స్కోరు పెంచే జనరల్‌ ఎస్సే!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలో రాత పరీక్ష మార్కుల వెయిటేజ్‌ 87 శాతమైతే మిగతా 13 శాతం వ్యక్తిత్వ పరీక్షది. దీన్నిబట్టి రాతపరీక్ష ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాత పరీక్షలో జనరల్‌ ఎస్సే (వ్యాసం) కీలకమైనది. దీన్ని

Published : 15 Sep 2022 00:32 IST

మెరుగైన వ్యాసరచనకు మెలకువలు

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలో రాత పరీక్ష మార్కుల వెయిటేజ్‌ 87 శాతమైతే మిగతా 13 శాతం వ్యక్తిత్వ పరీక్షది. దీన్నిబట్టి రాతపరీక్ష ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాత పరీక్షలో జనరల్‌ ఎస్సే (వ్యాసం) కీలకమైనది. దీన్ని మెరుగ్గా రాయటానికి ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!

2013లో సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష స్వరూపాన్ని సవరించి, కొత్త రూపు తీసుకొచ్చారు. దానిలో భాగంగా జనరల్‌ ఎస్సే పేపర్‌కు 50 మార్కులు పెంచారు. 2013కి ముందు ఎస్సే పేపర్‌ 200 మార్కులకు ఉండేది. ఇప్పుడది 250 మార్కులకు పెరిగింది. ఎగ్జామినర్‌లు జనరల్‌ నాలెడ్జ్‌ కన్నా జనరల్‌ ఎస్సేకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల కోణంలో చూస్తే... జనరల్‌ ఎస్సే వల్లనే ఎక్కువ మార్కుల స్కోరుకు అవకాశముంటుంది. అభ్యర్థి మూడు గంటల్లోగా రెండు వ్యాసాలను రాయాలి.

2013 నుంచి గమనిస్తే ఏ సంవత్సరంలోనైనా ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల తుది ఫలితంపై వ్యాసంలో సాధించిన మార్కుల ప్రభావం ఎక్కువని తెలుస్తుంది. జనరల్‌ స్టడీస్‌లో టాపర్‌లుగా నిలిచిన అభ్యర్థులు సాధించిన మార్కులను పరిశీలిస్తే- వారందరికీ జనరల్‌ ఎస్సే పేపర్‌లో వచ్చిన మార్కులకన్నా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లలో తక్కువ/సగటు మార్కులే వచ్చాయి. అయితే- జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌ చాలా విస్తృతమైనది, నిర్దిష్ట పరిధి లేనిది. ఏయే అంశాలు వస్తాయో తెలుసుకోవడం చాలా కష్టం. చాలావరకు జనరల్‌ స్టడీస్‌లో వచ్చిన 35 శాతం మార్కులతో పోలిస్తే, ఎస్సేలో 35 నుంచి 40 శాతం మార్కులు సాధించినవాళ్లు విజేతగా నిలుస్తున్నారు. అందువల్ల పరీక్షలో విజయం సాధించాలంటే- ఎస్సేలో ఎక్కువ స్కోరు చేయడం అవసరమనేది నిస్సందేహం.

ఎలా సన్నద్ధమైతే మేలు?

* పరీక్షరోజు వరకు 5- 6 అంశాలకు సిద్ధపడి ఉండండి. ఇలా అయితే కనీసం ఒక టాపిక్‌/ సంబంధిత అంశాన్ని రాయగలుగుతారు. ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడమేకాక ఎక్కువ అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

* గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. అన్ని విభాగాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయని గమనించవచ్చు.

* ఎంచుకున్న అంశానికి సంబంధించి చర్చనీయాంశమైన ప్రభుత్వ నిర్ణయాలూ, ఆదేశాలను గుర్తించండి. ఇందుకు ప్రభుత్వ అధికార వెబ్‌సైట్లలో దొరికే సమాచారం మంచి వనరులా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు యోజనలాంటి పత్రికలో వచ్చే సమాచారం అధికారికం.

* ఏ కోణం నుంచి ప్రశ్నలు వస్తాయో, ఏయే రకంగా అడుగుతారోనని విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ వివిధ అంశాలను చదవాలి.

* 2500 పదాలతో కూడిన ఒక వ్యాసాన్ని రాయండి. దాదాపు అన్ని పాయింట్లనూ కవర్‌ చేయండి. మీకై మీరుగా చదివిన/ సంగ్రహించిన విషయాల్ని రాసేయండి.

* ఆ వ్యాసాన్ని సగానికి సగం 1250 పదాలకు కుదించండి. ఈ పద్ధతి అసలు ఉద్దేశమేంటంటే- 2500 పదాలు రాసినప్పుడు అన్ని పాయింట్లూ కవర్‌ అయినట్లే, సగం పదాలకు కుదించినప్పుడు కూడా అన్ని పాయింట్లూ రావాలి.

* మళ్లీ 1250 పదాల వ్యాసాన్ని 800 పదాలకు కుదించండి. ఇప్పుడు కూడా అన్ని పాయింట్లూ కవర్‌ అవ్వాలి.

* దీన్నిబట్టి మీరు గమనించాల్సిందేంటంటే- 2500 పదాలతో కూడిన వ్యాసం రాయడం, 1250 పదాలతో రాసే వ్యాసంకన్నా తేలిక. 1250 పదాలతో కూడిన వ్యాసం రాయడం- 800 పదాలతో రాసిన వ్యాసంకన్నా చాలా సులభం.

* తక్కువ నిడివి గల పదాల్లో అన్ని పాయింట్లనూ రాయగల సామర్థ్యం ఏర్పడితేనే పూర్తి స్థైర్యంతో పరీక్షకు సిద్ధపడినట్లు లెక్క. నిజానికిది జనరల్‌ స్టడీస్‌ పేపర్‌కు కూడా ఉపయోగపడుతుంది.

* ఎక్కువ విషయాలపట్ల పరిజ్ఞానం పెంచుకోవడం తప్పనిసరి అనేది గుర్తుంచుకోవాలి.

పాఠశాల/కళాశాల స్థాయిలో ...

వ్యాస రచన ఒకరోజులోనో, ఒక నెలలోనో నేర్చుకునే ప్రక్రియ కాదు. దీనికి సాధన చాలా ముఖ్యం. పాఠశాల/ కళాశాల స్థాయి నుంచే దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల నైపుణ్యానికి స్థిరమైన పునాది పడినట్లవుతుంది.

పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్‌ లేదా సోషల్‌ సబ్జెక్టులో ఆసక్తిని పెంచుకోండి. సాధారణంగా చాలామంది ఇంజినీరింగ్‌/మెడిసిన్‌ చేస్తామనే ఉద్దేశంలో ఈ సబ్జెక్టులను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదేమైనా పదో తరగతి పూర్తయిన తర్వాత సోషల్‌ సబ్జెక్టు మీద దృష్టి సారించండి. పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన సమాచారంకన్నా ఇంకా ఎక్కువ విషయాలను నేర్చుకోండి.

ప్రభుత్వ/ ప్రభుత్వేతర సంస్థలు చాలా సందర్భాల్లో వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నాయి. వీటన్నింటిల్లో పాల్గొనండి. బహుమతులు గెలుచుకోవడం కోసమో లేదంటే సర్టిఫికెట్ల కోసమో పాల్గొనకండి. ఇటీవల ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌కి సంబంధించి చాలా సంస్థలు విభిన్న అంశాల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించాయి.

తరచుగా వ్యాసరచన పోటీల్లో పాల్గొనండి. కొన్నిసార్లు పోటీకి ఇవ్వబోయే అంశాల్ని కూడా ముందుగానే చెబుతారు. ఇందుకు మీ సీనియర్‌తో కూర్చొని ఆ అంశం గురించి చర్చించండి. మెరుగ్గా సిద్ధమై పోటీలో పాల్గొనండి.

మీ విద్యాసంస్థలో వక్తృత్వ పోటీ/చర్చలు నిర్వహిస్తే పాల్గొనండి. వేదిక మీద మాట్లాడటం గురించి భయపడుతూ, వెనకడుగు వేయొద్ద్దు. కేవలం సిద్ధమై పాల్గొనండి, అంతే! మీరే ఆ తేడాను గమనించగలుగుతారు. వ్యాసం/ ప్రసంగం చాలా విషయాల్లో ఒకేలా ఉంటాయి.

సెలవుల్లో నవలలను చదవడం వ్యాపకంగా పెట్టుకోండి. అవి కాల్పనిక (ఫిక్షన్‌) నవలలు అయినా అది పెద్ద విషయం కాదు. నిజానికి, జరిగిన విషయాలనూ, తెలిసినవాటినీ రాయడం కంటే కాల్పనిక రచనలే కష్టం. ఫిక్షన్‌ కథలను రాసే రచయిత సైతం రాసే విషయంలో చదివేవారిని ఆకట్టుకునేలా, అంటే ప్రతి పేజీలో ఉత్కంఠతను పోనివ్వకుండా చదివించేలా జాగ్రత్తపడతాడు. ఇందుకు కచ్చితమైన పదాల కూర్పు అవసరం. మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో సైతం నవలా పఠనం సాగించవచ్చు.

ప్రతిసారి చదువుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అప్పుడు మంచి సమాచారాన్ని అందించే పాడ్‌కాస్ట్‌ల ద్వారా కావాల్సిన సమాచారాన్ని వినండి.

దీన్ని పాఠశాల స్థాయివరకే వదిలేయకుండా కళాశాలలోనూ కొనసాగించండి.

ఈ విధంగా సాధన చేస్తే ఎప్పుడైనా, ఎక్కడైనా మెరుగైన వ్యాసాన్ని రాయగలిగే సామర్థ్యం పెరుగుతుంది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని