళంగా, సూటిగా ఇచ్చారు. కానీ 2017, 2018 ఏఈఈ పరీక్ష పేపర్లను పరిశీలిస్తే లోతైన అవగాహన ఉన్నవారు మాత్రమే సమాధానం రాసేలా కఠినమైన, విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు ఇచ్చారు. అందుకే సబ్జెక్టు మీద లోతైన, విశ్లేషణాత్మకమైన అవగాహన పెంచుకోవాలి.
* జనరల్‌ స్టడీస్‌లో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, ప్రణాళికలకు సంబంధించిన సిలబస్‌ కలిపి ఉంటుంది.
* తెలంగాణ భౌగోళిక అంశాలు, తెలంగాణ చరిత్ర- సంస్కృతి, కళలు, సాహిత్యం, వాస్తుశైలి, తెలంగాణ సామాజిక అంశాలు, తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, జనరల్‌ సైన్స్‌ల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.
* జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలూ ఉంటాయి. నిత్యం వార్తాపత్రికలను చదువుతూ నోట్‌బుక్‌లో ముఖ్యాంశాలు రాసుకోవాలి. పేపర్‌ పఠనం కూడా సన్నద్ధతలో భాగమని గ్రహించాలి. అప్పుడే వర్తమాన అంశాలపై పట్టు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విజయాలు, అవార్డులు, ప్రభుత్వ పాలసీలు, స్థానికంగా జరిగిన సదస్సులు, సమావేశాలు ప్రధానం.
* జాతీయ వర్తమాన అంశాల్లో జాతీయ పథకాలు, భారతదేశం విదేశీ సంబంధాలు, క్రీడలు, సదస్సులు, అవార్డుల పరిజ్ఞానం అభ్యర్థులకు ఎంతో అవసరం.
* అంతర్జాతీయ అంశాల నుంచి తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానమైన అంతర్జాతీయ సంఘటనలు పరిశీలిస్తే చాలు.
తెలంగాణ భౌగోళిక అంశాలు: ఈ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, ఖనిజ వనరులు, అడవులు, నేలల తీరు మొదలైన అంశాల మీద అభ్యర్థి లోతైన అవగాహన పెంపొందించుకోవాలి.
తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, వాస్తుశైలి: ఈ అంశం నుంచి సుమారు 10 ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రాచీన కట్టడాల వాస్తుశైలి, ముఖ్యమైన జాతరలు, పండగలు, కొండ జాతులు, సంప్రదాయాలు, కళలు, ముఖ్యంగా నాగోబా, గుస్సాడి, కొమ్మకోయ, పేరిణి నృత్యం లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. కాకతీయుల కాలంలో సమాజం, కళలు, వాస్తుశైలి, వేములవాడ చాళుక్యులు, నిజాంలు, కుతుబ్‌షాహీల కళలు, సాహిత్యం, వాస్తుశైలి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం తీరుతెన్నులు: ఈ అంశం నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. 1969లో తెలంగాణ ఉద్యమ తొలిదశ ప్రారంభం, ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకం, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ పాత్ర, జేఏసీ పాత్ర, సింహగర్జన, ఉద్యోగ గర్జన, మిలియన్‌ మార్చ్‌, చలో అసెంబ్లీ, ఉద్యమ సమయంలో ఆలపించిన గేయాలు, రచనలు, వ్యక్తులు, సంస్థలపై అవగాహన అవసరం. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే ఉపయోగం ఉంటుంది.

ఆధునిక భారత చరిత్ర, జాతీయ ఉద్యమం: ఐరోపావారు భారతదేశం వచ్చి స్థిరపడిన కాలం నుంచి 1974 వరకు జరిగిన ప్రధాన సంఘటనలు ముఖ్యం. మైసూర్‌ యుద్ధాలు, కర్ణ్ణాటక యుద్ధాలు, హైదరాబాద్‌ నవాబు బ్రిటిష్‌ వారి సంబంధాలు, గాంధీయుగం, జాతీయ ఉద్యమ సంస్థలు, పత్రికలు, గవర్నర్‌ జనరల్స్‌, వైశ్రాయ్‌ల కాలంలో జరిగిన సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి.  
జనరల్‌ సైన్స్‌, టెక్నాలజీ విజయాలు: ఈ అంశం నుంచి 15-20 ప్రశ్నలు వస్తున్నాయి వాటిలో కొన్ని ప్రశ్నలు సాంకేతికతలో భారత్‌ సాధించిన విజయాలు ముఖ్యంగా ఇస్రో సాధించిన విజయాలు, పీఎస్‌ఎల్‌వీ/జీఎస్‌ఎల్‌వీ, లాంచ్‌ వెహికల్స్‌, కృత్రిమ ఉపగ్రహాలు, సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్‌ల మీద వస్తాయి. విటమిన్లు, మినరల్స్‌, వ్యాధులు, వర్తమాన శాస్త్రం, సాంకేతిక అంశాలు మొదలైనవీ ముఖ్యమే. కరోనాకు సంబంధించిన విషయాలు కూడా
చదవడం మంచిది.

పాలిటీ, గవర్నెన్స్‌: పాలిటీలో వర్తమాన అంశాలను ఎక్కువగా చదవాలి. నేషనల్‌ జ్యుడీషియల్‌ కమిషనర్‌ పరిపాలనలో వస్తున్న మార్పులు, వ్యక్తులు, విధానాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలు, డిజిటల్‌ పరిపాలన, నీతి ఆయోగ్‌, గవర్నెన్స్‌ పాత్ర, ముఖ్యమైన ప్రకటనలు, రాజ్యాంగ సవరణలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మీద దృష్టి పెడితే ఎక్కువ ఉపయోగం.
పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ:
ఈ అంశం నుంచి 6-10 ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌ వార్మింగ్‌ కారణాలు, ప్రభావం, ఓజోన్‌ పొర నశించడం, కారణాలు, ప్రభావాలు, కాలుష్య కారకాలు, ఆమ్ల వర్షాలు, ప్రభావం మీద ప్రశ్నలు వస్తాయి. విపత్తు నిర్వహణలో కరవు, తుపానులు, భూకంపాలు, సునామీ, నిర్వహణ చట్టం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 22-09-2022.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022.
విద్యార్హతలు: బీఈ/బీటెక్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, అగ్రికల్చర్‌), తత్సమాన డిగ్రీ చదివిన అభ్యర్థులు.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.

వెబ్‌సైట్‌ : https://www.tspsc.gov.in/


రిఫరెన్స్‌ పుస్తకాలు

ఇండియన్‌ జాగ్రఫీ- డాక్టర్‌ కుల్లర్‌
తెలంగాణ జాగ్రఫీ- 6 నుంచి 10 వరకు సీబీఎస్‌ఈ పుస్తకాలు
హిస్టరీ మోడ్రన్‌ ఇండియా- బిపిన్‌ చంద్ర
ఇండియన్‌ ఎకానమీ- ప్రత్యోగిత దర్పణ్‌ ఇండియా, సామాజిక సర్వే, ఇండియన్‌ ఇయర్‌ బుక్‌
తెలంగాణ సామాజిక ఎకానమీ: తెలంగాణ సామాజిక సర్వే
తెలంగాణ చరిత్ర సంస్కృతి, కళలు, వాస్తు శైలి, తెలంగాణ ఉద్యమ చరిత్ర: తెలుగు అకాడమీ

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: స్పెక్ట్రమ్‌


- ప్రొ. వై.వి.గోపాలకృష్ణమూర్తి, ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని