Published : 13 Sep 2022 01:14 IST

ఆన్‌లైన్‌ పరీక్షలు రాస్తున్నారా?

ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో భాగంగా.. అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవుతుంటారు. కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రవేశ పరీక్షలూ రాస్తుంటారు. ప్రస్తుతం ఇవన్నీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీటీ)గానే జరుగుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు రాయడం మెలకువలను తెలుసుకోవటం ఎంతో ప్రయోజనకరం!  

కొంతమంది విద్యార్థులకు సీబీటీ రాయడం సులువుగానే ఉంటుంది. కానీ కంప్యూటర్‌ అందుబాటులో లేనివారికీ, మొదటిసారిగా ఈ విధానంలో పరీక్ష రాస్తున్నవారికీ కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలాంటివాళ్లు ఈ వివరాలతో అవగాహన పెంచుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

* సీబీటీని ఆన్‌లైన్‌ లింకు, ఎగ్జామ్‌ పోర్టల్‌లో ఎగ్జామ్‌ అకౌంట్‌ను తెరవడం, ఐకాన్‌కు క్లిక్‌ చేయడం ద్వారా ప్రారంభించొచ్చు.

* ముందుగా ఫస్ట్‌పేజీ కనిపించి లాగిన్‌ వివరాలు అడుగుతుంది. అప్పుడు కీబోర్డును ఉపయోగించి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ రాయాలి.

* ఆ తర్వాతి పేజీలో స్టూడెంట్‌ ఐడీ, పరీక్ష ఐడీ రాయాలి. రాయబోయే పరీక్ష, సబ్జెక్టు వివరాలను ఎంపిక చేసుకోవాలి. పరీక్ష ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాటూ జరగకుండా ఉండటానికి ఇలాంటి ఏర్పాటు చేస్తారు.

* ప్రతి పేజీలోనూ సాధారణంగా ‘బ్యాక్‌, నెక్ట్స్‌’ అనే రెండు బటన్లు ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఒకపేజీ పూర్తికాగానే రెండో పేజీలోకి వెళ్లడానికి ‘నెక్ట్స్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి. ఏదైనా రాయడం మర్చిపోయి వెనక్కు వెళ్లాలనుకుంటే ‘బ్యాక్‌’ బటన్‌ క్లిక్‌ చేయొచ్చు. పేజీలో వివరాలు రాయడం పూర్తికాగానే ‘నెక్ట్స్‌’ బటన్‌ క్లిక్‌ చేసి మరో పేజీలోకి వెళ్లాలి.

* తర్వాతి పేజీలో పరీక్ష సమయం, విభాగాలు, ప్రశ్నలు, వాటిని రాయాల్సిన విధానం మొదలైన వివరాలుంటాయి. వీటిని జాగ్రత్తగా చదివి, పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉంటే.. పేజీ చివర్లో ఉండే ‘స్టార్ట్‌ ఎగ్జామ్‌’ బటన్‌ నొక్కాలి.

* తర్వాత మొదటి పేజీ తెరుచుకుని పరీక్ష మొదలవుతుంది. స్క్రీన్‌ మూలలో టైమర్‌ ఉంటుంది. ఎంత సమయం గడిచింది.. ఇంకా ఎంత మిగిలి ఉందనే విషయాన్ని పరీక్ష పూర్తయ్యేంతవరకూ అది మీకు చూపిస్తూనే ఉంటుంది.  

* కొన్ని పరీక్షల్లో ప్రతి పేజీలోనూ ‘సేవ్‌’, ‘కంటిన్యూ’ బటన్స్‌ ఉంటాయి. ఒక పేజీలో సమాధానాలు రాయడం పూర్తికాగానే ‘సేవ్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ‘కంటిన్యూ’ క్లిక్‌ చేసి మరో పేజీలోకి వెళ్లాలి.


ఎంసీక్యూల సంగతి

* కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల్లో సాధారణంగా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు (ఎంసీక్యూ) ఉంటాయి. కొన్నింటిలో మాత్రం డిస్క్రిప్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. మరికొన్ని పరీక్షల్లో ఈ రెండు విధాలైన ప్రశ్నలూ ఉండొచ్చు.

* ఎంసీక్యూల్లో నాలుగైదు ఆప్షన్లు ఉంటాయి. ప్రతిదానికీ సర్కిల్‌ లేదా బాక్స్‌ ఉంటుంది. మౌస్‌తో దాంట్లో టిక్‌ చేయాలి. మీరు క్లిక్‌ చేయగానే అక్కడ టిక్‌ మార్కు పడుతుంది. కొన్ని పరీక్షల్లో మీరు సమాధానాన్ని క్లిక్‌ చేయగానే సర్కిల్‌ బ్లాక్‌ కలర్‌తో నిండుతుంది. దానర్థం ఆ సమాధానాన్ని మీరు ఎంపికచేశారనే.

* ఎంసీక్యూలు సాధారణంగా టిక్‌ పెట్టేవే ఉంటాయి. కొన్నిసార్లు ప్రశ్న దగ్గర కొద్దిగా ఖాళీ వదులుతారు. అక్కడ రెండు, మూడు పదాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది.

* దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానం రాయడానికి కొంచెం ఖాళీని బాక్సు రూపంలో వదిలిపెడతారు. ఆ బాక్సులో మౌస్‌, కీప్యాడ్‌ను ఉపయోగించి సమాధానం రాయాలి. అక్షరాల సైజు, శైలిని మార్చడానికి వీలుగా ఆ బాక్సులోనే తగిన ఏర్పాట్లూ ఉంటాయి.

* ప్రతి పేజీలోనూ ఒకపక్కగా చిన్న బాక్సు ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే మొత్తం పేజీలను చూపిస్తుంది. సమాధానం రాయని ప్రశ్న ఏ పేజీలోనైనా ఉంటే చూసుకుని ఆ పేజీని మళ్లీ తెరిచి సమాధానం రాసుకునే సౌలభ్యం ఉంటుంది.

* ముందుగా సులువైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసి కష్టమైనవాటిని వదిలేయాలి. చివరిగా వెనక్కు వెళ్లి వదిలిపెట్టిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సమయం వృథా కాదు.

* అన్ని విభాగాలనూ పూర్తిచేసిన తర్వాత ఒకసారి అన్నీ సరిచూసుకుని చివరి పేజీలోకి వెళ్లాలి. లాస్ట్‌పేజీ చివర్లో ‘ఫినిష్‌ లేదా సబ్‌మిట్‌ ద టెస్ట్‌’ అనే బటన్‌ను క్లిక్‌చేస్తే పరీక్ష పూర్తయినట్టే.

* పరీక్షలో మొత్తం ఎంసీక్యూ ప్రశ్నలు మాత్రమే ఉంటే.. ఫినిష్‌ బటన్‌ నొక్కగానే ఫలితం తెలిసిపోతుంది. వ్యాసరూప ప్రశ్నలు ఉన్న పరీక్షల ఫలితాన్ని కొన్ని రోజుల తర్వాత మీ ఈమెయిల్‌కు తెలియజేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని